1. Home
  2. Articles
  3. Mother of All
  4. జ్ఞానగుళికలు

జ్ఞానగుళికలు

Bhattiprolu Lakshmi Suguna
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 11
Month : April
Issue Number : 2
Year : 2012
  1. సంకల్పరాహిత్యం

(గత సంచిక తరువాత…)

సాధారణంగా ఏ మనిషికయినా కొన్ని విషయాలు సుఖాన్ని కలిగిస్తాయి. కొన్ని విషయాలు దుఃఖాన్ని కలిగిస్తాయి. ఈ సుఖఃదుఖాలకు మూలం రాగద్వేషాలు. వీటి వలన అనుకూల, ప్రతికూల భావాలు కల్గుతూ ఉంటాయి. ‘సంకల్ప వికల్పాత్మాకం మనః’ అన్నట్లుగా మనస్సులో అనేక అభిప్రాయాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అలలు లేని సముద్రం లేనట్లు, ఆలోచనల్లో మార్పు తప్ప సంకల్పాలు లేని స్థితి ఎపుడూ ఉండదు. ‘నహ్యసన్న్యస్త సంకల్పయోగీ భవతి కశ్చన’ సంకల్పత్యాగం చేయని వాడు యోగి కాజాలడని భగవద్గీతా ప్రవచనం. సంకల్ప రాహిత్యం కావాలని అందరూ కోరుకుంటారు. కానీ సంకల్పరాహిత్య స్థితి రాలేదనే తపనతోనే జీవితమంతా గడుస్తుంది తప్ప ఆ స్థితి అందుబాటులోకి రాదు. ఎన్నో సాధనలు చేసే ఏ మహర్షులకో మాత్రమే సాధ్యం కావచ్చు. కానీ మహర్షుల అనుభవానికి మన అనుభూతికి పొంతన కుదరదు. సంకల్పరాహిత్యం కోసం తపనపడే మానవాళికి ‘తనకు వచ్చే సంకల్పాలకు తాను కర్తను కాననీ తనకు వచ్చే సంకల్పాలన్నీ దైవసంకల్పాల నీ తెలుసుకోవడమే సంకల్పరాహిత్యం’ అని అమ్మ నిర్వచించింది.

సంకల్పాలు మనవి కానప్పుడు జరిగే పనులందు మనం నిమిత్త మాత్రులం. ఏది జరిగినా, ఏమి చేస్తున్నా అంతా భగవంతుడే చేస్తున్నాడనీ, తనకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా అది భగవదనుగ్రహమే అని భావించడమే సుఖానికి మార్గం అవుతుంది. నేను చేస్తున్నాను అని ప్రతి పనికీ తాను కర్తనని భావిస్తే అనుకున్నది జరుగకపోతే దుఃఖాన్ని పొందడం; తనకు సంబంధించినవి. తననుండి దూరమైతే బాధపడడం జరుగుతుంది. కానీ దేనికీ నేను కర్తను కాను అనుకున్నప్పుడు సుఖదుఃఖాలకు పొంగిపోవడం, క్రుంగిపోవడం ఉండదు. అదే స్థితప్రజ్ఞలక్షణం. అదే నిశ్చలస్థితి.

ఉదాహరణ : ఒక సరస్సునే తీసుకుందాం. వెన్నెల రాత్రి పండు వెన్నెల కాస్తూ ఉంటుంది. ఆకాశంలోని నక్షత్రాలు, చంద్రుడు, సరస్సు ఉపరితలంపై ప్రతిబింబిస్తూ ఉంటాయి. ఇంతలో గాలి తాకిడికో, ఒక రాయి విసిరితేనో ఆ సరస్సు చెదరి కన్పించే ఆ దృశ్యమంతా ఛిన్నాభిన్నమౌతుంది. కాని ఇది యదార్థం కాదు. యదార్థమైన వస్తువు యధాతధంగా ఉన్నది అన్న జ్ఞానం కలగగానే ఆ భ్రాంతి పోతున్నది.

అలాగే మనకు కలిగే అభిప్రాయాల తాకిడికి మనస్సు అనే సరస్సు చెదరిపోతుంది. కానీ వీటన్నింటికీ కర్తను నేను కాదు. ఇవన్నీ దైవసంకల్పాలే అని తెలుసుకున్నప్పుడు నిశ్చలస్థితి కల్గుతుంది. గాలికి రెపరెపలాడుతున్న దీపం మనకు వెలుగును సరిగా అందించలేదు. ఆ దీపం ఎంత పెద్దదైనప్పటికీ కదిలిపోతున్నప్పుడు అది చేయగలిగింది లేదు. అదే నిశ్చలస్థితిలో గోరంత దీపం కొండంత వెలుగు నిస్తుంది. మనస్సు దీపం లాంటిది. సంకల్ప వికల్పాల తాకిడికి చెదిరిపోతుంది. అప్పుడు ఇవన్నీ దైవసంకల్పాలే అని గుర్తించగల్గినప్పుడు నిశ్చలస్థితి ఏర్పడుతుంది. ఇది అనుభవంలోకి రావడమే సంకల్పరాహిత్య స్థితిని పొందడం. మరి ఇది సాధ్యమేనా? అందుకే అమ్మ “వచ్చే సంకల్పాలన్నీ దైవసంకల్పాలుగా భావించడమే సంకల్పరాహిత్యం” అనే నిర్వచనాన్ని సాధనాపరంగా చెప్తున్నది.

తనకు వచ్చే సంకల్పాలకు తాను కర్తను కాను అన్నది సాధనలో మొదటిదశ. తద్వారా ఎదుటి వారి సంకల్పాలకు కూడా వారు కర్తలు కారు. అనేది సాధనలో తర్వాత మెట్టు. ఆ క్రమంలో అందరి అన్ని సంకల్పాలకు మూలం భగవంతుడే అనే దర్శనం కలగడమే చేరుకోవలసిన గమ్యం.

“చేసేవాడి సంకల్పంచేత ఏర్పడ్డ ఈ సృష్టి సంకల్పరహితమెట్లా అవుతుంది. సృష్టికర్తే సంకల్పరహితుడు కాలేడు. మన సంకల్పమెట్లా పోతుంది. ఈ సంకల్పం మనది కాదనుకోవటమే సంకల్ప రాహిత్యం” అనే అమ్మవాక్యం ఒక జ్ఞానశాస్త్రం. అది సార్వకాలిక సత్యజ్ఞాన రూప సువర్ణ జ్యోతిని వెలిగించి అజ్ఞానాంధకారాన్ని అంతం చేస్తుంది. సంకల్పరాహిత్య అనుభవం లోకి రాక కలవరపడే సాధకునికి అమ్మ ఇచ్చిన నిర్వచనం ఒక గమ్యాన్ని, మార్గాన్ని నిర్దేశిస్తుంది; బేషరుతుగా ఒక హామీని ప్రసాదిస్తుంది.

(సశేషం)

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!