జిల్లెళ్ళమూడి నాలుగు ఆలయముల కూటమి. దేహం విడిచిన హైమకి 6-4-1968న ప్రాణప్రతిష్ఠ చేసి, హైమాలయాన్ని అమ్మ కట్టించింది. 1970లో విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. హైమ మానవిగా జన్మించి, దైవానుగ్రహం పొంది దైవత్వాన్ని అధిరోహించింది. నేడు అనేక విధాల దర్శనాలు ఇస్తున్నది. బాధావిముక్తులను చేస్తున్నది. అక్కడ చేస్తున్న ప్రార్థనలు వ్యర్ధం కావు. హైమాలయంలో చేరిన వారి మనస్సులలో అశాంతికి తావులేదు. అమ్మే. చెప్పిందికదా. “నాదేముందిరా! అంతా అనుగ్రహము హైమదే. హైమ గతించలేదు. నాముందు తిరుగుతూనే ఉంది. మీకు కనబడుతుంది. మీతో మాట్లాడుతుంది” అని.
అనసూయేశ్వరాలయానికి 1956లో శంకుస్థాపన జరిగి నిర్మాణం కొంత 1 వరకు జరిగి ఆగిపోయింది. 16, ఫిబ్రవరి 1981న నిత్య సువాసిని అయిన అమ్మ పతిదేవులు మనకి నాన్నగారు చివరి శ్వాస పీల్చగా 17వ తారీకున అమ్మ, నాన్నగారిని ఆలయములో ప్రవేశపెట్టించింది. అనసూయేశ్వరులై ఆవిర్భవించారు. ఆలయానికి ‘అనసూయేశ్వరాలయ’ మని నామకరణం చేసినది. అమ్మ “నాన్నగారి పక్కనే ఎప్పటికైనా నాస్థానమని సుస్పష్టంగా ఎన్ని పర్యాయములో చెప్పింది.
12 జూన్ 1985న అమ్మ దేహనిష్క్రమణ చేసినది. అమ్మ ఆదేశాను సారంగానే అనసూయేశ్వరాలయంలో నిర్ణీతమైన స్థలంలో అమ్మను ప్రతిష్ఠించడం జరిగింది. అమ్మ ‘నేను శరీరములో ఉన్నప్పటి కంటె శరీరంలో లేనప్పుడే మీకు ఎక్కువగా ఉపయోగపడతాను” అని హామీ యిచ్చినది. అలాగే మనల్ని కాపాడుతూనే ఉంది. మన అవసరాలు తీరుస్తూనే ఉంది. రెండు చేతులు పైకెత్తి ‘నేను నిస్సహాయుడను’ అని ప్రార్థిస్తే శరీరంతో కూడ కనబడుతుంది. సర్వప్రజానీకానికై అభయప్రదాయినియై, ఆశాజ్యోతియై అనంత దీప్తితో ప్రకాశిస్తోంది అనసూయేశ్వరాలయం.
నూతనముగా వెలిసిన శ్రీ నవనాగేశ్వరాలయము, శ్రీ వరసిద్ధి వినాయకాలయములు తృతీయ, ద్వితీయ వార్షిక ఉత్సవములు జూన్ నెలలో జరుపుకున్నవి. నిత్యమూ వేదఘోష, అభిషేకములు, కుంకుమపూజలు హోమములు, యజ్ఞములు, వ్రతములు, పారాయణలతో ఆలయములు వెలుగొందుతున్నవి. అనంతశక్తి సాగరానికి రేవై, శక్తిపీఠమై, సర్వప్రజానీకానికి అభయప్రదాయినియై, ఆశాజ్యోతియై, భక్తుల పాలిట కల్పవృక్షమై, శాశ్వత తీర్థయాత్రాస్థలమైన మహాక్షేత్రం – జిల్లెళ్ళమూడి.
మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథిదేవోభవ, అను నాలుగు ఆర్యోక్తులను మనము ఆచరించవలసినవి. మూలస్తంభాలు, సర్వశాస్త్రముల యొక్క సారాంశము. హిందూమతమునకు
అమ్మను నేను అమ్మగానే చూసినాను. చూస్తున్నాను. అది నా అదృష్టమూ, దురదృష్టమూ కూడ. అమ్మను కొంత మంది గురువుగా, మరి చాలా మంది దేవుడుగా చూస్తారు. నిజానికి అమ్మ అంత కన్న ఎక్కువే. శిష్యుడు చిన్న అబద్ధము ఆడినా, చిన్న తప్పు చేసినా గురువు మండిపడి శిష్యుని శపించిన కథలు ఎన్నో. పురాణములలో ఉన్నవి. అమ్మకి తన పిల్లలలో తప్పుపట్టడము అనే ప్రశ్న లేదు. ‘తల్లికి తప్పే కనిపించదగింది. ఇంక శిక్షించే ప్రశ్నలేదు. అవతార మూర్తులు దుష్టులను శిక్షించడం, శిష్టులను రక్షించడం చేసినారు. విష్ణువంతటివాడు దేవతలకు అమృతం పంచి, దానవులకు నిరాకరించినాడు. అమ్మ అందరికీ ఏ విధమైన తేడా చూపక అమృత తుల్యమైన ప్రేమను పంచి పెట్టింది. తనకి చిన్న తనంలో మహాఅవమానము చేయుటకు ప్రయత్నించిన వ్యక్తికి ఆదరణ, ఆప్యాయతలతో ప్రసాదం యిచ్చి బట్టలు పెట్టి పంపించింది. అమ్మ మనలో దోషములు వెతకదు, ప్రేమను పంచి పెట్టడం తప్ప. అందుకే అమ్మ అమ్మే – మాతృదేవోభవ.
అమ్మ స్థానం ఎప్పుడూ నాన్నగారి పక్కనే అంది. వారిద్దరు మనకి పార్వతీ పరమేశ్వరులు. జిల్లెళ్ళమూడి మనకు కైలాసమే. మనము నాన్నగారిని పితృదేవోభవ అని నమస్కరిస్తున్నాము.
అమ్మ ప్రవేశపెట్టిన ఊళ్ళో పిడికెడు బియ్యం పథకం ఒక మంత్రం లాగ పనిచేసింది. అదే ఆలయానికి పునాదీ, అన్నపూర్ణాలయానికి నాంది అయింది. అన్ని బాధలకంటే ఆకలి బాధ మహాబాధ. ఆకలి అంతస్థు, వయస్సు, యోగ్యతలకు అతీతమైనది. ‘ఆకలిబాధ భరించడం కష్టం నాన్నా’ అనేది. అన్నపూర్ణాలయానికి రూపకల్పన చేసినది. 1958లో చిన్న వాగుగా మొదలైన అన్నపూర్ణాలయము 1973 స్వర్ణోత్సవములలో మహానది అయినది. ఒకే పంక్తిలో లక్షమంది. అమ్మ బిడ్డలు ఆప్యాయత, అనురాగము, ఆదరణలతో కూడి అమృతతుల్యమైన అమ్మ ప్రసాదాన్ని స్వీకరించినారు. 1958 ఆగష్టు నెలలో, అమ్మ ఆశీర్వచనముతో మొదలై 2008 ఆగష్టులో 50 సంవత్సరములు పూర్తి చేసుకుని నిత్యయౌవ్వనముతో పరుగులిడుతోంది. వయస్సుతో నిమిత్తము లేదు. డ్రెస్సు, ఎడ్రస్లతో సంబంధము లేదు. పండిత పామరులు తేడా లేదు. అమ్మకు అందరూ బిడ్డలే. అందరూ అతిథి దేవుళ్ళే, అమ్మ చెప్పింది కదా, ‘నాలో మీరు మానవత్వాన్ని చూస్తారు. నేను మీలో దైవత్వాన్ని చూస్తాను’ అని.
1971లో విశ్వజననీ పరిషత్తు ఏర్పడి, మాతృశ్రీ విద్యాపరిషత్తు, మాతృశ్రీ సంస్కృత పాఠశాల, కళాశాలలు ఏర్పడినవి. అప్పటి నుండి ఎంత మందో మేధావులు, సంస్కృత తెలుగు భాషలలో విద్యావేత్తలు, ఆచార్యవర్యులు ఆ సంస్థల అభివృద్ధికి నిర్విరామంగా కృషి చేస్తున్నారు. ఉన్నత విద్యా సంస్థగా తీర్చిదిద్దుతున్నారు. ఎందరో మహానుభావులు, శ్రీశైల పూర్ణానందస్వామి, లక్ష్మణ యతీంద్రులు, శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వంటి ఆధ్యాత్మిక వేత్తలేకాక, కరుణశ్రీ పాపయ్యశాస్త్రి, జటావల్లభుల పురుషోత్తం, జమ్మలమడక మాధవరామశర్మ ఎక్కిరాల కృష్ణమాచార్య, వేదవ్యాస్, భరధ్వాజ, పుట్టపర్తి నారాయణాచార్య శ్రీపాద గోపాల కృష్ణమూర్తి, కోటంరాజు రామారావు, కాశీకృష్ణమాచార్యులు, దువ్వూరి వెంకట రమణ శాస్త్రి వంటి కవి, పండితవర్యులు ఎందరో మహానుభావులు జిల్లెళ్ళమూడి వచ్చినారు. సద్గురు శివశ్రీ శివానంద మూర్తిగారు, బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారి వంటి ప్రసిద్ధులు అమ్మలోని జగన్మాతృత్వాని దర్శించినారు. వారందరూ అమ్మకు బిడ్డలే. ఆచార్యులే – ఆచార్యదేవోభవ.
జిల్లెళ్ళమూడి ఆలయములు కూటమి మాత్రమే కాదు.
నాలుగు ఆర్యోక్తుల సాయుజ్యము కూడా.
జయహోమాతా శ్రీఅనసూయా రాజరాజేశ్వరి శ్రీపరాత్పరి