పల్లవి:
విప్లవ శంఖారావ బాణీ జిల్లెళ్ళమూడి అమ్మ వాణీ,
వేదమయ జీవన శ్రేణి ఆ మహా యోగిని వచన వేణి!!
చరణాలు:
నిగ్రహం వుంటే ఏ గ్రహాలు ఏమీ చేయలేవు మనలని,
మనిషిని నడిపించేది నవగ్రహాలు కాదు రాగ ద్వేషాలే,
తనను తాను విమర్శించు కోవడం వివేక మంటారు,
జగత్ సత్యం బ్రహ్మ సత్యం యని ప్రకటించిన ధీశాలి!…
మన బిడ్డ కనబడ్డట్టు అందరూ కన్పించుటే బ్రాహ్మీస్థితి,
మనం చూసేదంతా దివ్యంగా కనబడుటయే దివ్యదృష్టి,
విచక్షణ లేని వీక్షణయే సమదృష్టి అనుగ్రహమంటారు,
వైకల్యము లేని స్థితినే కైవల్యమన్న సమతావాది అమ్మ!…
అన్నమే కాదు అశుద్ధము గూడా పరబ్రహ్మ స్వరూపమే,
భర్తే దైవం భార్యకు అంటారు భార్య గూడా దేవతే భర్తకు,
రోగికి వైద్యుడే కాదు, వైద్యునికి రోగి కూడా నారాయణుడే,
శిష్యునికి గురువే కాదు, గురునికి శిష్యుడు కూడా బ్రహ్మమే!…
మిధ్య అంటే లేదని కాదుగా ఎప్పుడూ మారుతూ వుండేది,
దయ్యమంటే దయలేని వాడు, సర్వత్రా అనురాగమే విరాగం.
సహనమనే దేవతను కష్టాలనే పూజా ద్రవ్యాలతో పూజించు,
ఒరిపిడి అవసరమే, బంగారానికి పువ్వుకు ఒకటే పనికిరాదు!…
నాదేముంది అమ్మా, మీ విశ్వాసమే మిమ్ములను రక్షించినది,
దైవత్వం కాదు మాతృత్వం, అందరినీ ప్రేమించుటే నా తత్వం,
శుక్ల శోణితములది ఏ కులమో నాదియును అదియే కులము
విశ్వకుండలినీ శక్తి విశ్వజననియే మా జిల్లెళ్ళమూడి అమ్మ!!..