ప్రియమైన అమ్మకు శతకోటి ప్రణామాలతో,
నీ ఒడి బిడ్డలు, నీ బడి పిల్లలు, జిల్లెళ్ళమూడి అమ్మ సేవాసమితి, పార్వతీపురం సభ్యులు వ్రాసుకుంటున్న మొదటిలేఖ, అభ్యర్థన –
అమ్మా ! ఏ పూర్వపుణ్యఫలమో, మేమంతా నీ చెంత చేరాము. నీ పవిత్ర సువర్ణ హస్తాలతో స్థాపించిన మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో చదివాము. నీ చేతి గోరుముద్దలు తిన్నాము. సంస్కృతీ, సంప్రదాయాలు తెలుసుకున్నాము. అందరింటిలో, అర్కపురిలో ఎందరెందరో, మహానుభావుల పరిచయాలతో, సూక్తి సుధల పరిమళాలతో పునీతుల మయ్యాం. నీ ప్రేమ సుధాప్రవాహంలో తడిసి ముద్దయి, జన్మసార్థకం చేసుకున్నాం. “నీకున్నది తృప్తిగా తిని, యితరులకు ఆదరంగా పెట్టుకో” అన్న నీ మాటను ఆదర్శంగా తీసుకొని, ఏ కొద్దిమందికైనా ఆకలి తీర్చాలనే ఉద్దేశ్యంతో, పార్వతీపురం ప్రాంత పూర్వవిద్యార్థులమైన మేమంతా ఏకమై, నీ పేరుతో తేది 06-08-2021న జిల్లెళ్ళమూడి అమ్మసేవాసమితిపేరుతో ఒక సేవా సంస్థను ఏర్పాటు చేసుకొని, ఆ రోజు 50 మందితో 50 మంది అన్నార్తులకు, అన్నప్రసాదం అందించాము. నీ కృపాకటాక్షవీక్షణాలతో, నీ విచ్చిన సంకల్పబలంతో, ఆ రోజు ప్రారంభమయిన, “అమ్మ అన్నప్రసాద వితరణ యాగం” పార్వతీపురం జిల్లా ఆసుపత్రి ఆవరణలో ఇంతింతై వటుడింతయై అన్నట్లుగా, దినదినాభివృద్ధి చెందుతూ, వందలాదిమందికి ఆకలితీర్చే సేవా సంస్థగా రూపు దిద్దుకుంది మన సేవా సమితి. ఏరికోరి మా పార్వతీపురం ప్రాంతానికి నీవు వేంచేసినందుకు ధన్యవాదాలమ్మా! మాకీ సదవకాశాన్ని కల్పించిన నీకు, ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం? శిరస్సు వంచి నమస్కరించుకోవడం తప్ప. అయితే అమ్మా! మాదో కోరిక. మాకు అన్నీ ఇచ్చావు. మాకేమి కావాలో నీకే తెలుసు. ఇప్పుడు మా అందరి కోరిక ఒకటే. మన ఈ సేవాసమితి ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలనే తపన. అందుకు నీ ఆశీస్సులు కావాలి. ఎల్లవేళలా మాకు అండగా ఉండాలి. ఆయురారోగ్యాలు ప్రసాదించాలి.