1. Home
  2. Articles
  3. Viswajanani
  4. జిల్లెళ్ళమూడి అమ్మ

జిల్లెళ్ళమూడి అమ్మ

Palla Satyanarayana
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 21
Month : January
Issue Number : 6
Year : 2022

ఓంకారశబ్దిణి శ్రీకారరూపిణి

అర్కపురవాసిని లోకైక జనని

వందనం నీకిదే నీ చిన్నితనయుని

నిను వర్ణింప నేనెంత త్రిలోకపావని ||ఓం||

 

నీ ముఖారవిందాన్ని చంద్రుడే ధరించే

నీ నుదుటి తిలకంగా సూర్యుడే వసించే

సూర్యచంద్రాదులు నీ చుట్టు పరిభ్రమింప

కరుణగల చూపులతో పండువెన్నెలలు గాయ

తీయతీయని పలుకుల అమృతఝరులు కురియ ||ఓం||

 

ఎందరెందరు ఏ సమయంలో వచ్చినా

అరగంటలో మృష్టాన్న భోజనం వడ్డించీ

ఆకలిని తీర్చేటి అమృతామూర్తీ! అన్నపూర్ణేశ్వరీ! ||ఓం||

 

ఏ పండుగొచ్చినా జాతిమత భేదం లేక

సర్వదేవతారూపాన్ని నీలోన దర్శించి

బాధల్ని మరిచాము పరవశం చెందాము

సమసమాజ నిర్మాణశిల్పీ! విశ్వచైతన్య స్వరూపీ! ||ఓం||

 

దేశవిదేశాల నుండి-యాత్రికులు వచ్చారు

ఆస్తికులు వచ్చారు – నాస్తికులు వచ్చారు

నీ పాదాల నాశ్రయించారు- నీహృదయంలో తిష్ఠవేశారు

అసలైన అమ్మ వని అన్నారు-నీపాదాల మోకరిల్లారు ||ఓం||

 

వ్యాకరణ ఛందస్సు తర్కమీమాంస శాస్త్రాలు

నీ ఆశ్రయంలో వల్లెవేశారు పురాణేతిహాసాలు పారాయణ చేశారు

నీవు నెలకొల్పిన ప్రాచ్యకళాశాలలో ఓనమాలుదిద్దారు

అచట పుట్టిన చిగురుకొమ్మైన చేవగా పేరు గాంచారు ||ఓం||

 

సుప్రభాత సంధ్యావందన మాచరించువేళల

నీ సాన్నిధ్యం,నీదర్శనం, నీ పలకరింపు అమృతం చిలికాయి;

జయహోమాతా శ్రీ అనసూయా రాజరాజేశ్వరి శ్రీపరాత్పరి

నామమంత్రం గురుశిష్య బృందాన్ని పునీతం చేసింది ||ఓం||

 

గారెలు బూరెలు వడ అప్పడాలు

పాయసం పులిహోర గోంగూర పచ్చడి

అన్ని వంటకాలు నీ మమకారం నీ అనురాగం

రూపుదిద్దుకున్నాయి – అందుకే అంతమధురం ||ఓం||

 

నీ ఆస్పత్రిలో చేరి ఎందరో ప్రాణం పోసుకున్నారు

మరెందరో నీ ఒడిలో చదివి జీవితంలో స్థిరపడ్డారు.

మేము నీ బడిలో విద్యార్థులం – నీ ఒడిలో చిన్నారులం

మా జీవితం, జీవనం నీవె – మా ఊపిరి, మా చేవ నీవె

వినైవానసూయాం నమాతా నమాతా 

సదైవానసూయాం స్మరామి స్మరామి ||ఓం||

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!