1. Home
  2. Articles
  3. Viswajanani
  4. జిల్లెళ్ళమూడి మాతృశ్రీ సంస్కృత కళాశాలలో

జిల్లెళ్ళమూడి మాతృశ్రీ సంస్కృత కళాశాలలో

Editorial Board - Viswajanani
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 14
Month : September
Issue Number : 2
Year : 2014

కొండముది అన్నపూర్ణమ్మ – సుబ్బారావు స్మారక సమావేశ మందిరం ప్రారంభం 

రామకృష్ణ “అమ్మ సేవలో” గ్రంథావిష్కరణ

శ్రీ కొండముది రామకృష్ణ అన్నయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లెళ్ళమూడి అమ్మ ఆంతరంగిక కార్యదర్శిగా శ్రీ విశ్వజనని పరిషత్, విద్యాపరిషత్తుల అధ్యక్షునిగా, కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన, దివంగత కొండముది రామకృష్ణ అన్నయ్య 16వ వర్థంతి సంస్మరణ సభా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. 23.8.14 శనివారం నాడు జిల్లెళ్ళమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రాంగణంలో జరిగిన ఈ సభకు కళాశాల కరస్పాండెంట్, ప్రముఖకవి, రచయిత శ్రీ పి.యస్.ఆర్.ఆంజనేయ ప్రసాద్ స్వాగతం పలుకగా, విద్యాభివృద్ధి కమిటీ అధ్యక్షులు శ్రీ బొప్పూడి రామబ్రహ్మం అధ్యక్షత వహించారు. విశ్రాంత ఉపన్యాసకురాలు డాక్టర్ యు. వరలక్ష్మి సభా నిర్వహణ చేశారు. ఈ సభ ప్రారంభానికి ముందు శ్రీ కొండముది సుబ్బారావు, అన్నపూర్ణమ్మల స్మారక మందిరాన్ని ప్రారంభించారు. ప్యాట్రన్ శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు తమ సందేశం అందించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన శ్రీ కొండముది రామకృష్ణ అన్నయ్య కవిగా, రచయితగా, నాటకకర్తగా, అప్పికట్ల గ్రామ కరణంగా, అమ్మ ఆశయసాధకునిగా, ‘అమ్మ’ సినిమా స్క్రిప్టు రచయితగా, ప్రజాసేవకునిగా గురుతర బాధ్యతలు నిర్వహించారని వక్తలు కొనియాడారు. ఈ సభలో శ్రీ ఎమ్. దినకర్, శ్రీ కొండముది హనుమంతరావు, శ్రీ కొండముది సుబ్బారావు, శ్రీ భట్టిప్రోలు చలపతిరావు, శ్రీ మతి బ్రహ్మాండం వసుంధరక్కయ్య, కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి డాక్టర్ బి. యల్. సుగుణ, ప్రధానోపాధ్యాయులు, శ్రీ కొండముది ప్రేమకుమార్, శ్రీ కొండముది దత్తాత్రేయశర్మ, శ్రీ లక్కరాజు సత్యనారాయణ తదితరులు వక్తలుగా పాల్గొన్నారు. మాతృశ్రీ కళాశాల సమావేశ మందిర నిర్మాణానికి శ్రీ కొండముది హనుమంతరావు గారు లక్షరూపాయల విరాళాన్ని శ్రీ కొండముది రామకృష్ణ అన్నయ్య ఫౌండేషన్ తరపున అందించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతి జ్ఞాపికులతో అభినందించారు.

సంపూర్ణ విద్యార్థి అవార్డు (రామకృష్ణ అన్నయ్యపేరిట) జి. గోపీవలి III B.A. Skt, డి. ప్రవీణ్ కుమార్ III BA Tel సంయుక్తంగా పొందారు.

పాఠశాలలో : టి.వి.యస్. సాయితరుణ్ X క్లాస్ – అందుకున్నారు.

“అమ్మసేవలో” పుస్తక ప్రచురణకై ఆర్థిక సహకారం అందించిన రామకృష్ణ అన్నయ్య మనుమడు, శ్రీ కొండముది సుబ్బారావు, శ్యామల గార్ల కుమారుడు శ్రీ కొండముది హైమాకర్ శ్రీనివాస చైతన్య (నాని), వేంకట మానస దంపతులకు సభలోని వారు అభినందనలు తెలిపారు. కళాశాల వసతి గృహము ముందు సౌరశక్తి దీపాల కోసం 50 వేల రూపాయలు అందించిన శ్రీ మునిపల్లె వేంకటరామ సుబ్బారావు, అన్నపూర్ణమ్మల కుమారుడు డాక్టర్ ఫణిభూషణ్ చక్రవర్తి F.R.C.S. (లండన్) గారికి సభలోని పెద్దలు ధన్యవాదములు తెలిపారు.

సౌరదీపాలు ఏర్పాటు చేయుటకు సహకరించిన శ్రీ బూదరాజు సుబ్రహ్మణ్యేశ్వర శర్మగారికి, నిర్మాణ కార్యక్రమంలో సహకారం అందించిన శ్రీ బి. రామచంద్ర, శ్రీ వఝా మల్లిఖార్జునరావు (మల్లు) గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో చివరగా పిల్లలకు, పెద్దలకు బిస్కెట్లు, బూంది పంచిపెట్టారు. శాంతిమంత్రంతో కార్యక్రమం ఆహ్లాదకరంగా ముగిసింది.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!