శ్రీ నాదెండ్ల లక్ష్మణరావు – శ్రీమతి సీతాభ్రమ రాంబికాదేవి వివాహ షష్టిపూర్తి మహోత్సవం 6-9-2014 శనివారం జిల్లెళ్ళమూడి అమ్మ సన్నిధిలో ఆత్మీయులు, బంధుమిత్రులు, అన్నయ్యలు, అక్కయ్యల సమక్షంలో అత్యంత వైభవంగా నిర్వహించబడినది. గత 20 సంవత్సరాలుగా జిల్లెళ్ళమూడిలో అమ్మసన్నిధిలో, అమ్మసేవలో జీవనం కొనసాగిస్తూ అందరి మన్ననలు పొందుతున్న విషయం విదితమే. వారి వైవాహిక జీవితము 60 సం||లు పూర్తి చేసుకొన్న తరుణంలో భ్రమరాంబ అక్కయ్య సోదరులు, శ్రీ గుడిపూడి పాండురంగవిఠల్, శ్రీ జనార్దనశర్మ – లక్ష్మణరావు అన్నయ్య సోదరులు శ్రీ నాదెండ్ల సత్యనారాయణ గారి కుటుంబసభ్యులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవం నిర్వహించారు. 6-9-2014 శనివారం ఉదయం దంపతిపూజతో ఈ కార్యక్రమము ప్రారంభమైనది. 11 మంది దంపతులకు లక్ష్మణరావు దంపతులు, పూజ నిర్వహించారు. తదుపరి ‘అందరిల్లు’ వేదికపై ‘అమ్మ కళ్యాణం’ లక్ష్మణరావు దంపతులచే వైభవంగా నిర్వహింప బడినది. సశాస్త్రీయంగా, సంప్రదాయబద్ధంగా నిర్వహింప బడిన అమ్మ-నాన్నగార్ల కళ్యాణంలో కుటుంబసభ్యులు, హితులు, ఆవరణలోని భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. అర్చకులు నవీన్ కళ్యాణ క్రతువు నిర్వహింపగా, శ్రీ రావూరి ప్రసాద్ అమ్మ గీతాలతో కార్యక్రమ వైభవాన్ని పెంచారు. శ్రీ పి.యస్.ఆర్.ఆంజనేయప్రసాద్ కళ్యాణ విశేషాలు వివరిస్తూ, అమ్మ చెప్పిన విశేషాలను తెలియచేస్తూ, లక్ష్మణ రావు దంపతులను కవితానీరాజనంతో అభినందించారు. ‘నేను మీకు బిడ్డను’ అని అమ్మ లక్ష్మణరావు అన్నయ్యకు – భ్రమరాంబ అక్కయ్యకు తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. కార్యక్రమములో పాల్గొన్న ఎందరో లక్ష్మణరావు దంపతులను నూతనవస్త్రములతో, శాలవలతో, పుష్ప మాలలతో, పట్టుకిరీటంతో సత్కరించారు. మధ్యాహ్నం చక్కనివిందు అమ్మప్రసాదంగా అన్నపూర్ణాలయంలో అందరూ ఆరగించారు.
ఆ రోజు సాయంత్రం ఇదే వేదికపై ‘ఆత్మీయ వినోదవల్లరి’ నిర్వహించబడినది. లక్ష్మణరావు – భ్రమరాంబ దంపతుల మేనల్లుడు జి.వై.యన్. బాబు నిర్వహించిన కార్యక్రమము ఎంతో ఉల్లాసంగా, సర్వజనరంజకంగా సాగినది. కుటుంబసభ్యులు చక్కని గాత్ర సంగీతంతో, మనుమళ్ళు కాషియో, వేణువుతో చక్కని వాద్య సంగీతమును అందించారు. అప్పటికప్పుడు అల్లిన పాటలతో సందడి చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి సుగుణ ఈ షష్టిపూర్తి దంపతుల ఆత్మీయత, అమ్మపట్ల వారి కున్న అచంచల విశ్వాసమును ప్రస్తావిస్తూ ప్రసంగించారు. సంగీత కదంబములో శ్రీ పాండురంగ విఠల్, శ్రీ పూళ్ళ సత్యనారాయణమూర్తి, శ్రీమతి మోక్షలక్ష్మి, శ్రీమతి విశాల, శ్రీమతి దీపికారత్నజ, చి.రమాచంద్రిక, చి. అమృతవాణి, చి. రాధేశ్యామ్, చి. అభిరామ్, చి.శ్రీకర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ జి. జనార్దనశర్మ, శ్రీ జి.వి. యన్. హరి, శ్రీ జి. రాధాకృష్ణ, శ్రీ ఎన్. రాంబాబు తదితరులు కార్యక్రమము వైభవంగా జరగటానికి కృషి చేశారు. ఆ రోజంతా ఎంతో ప్రేమాభిమానములతో, ఆత్మీయతతో, భక్తి విశ్వాసాలతో కార్యక్రమము మధురస్మృతులతో సాగటంలో శ్రీ లక్ష్మణరావు – భ్రమరాంబ దంపతుల జీవనశైలి ఆదర్శమై వెలుగొందింది.