వచ్చిన వారందరికీ వడ్డించి – ఆకలి తీర్చటమే అమ్మ సంకల్పం,
స్వయం అన్నపూర్ణ, అన్నదాత – మా జిల్లెళ్ళమూడి అమ్మ…
వేదాంత విజ్ఞాన భాషణలు లేవు – ఆత్మజ్ఞానం ఊసే లేదు.
నిత్య జీవిత సత్యాలు నిండుగా – విడమరచి చెప్పటమే వేదాంతం…
‘అద్వైత మంటే ఏమిటమ్మా!’ అని అడిగింది ఒకామె.
‘కూతురినీ కోడల్నీ ఒక్కటిగా – చూస్తే సరిపోతుంది గదమ్మా!’ ..
‘యజ్ఞము చేస్తున్నాము మేము – ఆహుతి ఏదైనా వెయ్యండమ్మా!’
-‘గాడి పొయ్యిలోనే వేస్తా నమ్మా – నేను వెయ్య దలచుకున్నదంతా….
యోగి గదా మీరు – ఏమిటి మీ సాధన?’ – ‘గరిటలు గిన్నెలూ’….
‘ముహూర్తము చెప్పండమ్మా! మా గృహ ప్రవేశానికి.’
– పెట్టేది కాదు, జరిగేదే ముహూర్తము’
‘ఎందుకమ్మా ఇలా వుంది లోకం – స్వార్ధం రాజ్యమేలుతూ..?’
‘మంచి చెడులు – కలిసే గదమ్మా సృష్టి’….
మంచి చెడ్డలు ఎంచదు బిడ్డల్లో.
పాపులు పతితలు అందరూ – అమ్మకు పసిబిడ్డలే!..
‘మానవత్వం చూస్తారు మీరు నాలో- దైవత్వం చూస్తాను నేను మీలో’ ..
ఉన్నంతలో ఆదరముగా ఇతరులకు పెట్టే ప్రతి యిల్లు
అమ్మ యిల్లే. గుర్తించి, ఆచరించి తరించండి
వర్షంలో తడిసిన పేదరాలికి – అమ్మ పట్టు చీర ఇస్తుంటే అన్నారు,
‘ఇది నీకు రేపటికి చీరె కదమ్మా!’ -‘ఇస్తేనే గదమ్మా మనకు వచ్చేది’……
‘రాగద్వేషాసూయల రాహిత్యమే గదా అనసూయ’.
గుణాతీత ప్రాజ్ఞత స్థితప్రజ్ఞత – మన జిల్లెళ్ళమూడి అమ్మయే! …
కష్టాలు నష్టాలు జీవితములో – ఎవరి కైనా అనివార్యం.
వాటిని భరించే శక్తి నిస్తాయి – జపాలు, తపాలు…
కష్టాలను చూసి స్పందించటమే మానవత్వం.
పరోపకారమే పుణ్యం. మానవత్వమే దైవత్వం!..
అమ్మ అంటే లోతు తెలియని సముద్రం,
అమ్మ అనగా హద్దు లేనిది – అమ్మ అనగా అడ్డు లేనిది!
‘ఉన్నది శక్తి ఒక్కటే. దైవీశక్తి అంటూ వేరుగా లేదు’
– కనిపించే దంతా దైవీరూపమే!!..