అన్నయ్యలారా! అక్కయ్య లారా!… విశ్వంలోని అన్ని క్షేత్రాల సమాహారం మన జిల్లెళ్లమూడి. నిజమా!… అవును…. అనుభవం కంటే ప్రమాణం ఏమి ఉంటుంది!. శత జయంతి ఉత్సవాల శుభ ఘడియలలో రాలేని ఈ మీ సోదరుడు, వచ్చిన భక్తులందరూ అడుగుపెట్టిన నేల ఎంత గొప్పదో వసుంధర అక్కయ్య మాటల్లో నెమరు వేసుకుంటున్నాడు.
“స్నానం చేసి పెద్ద జరీ అంచుగల పట్టు రవికె వేసుకుని ఎఱ్ఱని పట్టుచీర కట్టుకుని బులాకీ పెట్టుకుని, హాల్లో మంచం మీద కూర్చుంది అమ్మ. (హాలు నిండా జనం). ఇంతలో ఒక జీప్ వచ్చింది. జీపు నిండా జనం ఉన్నారు. అమ్మ దర్శనార్థం “రఘువరదాసు గారు, ప్రభుదత్త బ్రహ్మచారి గారు” వచ్చారు.
అమ్మకు ఎడమచేతి వైపు రఘువరదాసు గారు, కుడివైపు ప్రభుదత్త బ్రహ్మచారి గారు కూర్చున్నారు. బ్రహ్మచారి గారిని అమ్మ ఒడిలోకి తీసుకున్న దృశ్యం చూడగానే కళ్ళు చెమర్చాయి. అధ్యాత్మికోన్నతులైన తన ఇద్దరి బిడ్డలను సూర్య చంద్రుల వలె చెరి ఒక వైపు దగ్గరకు తీసుకుంది. కరుణారస పూరిత దృక్కులతో వీక్షిస్తూ, తన అమృత హస్తాలతో వారిని ఆప్యాయంగా నిమురుతున్న ఆ మాతృమూర్తిని చూడగానే నాకు ఒళ్ళు జలదరించి బాష్ప పూరిత నేత్రాలయినాయి. చూసే వారికే అలా ఉంటే, ఆ ప్రేమను అనుభవిస్తున్న ఆ మహాత్ముల హృదయాలు ఎంత పరవశించాయో అని అనిపించింది. ఆ దృశ్యం వర్ణనాతీతం. ఆ ఆనందం ఊహాతీతం. వారిద్దరికీ ప్రతీ దానికీ “హరే రామ” అనే అలవాటు. అమ్మను చూసి నప్పటినుండి ‘జై మా, జై మా’ అంటున్నారు.
బ్రహ్మచారి గారు అమ్మను అతి దగ్గరగా తీసుకుని ‘జగన్నాధం వెడదామా అమ్మా’ అన్నారు. అమ్మ: “అంతా అదే అయినప్పుడు ప్రత్యేకంగా వెళ్లేదేమున్నది”.
బ్రహ్మచారి గారికి తెలుగు అర్ధం కాదు. అక్కడ ఉన్న ఉమ హిందీ లోకి అనువాదం చేసింది. ఆయన విని నవ్వుకున్నారు. “బృందావనం వెడదామా అన్నారు. అమ్మ విన్నది. ఏమీ విననట్లుగా మామిడి పండ్లను కొరికి ఒకటి బ్రహ్మచారి గారికీ, మరొకటి రఘువరదాసు గారికీ నోట్లో పెట్టి వారితో వచ్చిన అందరికీ ప్రసాదం పంచింది.
శాయమ్మ గారిని ఏదైనా ఫలహారం చేసుకు రమ్మన్నది. ఆమె తేగానే అమ్మ…. బ్రహ్మచారి గారి చెయ్యి పట్టుకుని గేటు ఇవతల ఉన్న జీప్ దాకా వచ్చి, ఠక్కున జీప్ లో ఎక్కి కూర్చున్నది. ప్రక్కనే బ్రహ్మచారి గారు కూర్చున్నారు. వెనుక సీటులో వారితో వచ్చిన సీతమ్మ గారు, ఆమె తమ్ముడు జనార్ధన రావు గారు, ఆమె తల్లి శాయమ్మ గారు, నేను, సుబ్బారావు అన్నయ్య ఎక్కాము. డోమ్ మీదఒకవైపు రామకృష్ణ అన్నయ్య, రఘువరదాసు గారు, మరొక వైపు ఉమ, కస్తూరి ఎక్కారు. డోర్ పట్టుకుని మువ్వల సత్యం ఎక్కాడు.
జీప్ బయల్దేరింది. అమ్మ ఎటు వెడుతున్నదీ ఎవరికీ అర్థం కాలేదు. వారంతా మట్టిపూడి అనుకుంటున్నారు. అమ్మ ఓంకార నది వైపు (కాలవకు పేరు) వెళ్ళమని సూచించింది. ఒడ్డున ఆపించి జీపు దిగింది. అంతా ఆశ్చర్య చకితులైనారు. అక్కడ ఉన్న ఆవులను, గేదెలను, వాటిని కాస్తున్న కాపరులను చూపించి ” బృందావనం వచ్చాం నాన్నా!” అన్నది. మేము మఱిపూడి అనుకున్నాం. కాలువ దగ్గరకు తీసుకు వచ్చింది. ఎంత మాయ చేసింది. అమ్మ మాయను మనమేం తెలుసుకోగలం – అని అమ్మ లీలలను గురించి చెప్పుకుంటూ పరమానందభరితులం అయినాము.
అమ్మ శాయమ్మ గారు తెచ్చిన స్వీటును మూడు సార్లు ఓంకార నదిలో వేసి బ్రహ్మచారి గారికీ, రఘువరదాసు గారికీ నోట్లో పెట్టింది. రఘువరదాసు గారు కూడా అమ్మ నోట్లో మూడు సార్లు పెట్టారు. అక్కడ ఉన్న అందరికీ నోట్లో పెట్టి, దూరంగా ఉన్న గొడ్ల కాపరులకు పంపి 15నిమిషాల్లో జీపు తిరుగు ముఖం పట్టించింది. ఆవరణ లోనికి రాగానే వారు వెళ్ళటానికి అమ్మ అనుజ్ఞ ఇచ్చింది. జీప్ వెళ్లేంతవరకూ అమ్మ చూస్తూనే ఉన్నది. తర్వాత ఉన్న వారందరికీ దర్శనం ప్రసాదించింది.
(వసుంధర అక్కయ్య రాసిన ” శ్రీ వారి చరణ సన్నిధి” నుండి.. పేజీ 226), జయహెూ మాతా..
—
జిల్లెళ్ళమూడిలో అమ్మనాన్నగారల కళ్యాణోత్సవం
5-5-23 న ఆదిదంపతులు అమ్మనాన్నగారల కళ్యాణోత్సవాన్ని జగత్కళ్యాణకారకంగా, నేత్రపర్వంగా నిర్వహించారు. ముందుగా మేళతాళాలతో కళ్యాణమూర్తులను ఊరేగించి, కళ్యాణమంటపం వద్దకు చేర్చగానే వరుని పక్షాన శ్రీ డివియన్ కామరాజు, వధువు పక్షాన శ్రీ కొండముది సుబ్బారావు మనోజ్ఞంగా ఎదురుకోల నిర్వహించారు.
శ్రీ జి. కృష్ణప్రసాద్, శ్రీమతి సరోజినీదేవి దంపతులు శ్రీ ఎ.సత్యనారాయణ, శ్రీ ఎ.వి. చిత్ర దంపతులు, శ్రీ పి.ఎ.రాజు, శ్రీమతి దుర్గ దంపతులు; శ్రీ కమలేష్, శ్రీమతి రవళి దంపతులు పీటల మీద కూర్చొని అమ్మనాన్నగారలకు అమ్మనాన్నలుగా వేదోక్త శాస్త్రోక్తరీతిగా సుముహూర్తం, సూత్రధారణ, అక్షతారోపణ ఇత్యాది క్రియలను విధివత్ పురోహితులు నిర్వహించారు.
సుమారు 500 మంది ఉత్సాహంగా ఉత్సవంలో పాల్గొన్నారు. అందరికీ శ్రీ విశ్వజననీ పరిషత్ ట్రస్టు వారు షడ్రసోపేతమైన విందుభోజనం సమకూర్చి సత్కరించారు. అమ్మనాన్నగారల శుభాశీస్సులను పొంది అందరూ పరవశించారు, పులకించారు.