జిల్లేళ్ళున్నాయంటే ఏమీ లేని క్షేత్రం అంటారు వాడుకలో. ఇంకేమీ మొలకలెత్తని చోటు. ‘అమ్మ’ అడుగుపెట్టనప్పుడు ఎలా ఉన్నదో వినడమే కాని చూడలేదు. 1958లలో ఎలా ఉందంటే ఏడవమైలుకు బాపట్ల నుంచి రిక్షాలోనో, కాలినడకనో వెళ్ళి అక్కడ నుంచి జపాన్ తుమ్మపొదల మధ్య కాలిబాటను పట్టుకొని రెండు ఉరవలు దాటి అమ్మ ఉన్న పాక చేరుకునేవాళ్ళం. వర్షాకాలం వరదలో చెట్లకు పాములు పొట్లకాయలలాగా వేలాడుతుండేవి. కానీ చిత్రంగా ఎవరికీ, ఏ భయమూ ఉండేది కాదు. అమ్మను చేరబోతున్న ఆత్రమూ ఆనందమూ పాదాలంటిన క్షణంలో కన్నీరుగా వర్షించిన హృదయ తాపమూ – ఏ ఆలోచనలూ దరిచేరని నిరామయమైన అవిచ్ఛిన్నమైన ఆనందం.
అమ్మ దగ్గర కూర్చొని ఆ అవ్యాజ కరుణామృత ప్రవాహంలో మునిగి తేలుతూ, అమ్మ పాదోదకాన్ని హరిపదతీర్థస్నానంగా, పరసుఖసంధానంగా సర్వరోగ దివ్యౌషధీతోయంగా అనుభవించి సేవించి, కీర్తించి – అమ్మ మన నోటికి అందించిన ఆవకాయ ముద్దలూ, చింతకాయ పచ్చడి ముద్దలు, ఫలాలు అనేక దివ్యపరిమళాలతో అనుభవానికి వస్తుంటే ఆశ్చర్య సంభ్రమాలతో చకితులమౌతూ ఆరగించి, అమ్మపాద సంవాహన చేస్తూ, ఈ బ్రతుకుకిక ఇది చాలు అనుకొంటూ – ఇంకెవరికి కావాలి ముక్తి ఇది చాలదా అనుకొన్న కాలం గతమైంది. పాకలు – చీరాల వారివీ…. గుంటూరు కుమారస్వామిగారివి ఏర్పడి. మాయమై అన్నపూర్ణాలయము, అమ్మ వాత్సల్యాలయమూ, అనసూయేశ్వరాలయము, హైమాలయము, నవనాగేశ్వరాలయమూ, వినాయక ఆలయమూ, మాతృశ్రీ చరణ సన్నిధి ఒక దాని ప్రక్కన ఒకటి రూపుదిద్దుకున్నాయి.
ఆనాడు అమ్మను సందర్శించిన వారిలో కొంతమందితో అమ్మ ఆనాడే చెప్పింది – అవకాశం ఉన్నప్పుడల్లా వచ్చిపోతుండండి నాన్నా అనీ, ఒకనాటికి 7వ మైలు దగ్గరనుంచే నమస్కారం చేసిపోవలసిన రోజు వస్తుందేమో అని.
పసిడి వన్నెల అమ్మ దక్షిణాది దేవాలయాలలో వలె కృష్ణవర్ణంలో ప్రతిష్టించబడినప్పుడు, అమ్మ మాటలు గుర్తుకురాగా, కీ.శే. రాజుపాలెం రామచంద్రరావు వంటి కొందరు 7వ మైలును ప్రధమ ద్వారంగా, ఒకటి, రెండవ వరవలు రెండు, మూడవ ఆవరణలుగా, ప్రస్తుత ఆవరణలో ప్రవేశం 4న ప్రాకారంగా, తపోవనప్రవేశం (గజేంద్రమ్మ గారి పాక) 5వ ప్రాకారంగా, అమ్మ ఇంటి ప్రవేశం 6వదిగా అమ్మ గృహ / ఆలయ ద్వారం 7వదిగా – సప్తప్రాకారాలతో కూడిన మహాక్షేత్రంగా భావించేవారు.
అమ్మ విధానాలు తెలిసిన వారెవరున్నారు గనుక! అమ్మ ఇచ్ఛతోనేమో – హైమాలయము, అనసూయేశ్వరాలయము, నవ నాగేశ్వరాలయము, సిద్ధి విఘ్నేశ్వరాలయము, మాతృశ్రీ చరణసన్నిధి మంటపమూ మొదలైనవి ఏర్పడ్డాయి. ప్రస్తుత అన్నపూర్ణాలయం పెద్ద ఎత్తున పునర్నిర్మించే ప్రయత్నం అచిరకాలంలోనే రూపుదాల్చనున్నది. శుభమ్ –
ఆవరణ ‘అందరిల్లు’గా అందరూ అన్నయ్యలు, అక్కయ్యలుగా బాధ్యతలు పంచుకుంటూ కాలువ నుండి, చెరువు నుండి బండితో అమ్మస్నానానికి నీరు తెచ్చి, కృష్ణవేణమ్మ అక్కయ్య వంటివారు గుడ్డలు ఉతికితెచ్చి, అన్నపూర్ణాలయ భవనానికి గానుగ త్రిప్పి, ఇటుకలు మోసి, లారీలలో ఇసుక మోసి పొలాలలో పంటకోసి, ఆశ్రమనంతా ‘అమ్మ’ నామంతో ‘జయహో మాతా’ అంటూ గాలికి వదలి అమ్మ దగ్గరికి తిరిగి వచ్చి నవ్వులతో కేరింతలతో అమ్మ ప్రేమతో ఇచ్చిన ప్రసాదం పంచుకొన్న రోజులు ఏనాటికీ మరపురానివి.
ఇక్కడ ఒక ప్రశ్న. ఈ మధ్య మా కుమారుడు రవికిరణ్ దగ్గరకు వెళ్ళినపుడు వాడు అడిగినది ఎంతో సున్నితమైనది; సునిశితమైనది నన్ను కలల ప్రపంచం నుండి; గతం నుంచి వర్తమానంలోకి దింపి భవిష్యత్తువైపు చూడమన్నది. “భవిష్యత్తులో కొన్ని వేల మంది జిల్లేళ్ళమూడి వస్తారని, మహా పుణ్యక్షేత్రమౌతుందని అన్నపూర్ణాలయం నిర్మించబోతున్నారు గదా 1. అక్కడికి వచ్చే వేల మంది ఎందుకు వస్తారని అనుకొంటున్నారు? 2. వచ్చిన వారు ఏం చేస్తారని, ఏమి చెయ్యాలని అనుకొంటున్నారు 3. వారికి మనం ఏ ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారు?” అని.
కదలి వచ్చిన కారుణ్యమూర్తి వదలి, కదిలింది. నేడు వచ్చే వారికి జ్ఞాపకాలే బలం. మరి భవిష్యత్తులో వచ్చేవారికో? ఏది ప్రేరణ?
‘నా సంకల్పం లేనిదే ఎవ్వరూ ఇక్కడికి రాలేదు. రాలేరు’ అన్నది అమ్మ. కనుక వచ్చే వారందరూ అమ్మ సంకల్పానుసారమే వస్తారు. మనకెందుకు అంటే అన్నీ అమ్మే చూసుకుంటుంది. ఈ భవనాల బెడద ఎందుకు, ఆలయాల గొడవ లెందుకు అనుకోవచ్చు.
కానీ కొంత వాస్తవికంగా చూసి, వచ్చే వారూ మన అన్నయ్యలూ, అక్కయ్యలే గదా; మనం పొందిన ఆనందానుభూతుల్నే వారు ఇక్కడ పొందడానికి మనం ఏం చేయాలి అనుకున్నప్పుడు రూపుదిద్దుకున్న మొదటి ఆలోచన బహుశా అన్నపూర్ణాలయం. ఎందుకంటే బాపట్ల నందిపాడు మార్గంలో 7వ మైలు దగ్గరదిగి 1 1/2 మైలు దూరంలో ఉన్న జిల్లేళ్ళమూడి – చేరిన వారికి ఆకలి తీర్చడానికి వేరే ఏ హోటళ్ళూ లేని ఈ కుగ్రామంలో అన్నపూర్ణయైన అమ్మ ప్రసాదం. లభ్యమయే మహత్తర ప్రదేశం అన్నపూర్ణాలయం. కానీ ప్రస్తుతం ఉన్న ప్రదేశంలోనే దాన్ని నిర్మించాలనుకోవడం ‘Heritage’ నిర్మాణాల రూపుమార్చడమౌతుందేమో ఆలోచించాలి. రెండు ఇంకెన్నో రెట్ల జనాలు వస్తారనుకున్నప్పుడు ఈ ప్రదేశం చాలదు. లక్షమందికి ఒక్క పంక్తిన భోజనాలు పెట్టినప్పుడు పొలాలలో పందిళ్ళు వేసి బారులలో కూర్చున్న దృశ్యం గుర్తుకు రాకమానదు. పైగా కేవలం నాలుగు స్తంభాలపై కప్పు మాత్రమే కాదు గదా – ఆధునికమైన వంటగది అక్కడి నుంచి పదార్థాలు ఏ విధంగా రావాలి. తిరిగి వెళ్ళాలి – భోజనం చేసేవారుఎలా కూర్చుంటారు? వడ్డన పళ్ళేలలోనా? ఆకులలోనా? వాటిని ఎలా శుభ్రపరచాలి – వ్యర్థాలను ఏ విధంగా వదిలించుకోవాలి. ఆవరణను శుభ్రం చేయాలంటే ఎలా? ఇక్కడికి చేరుకోవాలంటే మార్గం బయటికి వెళ్లే మార్గం- ఇవన్నీ కలిసి ఆలోచిస్తే అన్నపూర్ణాలయం!
వచ్చే వారందరూ కేవలం భోజనం చేసి వెళ్ళడానికే వస్తారు అనుకోవడం పెద్ద పొరపాటు. ఏనాడూ, ఎవరూ ఇక్కడికి భోజనం కోసం రాలేదు. జగదంబ – అన్నిటికీ ఆది అయిన పరాశక్తి కారుణ్యమూర్తియై దిగి వస్తే – దర్శనమూ స్పర్శనమూ జన్మధన్య కారణమని తరలి వచ్చింది జగతి. ‘అమ్మ’ గనుక కడుపుతడిమి ఆకలి తీర్చి కృష్ణుడు అటుకులు ఆరగించి సంపదలిచ్చినట్లు తనుతినకున్నా, పెట్టే మెతుకుతో పాపాలు పరిహరించి సుగతి ప్రసాదించింది
‘అమ్మ’. భౌతికంగా అమ్మ కనరాకున్నా ‘అమ్మ’ సాన్నిధ్యాన్ని అనుభవించాలనే వస్తారు భవిష్యత్తులో వారు.
మనం యాత్రలు చేస్తున్నాం. ప్రసిద్ధమైన దేవాలయాలు సందర్శిస్తునాం ఒక తిరుపతి – మధుర తంజావూరు – కేవలం భోజనానికి మాత్రమే కాదు – గదా – అక్కడి పవిత్రత పవిత్రమైన భావనా బలం వల్ల అనుభూతిలోకి వస్తుందని గదా. ఆ వాతావరణాన్ని ఏర్పరచడానికి మనం ఏం చేయాలి అని ఆలోచించవలసిన తరుణం ఆసన్నమైంది.
అమ్మ ఆలయప్రవేశం చేసింది గనుక ఆలయం చూడటానికి వచ్చినవారు ఆపేక్షిస్తారనేది పరమసత్యం. దక్షిణాదిన ఉన్న ఏ ఆలయం చూసినా – దైవానికి ప్రాధాన్యమిచ్చి గొప్ప గర్భాలయమూ ముందు అర్థమంటపాలూ, నాట్యమంటపాలూ, సభామంటపాలూ చుట్టూ ప్రదక్షిణ మార్గాలూ, ప్రాకారాలూ మార్గంలో ఇతర ఉపదేవాలయాలూ గోపుర ద్వారాలూ నిర్మించబడి ఉండటం గమనిస్తారు. పుష్కరిణిని దర్శిస్తాం. ఒక ప్రాకారంలో నుంచి మరొక ప్రాకారంలోనికి వెళుతున్న కొద్దీ దగ్గర అవుతున్నాం దైవానికి అనే భావన కుడ్యశిల్పాల మీద నుంచి దృష్టి మరల్చి అంతరాలయంలో (మనస్సులో) ఏకాగ్రత కుదిర్చి, లక్ష్యమూర్తి వైపు తిరుగుతుంది. ఆ వాతావరణం దానికి దోహదమౌతుంది. అదే విధంగా మనం అమ్మ ఆలయాన్ని ఇప్పటికే ఏర్పరచిన ఆలయాలనూ అనుసంధానించే మార్గాన్నొకదాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందనిపిస్తుంది నాకు. ఒక మాస్టర్ ప్లాన్ ప్రకారం నిర్మాణాలు జరిగితే ఆలయాన్ని ఎన్ని వేలమందైనా సులభంగా దర్శించుకోవచ్చు. లేకుంటే, అక్కడా తోపులాటలూ, తొక్కిసలాటలూ ఉంటే అదీ ‘అమ్మ’ దగ్గర! ఊహించడానికే భయం వేస్తుంది. విశాలమైన మార్గం – భక్తి భావం పెంపొందించే నామధ్వని, ఆచ్ఛాదితం చేసే చెట్లు బాటలకిరువైపులా ఉంటే ఎంత బాగుంటుంది!
అమ్మ ఆలయమూ, హైమ ఆలయమూ, వాత్సల్యాలయము, అలంకార హైమ ఉన్న ప్రధమాలయమూ చూచేవరుస ఏది? అమ్మ మన మధ్య తిరుగాడినప్పటి ఛాయాచిత్రాలను ఎక్కడ ప్రదర్శనకు ఉంచాలి? అమ్మ ధరించిన, వినియోగించిన వస్తువులు, ఎక్కడ ఉంచాలి, వీక్షకులు ఎలా దర్శించాలి? స్పర్శించవచ్చా? అప్పటి దృశ్యాలనూ (విడియోలు మొ||) ఎప్పుడు, ఎక్కడ ప్రదర్శిస్తే చూసేవారు అమ్మ సాన్నిధ్యాన్ని అనుభూతి చెందగలరో ఆలోచించాలి.
వచ్చేవారు అనేక దృక్పథాల వారై ఉంటారు. కొందరు భక్తిమార్గతత్పరులైతే, మరికొందరికి ధ్యానం ఇష్టమైతే, ఇంకొందరికి సేవ ప్రీతి పాత్రం కావచ్చు. అమ్మ దైవం మాత్రమే కాదు – పరిపూర్ణ మానవి. అమ్మకంటే గొప్ప సామ్యవాది లేరు. కుల, మత, వర్ణ, వర్గ, రహితంగా ఆవరణలో అందరూ కలిసి తినేవారు. కలిసి మనేవారు ఇదే మార్గం అని అనలేదు. నీకు ఏది ఇష్టమో ఏది చేయగలవో అది చేయమన్నది. అన్ని మార్గాలకు దారులు వేసింది అమ్మ. అక్కడ ఆదరణాలయం వృద్ధులు – నిరాధారుల కోసం – వైద్యాలయం వ్యాధిగ్రస్తుల కోసం – విద్యాలయం విద్యార్ధుల కోసం – ధ్యాన మందిరం ధ్యానయోగుల కోసం అఖండనామ సంకీర్తన నామయోగులకు ఆవరణ బాగోగులు కర్మయోగులకు మార్గాన్ని చూపుతారు. కానీ వాటికి తగిన వాతావరణం కల్పించవలసి ఉందిగదా. ఉదాహరణకు కన్యాకుమారి దగ్గర వివేకానంద కొండ దగ్గర ధ్యానమందిరంలో చిన్న ఆకుపచ్చ దీపం దాదాపు చీకటిగా, చల్లగా ఉండే వాతావరణం, సన్నగా వినపడే ఓంకారం అప్రయత్నంగానే ధ్యానమగ్నమై నిశ్చలమౌతుంది మనస్సు – కొన్ని క్షణాలైనా – అదే విధంగా రమణాశ్రమంలో స్కంధాశ్రమ వాతావరణం మనం ఏర్పరచుకొన్న ధ్యానమందిరంలో సన్నటి వెలుగూ, మంద్రధ్వనిలో అమ్మ గొంతు వినపడే ఏర్పాటుగానీ, నామంగానీ ఉండి కూర్చొనడానికి ఒక వరుసలూ కొన్ని ఆసనాలు ఉంటే – కుర్చీలు కానక్కర లేదు క్రింద చిన్నచాపలు చాలు – ఎంత బాగుంటుంది!
కొందరికి వైద్యాలయంలో సేవ చేయాలనిపించవచ్చు – కొందరికి మందుల అవసరాలు తెలిస్తే ఇచ్చి సహాయం చేద్దామనిపించవచ్చు. కొందరు వైద్యులకు మనం గూడా ఒక పూట – ఒక రోజు – వచ్చినప్పుడు మన సేవలు అందిస్తే అని పించవచ్చు. దానికి వచ్చిన వారికి అక్కడ వైద్యాలయం ఎక్కడ అని అడగవలసిన అవసరం లేకుండా ఏది ఎక్కడ ఉన్నదో చూపే మార్గపటాన్ని ఏర్పాటు చేస్తే!
ఆదరణాలయంలో ఏఏ సేవలు అవసరం. ఏమి లభ్యమౌతున్నాయి. ఎందరున్నారు? ఎందరుండవచ్చు వారికి ప్రేమను పంచడానికి ఎందరు ముందుకురాగలరు?
ఏ సంస్థ మనుగడకైనా ప్రధానం మానవ వనరులు. ఎంతో దూరదృష్టితో అమ్మ ఇక్కడ విద్యాలయాలు నెలకొల్పింది. ఓరియంటల్ కాలేజీ ఏర్పడింది. మనం కేవలం కార్పొరేట్ కాలేజీలలో వలె వారికి హాస్టల్ వసతినిచ్చి, ఒక డిగ్రీ చేతికిచ్చి పంపిస్తే వారికి అమ్మ ఏ విధంగా అనుభవానికి వచ్చినట్లు? వారికి అమ్మ సందేశం అందాలి! అది వారు అందరికీ పంచాలి. వారిని అక్కడ సేవా కార్యక్రమాల్లో ఐచ్ఛికంగా భాగస్వాములయేటట్లు చూడాలి. ఒక నెల వైద్యాలయంలో శిక్షణ – సేవా కార్యక్రమంలో – ఒక నెల అన్నపూర్ణాలయంలో – కొంతకాలం ఆదరణాలయంలో – సంకీర్తనాయజ్ఞంలో – పాలుపంచుకునేట్లు పాఠ్యప్రణాళికలో భాగమయ్యేట్లు చూచి, వాటికి తగిన గుర్తింపు, ప్రోత్సాహకాలు వారి సర్టిఫికేట్లలో ప్రశంసించడం ద్వారా! నగదు ప్రోత్సాహకాలు అందించడం ద్వారా, ఇంకా ఇతర మార్గాల ద్వారా అందిస్తే మనం అనుకుంటున్న అమ్మ భావజాల వ్యాప్తి ఎంత సులభంగా జరుగుతుంది. ఇప్పటికే విద్యాలయంలో పాత విద్యార్థులు సంఘంగా ఏర్పడి – అమ్మ ఉన్నప్పుడు విద్యార్థులు గూడా సభ్యులై, తమ అనుభవలూ, అనుభూతులూ పంచుకుంటూ సంస్థ అభివృద్ధికి దోహదం చేస్తే భవిష్యత్తు ఎంత సుందరంగా ఉంటుంది!
మరో అంశం వచ్చే వారికి వసతి, హైదరాబాదులో శ్రీరామకృష్ణమిషన్ వంటివి spiritual retreats జరుపుతారు. దైనందిన కార్యక్రమాలతో అలసి, ఆధ్యాత్మిక మార్గంలో సేదతీరాలనే అనేక కుటుంబాలు జిల్లేళ్ళమూడి వంటి ప్రశాంత ప్రదేశంలో కాలం గడపాలని వాంఛిస్తారు. అటువంటి వారు ఉండటానికి తగిన వసతి – స్నాన పానాదులుండేటట్లు ఒక గది ఉన్నా చాలు – ఉచితమే కానక్కరలేదు. సౌకర్యాలను బట్టి రుసుముతోనైనా అందుబాటులో ఉండి – పిల్లలకూ, పెద్దలకూ తగిన కార్యక్రమాలతో దైనందిని ఉంటే. ఉదాహరణకు పిల్లలకు కొన్ని ఆటలూ, వ్యాయామాలు, యోగాసనాలు భక్తి కీర్తనలు నేర్పే కార్యక్రమాలు – పెద్దలకు ధ్యానావకాశం, సేవాకార్యక్రమం పూజా కార్యక్రమాదికాలు – అమ్మను గూర్చి చదువుకొనే గ్రంథాలయమూ, చూచే ప్రదర్శనాలయమూ అందుబాటులో ఉంటే – ఎన్నికలలు!! రూపుదాల్చివలసినవి.
అమ్మ సాహిత్యం అందుబాటులో చాలా ఉన్నది. దానిని అమ్మ ఫోటోలు మొదలైనవి. అందరికీ అందుబాటులో ఉంచే డిజిటల్ లైబ్రరీ ఏర్పడుతున్నది. అమ్మ వెబ్సైట్ రూపుదిద్దుకుంటున్నది. అమ్మ ఉన్నప్పుడు, దేశవిదేశాలలో కొన్ని వేలమంది వచ్చి చూచిన వారూ రాకనే చూచినవారూ ఉన్నారు. అమ్మ అన్నది. మీరు అనుకొంటే నేను కనపడను; నేను అనుకొంటేనే మీరు చూస్తారు” అని. అమ్మ అందరినీ చూద్దామని ఏ క్షణాన అనుకొంటుందో. అనుకొన్నప్పుడు కనపడిన అందరినీ చూచి ఒక చిరునవ్వు ఎప్పుడు చిందిస్తుందో – అప్పుడు గతంలో మనవలెనే పరవశమైపోయే వారి భాగ్యం ఎంతో!! అమ్మను సామ్యవాదిగా చూస్తారో, ప్రేమమూర్తిగా ఆరాధిస్తారో, దైవంగా సాక్షాత్కరించుకొంటారో!
అమ్మ జీవితమహోదధిలో లేవబోయే తరంగంపైని ఆవిష్కృతం కాబోయే ఇంద్రధనుస్సు రంగులు తలచుకొంటే మది పులకించి పాటలు పాడమంటోందికదూ!
అమ్మను లలితా పరాభట్టారికగా భావించి లలితా సహస్ర కోటిపారాయణలు నిర్వహించుకొన్నాం. భానుమండల మధ్యస్థా అని గదా నామం. అర్కపురి అంటే భానుమండలమే గదా – అమ్మ తన సహస్ర రూపాలతో అణువణవునా ప్రతిబింబించినప్పుడు – ప్రతి హృదయంలో ప్రతి స్పందనలో ప్రతి ధ్వనించినప్పుడు జిల్లేళ్ళమూడి కేవలం సంస్కృతీకరింపబడిన అర్కపురి కాక సాక్షాత్కరించిన అర్కపురిగా భాసిస్తుంది త్వరలో అది జరగాలనీ, మేమూ అది చూడాలనీ ఆశతో అమ్మకు విన్నవిస్తూ
“కదలి రావమ్మా.
మము వదలిపోకమ్మా – కల్యాణివై శార్వాణివై
మా హృదయ సదనమందు అడుగడుగున దేవతలే
ఉన్నతాసనంబునకు – కదలిరావమ్మా.
కందునేమొ వ్రేలూలిన
సుందరమో నీ పదాలు
మడుగులొత్త మనసారగ కదలి రావమ్మా” అని రాజుబావతో కలిసి
మనమందరమూ ప్రార్థిద్దాం. వస్తుందనే ఆశ. అమ్మా! తథాస్తు అనవూ??