1. Home
  2. Articles
  3. Mother of All
  4. జిల్లెళ్ళమూడి ముక్తి క్షేత్రము – అమ్మ ముక్తి మాత

జిల్లెళ్ళమూడి ముక్తి క్షేత్రము – అమ్మ ముక్తి మాత

E. Hanuma Babu
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 11
Month : July
Issue Number : 3
Year : 2012

నదీ ప్రాధాన్యం గల ప్రదేశాలను తీర్థములని, దైవప్రాధాన్యం గల ప్రదేశాలను క్షేత్రములు అనుట సంప్రదాయం. కృష్ణా, గోదావరి, గంగా, యమున, పరీవాహక ప్రాంతాలన్నీ తీర్ధాలుగాను, విజయవాడ, కాశీ, మధుర, బాసర మున్నగు ప్రాంతాలను క్షేత్రములు గాను పై వాక్యాలను బట్టి అన్వయించుకోవాలి.

జిల్లెళ్ళమూడి విషయానికి వస్తే గ్రామానికి దక్షిణాన ఉన్నవాగు పేరు ‘ఓంకారనది’ ఈ మాట గుంటూరు జిల్లా గజెట్లో ఉన్నది. కనుక జిల్లెళ్ళమూడి తీర్థమవుతుంది. క్షేత్రం విషయానికి వస్తే అమ్మ సాక్షాత్తు రాజరాజేశ్వరి స్వరూపము కనుక ఈ గ్రామము క్షేత్రము కూడా అవుతుంది. మొత్తము మీద దీనిని తీర్థరాజము, క్షేత్రరాజము అని అనవచ్చును.

అన్ని క్షేత్రాలును ముక్తి క్షేత్రాలుగా చరిత్ర చెప్పుట లేదు. ప్రత్యేకించి ‘కాశి’ ముక్తి క్షేత్రము అని పెద్దలు చెప్పుచూ “కాశ్యాన్ మరణాన్ ముక్తిః” అన్నారు.. దానిని బట్టి మనము ఎక్కడ ఉన్నా నిత్యము స్మరణ చేత కాశీవాస ఫలము లభించుటయే కాక ముక్తి కూడా పొందవచ్చు. శారీరకంగా కాశీలో నివసించినా మానసికంగా కాశీకి దగ్గరైనా ముక్తి ఫలము తధ్యము.

శరీరేంద్రియముల వలన ఆత్మ విడువబడుట ముక్తి. మనస్సును ఆత్మలో లయింప చేయుట ముక్తి అన్నది పెద్దల మాట. అనగా దశేంద్రియములు వాని వాని వ్యాపారములను మాని మనస్సుకు లొంగియుండి మనస్సు ఇంద్రియ వాసనా సంబంధము పూర్తిగా కోల్పోయినప్పుడు ఆ మనస్సు ఆత్మలో లీనమగును. అది జీవన్ముక్తి. ఆ ఆత్మ పరమాత్మలో లయమగుటయే ముక్తి.

మన జిల్లెళ్ళమూడిని గూర్చి విన్నవాటిలో ఈ గ్రామము ఉన్న స్థలము శతాబ్దులకు ముందు ఒక కొండపైన ఉన్న ఆశ్రమం అని, ఆ ఆశ్రమ అధిష్టాత్రి మన అమ్మ అని విన్నాను. శ్రీమాలి గారి శిష్యులు అనీల్కుమార్ జోషిగారు చెప్పిన దాన్ని బట్టి ప్రస్తుతము హైమాలయమునకు దక్షిణాన ఉన్న తోటక్రింద సుమారు 10-15 అడుగులు త్రవ్వితే తిక్కన సోమయాజి యజ్ఞము చేసిన యజ్ఞకుండమున్నదని త్రవ్వి చూడమని అన్నారు.

మాన్యసోదరులు మొగలూరి రామచంద్రరావుగారి మామగారు కొణకంచి జగన్నాథం గారి జాతక రీత్యా ఒకక్షేత్రంలో వారు దేహం చాలించాలని చెప్పబడింది. వత్సవాయిలో జన్మించిన వారు జిల్లెళ్ళమూడిలో అమ్మలో ఐక్యమైనారు. ఆధ్యాత్మిక భావన కలవారు ఆశ్వయుజ, కార్తీక, మాఘ, వైశాఖ పౌర్ణమిలో సముద్రస్నానం చేస్తారు. ఇతర పర్వాలలో సముద్రంలో కాని, నదులలో కానీ స్నానం చేసి ముక్తులు కావాలని కోరుకుంటారు. అమ్మకు అత్యంత ప్రియపుత్రులు కీ॥శే॥ గోవిందరాజుల దత్తుగారు 1968 మాఘ పౌర్ణమినాడు గుంటూరు నుండి జిల్లెళ్ళమూడికి వచ్చి అమ్మ స్నానం చేసిన నీళ్ళలో స్నానం చేశారు.

ముక్తి పొందే ముందు సాధకులకు ద్వంద్వాతీత స్థితి కొంతలో కొంత లభ్యమవుతుంది. అమ్మ సాన్నిధ్యంలో అమ్మ చర్యలలో ఈ ద్వంద్వాతీత స్థితిని మనకు బోధిస్తున్నట్లు గోచరిస్తుంది. సో॥ వఝాప్రసాద్ గారు, అరుణ అక్కయ్యల వివాహ సందర్భంలో పోతుకూచి రవి అమ్మలో ఐక్యం అయినప్పుడు అతని తల్లి రాజ్యలక్షమ్మ గారితో అమ్మ పెళ్ళిపాటలు పాడించారు.

శ్రీ శ్రీ మారెళ్ళ రామకృష్ణ మాష్టారు (పూర్వం గాయత్రీ పరివార్ దక్షిణ భారత్ ఇన్ ఛార్జ్) జిల్లెళ్ళమూడి వచ్చి ఒక ప్రసంగంలో తన శిష్యులను ఉద్దేశించి, “మీరు ప్రతి పౌర్ణమికి ఇక్కడికి రండి. హైమాలయంలో నామ సంకీర్తనలో పాల్గొనండి. మీరు నామం చేయలేకపోతే హాయిగా ప్రసాదం తీసుకొని నిద్రపొండి. అమ్మ మీ చేత ఏం చేయించుకోవాలో ఆమె చూసుకుంటుంది. అంతే కాక అమ్మ తన అనుగ్రహాన్ని అన్నప్రసాదం ద్వారా మనకు అందిస్తుంది. హైమాలయంలో మీరు పౌర్ణమి నాటి రాత్రి చేసే నామ సంకీర్తన, సాధనలు వ్యర్థం కావు. ఎందుకంటే హైమాలయం రాబోవు కాలంలో ప్రపంచానికి కుండలిని జాగరణ చేసే కేంద్రం” అవుతుంది అన్నారు.

సద్గురు శ్రీ శివానందమూర్తి గారు 2005లో హైదరాబాద్లో గంటి కాళీప్రసాద్ చేసిన అభ్యర్ధన మేరకు ప్రసంగిస్తూ, ‘శుద్ధ చైతన్య స్వరూపమైన జగన్మాత కాల స్వరూపిణియై మాతృమూర్తిగా జిల్లెళ్ళమూడిలో అవతరించింది. ఆమెకు జీవకోటిలోని జీవులతో కూడా సంభాషణ చేసే శక్తి ఉన్నది. జిల్లెళ్ళమూడిలో అమ్మ అనుగ్రహించే ప్రసాదం ద్వారా అనేక జన్మపరం పరలను తగ్గించి వేస్తుంది. జిల్లెళ్ళమూడి కాశీ తర్వాత ముక్తి క్షేత్రం అని అన్నారు.

జిల్లెళ్ళమూడి గురించి ఆలోచిస్తే అమ్మ రాకముందు జిల్లెళ్ళమూడి వేరు, అమ్మ వచ్చిన తర్వాత జిల్లెళ్ళమూడి వేరు అని స్థానికులు, పరిసర గ్రామస్థులు చాలామంది నాతో అన్నారు. వాస్తురీత్యా అతిప్రమాదకర స్థాయిలో ఉండవలసినది ఈ గ్రామము. అమ్మ రాకముందు ఇచ్చట అరాచకములు, కొట్లాటలు, సజీవదహనం చేయటం వంటి దురాగతాలు జరిగినవి. అమ్మ వచ్చిన తర్వాత కొద్దికాలం ఆ స్థితి ఉన్నా అమ్మ తన 33వ ఏట లోకానికి విశ్వజనినిగా తెలిసిన తరువాత ఆ వికారాలు దరిదాపుగా తగ్గి ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తోంది.

ప్రాచీన వాఙ్మయాన్ని పరిశీలిస్తే ముక్తిమార్గములు అనేక విధములుగా గోచరిస్తున్నవి. జడభరతోపాఖ్యానమున భరత రాజషి భరత వర్షమును ఏర్పరచిన తర్వాత వానప్రస్థుడై పులహాశ్రయములో ఘోరమైన తపస్సు చేస్తూ ఉండేవాడు. ఒకరోజు జలమధ్యమున తపస్సు చేసుకొనుచుండగా నిండు చూలాలైన ఒక లేడి నీరు త్రాగుతున్నప్పుడు సింహగర్జన విని భయపడి అవతల ఒడ్డుకు దూకగా రాతికి దాని తల తగిలి మరణించెను. ఆ దూకుటలో తన గర్భమందలి కూన నీటిలో జారిపడి వేగమున కొట్టుకొనిపోవుటను భరతుడు చూసి దానిని కాపాడసాగెను. భరతుని యొక్క దినచర్యలో తపస్సుతోపాటు లేడి పెంపకము కూడా ప్రధానభాగం అయ్యెను. అతని అవసాన కాలంలో తపః ప్రభావమూ లేడి పెంపకమూ రెండూ కలిసి పూర్వజన్మ స్మృతి గల లేడిగా జీవులు అనేక రకములుగా జన్మించి చివరకు మానవులుగా పుట్టిన తరువాతనే మోక్షప్రాప్తి అని పెద్దలు అందురు. కేవలం మమకార ప్రభావం వలన భరతుడు లేడిగా జన్మించి నిర్లిప్త జీవితం గడిపి జడ భరతుడై ముక్తి నొందినట్లు తెలియుచున్నది. తరువాత ఏడుగురు వసువులు వశిష్ఠశాపం వలన గంగకి జన్మించి ముక్తులు అయిరి. అష్టమ వసువు మాత్రం అధిక పాపం వలన దేవవ్రతుడై భీష్ముడై కృష్ణపరమాత్మలో ఐక్యం చెందెను. ఇచట మనం గమనించవలసిన ఒక అంశం ఉన్నది. భీష్ముడు కురుక్షేత్ర సంగ్రామములో పదవరోజున అంపశయ్యనెక్కి ఉత్తరాయణ పుణ్యకాలము వచ్చిన పిదప శ్రీకృష్ణుడు తన వద్దకు రాగా సర్వేంద్రియ శక్తుల్ని చూపులలో నిలిపి పరమాత్మను నిర్నిమేషంగా చూస్తూ ఆ చూపుల ద్వారానే ఆయనలో ఐక్యం అయినాడు.

ప్రాచీన గ్రంథములలో మనుష్యులతో పాటు జంతువులు కూడా పుణ్యకర్మచేత ముక్తి పొందినట్లు అక్కడక్కడ తెలియచున్నది. శ్రీ (సాలె పురుగు), కాళము (సర్పము), హస్తి (ఏనుగు) మున్నగునవి.

ఇక అమ్మ చరిత్రలో పరిశీలన చేయగా శిశుప్రాయంలోనే కొన్ని జీవులకు ముక్తి నిచ్చినట్లు తెలియుచున్నది. కర్మానుసారము ప్రాణ పరిత్యాగము చేసినా కర్మలేశమైనా లేకుండా ముక్తిని ప్రసాదించినట్లు తెలియచున్నది. కర్మానుసారము ప్రాణపరిత్యాగము చేసినా కర్మలేశమైనా లేకుండా ముక్తిమార్గమున జీవులు ముక్తిని పొందినా మృతి ఒకేరీతిగా సామాన్యులకు కనబడుతుంది. నిశితంగా పరిశీలిస్తే రెండింటికి చాలా తేడా గోచరిస్తుంది. అమ్మకు పురిటి స్నానము చేయించిన తర్వాత ఒక పెద్ద నల్లకుక్క అమ్మ తల వద్ద కూర్చుని అమ్మ చేయి, కాళ్ళు కదిలినప్పుడు కొరుకుదామని సాహసింపలేక, పాదములు కదిలించగానే పాదముల చెంతకు వచ్చి అమ్మ పాదములపై తన ముట్టిని పెట్టి పడుకొని, అట్లే 10 నిమిషములు నిద్రపోతుంది. ఇంతలో అందరూ వచ్చి పెద్దగా అరచినా కుక్కను ఎంత కొట్టినా లేవదు. అమ్మ కాలు కదిలించకుండానే కుక్కలేచి అమ్మను పడుకోబెట్టిన జల్లెడ చుట్టు ప్రదక్షిణ చేసి వెళ్ళిపోతుంది. మరల 10 నిమిషాలలో వచ్చి అమ్మ కక్కిన పాలు నాకి అమ్మను పడుకోబెట్టిన మంచానికి ఐదు జానల దూరంలో పడుకొని కనులు తెరచి అమ్మను చూస్తూ ప్రాణాలు వదులుతుంది.

అమ్మ నామకరణం సందర్భంగా నక్షత్రశాంతి కొరకు హోమం చేయిస్తే హోమగుండంలో నుండి ఒక మిడత పైకి లేచి అమ్మ మీద వ్రాలి మరల హోమగుండంలో పడిపోతుంది. ఆ సమయంలో పెద్ద మెరుపువంటి కాంతి అంతటా ప్రసరిస్తుంది. అమ్మమ్మ (అమ్మతల్లి) రంగమ్మగారు 29వ రోజున సాయంకాలం 6గంటలప్పుడు నూతిలో చేద వేసిన తర్వాత పొత్తిళ్ళలో ఉన్న అమ్మను ఎత్తుకొని పాలు ఇచ్చే సమయంలో ఒక తేలు అమ్మ పాదాల క్రింద కొండిని ఆనించి సజీవముగానే ఉండును. అంతలో మిగతా వారు దానిని చూసే సరికి అది అమ్మలో ఐక్యమగును.

అమ్మ నాన్నగారు శ్రీ సీతాపతిశర్మగారు రోజూ భోజనం చేసేటప్పుడు ఒక పిల్లికి అన్నం పెట్టేవారు. ఒకరోజు రాత్రి ఆ పిల్లి ఎందుకో అన్నానికి రాలేదు. ఆ సమయంలో అది అమ్మని నిద్రిస్తున్న ఉయ్యాల్లో పడుకొనెను. తాతగారు

భోజనం చేసి ఉయ్యాలలోని పిల్లిని కొట్టగా అది లేచి క్రిందికి దిగి ఉయ్యాల చుట్టూ ప్రదక్షిణలు చేసి అరగంట సేపు అరచి అటకమీదకి ఎగిరి, ముఖము కళ్ళు అమ్మవైపు త్రిప్పి అమ్మను చూస్తూ ఒకే అరుపు. పావుగంట అరచి తొట్టిలోకి దూకి అమ్మ పాదాల మీద తన ముక్కును ఆనించి ఒకసారి శ్వాస పైకిలాగి మరొకసారి వదలి రెండవసారి పెద్ద ధ్వనితో శ్వాస లాగుతూ అమ్మ పాదాల మీదనే ప్రాణములు వదిలింది.

అమ్మమ్మకి జబ్బు చేసినప్పుడు వైద్యం చేసిన డాక్టరుగారి కాంపౌండరు కృష్ణమాచారి (వయస్సు 30 సంవత్సరములు) ఒకరోజున అమ్మతో, “అమ్మా ఇవ్వాళ ఎందుకో నిన్ను చూడాలనిపించింది. అనుకోగానే కనపడ్డావు. రాత్రి ఒకామెకు వైద్యం చేస్తుంటే మిమ్ములను ధ్యానము కాకుండా దర్శనము కూడా జరిగినది” అన్నారు. అందుకు అమ్మ “ఔను నాయనా! ధ్యాసే ధ్యానము” అన్నారు. అది విని కృష్ణమాచారి అమ్మకు సాష్టాంగ నమస్కారం చేసి ఆరోజు తెల్లవారుఝామున భావాద్వైతములో మునిగి అమ్మలో ఐక్యమైనారు.

ఒకరోజున అమ్మ తెనాలిలో ఒక ఒంటెద్దు బండి దగ్గర ఆగుతుంది. ఆ బండిలాగే ఎద్దు జబ్బుపడి ఆరోజే బండికి కట్టబడింది. అమ్మ ఎద్దుమీద చెయ్యివేసి దానిని నిమురుతుండగా అది గజగజ వణుకుతుంది. బండివాడు ఎద్దుజోలికి రావద్దు అని హెచ్చరించినా అమ్మ పట్టించుకోకుండా ఎద్దును సవరిస్తూనే ఉంది. బండివాడు కొరడా తీసికొని వేసాడు. ఆ దెబ్బ ముందు అమ్మ తర్వాత ఎద్దుకి తగులుతుంది. ఎద్దు బండిని వదిలి పెట్టి అమ్మ పాదాలపై ముట్టిపెట్టి అమ్మను చూస్తూ ‘అమ్మా’ అన్నట్లుగా అరచి ప్రాణాలు విడుస్తుంది. అప్పుడు బండివాడు “వారం రోజులుగా ఎద్దు జబ్బుపడింది. దీనికి నయం అయితే దీనినే దేవుడికిస్తాను అని మ్రొక్కుకున్నాను. ఇది అట్లా అయ్యింది” అని అంటాడు. ఇంకా మరికొన్ని అమ్మ బాల్యంలో జరిగిన సన్నివేశాలు జిల్లెళ్ళమూడి ముక్తి క్షేత్రమే; ఆ ముక్తిని ఇచ్చే అమ్మ ఏ ప్రదేశంలో ఉంటే అది ముక్తి క్షేత్రం అవుతుంది. “జ్ఞానం కలగడానికి” మానవ జన్మే అక్కర లేదు అని వివరిస్తాయి.

అమ్మకు సుబ్బారావు అన్నయ్య (జ్యేష్ఠ పుత్రుడు) జన్మించిన తర్వాత నాన్నగారితో కలిసి తన ప్రధాన కార్యక్షేత్రం అయిన జిల్లెళ్ళమూడికి కాపురానికి వచ్చింది. ఆ రోజుల్లో ఒక కుక్క ఉండేది. దానిని పెద్ద కుక్క అని పిలిచేవాళ్ళు. అప్పటికి దానికి ఏడేళ్ళు. నాడు గ్రామంలోని కుక్కలకు పిచ్చి ఎక్కిందని వాటిని చంపి పారవేస్తున్నారు. బాగా దెబ్బలు తిని కూడా అది తప్పించుకొని, మజ్జిగ చిలుకుతున్న అమ్మ వద్దకు వచ్చి అక్కడ పడ్డ మజ్జిగ చుక్కలు నాకి అమ్మపాదాలపై పడి తేరుకున్నది. అనంతరకాలంలో అది ఆశ్రమానికి చేసిన సేవ అపారమైనది. ఏడవ మైలు నుండి వచ్చేవారికి, ఏడవ మైలుకు వెళ్లేవారికి తోవ చూపించేది. ఇంటికి కాపలాదారుగా ఉండేది. కీలక సన్నివేశాలలో అమ్మకు తల్లిగా, తోడుగా, అంగరక్షకుడిగ, మిత్రుడిగా ప్రవర్తించేది. దాని చూపులో నడకలో అవసరమైతే అమ్మకోసం ఆత్మార్పణం చేయగల ధైర్యం కనిపించేది. అమ్మ మాటలలో చెప్పాలంటే మనిషి మనిషిని ఎంతగా ప్రేమించాలో అంతగా ప్రేమించేది. అది 3.08.1964 తేదీన అమ్మతో ఐక్యం కాబోయేముందు అస్వస్థతగా పోస్టాఫీసు గదిలో పడుకుంది. తర్వాత డాబా వైపున ఇసుకు కుప్పలపైకి చేరింది. మరణయాతన వలన కలిగే తపనకు తట్టుకోలేక అక్కడ చల్లగాలిలో పడుకుంది. ఆ సమయంలో అమ్మ దాని దగ్గరకు వెళ్ళి పాలగిన్నెలో తులసి దళం వేసి నోటికి అందిస్తే అది తులసిదళంతో సహా పాలు త్రాగేసింది. తర్వాత తన విశ్వాసాన్ని అర్పించి, శ్వాస విడిచి అమ్మలో ఐక్యమైంది.

గుండేలురావుగారు రామభక్తులు. వారు 20 ఏళ్ళనుండి పక్షవాతంతో బాధపడుతున్నారు. బాల్యంలో అమ్మవారి దగ్గరకు వెళ్ళి స్వయంగా అన్నం కలిపి ముద్దలు నోటికి అందించేది. మలమూత్రాలతో కలుషితమైన వస్త్రాలను తీసి శుభ్రమైన వస్త్రాలు పరిచేది. అలా 15 రోజులు పరిచర్యలు చేసింది. ఆ సమయంలో వారి నుండి అమ్మలోనికి, అమ్మ దేహం నుండి వారి దేహంలోకి శక్తి ప్రసారమౌతున్నట్లు వారికి అనుభవం కలిగింది. అదే స్థితిలో వారు అమ్మలో ఐక్యమైనారు.

కోనవెంకాయమ్మగారి అవసాన దశను గమనించి అమ్మ “నన్నెవరో గుర్తు పట్టావా?” అని అడగగా ఆమె మౌనంగా కళ్ళతో గుర్తుపట్టాను అంటే “ఇక చాలు కళ్ళుమూయి” అని అమ్మ అనటం, ఆమె ప్రశాంతంగా అమ్మలో లీనం కావటం జరిగింది. వెంకాయమ్మగారు వసుంధర అక్కయ్యతల్లి.

జీవన్ముక్తి గురించి పరోక్షంగా అమ్మ ఇలా అన్నట్లు అనిపిస్తుంది. పొయ్యిమీద పాలు పెట్టి, క్రింద పొయ్యిలో ఒక్కొక్క పిడక వేసి కాలుస్తూ మంటపెడితే ఆ సన్నని సెగకు నెమ్మది నెమ్మదిగా పాలు కాగుతూ మీగడ కట్టడం ఆరంభమౌతుంది. అందలి నీరు నెమ్మది నెమ్మదిగా ఆవిరై పైకి పోతుంది. పాలు వేడెక్కే కొద్ది నీటి శాతం తగ్గి మీగడ పెరుగుతుంది. చివరకు మీగడే మిగులుతుంది. అని ఈ వ్యాసం మొదట్లో చెప్పుకున్నట్లు ఇంద్రియ వాసనలతో మిళితమై నిర్లిప్త వైఖరి పొందిన తర్వాత వాసనాక్షయమైన మనస్సు ఆత్మలో – ఆ ఆత్మ పరమాత్మలో లయమౌతుంది. ఈ విధంగా జీవుడు ముక్తి పొందునని అన్వయించు కోవచ్చు. పైన ఉదహరించిన ఘట్టాలలో పిల్లి, కుక్క, ఎద్దు… వాటి చరమ దశలలో ఆచార్య భీష్మునివలె సర్వేంద్రియశక్తుల్నీ అమ్మపై లగ్నం చేసి అమ్మలో ఐక్యమైనట్లు తెలుస్తోంది. అయితే పై జంతు జాలములు పూర్వపు జన్మలలో ఎలాంటి సాధనలు చేసియున్నవో మనకు అవగతముకాదు. తెలిసిన అమ్మ మాత్రం ఏ సన్నివేశంలో వాటికి జన్మరాహిత్యం అనుగ్రహించాలో అలా చేసింది. ఇక వెంకాయమ్మగారి పరిస్థితి ఇటు అమ్మపైన గాఢమైన భక్తి అటు కుటుంబ సభ్యులపై మమకారం. ఈ ఘర్షణలో మమకార భావాన్ని అమ్మ పోగొట్టి ఆఖరిక్షణంలో నేను కనిపిస్తున్నానా? అంటూ తనలో అమ్మ కలుపుకున్నది. అంతేకాక కోనావారి అదృష్టమా అన్నట్లు స్వయంగా దగ్గరే ఉండి దహన సంస్కారాలూ అమ్మే చేయించింది.

గుండేలురావుగారి ఘట్టములో 15 దినములు తన శక్తి ప్రసారం ద్వారా ఆయన జన్మపరంపరలు నశింపచేసి పునర్జన్మ లేకుండా తనలో ఐక్యం చేసుకున్నది. ఇట్లే శ్రీరమణ మహర్షి తన తల్లి మరణించునపుడు ఆమెకు తన హస్త స్పర్శద్వారా ముక్తి కలిగించినట్లు తెలియుచున్నది. నాన్నగారు పరమపదించి నప్పుడు అమ్మ మరో మంచంపై నాన్నగారికి ప్రక్కన పడుకొని వారిపై చెయ్యివేసి చాలా సేపు ఉండి వారికి కూడా జన్మ రాహిత్యం కలిగించారని అనుకొనవచ్చును.

మనకు సుప్రసిద్ధంగా అయోధ్యా, మధుర, కాశీ, కాంచీపురం, ఉజ్జయిని, ద్వారావతి, పూరి.. ఈ ఏడు ప్రాచీన పరంపరలో మోక్షస్థానాలుగా ఉన్నాయి.

పై వృత్తాంతాలను బట్టి ‘అర్కపురి’ అనగా జిల్లెళ్ళమూడి కూడా అష్టమ ముక్తిక్షేత్రముగా ఎంచబడినది. ఇది శ్రీ కొల్లూరి అవతార శర్మగారు. ప్రతిపాదించిన విషయము. జిల్లెళ్ళమూడిలో అమ్మ ఆలయానికి ఆశ్రమానికి వచ్చీపోయేవారు కానీ, ఎవరైన ఈ గడ్డపై ఉన్నా, తిన్నా, నిద్రించినా వారికి వారి ప్రమేయము లేకుండానే ముక్తి సోపానాధిరోహణ అమ్మ అనుగ్రహం వలన అనాయాసంగా సిద్ధిస్తుంది.

“ఇది తధ్యము; సత్యము”

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!