జిల్లెళ్ళమూడి అమ్మగా పేరుగాంచిన బ్రహ్మాండం అనసూయాదేవి (1923-1985) తన జీవిత చరిత్రను తానే చెప్పారు. అది అమ్మ జీవిత మహోదధి పేరుతో 2004 లో విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారు తొలిసారి ప్రచురించారు. మలి ప్రచురణ 2018 లో మాతృశ్రీ జీవిత మహోదధి పేరుతో శ్రీ విశ్వజననీ పరిషత్ వారు ప్రచురించారు. మరల అది 2023 లో మూడవ ముద్రణ పొందింది.
అమ్మ స్వయంగా చెప్పి వ్రాయించిన ఆ గ్రంథం తెలుగు భాషలో వచ్చిన అపురూప తత్త్వగ్రంథం. తత్త్వచింతనకు సమకాలీనతను జతపరచి, సిద్ధాంతాలు పక్కన పెట్టి, జీవితం సుగతికోసమే అన్న లక్ష్యంతో ఆ పుస్తకం 1923-1936 మధ్య కాలంలో అమ్మ చరిత్ర నమోదు చేస్తుంది. అమ్మ తత్త్వానికి శిరస్సు మరుగు, హృదయం అసలు, శ్వాస చైతన్యం, చేతులు కరుణ, బుద్ధి నేను, కాళ్ళు కాలము.
ఒక కాలములో నేను మనస్సుగా, కరుణగా పనిచేస్తూ, చైతన్యం, అసలు దాటి మరుగులోకి ప్రవేశిస్తుంది. మనస్సు, నేను మరుగులోకి వెళ్ళడం అధిగమనం. మరుగు అసలైన స్పందనై కాలము, కరుణ ద్వారా నేనుగా
స్పందించడం క్రిందికి రావడం. ఇదే సృష్టి. అమ్మ తత్త్వాన్ని జాగ్రత్తగా చూస్తే ఆమె సాంఖ్య సిద్ధాంతాన్ని, అద్వైతానుభవాన్ని ఆమోదించినట్లు కనబడుతుంది.
ఆమె ప్రత్యక్ష జ్ఞానం, భావాతీత స్పృహ అంగీకరించారు. ఎందుకంటే జ్ఞానం అభివ్యక్తం, అవ్యక్తం అనే రెండు దశలలో ఉంటుంది. అవ్యక్తము పరాస్థితి. అభివ్యక్తము వైఖరి.
అమ్మ మహాయోగిని. మానసవీణలో నాదానుసంధానం చేసి, భూతశక్తి, చలనశక్తి, వికిరణశక్తి అనే వాటి మధ్య సార్వకాలిక సమన్వయం సాధించారు. అదే అమ్మ పరంగా దర్శనం, స్వస్వరూపానుసంధానం. ఆ అనుభవం భావస్థాయికి రావాలంటే పరిశీలన, విమర్శ, వివరణ ఉండాలి. కన్నవాడు వివరిస్తాడు.
అమ్మపరంగా ఈ సృష్టి రాగ ద్వేషాలు ఆధారంగా ఉంటుంది. రూపం లేని మనస్సు ఏ రూపమైనా ధరిస్తుంది. ఇక్కడే మనస్సు కరుణ, కాలము పరిధిలోకి వచ్చి అహంస్ఫురణ పొందుతుంది. అమ్మ ఈ సృష్టి నిజం అన్నారు. ప్రతి ఒక్కరూ అవతారమే. అందరూ సృష్టి అనే నెట్ వర్క్ లో అవసరమే.
జననం, మరణం, జన్మరాహిత్యం, కర్మ అనేవానిని గూర్చి ఆలోచించవద్దు.
మనకు ఉండవలసింది ధ్యాస. అదే ధ్యానం.
మనము చేయవలసినది ఆరాధన. అనగా శక్తి సమర్థవంతంగా ఉపయోగించడం.
ధ్యానం వలన మౌనం, ఆరాధన వలన శౌచం. వాటి రెండిటి వల్ల సుగతి.
(ఇదే రేఖామాత్రంగా అమ్మ తత్త్వము).