మహోదధినాటి సాంఘిక పరిస్థితులు అంటే అమ్మ గర్భంలో ఉన్నప్పటి నుంచి, అమ్మ వివాహ నిశ్చయం వరకు దాదాపు 18 సంవత్సరాల (1923-1941) సంగతులన్న మాట. ఆనాటి సంఘంలో ఉన్న ఆచారవ్యవహారాలు, వాడిన భాష, ధరించిన ఆభరణాలు, ఆహారం, ఆహార్యం, ఆధ్యాత్మిక రంగం, ప్రయాణ సాధనాలు, ఇప్పుడు మూఢాచారాలుగా భావిస్తున్న ఆచారాలు, ఉద్యోగ అవకాశాలు ఇలా… అనేకానేక సంగతులు సందర్భవశాత్తూ అలవోకగా అమ్మ చెప్పింది. వీటిని అసలు కథనం నుంచి విడదీసి విశ్లేషించటమంటే అదొక బృహత్కార్యమే! ఒక సిద్ధాంత గ్రంథానికి సరిపడానో, అంతకు మించినదో సామగ్రి, మహోదధిలో ఉన్నది. సాహిత్య, సాంఘిక శాస్త్రాలలో అభినివేశమున్న ‘గజ ఈతగాళ్ళు’ ఎవరయినా ముందుకొచ్చి చేపట్ట దగినది. ఇది కేవలం ఆరంభము, అంకురార్పణ మాత్రమే!
అమ్మతొ అతి సన్నిహితంగా మెసలిన, అనేక సంఘటనలు, సంభాషణలు స్వయంగా కన్న, విన్న గోపాలన్నయ్య, రాజుబావల తరం క్రమంగా కనుమరుగవుతున్నది. మిగిలిన పెద్దలు ఓపిక చేసుకుని ముందుకొచ్చి సందేహ నివృత్తి చేయాలి. విషయ వివరణ చెయ్యాలి. ఉదాహరణకు ‘గరుడ గుడ్డ కట్టటం’, గుఱ్ఱపు శాంతి, పిల్లి ‘మచ్చు’ మీద కెగిరి… వంటి పదాలున్నాయి. వీటి అర్థం ఎందరికి తెలుసు? జనుల నోళ్ళలో నానుతున్న పడికట్టు పదాలు, మాండలికాలు, యాస, నిఘంటువుల్లో కూడా దొరక్కపోవచ్చు. అందువల్ల అప్పటి పెద్దల నుండి రాబట్టుకోవలసిన బాధ్యత మనదే. (రావూరి ప్రసాదు ఇంటర్వ్యూల ద్వారా అమ్మతో, పెద్దల, ప్రముఖుల అమూల్య అనుభవాలు సేకరించినట్టు)
ఇక అసలు విషయానికి వస్తాను – అమ్మ జననం నాటి సంగతులతో. ఆ రోజుల్లో అన్నీ ఉమ్మడి కుటుంబాలే. కనీసం పదిమందయినా ఉండేవారు కుటుంబానికి సంతానమే సంపదగా భావించిన రోజులు. కుటుంబ నియంత్రణ అన్న దురవస్థ లేని రోజులు. పురుళ్ళన్నీ దాదాపు యింట్లోనే, పెద్దల, వృద్ధమాతల పర్యవేక్షణలో జరిగి పోతూండేవి. ఊరికో మంత్రసాని, నొప్పులు మొదలవగానే ఆమె వచ్చి పురుడుపోసి కార్యం గట్టెక్కించేది. మాతా శిశు సంరక్షణ యధా శక్తి జరిపేది. ‘ఫీజు’ల ప్రసక్తి కానరాదు. జాత అశౌచం మృత అశౌచమంత నిక్కచ్చిగా పాటించేవారు. ఏదైనా ‘శుద్ధి’ చెయ్యవలసి వస్తే ఆవుపంచితం వాడటం పరిపాటి. గొల్ల నాగమ్మ చంటి బిడ్డకు పురిటిస్నానం చేయించాలని పెరట్లో వంటింటి వైపు వెళ్ళగా, పురిటి బిడ్డను వంటింటి వైపుకు తీసుకొచ్చావు. మైలపడిపోదా? అంటూ కోపగిస్తుంది బామ్మ (అమ్మ మేనత్త); ఆవు పంచితం చల్లి పడిన మైలకు శుద్ధి అయిందనిపిస్తుంది. అలాగే పాకీదాని పిల్లను రోడ్డు ప్రమాదం నుంచి అమ్మ ఎత్తుకుని రక్షించినపుడు కూడా ఆవు పంచితం తోనే శుద్ధి జరిగింది అమ్మకు. ఇప్పుడు ఆధునిక వైద్య విధానంలో ఆముదం వాడటం నిషిద్ధం. కాని ఆ రోజుల్లో ఆముదం తరచు వాడేవారు, కడుపులో మురికి పోవాలని.
పురిటిస్నానం అనేది ఒక సామూహిక కార్యక్రమంలా జరిగేది. అమ్మ పురిటిస్నానానికి ఊళ్ళో 500 యిళ్ళవాళ్ళను పిలుస్తారు. 108 మంది 108 బిందెల నీళ్ళు తెచ్చారట. దిష్టి తియ్యటానికి యిప్పటిలాగే ‘ఎర్రనీళ్ళు’ వాడేవారు (పసుపు నీళ్ళలో కాస్త సున్నం కలిపి చేసిన నీళ్ళు). బిడ్డకు మూడవ నెలలో ‘ముద్దకుడుము’ ల ముచ్చట జరిపేవారు. పుట్టినప్పుడు ముడుచుకుని ఉన్న గుప్పెట మెల్లమెల్లగా తెరచుకొని అరచేతి వేళ్ళు విప్పారే సమయం అది. చలిమిడి ముద్దలు అయిదుగురు ముత్తయిదువలకు ఇప్పించే వారు. రోజుల బిడ్డకు నల్లగాజులు వేసేవారు. ఈ ఆచారం నేడూ పాటించ బడుతున్నదే. గాజుల బదులు చిన్న నల్లపూసల దండ ముంజేతికి కట్టటం కూడా ఉన్నది.
(సశేషం)