సమితి కార్యక్రమముల స్థితి, పురోగతి, సభ్యుల పాత్ర సంక్షిప్త నివేదన
- అమ్మష్టాలు : జనవరి – ఫిబ్రవరి నెలలో అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనలో “అమ్మ” తత్వ ప్రచారంలో భాగంగా జిల్లెళ్ళమూడి అమ్మ సేవా సమితి 40 రోజులపాటు స్టాలును నిర్వహించి అమ్మను గురించి తెలియజేసే సాహిత్యంతో పాటు, తీర్థ ప్రసాదములు, కుంకుమ, అమ్మ ఫొటోలు సందర్శకులకు ఇచ్చుచున్నాము.
స్టాలు నిర్మాణము నిర్వహణలలో ఎంతో మానవ వనరుల ఆవశ్యకత యున్నది. ప్రతి సోదర సభ్యుడు/సభ్యురాలు 40 రోజులలో ఏదో ఒక రోజు సాయంత్రం 6 గంటల నుండి రా॥ 8 గంటల వరకు రోజుకు ఇద్దరు చొప్పున స్టాలులో సేవా కార్యక్రమములో పాల్గొని “అమ్మ” కృపకు పాత్రులు కాగలరు.
స్థాలు నిర్మాణమునకు సుమారు రూ. 24,000/- నిర్వహణకు (ప్రసాదము, పూలు, దండ మొ॥వాటికి) రోజుకు రూ. 1100/- చొప్పున రూ. 44,000/- వ్యయమగును.
- అమ్మ జన్మదినోత్సవం : 2019 సంవత్సరము నుండి మార్చి 28 తేదీన ప్రతి సంవత్సరం, సంవత్సరమునకు ఒక ప్రాంతం చొప్పున హైదరాబాదులో వివిధ ప్రాంతాలలో “అమ్మ” జన్మదినోత్సవము నిర్వహించాలని కార్యవర్గం భావించుచున్నది. దీనికి వివిధ ప్రాంతాలలోని సభ్యులు అచ్చట హాలు మొ|| నిర్ణయాలలోను కార్యక్రమ నిర్వహణలోను కార్యవర్గమునకు సహకరించి “అమ్మను”ను గురించి వివిధ ప్రాంతముల వారికి తెలియచేయు మహత్కార్యములలో పాల్గొనగలరు. ఈ కార్యక్రమమునకు రమారమి రూ. 75,000/- ఖర్చు అగును.
- అమ్మ కళ్యాణం : అమ్మ కళ్యాణము కూడా ప్రతి సంవత్సరము వేరు వేరు ప్రాంతాలలో నిర్వహించిన అమ్మ తత్త్వ ప్రచారము విస్తృత పరిధిలో జరుగునని భావించుచున్నాము. కళ్యాణమునకు, మంగళసూత్రములు, మట్టెలు మొ|| చేయించిన యెడల అవి “అమ్మ”కు వాడి 16 రోజుల పండుగ అయిన తరువాత వారికే ప్రసాదముగా ఈయబడును. అవి వారి పిల్లల పెండ్లిలో ఉపయోగించుకోవచ్చును. “అమ్మ” కళ్యాణానికి సహితం రమారమి రూ. 75,000/- ఖర్చు అగును.
- సమితి భూములు, భవన నిర్మాణం : సమితికి తొర్రూరు, హయతనగర్ మండలంలో సర్వే నం. 108లో 800 గజములు (ప్లాట్ నెం. 149 మరియు 150) సర్వే నం. 110లో 200 గజములు (ప్లాట్ నెం. 397) స్థలము కలదు. లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీము క్రింద సుమారు రూ. 2,00,000/- (రెండు లక్షలు) ఖర్చు చేసి వీని లేఅవుట్ రెగ్యులరైజ్ చేయించితిమి. ఈ భూమిలో “అమ్మ” ధ్యానాలయం, ఫంక్షన్ హాలు కలసి యుండునట్లు ఒకే కట్టడం నిర్మించిన ఆధ్యాత్మిక కార్యకలాపాలు మరియు సమితి సభ్యులు వారి పిల్లల శుభకార్యములు తక్కువ ఖర్చుతో నిర్వహించు కొనవచ్చును. అంతే కాక భవనపు నిర్వహణ ఖర్చు అదనపు భారం కాకుండా వుంటుంది.
భవన నిర్మాణానికి సుమారు రూ. 97 లక్షలు అగునని ఒక అంచనా. దీనికి సభ్యుల విరాళములు మాత్రమే చాలవు అందువలన వారికి తెలిసిన కార్పొరేట్ సంస్థల నుండి కాని, ధనవంతులయిన దాతల నుండి కాని, ఇతరముగాను, విరాళము సేకరించు మార్గములు చూపి, సేకరించి యిచ్చి సహకరించవలసినదిగా ప్రార్థన.
- అమ్మ తత్వప్రచారంలో సమితి యితర కార్యక్రమాలు :
(అ) ప్రేమార్చన :- అనాధలకు, వృద్ధులకు, మానసిక, శారీరక వికలాంగులకు, అన్న ప్రసాదము, వస్త్రములు యిచ్చుట, పేద విద్యార్థులకు సహాయము. ఈ కార్యక్రమాలలో ప్రతినెల కనీసం ఒక కార్యక్రమం చేస్తున్నాము. ‘9’ కార్యక్రమాలకు శ్రీ బి. వెంకటరామ శాస్త్రిగారు వారి కుటుంబము ఆర్థిక సహాయం చేస్తున్నారు. చలికాలం కాలిబాటలపై నిద్రించు పేదలకు రగ్గులు కప్పుట మొదలగు కార్యక్రమములు నిర్వహించుచున్నాము.
(ఆ) ప్రవచనములు :- అమ్మను గురించిన ప్రవచనం చాలా కాలం క్రిందట చేశాము. తరువాత మార్చి 28న “అమ్మ” జన్మదినోత్సవంనాడు శ్రీ వి.యస్.ఆర్. మూర్తిగారు చేశారు. శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తిగారి చేత హైదరాబాదులోని వివిధ ప్రాంతాలలో నెలకు ఒకసారి ‘మాతృశ్రీ అనసూయా వైభవం’ అను పేర ఒక ప్రవచనం చేయించాలని సంకల్పంతో వారితో మాట్లాడటం జరిగింది. వారు అప్పుడు సమ్మతించారు.
(ఇ) పూజలు :- హైదరాబాదులో ఏదో ఒక ప్రాంతంలో వారానికి ఒక రోజు పూజ జరిగితే కొత్తవారు కొంత మంది అమ్మను గురించి తెలుసుకొని లబ్ది పొందుతారనే ఉద్దేశ్యంతో 52 వారాలు 52 మంది భక్తులు / సభ్యులు ముందుకు రావల్సిందిగా కోరాము. సంవత్సరానికి ఒకరికి ఒక్కసారి అవకాశం వస్తుంది. చేయడం సులభమవుతుంది. ప్రస్తుతం నెలలో మొదటి ఆదివారం కీ.శే. పులిపాక శ్రీ రామమూర్తిగారి యింట్లో జరుగుచున్నది. (ఫోను 040-23323229) 52 వారాలలో ఎవరు ఏ వారం ఏ తేదీన చేయాలను కుంటారో 9492925315 / 9441262927 / 9290460859 లకు తెలిపితే వారికి కావలసిన ఫ్లెక్సీ సరఫరా చేసి ఇతర సభ్యులకు వర్తమానం అందించి సమితి అనుసంధానం చేస్తుంది.
- సభ్యుల శుభాశుభాలలో సమితి స్పందన :
(అ) గృహప్రవేశానికి, వారి పిల్లల కళ్యాణానికి పీటల మీద కూర్చునే సమితి సభ్యులు (ఏ ఒక్కరైనా సరే) అయిన దంపతులకు “అమ్మ” ప్రసాదంగా వస్త్రములను కార్యవర్గ సభ్యుల ద్వారా సమితి అందచేస్తున్నది.
(ఆ) సమితి సభ్యులు “అమ్మ” ఒడి చేరినప్పుడు దండ, శేషవస్త్రం యిచ్చి
సమితి తమ సంతాపం తెలియజేస్తున్నది. (ఇ) సభ్యుల తల్లి/తండ్రి “అమ్మ ఒడి చేరితే వారికి ఆదరణ వస్త్రములు యిచ్చి సమితి సానుభూతి తెలియజేస్తున్నది.
- వృద్ధులైన (74 + సంవత్సరములు) సభ్యులకు వారి జీవిత భాగస్వామికి, “అమ్మ” ఫొటో ఉన్న జ్ఞాపికను, జిల్లెళ్ళమూడిలో “అమ్మ” నాన్నగారి పాదాల వద్ద ఉంచిన ధోవతి, చీరెను బహూకరించి సత్కరించు సాంప్రదాయమును సమితి ఆరంభించినది.
- నూతన సభ్యుల చేరిక :
(అ) ఇప్పటికే సభ్యులైన వారు తమకు తెలిసిన భక్తి మరియు సేవా తత్పరులైన వారిని ఇతోధికంగా సభ్యులుగా చేర్పించ విన్నపము.
(ఆ) సభ్యత్వ చందా – సంవత్సరమునకు (క్యాలెండర్ ఇయర్) రూ. 250/ జీవిత పర్యంతం (పది సంవత్సరాలు) రూ. 2000/
- (అ) “అమ్మ”ను గురించిన పుస్తకాలు ప్రతి ఒక్క సభ్యుడు సంవత్సరానికి కనీసం 3 కొనుగోలు చేసి వారి మిత్రులకు బహుమతిగా ఈయ ప్రార్థన.
(ఆ) ‘విశ్వజనని మాసపత్రిక’కు, ‘మదర్ ఆఫ్ ఆల్’కు చందాదారులు కండి. అమ్మ డయిరీలు కొని వాడండి. అమ్మను గురించి గా తెలుసుకోండి మరియు ఇతరులకు తెలియ చేయండి.
ముగింపు :
(క) “అమ్మ” స్టాలులో రోజుకు కనీసం ఇద్దరు సేవలో పాలుపంచుకొనండి.
(ఖ) “అమ్మ” జన్మదినోత్సవం, కళ్యాణం హైదరాబాదు/సికింద్రాబాదులలో ప్రతి సంవత్సరం ఒక నూతన ప్రదేశంలో నిర్వహించడానికి సహకరించండి.
(గ) “అమ్మ” పూజ ప్రతివారం ఒకరి యింట్లో చేయడానికి వీలుగా 52 మంది తమ పేర్లను నమోదు చేసుకొనండి.
(ఘ) ప్రేమార్చనలు, ప్రవచనములు ఇతోధికంగా జరపటానికి “అమ్మ” పుస్తకములు విరివిగా కొని పంచి సహకరించండి.
(జ) ఆర్థిక వనరుల అభివృద్ధికి, సభ్యుల సంఖ్య వృద్ధికి మీ సలహాలు, సహాయం అందించండి.
(చ) మీ శుభాశుభములను మాతో పంచుకోండి.