అమ్మ శతజయంతి మహోత్సవం శరవేగంగా సమీపిస్తున్న తరుణంలో మన ముందున్న అనేక సవాళ్ళలో ఒకటి యాత్రికుల వసతి సౌకర్యం. ఈ విషయమై శాశ్వత పరిష్కార సాధనలో భాగంగా శ్రీవిశ్వజననీ పరిషత్ సుమారు 20 గదుల నూతన వసతి గృహ నిర్మాణానికై గత సంవత్సరం డిసెంబరు నెలలో శంకుస్థాపన చేసిన విషయం మనసోదర బృందంలో చాలా మందికి తెలిసిన విషయమే.
ఈ నూతన వసతి గృహ నిర్మాణానికి సుమారు ఒక కోటి అరవై లక్షల రూపాయల ఖర్చు కాగలదని అంచనా. అమ్మ అపార కృపా విశేషం కారణంగా నిర్మాణ కార్యక్రమం ఇంతవరకూ నిరాటంకంగా కొనసాగుతున్నది. మొదటి అంతస్తు పైకప్పు నిర్మాణం జూన్ నెల 27వ తేదీన వేయడం జరిగింది. ఈ సంవత్సరం చివరికి నిర్మాణం పూర్తి అయి, అమ్మ శతజయంతి మహోత్సవానికి ఇరవై గదులూ అందుబాటులోకి రావాలని అమ్మను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము.
ఈవసతి గృహ నిర్మాణ కార్యక్రమంలో తమవంతు సహకారం అందించడానికి సోదరీ సోదరులకు శ్రీ విశ్వజననీ పరిషత్ ట్రస్ట్ స్వాగతం పలుకుతున్నది.
సువిశాలమైన 20 గదులతో ఈ వసతి గృహ నిర్మాణం జరుగుతున్నది. ఇందులో సగం గదులకు ఎయిర్ కండిషన్ సౌకర్యం కూడా వుంటుంది. ప్రతి గదిలో ఒక డబుల్ బెడ్, అటాచ్డ్ బాత్, వార్డ్ రోబ్ సమకూర్చబడుతవి. ఒక గది నిర్మాణానికి అయ్యే ఖర్చు సుమారు 8.00 లక్షలు అయినా, కనీసం 5.00 లక్షలు విరాళం ఇచ్చే దాత పేరు మీద ఒక గది నిర్మాణం చేద్దామని కార్యవర్గం నిర్ణయించింది. జిల్లెళ్ళమూడి ఎప్పుడు వచ్చినా సంవత్సరంలో ఒక నెల రోజులు దాత ఆ గదిలో వుండే అవకాశం కలుగుతుంది. మిగిలిన పదకొండు నెలలు యాత్రికులకు ఇవ్వబడుతుంది.
జిల్లెళ్ళమూడిలో జరిగే అనేక కార్యక్రమాలకు చేయూత నిచ్చిన సోదరీ సోదరులు ఈ నిర్మాణ కార్యక్రమంలో కూడా సహృదయతతో, ఉదారంగా పాల్గొని తమ సహాయ సహకారాలందిస్తారని సవినయంగా ప్రార్థిస్తున్నాము.
శ్రీ విశ్వజననీ పరిషత్ ట్రస్ట్ జిల్లెళ్ళమూడి