1. Home
  2. Articles
  3. Viswajanani
  4. జిల్లెళ్ళమూడి క్షేత్ర గురుత్వాకర్షణ

జిల్లెళ్ళమూడి క్షేత్ర గురుత్వాకర్షణ

K B G Krishna Murty
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 15
Month : August
Issue Number : 1
Year : 2015

సాక్షాత్తు పరమాత్మే మానవిగా జిల్లెళ్ళమూడి గ్రామం కరణం శ్రీ బ్రహ్మాండం నాగేశ్వరరావు గారి భార్య అనసూయగా అవతరించి యావత్ జీవులను తన బిడ్డలుగా చూస్తూ ప్రేమిస్తుంది. ఆమె నివసించిన ఇంటిని “అందరిల్లు” గా నామకరణమొనరించి అందరికి భోజన, వసతి సౌకర్యాలను కలుగచేస్తూ అందరితో మృదుమధురముగా ఆధ్యాత్మికతను మేళవించి మాట్లాడింది. అందరిని ఆత్మ స్వరూపులుగా ఆమె చూస్తూ అందరిని అట్లా చూడమని అభిభాషించింది. అటువంటి దివ్యమైన ప్రేమమూర్తి నివసించిన గ్రామము జిల్లెళ్ళమూడి ఒక పుణ్యక్షేత్రముగా విలసిల్లుతూ పలు సోదరీ సోదరులను ఎటువంటి విచక్షణ లేకుండా ఆకర్షిస్తుంది. ఆ క్షేత్రములో కొంత కాలము నివసించినట్లయితే ఆ క్షేత్రమును వదలలేని పరిస్థితి తటస్థ పడుతుంది. వారు, వారి కుటుంబ సభ్యులైన భార్య, పిల్లలు, మనుమలు, మనుమరాండ్రను సైతం వారు ఎంతో ప్రేమిస్తున్నా, ప్రేమింపబడుతున్నా వారి మనస్సంతా అహర్నిశలు ఈ క్షేత్రము వైపుకే లాగివేయబడటం అనేకమైన సోదరీ సోదరులకు అనుభవైకవేద్యమే.

నేను అమ్మతో 52 సంవత్సరాలు ఈక్షేత్రములో నివసించటం నాకు అమ్మ ఇచ్చిన అదృష్టంగా, వరంగా భావిస్తున్నాను. నేను ఎక్కువ కాలం నా కుటుంబముతో గడపటం అవకాశము లేకపోయింది. ఇప్పుడు వారు నన్ను వారితోనే నా మిగతా కాల పరిమితి గడపాలని అభిలషించటం అభినందించవలసినదే. నేను ఈ మధ్య విశాఖపట్నం నా కుటుంబ సభ్యులతో గడపాలని ఇరువురి అభిలాషతో అక్కడ దాదాపు ఒక నెల రోజులు ఉండటం తటస్థించింది. నేను 10 రోజులు అయ్యేటప్పటికే నాకు పిచ్చిపట్టినట్లు ఏమీ తోచక అక్కడ వుండలేని పరిస్థితితోడై వెంటనే జిల్లెళ్ళమూడి క్షేత్రానికి వెళ్ళాలనే మనస్సు ఆరాటపడింది. నేను నా మనోవ్యధను కుటుంబ సభ్యులందరికి విన్నవించటం వారు సహృదయతో నా మనోవ్యధను అర్థం చేసుకొన్నవారై నన్ను స్వయముగా జిల్లెళ్ళమూడికి చేర్చటం జరిగింది.

నేను తత్వచింతనాపరుడిని అయినా ఇట్లా నా మనస్సు వికలం పొందటం గూర్చి నిశితంగా ఆలోచిస్తే ఇట్లా ఇటువంటి స్థితిలోనున్న వాళ్ళను అనేకమందిని నేను చూడటము నాకున్న అనుభవమే. ఏరకంగా ఒక ఇనుప ముక్కను అయస్కాంత శక్తి ఆకర్షిస్తుందో అదేవిధంగా నన్ను, నాబోటి వారిని ఈ జిల్లెళ్ళమూడి క్షేత్రము, పరదేవతయైన అమ్మ ఆకర్షించటమే. ఆ ఆకర్షణకు నేను వివశుడనైనాను. అక్కడ నేను పొందిన మనోవికలత వెనుకనున్నది భగవత్ సంకల్పమే. ఇటువంటి అనుభవానికి లోనైన కొందరు సోదరీ సోదరుల పేర్లును ఈ క్రింద ఉదహరిస్తున్నాను. అమ్మకోసం జిల్లెళ్ళమూడి క్షేత్రము కోసం పరితపించిన మహనీయులు కొందరు

యార్లగడ్డ రాఘవయ్య, కటిక కోటేశ్వరరావు, తహశీల్దారు వీరయ్యచౌదరి, కోన సుబ్బారావు, కోన వెంకాయమ్మ, జొన్నభట్ల వెంక్రటామయ్య, కొండముది రామకృష్ణ, కొండముది రామమూర్తి, అధరాపురపు శేషగిరిరావు, వల్లూరి పాండురంగారావు, రాచర్ల లక్ష్మీ నారాయణ, తంగిరాల కేశవశర్మ, సిరిగిరి సుబ్బారావు, రాధాకృష్ణరెడ్డి, రెడ్డి సుబ్బయ్య, పోతుకూచి రవి, శ్రీపాద గోపాలకృష్ణమూర్తి, డి.యస్.పి. సత్యనారాయణ, మేనకూరి సుందరరామరెడ్డి, సి.టి.ఓ. రామచంద్రరావు, యల్లాప్రగడ సుశీల. ఇంకెందరో ?

సాక్షాత్తు పరదేవతయే అమ్మ అవతరించిన ఈ క్షేత్రాన్ని వదలి ఎవరుండగలరు? ‘క్షేత్రంలో ఉన్నవాడు క్షేత్రమైయున్నాడు. క్షేత్రాన్ని నడిపిస్తున్నాడు.” — అమ్మ.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!