అమ్మ ఆశయాలకు ఆచరణరూపం కల్పించే లక్ష్యంతో పనిచేస్తున్న
శ్రీ విశ్వజననీపరిషత్ ట్రస్టు ఆధ్వర్యంలో జిల్లెళ్ళమూడి అమ్మ
శతజయంతి మహోత్సవాలు 2023
అమ్మ శతజయంతి సభలు అందరికీ ఆనందం పంచుతూ సకల మానవాళికీ అమ్మ ప్రబోధాన్ని సన్నిహితం చేస్తున్నాయి.
మార్చి 28వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి.
ఈ సందర్భంగా విశాఖపట్నం, పార్వతీపురం, శృంగవరపు కోట, రాజాం, హైదరాబాద్, విజయవాడ, తిరుపతి మొదలైన ఎన్నో చోట్ల అమ్మ సందేశ సభలు విజయవంతంగా జరిగాయి. హైదరాబాద్, విజయవాడలలో అమ్మ సందేశ సభలు “అభాగ్యులం కాదు మనం… భాగ్య నగరు మనది. అపజయం లేదు మనకు… విజయవాడ మనది” అన్నట్లుగా హైదరాబాదు, విజయవాడ నగరాల్లో అమ్మ శతజయంతి శంఖారావం అద్భుతంగా నినదించింది. 2023 మార్చి 28వ తేదీ నుంచి ఐదు రోజులపాటు జిల్లెళ్ళమూడిలో అమ్మ శతజయంతి మహోత్సవాలు సుసంపన్నం. కానున్నాయి. ఈ సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ ప్రధాన కేంద్రాలలో శతజయంతి సందేశ సభలు జరుగుతున్నాయి.
శ్రీ విశ్వజననీ పరిషత్ ట్రస్టు ఆధ్వర్యంలో జనవరి 26వ తేదీన హైదరాబాద్-రవీంద్ర భారతిలో, ఫిబ్రవరి 19వ తేదీన విజయవాడ- తుమ్మలపల్లివారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో జరిగిన సందేశసభలు విశేష వైభవాన్ని సంతరించుకున్నాయి. అమ్మ ప్రసాదించిన సూక్తులు సర్వోపనిషత్సారాలు- అని హైదరాబాదు సభలో విశిష్ట అతిథి ప్రవచన కిరీటి, మహా సహస్రావధాని, పద్మశ్రీ పురస్కృతులు డా. గరికిపాటి నరసింహారావు సప్రమాణంగా నిరూపించారు.
‘తృప్తే ముక్తి’ అని చెప్పిన అమ్మ వాక్య విశ్లేషణతో ప్రారంభించి, దైనందిన జీవితం ప్రశాంత సుందరం కావటానికి అమ్మ సూక్తులు ఎలా దోహదం చేస్తాయో గరికిపాటివారు ఆకర్షణీయంగా వివరించారు. అద్వైతమే అమ్మ తత్త్వమని, అది సమాజంలో శాంతియుత సహజీవన సౌభాగ్యానికి రాచబాట అనీ డా. గరికిపాటి వారు సోదాహరణంగా సిద్ధాంతీకరించారు. ప్రముఖ సాహితీవేత్త డా.యు. వరలక్ష్మి సభకు స్వాగతం పలికారు.
తెలంగాణ సాంస్కృతిక సలహాదారు డా. కె. వి. రమణాచారి ముఖ్య అతిథిగా సభలో పాల్గొన్నారు. పోస్టు మాస్టర్ జనరల్ డా. పి.వి.యస్. రెడ్డి అమ్మ శతజయంతి తపాలా కవరును విడుదల చేశారు. ‘దర్శనమ్’ ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక సంపాదకులు మరుమాముల వెంకటరమణ శర్మ సభానిర్వహణ చేశారు.
ఈ ప్రపంచంలో ఆకలిబాధ లేకుండా పోయే రోజు రావాలని పరితపించిన అమ్మలోని విశ్వమాతృత్వ విశిష్టతను సభా ప్రారంభకులు ‘విశ్వజనని’ మాసపత్రిక సంపాదకులు ఆచార్య మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి వివరించారు.
ట్రస్టు ఛైర్మన్ శ్రీ కుమ్మమూరు నరసింహమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సభకు తమ మధుర గానంతో ప్రసిద్ధ గాయని శ్రీమతి తంగిరాల అనసూయ శుభారంభం చేశారు.
ఫిబ్రవరి 19వ తేదీన విజయవాడలో ఆచార్య మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి సభా సంచాలకులుగా వ్యవహరించారు. మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల కరస్పాండెంట్ డా. బి.ఎల్. సుగుణ అమ్మ అవతరణలోని అంతర్యాన్ని, అమ్మలోని విశ్వ ప్రేమనూ సహజ సుందరంగా ఆవిష్కరించారు.
స్థానిక శాసనసభ్యులు మల్లాది విష్ణువర్ధన్ ముఖ్య అతిథిగా పాల్గొని తమ సౌజన్య సహకారాలను ప్రకటించారు. ‘శారదా జ్ఞాన పుత్ర’, ప్రవచన చక్రవర్తి చాగంటి కోటేశ్వరరావు విశిష్ట అతిథిగా సందేశం అందించారు. సృష్టిలో సాటిలేనిది అమ్మ ప్రేమ అనీ ఆ ప్రేమ తన గర్భవాసాన జన్మించిన వారికే కాక సకల ప్రాణికోటికీ పంచిన అమ్మ సాక్షాత్తూ పరదేవత అని చాగంటివారు ఆర్ద్రంగా వెల్లడించారు. వసుధైక కుటుంబ స్థాపనకు అమ్మ ప్రబోధం ఎలా దారి చూపుతుందో సోపపత్తికంగా చాగంటి కోటేశ్వరరావు నిరూపించారు.
తిరుపతి మహతి ఆడిటోరియంలో జరిగిన జిల్లెళ్ళమూడి అమ్మ శతజయంతి సందేశ సభ ఘనంగా జరిగింది.. అమ్మతో తమ అనుభవం, అమ్మతత్త్వంపై కుర్తాళం శ్రీ సిద్దేశ్వరీ పీఠాధీశ్వరులు శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామీజీ వారు, పూజ్యశ్రీ రమ్యానంద భారతీస్వామిని వారు అనుగ్రహభాషణ చేసారు… శాసన సభ్యులు శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి, జిల్లెళ్ళమూడి విశ్వజననీ ట్రస్ట్ చైర్మన్ కె.నరసింహ మూర్తి, మల్లా ప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఫిబ్రవరి 22వ తేదీ సాయంత్రం జరిగిన (తిరుపతి) సభలో అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డా.ఆకెళ్ళ విభీషణ శర్మ, తి.తి.దే. ఛీఫ్ ఆడిట్ ఆఫీసర్ శ్రీ కే.ఏ. శేష శైలేంద్ర పాల్గొన్నారు.
కొప్పరపు కవుల కళాపీఠం వ్యవస్థాపకులు శ్రీ మా శర్మ సభను నిర్వహించారు. ఈ సభలో పద్మశ్రీ ఎల్లా వెంకటేశ్వర రావు సమర్పించిన మృదంగ నాదార్చన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
శతజయంతి శంఖారావం ఉత్తరాంధ్రలో ప్రారంభమైంది. విశాఖపట్నంలో మాతృశ్రీ అధ్యయన పరిషత్ సహకారంతో పూర్వ విద్యార్థుల కృషిఫలితంగా శ్రీ విశ్వజననీపరిషత్ ట్రస్టు జనవరి 10వ తేదీ సాయంత్రం అమ్మ సందేశ సభను నిర్వహించింది.
ట్రస్టు ఛైర్మన్ శ్రీ కుమ్మమూరు నరసింహ మూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సభ శ్రీ ఎం. ఉమామహేశ్వరరావు ఆలపించిన భక్తిగీతాలతో శ్రీకారం చుట్టుకున్నది. డా. యు. వరలక్ష్మి సంచాలకత్వంలో డా.బి.ఎల్. సుగుణ సభా ప్రారంభకులుగా అమ్మ తత్త్వ సందేశం ఆసక్తికరంగా వెలువడింది.
సెయింట్ ఆన్స్ కళాశాల పౌరశాస్త్ర శాఖాధ్యక్షులు శ్రీమతి ఏ. భాగ్యలక్ష్మి, ఆంధ్ర విశ్వవిద్యాలయం రిటైర్డ్ రెక్టార్ ప్రొఫెసర్ ఏ.ప్రసన్న కుమార్, ప్రముఖ న్యాయవాది శ్రీ మజ్జి సూరిబాబు, ప్రముఖ కార్డియాలజిస్ట్ డా.ఏ. అశ్వనీ కుమార్, ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల రిటైర్డు ప్రొఫెసర్ కవిరాయుని కామేశ్వర రావు, విశాఖ-మాతృశ్రీ అధ్యయన పరిషత్ అధ్యక్షులు శ్రీమతి ఏ. కుసుమా చక్రవర్తి, ‘విశ్వజనని’ సంపాదకులు ఆచార్య మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి ప్రభృతులు పాల్గొన్నారు. అమ్మ అవతార తత్త్వాన్ని, జిల్లెళ్ళమూడిలో జరిగే సేవా కార్యక్రమాల విశేషాలనూ వక్తలందరూ వివరించారు. శ్రీ పొట్నూరు కృష్ణ సభకు స్వాగతం పలుకగా శ్రీ ఎం. భాస్కరరావు వందన సమర్పణ చేశారు.
జనవరి 11వ తేదీన రాజాంలో అమ్మ శతజయంతి సందేశ సభ వైభవంగా జరిగింది. శ్రీ కరణం శంకరరావు స్వాగత వచనాలతో ప్రారంభమై డా.బి.ఎల్. సుగుణ అధ్యక్షతలో ఈ సభ విజయవంతమైంది. ఆచార్య మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి సభాప్రారంభకులుగా, డా యు. వరలక్ష్మి ప్రధాన వక్తగా పాల్గొన్నారు.
రాజాం రెడ్ క్రాస్ అధ్యక్షులు శ్రీ కొత్త సాయి ప్రశాంత కుమార్, శ్రీ గార రంగనాథం, శ్రీ సిహెచ్ విశ్వనాథం ఈ సభలో పాల్గొన్నారు. అందరినీ బిడ్డలుగా ఆదరించే అమ్మ విశ్వమాతృత్వాన్ని వక్తలు వేనోళ్ళ ప్రస్తుతించారు. శ్రీ పి.చైతన్య కుమార్ సారథ్యంలో ఈ కార్యక్రమం ఆహ్లాద కరంగా జరిగింది. అమ్మ ప్రసాదంగా అందరికీ కార్యకర్తలు విందు భోజనం అందించారు.
ఆనాటి సాయంత్రం పార్వతీపురంలో జరిగిన ప్రత్యేక సభ అమ్మ దివ్య వైభవానికి జయపతాక.
2021 ఆగస్టు 6వ తేదీనుంచి అవిశ్రాంతంగా నిత్యమూ అన్నదానం నిర్వహిస్తున్న పూర్వ విద్యార్థులు శ్రీ గంటేడ చిన్నం నాయుడు నాయకత్వంలో ఈ సభ జరిగింది. డా.యు. వరలక్ష్మి, డా.బి.ఎల్.సుగుణ, ఆచార్య మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి ప్రభృతులు ఈ సభలో పాల్గొని అమ్మ ప్రబోధించిన విశ్వ మానవ సౌభ్రాత్ర వైభవాన్ని వివరించారు.
జనవరి 12వ తేదీ ఉదయం 10గంకు శృంగవరపుకోటలో ఆచార్య మల్లాప్రగడ అధ్యక్షతలో జరిగిన సందేశ సభలో డా.యు. వరలక్ష్మి, డా.బి.ఎల్. సుగుణ వక్తలుగా పాల్గొన్నారు. పూర్వ విద్యార్థులు శ్రీమతి వి.కస్తూరి, శ్రీ వి. భాస్కరశర్మ ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. సమాజ అభ్యుదయం కోసం విశ్వజననిగా అమ్మలోని త్యాగనిరతిని వక్తలందరూ బహుధా కీర్తించారు. అందరికీ అమ్మప్రసాదంగా అందించిన విందుభోజనంతో కార్యక్రమం పరిసమాప్తమైంది.
జనవరి 24వ తేదీన కొవ్వూరు శ్రీ సుందర సాయి దేవాలయంలో అమ్మ శతజయంతి సభ జరిగింది. ఆచార్య మల్లాప్రగడ అధ్యక్షతలో డా.యు. వరలక్ష్మి అమ్మ అభ్యుదయ పథాన్ని విశ్లేషిస్తూ ప్రసన్న గంభీరమైన ప్రసంగం చేశారు. ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హెరిడిటరీ ట్రస్టీ శ్రీ బ్రహ్మాండం రవీంద్ర రావు అమ్మ తన ఇంటిని అందరిల్లుగా తీర్చిన తీరు వివరించారు.
శ్రీ గుడివాక శ్రీనివాస్ మధుర గానంతో అమ్మకు స్వర సుమాంజలి సమర్పించారు.
మార్చి 18వ తేదీ శనివారం సాయంత్రం గుంటూరులో అమ్మ శతజయంతి సందేశ సభ ఆహ్లాదకరంగా సాగింది. బృందావన్ గార్డెన్సు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం పద్మావతీ కల్యాణ వేదికపై శ్రీ విశ్వజననీ పరిషత్ ట్రస్టు ఆధ్వర్యంలో జరిగిన ఈ సభ గజల్ గంగోత్రి డా.ఎం.బి.డి.శ్యామల భక్తిగీతాలాపనతో ప్రార్థనాగీతంతో ప్రారంభమైంది.
నాట్యాచార్యులు ఖలీల్ బృందం దేవీ వైభవాన్ని వివరిస్తూ చక్కని నృత్యం ప్రదర్శించారు.
ట్రస్టు అధ్యక్షులు శ్రీ కుమ్మమూరు నరసింహమూర్తి అధ్యక్షత వహించగా, శ్రీ బ్రహ్మాండం. రవీంద్రరావు అన్నయ్య జ్యోతి ప్రకాశనం చేశారు.
అందరూ సమైక్య భావంతో అమ్మ సందేశాన్ని ఆచరిస్తూ విశ్వవ్యాప్తం చేయాలని శ్రీశ్రీశ్రీ విశ్వయోగి విశ్వంజీ సందేశం అందించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న హిందూకాలేజీ హైస్కూల్ కమిటీ అధ్యక్షులు శ్రీ గబ్బిట శివరామ కృష్ణ అమ్మ అవ్యాజ ప్రేమతత్వాన్ని కొనియాడారు.
కార్యక్రమ నిర్వహణకు సంపూర్ణంగా సహాయ సహకారాలు అందించిన ఆలయ పాలకవర్గ అధ్యక్షులు శ్రీ సిహెచ్. మస్తానయ్య గౌరవ అతిథిగా అమ్మ పట్ల తమ భక్తిని వెల్లడించారు. ఆత్మీయ అతిథిగా ట్రస్టు సభ్యులు శ్రీ బొప్పూడి రామబ్రహ్మం తమ ప్రసంగంలో శాంతియుత సహజీవన సౌభాగ్యానికి దారులు వేసిన అమ్మకు నీరాజనం సమర్పించారు. విశిష్ట అతిథిగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల కరస్పాండెంట్ డా.బి.ఎల్. సుగుణ అమ్మ విశ్వ మాతృత్వాన్ని సప్రమాణంగా నిరూపించారు.
ప్రత్యేక అతిథిగా ప్రముఖ సాహితీవేత్త డా.డి.ఎన్. దీక్షిత్ అమ్మ పేరు అనసూయ అని, ఆ పేరు సార్థకమని వ్యాఖ్యానించారు. ఆనాటి అనసూయ త్రిమూర్తులను పసిపిల్లలను చేసిందనీ ఈ నాటి అనసూయ అందరినీ త్రిమూర్తులుగా చూసిందనీ వివరించారు. ఆచార్య
మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి సభను ఆసక్తి కరంగా నిర్వహించారు. శ్రీ జన్నాభట్ల సుబ్రహ్మణ్యం, శ్రీ విజయేంద్ర, శ్రీ అన్నంరాజు వంశీ మాధవ్, శ్రీ పోతరాజు హైమానంద్ ప్రభృతుల సహకారంతో సభ విజయవంతం అయింది. శ్రీ వడ్లమాని రవి అందించిన సౌజన్యం మరువలేనిది.
మార్చి 19వ తేదీన బాపట్లలో రోటరీ కల్యాణ మంటపంలో అమ్మ శతజయంతి సందేశ సభ శ్రీ కొండముది ప్రేమ కుమార్ పర్యవేక్షణలో సంతృప్తికరంగా జరిగింది.
శ్రీమతి లక్కరాజు విజయశ్రీ మధురగానంతో శ్రీకారం చుట్టుకొన్న ఈ సభలో స్థానిక శాసన సభ్యులు శ్రీ కోన రఘుపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లెళ్ళమూడి అభివృద్ధికి వ్యక్తిగతంగానూ ప్రభుత్వపరంగానూ సంపూర్ణ సహకారం అందించగలమని శ్రీ రఘుపతి నిండు మనసుతో ప్రకటించారు. శ్రీ నందిరాజు విజయకుమార్ చక్కని నిర్వహణలో శ్రీ నందనవనం శ్రీనివాస రావు ప్రధాన వక్తగా ఈ సభలో పాల్గొని అమ్మను దివ్య జననిగా పేర్కొన్నారు. శ్రీ కె.నరసింహ మూర్తి అధ్యక్షతన శ్రీ రవి అన్నయ్య జ్యోతి ప్రకాశనంతో సభకు నిండుదనం వచ్చింది. సభా ప్రారంభకులు డా.యు వరలక్ష్మి బాపట్లతో అమ్మకున్న అనుబంధాన్ని హృద్యంగా ఆవిష్కరించారు.
ఆత్మీయ అతిథిగా శ్రీ కొండముది సుబ్బారావు అమ్మలోని అవ్యాజ ప్రేమ వైభవాన్ని వివరించారు. ఆచార్య మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి పుష్పాంజలి సమర్పించారు. శ్రీ ఎం. నాగరాజు వందన సమర్పణ చేశారు. అమ్మతో అనుబంధం పెనవేసుకొన్న కుటుంబాలకు చెందిన సోదరీ సోదరులను ఈ సభలో సత్కరించటం విశేషం.