కరుణాంతరంగయై కారుణ్యసింధువై
తల్లి ప్రేమను పంచు తన్వియెవరు
మధురంపు వాక్కుల మమతానురాగాల
మాతృతత్త్వమునింపు మాన్య యెవరు
పచ్చడిమెతుకులే పచ్చని బ్రతుకులై
తీర్చిదిద్దిన యట్టి దేవి యెవరు
వాత్సల్యమేఘమై పాండిత్యపీఠమై
అక్షర మొసగె ఆద్య యెవరు
అన్ని నేనులు తానయై నున్నయట్టి
అందరమ్మల కమ్మయై అలరునట్టి
మధుర ధరహాసరూపమై మనెడియామె
పుణ్యఫలవల్లి జిల్లెళ్ళమూడి తల్లి