జిల్లెళ్ళమూడిలో నాన్నగారు అని అనగానే జిల్లెళ్ళమూడి కరణంగారు, బ్రహ్మాండం నాగేశ్వరరావు గారు అని చెప్పకుండానే చెప్పుతారు ఆ ఊళ్ళో ఎవరిని అడిగినా. 1950-60 దశకంలో ఎవరు జిల్లెళ్ళమూడికి వచ్చినా అమ్మను చూడాలంటే కరణం గారింటికి వెళ్ళవలసిందే. వలసిందే. ఆ ఇల్లు ఒక పూరిల్లు, సూర్యచంద్రాదులను ఆ ఇంటిలో కట్టివేశారా అన్నట్లు వుండేది. ఆ ఇంట్లో ఒక పడకకుర్చీ, ఆ కుర్చీ మీద వ్రాసుకోటానికి వీలుగా ఒక చెక్క ప్లాస్క్ ఆ కుర్చీలో కూర్చుని కరణీకం లెక్కలు వేసుకుంటూ నిరాడంబరంగా కూర్చునేవారు నాన్నగారు. ఆ ఇంటికే ఒక తపాలా పెట్టె వ్రేలాడి కట్టబడి వుండేది. కారణం ఆ వూరికి ఈయన కరణంగారే కాదు, బ్రాంచి పోస్ట్ మాస్టర్ కూడా. వెళ్ళినవారు ‘అమ్మగారు ఉన్నారాండీ’ ? అని అడిగితే ఆయన “ఇదిగో ! నీ కోసం ఎవరో వచ్చారని” చెప్పేవారు అమ్మతో. అమ్మ దర్శనం ఇచ్చేది ఆ వచ్చినవారికి, ఆవిడను చూడగానే ఒక దేవతను చూచినట్లు వుండేది. ఆవిడకు సమస్కరించి ఆవిడ ఇచ్చిన ఆతిథ్యం స్వీకరించేవారు. ఊళ్ళో బ్రాహ్మణ కుటుంబం వీరు ఒక్కరే. అందుకని వచ్చిన వారికి భోజన సౌకర్యం ఆ ఇంట్లోనే జరిగేది. అట్లా 1958 వరకు వచ్చిన వారికి భోజన సౌకర్యం, వసతి నాన్నగారే ఇచ్చేవారు. వచ్చిన వారిని ఆత్మీయులుగా చూడటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.
ఆయనకు శతజయంతి మహోత్సవాలు ఇప్పుడు జరుగుతున్నవి. అయితే నా మనస్సులో మెదిలేది నాన్నగారికి అత్యంత ఆప్తుడు, బంధువు అయిన మా సోదరులు రామకృష్ణకు తండ్రి కొండముది సుబ్బారావు, అప్పికట్ల గ్రామకరణం. నాన్నగారి వివాహానికి ఈయన ప్రముఖ పాత్ర ఎంతో వుందని అమ్మ చరిత్ర చెప్పుతోంది. అంటే ఆయనకు కూడా ఇప్పుడు శతవసంతాలు నిండి ఉండేవి. వీరికి అత్యంత స్నేహితుడు బాపట్ల కోనా ప్రభాకరరావు గారు. అమ్మ వివాహ ఏర్పాట్లలో ఈయన వంతు, పాత్ర కూడా గణనీయంగానే వుందని అమ్మ చరిత్రే చెపుతున్నది.
నేను జిల్లెళ్ళమూడిలో అమ్మ సన్నిధిలో 1962-63 నుండి వుండటానికి కారణభూతులు నాన్నగారే అని చెప్పక తప్పదు. అప్పటి నాన్నగారి పాత్ర అటువంటిది. ఈ జీవిత నాటకరంగంలో అన్ని పాత్రలూ వాడు నిర్ణయించినవే అనేది పరమ సత్యం. ఈ సత్యమైన విధిని తప్పించుకొనటానికి ఎవ్వరికీ వీలులేదు. ఎవరి పాత్ర, విశిష్టత వారిదే. విధిని తప్పించుకోవటం విధాతవల్ల కూడా కాదు. ఈ నాటకంలో నాన్నగారే హీరో.
నాన్నగారింట్లో పాలేరుగా మంత్రాయి అనేవాడు వుంటూ వుండేవాడు. ఆ మంత్రాయికి అమ్మ అంటే అత్యంత భక్తిశ్రద్ధలు. వాడికి ఎక్కడున్నా అమ్మ ఎట్లా వున్నదో అనేదే ధ్యాస, నాన్నగారి పొలం పనులకు వెళ్ళి పొలం దున్ను తున్నప్పుడు కాడి మేడిలో అమ్మను స్పష్టంగా చూస్తుండే వాడు. అమ్మకు ఏ మాత్రం ఆపద వాటిల్లినా ఆ కాడి మేడి అట్లాగే పొలంలో వదిలివేసి ఇంటికి పరుగెత్తేవాడు. జిల్లెళ్ళమూడిలో నాన్నగారికి గ్రామపార్టీలుండేవి. నాన్నగారి వ్యతిరేకులు ఆ ఊళ్ళో కొంతమంది అమ్మను చంపటానికి కూడా అనేక ప్రయత్నాలు చేయటం నా దృష్టిలో 2, 3 ఉదంతాలు వున్నవి. వాటి వివరాలు ఇక్కడ ఇప్పుడు వ్రాయటం సందర్భోచితం కాదని వదిలేస్తున్నాను. కాని అటు వంటప్పుడు కూడా అమ్మ తన మాతృతత్వాన్ని ఎట్లా ప్రకటిస్తుందో వ్రాయనలవికాదు.
నాన్నగారు నన్ను ‘గోపాలకృష్ణమూర్తీ’ అని ‘గోపాల కృష్ణమూర్తిగారూ!’ అని ఎంతో ఆప్యాయంగా పలకరించే వారు. ఒకసారి 1971 లో నాకు ఫ్లూరసీ అనే ఊపిరితిత్తుల వ్యాధి వచ్చి చీరాలలో డాక్టర్ నారపరాజు శ్రీధరరావుగారి ఆసుపత్రిలో చేరాను, చీరాలలో బూదరాజు శేషగిరిరావు గారి ఇంటి దగ్గర మేడమీద ఒక పోర్షన్ అద్దెకు తీసుకొని డాక్టర్ గారు రోజు వచ్చి చూచిపోయేటట్లుగా ఏర్పాటు చేయబడింది. అప్పుడు నాన్నగారికి కూడా ప్లూరసీ వచ్చి డాక్టర్ శ్రీధరరావుగారి దగ్గరే వైద్యం చేయించుకుంటూ నేను వున్న ఇంటిలోనే ఆయన కూడా ఉండేవారు. మా యిరువురికీ వంట చేసి పెడుతూ మాకు కావలసిన సేవలు మా పినతల్లిగారు చేస్తూ వుండేవారు. అట్లా 3 నెలలు వున్నాము. అప్పుడు అమ్మ మా యిరువురినీ చూడటానికి చీరాలలో డాక్టర్. శ్రీధరరావు గారింటికి వచ్చి మమ్ములను చూచారు.
నేను జిల్లెళ్ళమూడిలో అమ్మ గదిలో వుండే రోజులలో నాన్నగారు అమ్మ గదిలోనికి వచ్చి “ఏమండీ మీ అమ్మగారు లేవలేదేమిటి ? ఒంట్లో బాగాలేదా?” అని అడిగారు. నేను “అమ్మకు జ్వరమండి, ఒళ్ళు కాలిపోతున్నది” అన్నాను. “ఎంతుంది. ఏమిటి?” అనేవారు. నేను “104 డిగ్రీలు వుండవచ్చు” అనేవాడ్ని. “అంతేనా? దానికే పడుకోవాలా అండీ” అనేవారు. నాన్నగారు ఒక్కొక్కప్పుడు మూలుగుతూ పడుకుండేవారు. “నాన్నగారూ! మూలుగుతున్నారేమిటండీ” అంటే “నాకు జ్వరం తగిలిందయ్యా, ఒంట్లో బాగోలేదు” అనేవారు. “జ్వరమా! ఎంతుందేమిటి?” అంటే (99) అని మూలుగుతూ చెప్పేవారు. ’99కే మూలగాలాండీ ? అమ్మకు 104 జ్వరమొస్తే దీనికే పడుకోవాలా ? అన్నారు కదా !” అంటే, నాన్నగారు “మీ అమ్మగారికేమయ్యా ? ఎంత జ్వరమైనా చిలక కొయ్యకు వేసి స్నానం చేసి రాగలదు” అనే వారు. ఎక్కడకు ఆయన వెళ్ళినా ఆయనతో పాటే అమ్మ వుంటుందని అమ్మ వచ్చినప్పుడు వుండే ప్రత్యేకమైన సువాసననుబట్టి నాకు అర్ధమయ్యేదని చెప్పేవారు. ‘శ్రీ నాగేశ్వర పాదపద్మ యుగళీచింతాసుధా స్వాదినీ. శ్రుత్యంత స్తవనీయ దివ్యచరితా’ అని డాక్టర్ పన్నాల రాధాకృష్ణశర్మగారు వ్రాసినట్లు నాన్నగారు ఏదో మైలు వద్ద బస్సులో క్రిందకు దిగగానే నాతో అమ్మ అనేది. “నాన్నగారు ఇప్పుడు బస్సు దిగారని” అంటే నాన్నగారి అడుగుల సవ్వడి ఎప్పుడూ అమ్మ హృదయంలోనే వుంటుందని తెలియచేస్తుంది.
నాన్నగారు ఎప్పుడూ “నేను జిల్లెళ్ళమూడి అమ్మగారి భర్తను అని చెప్పుకుంటేనే నాకు మర్యాద గౌరవం వుంటుంది కాని జిల్లెళ్ళమూడి కరణాన్ని అని చెప్పుకుంటే నన్ను ఎవరు గౌరవిస్తారయ్యా” అనేవారు. ఒకసారి నేను జిల్లెళ్ళమూడి అమ్మను అని చెప్పుకుంటూ తిరిగేటువంటి ఒక ఆవిడ జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మను సందర్శించింది. అప్పుడు అమ్మ ఆమెతో అన్నది. “జిల్లెళ్ళమూడి అమ్మను అని చెప్పుకోవటం నీకు గొప్ప. కాని నేను జిల్లెళ్ళమూడి కరణంగారి భార్యను అని చెప్పుకోవటం నాకు గొప్ప, నీవు జిల్లెళ్ళమూడి కరణం గారి భార్యవు కాలేవుగా?” అన్నది. పతియే దైవమని భావించి ఏ కార్యక్రమాలలోనైనా అమ్మ పాల్గొనే ముందర నాన్నగారి పాదాలకు నమస్కరించేది. సంక్రాంతి పండుగ ముందర, భోగి రోజు నాన్నగారికి బొట్టు పెట్టి ఆయన పాదాలకు సమస్కరించి ఆ పాదాలపై భోగిపండ్లు పోసిన తరువాతనే హైమాలయంలో కాని ఆ పండుగకు విచ్చేసిన వేలాదిమంది సోదరీ సోదరులు ఆడ, మగ, పిన్న, పెద్ద తేడా లేకుండా ఒకే పంక్తిలో కూర్చోబెట్టి భోగిపండ్లు పోసేది. నాన్నగారిని అమ్మ నాగేంద్రునిగా. నాగేశ్వరునిగా, సోమశేఖరునిగా అభివర్ణించేది.
- (శ్రీ నాన్నగారి శతజయంతి సంచిక నుండి)