ఆర్తి హరము, ఆనంద ప్రదము ఈ నగర సంకీర్తన.
కల్యాణ యుతము, కైవల్య ప్రదము ఈ నగర సంకీర్తన.
ఆరోగ్య కరము, అమ్మ నామామృత ప్రవాహము ఈ నగర సంకీర్తన.
అనుదిన సుప్రభాత సమయ అర్కపురి అనుభూతి ప్రకాశము ఈ నగర సంకీర్తన.
అమ్మ దివ్య నామ తేజో వైభవ వ్యాప్త్యర్థం ఈ నగర సంకీర్తన.
అనసూయా మహాదేవ్యాః ప్రీత్యర్థం ఈ నగర సంకీర్తన.
అమ్మ శత జయంతి సంవత్సర సంరంభ స్ఫూర్త్యర్థం ఈ నగర సంకీర్తన.
సకల సృష్టి శుభేక్షణం, సర్వేషాం శాంతి దాయకం ఈ నగర సంకీర్తన.
సామాన్యులకు శుభేచ్ఛ కలిగేటందులకు ప్రేరణ ఈ నగర సంకీర్తన.
సమస్త భక్త జనులకు మోక్షేచ్ఛ కలిగేందుకు స్ఫూర్తి ఈ నగర సంకీర్తన.
ముముక్షు జన సోదరులందరికీ ‘సుగతి’ సిద్ధ్యర్థం ఈ నగర సంకీర్తన.
సకల ప్రాణికోటి సౌభాగ్య సిద్ధ్యర్థం ఈ నగర సంకీర్తన.
శ్రద్ధా భక్తి సమన్వితంగా అర్కపురిలో అందరింటి అన్నయ్యలు, అక్కయ్యలు అనుదినమూ సూర్యోదయాత్ పూర్వమే, నిదుర మేల్కాంచి, స్నానాదులు పూర్తిగావించుకుని, అమ్మ నామ వస్త్రమును భక్తి మీర ధరియించి, అమ్మకు ప్రతీకగా అమ్మ చిత్రపటమును ప్రియమారా చేత బూని, తాళములు చరుస్తూ, కంజీర మొదలగు వాద్యములతో నాదములు వాయిస్తూ, నోరారా అమ్మ దివ్యనామము ‘జయహెూమాతా శ్రీ అనసూయా రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి’ అంటూ ముక్త కంఠంతో కీర్తిస్తూ… నెమ్మది నెమ్మదిగా అందరింటి ఆవరణ యందలి ఆలయాలకు ప్రదక్షిణ గావిస్తూ, అందరింటి మీదుగా జిల్లెళ్ళమూడి ప్రధాన వీధులలో అమ్మను ఊరేగిస్తూ, అమ్మనామాన్ని జపిస్తూ నడుస్తూ, అమ్మ నామ ప్రభలను ఆయా మార్గాలలో నింపుతూ అర్కపురి వేకువకు మరింత అమ్మ దివ్యనామ శోభలను సైతం జత చేస్తూ, అమ్మ దివ్య నామ తరంగాలు, ఆ వైబ్రేషన్స్ విశ్వవ్యాప్తమయ్యేలా సవ్య దిశలో అమ్మనే లక్ష్యంగా చేసుకుని, మనసున హృదయమున అమ్మపైననే ధ్యాసను నిలిపి, చివరగా అనసూయేశ్వర హైమాలయాలకు ప్రదక్షిణ గావించి, తొలుత హైమవతీ దేవిని, ఆపై జగజ్జననీ జనకులైన అమ్మా నాన్నగార్లను ధూళి దర్శనం గావించుకుని మంగళ హారతితో కూడిన నీరాజనాలు సమర్పించడం తీర్థప్రసాద స్వీకరణంతో పూర్తి అయ్యేలా అనుదినము జరిగేది ఈ నగర సంకీర్తనా స్రవంతి, సుప్తమానసాల్ని జాగృతం చేసే ప్రభాత భేరి.