అమ్మ వాక్యాలు ఆప్తవాక్యాలు, జ్ఞానరసాప్లావితాలు, సత్యసంశోభితాలు, మార్గదర్శకాలు, అణువుకంటే చిన్నవి. మహత్తుకంటె గొప్పవి. అవి సరళంగా, స్వయం వ్యక్తాలుగా కనిపిస్తాయి; కానీ తరచి చూస్తే ఎన్నో నిగూఢమైన అనంతమైన అపూర్వమైన ఆధ్యాత్మిక సత్యాలు వాస్తవాలు కనిపిస్తాయి, కళ్ళు తెరిపిస్తాయి. నాకు అందినంత వరకు కొన్ని వాక్యాలకు వివరణ అందిస్తాను. 1. సంకల్పమే సంసారం:
సంకల్పం అంటే ఇచ్ఛ, కోరిక. సంసారం అంటే జనన మరణ ప్రవాహం. సంసారం అంటే సృష్టే. నిర్వికారం, నిర్గుణం అయిన పరబ్రహ్మ తత్త్వమందు కలిగిన స్పందనే ఈ సృష్టికి కారణం. ‘స్కో కామయత బహుశ్యాం ప్రజాయయేతి’ అంటుంది అరుణమంత్రం. ‘నేను ప్రజలను సృష్టించాలి’ అన్న పరమాత్మ సంకల్పమే ఈ సృష్టి అంతా. ఇది విశ్వసంసార విషయం. ఇది పరమాత్మ లీలా వినోదం.
కానీ లోకంలో సంసారం అనే పదానికున్న అర్థం వేరు. భార్య, బిడ్డలు మొదలైన బంధాలనే సంసారంగా భావిస్తారు. కుటుంబం అన్న తరువాత ఎన్నో బాధ్యతలు ఉంటాయి, ఎన్నో సమస్యలు ఎదురౌతాయి; సుఖంతోపాటు కష్టమూ ఉంటుంది. వాటన్నింటినీ సక్రమంగా నిర్వహిస్తూ ఆయా సన్నివేశాలకు తగినట్లుగా ప్రవర్తిస్తూంటే సంసారం సారవంతమే. కాని ఆ బాధ్యతలనే భారంగా భావిస్తూ సమస్యలతో సతమతమవుతూ సంసారంలో కూరుకుపోయి బయటకు రాలేక బాధ పడుతూంటారు. తమ కష్టాలన్నింటికీ సంసారమే కారణమనీ, ఆ సంసార లంపటంలో చిక్కుకుని ఆధ్యాత్మిక చింతన చేయలేక పోతున్నామని వాపోతూ ఉంటారు. అందుకే ‘సంసారం సాగరం దుఃఖం’ – అని తలపోస్తూ నన్యానులే దానిని తరించగలరనే సంప్రదాయం బలపడిపోయింది. ఆ అభిప్రాయాన్ని మార్చడం కోసమే అమ్మ “సంకల్పమే సంసారం” అనీ, సంసారం పట్ల మనకున్న ఆలోచనా ధోరణే బంధానికి కారణమనీ, భావబంధమే తప్ప భవబంధం లేదనీ ప్రబోధించింది. పెళ్ళిలో పెద్దపులి లేదని ఆచరణాత్మకంగా నిరూపించింది. “సర్వాన్నీ అనుభవిస్తూ సర్వాన్నీ విడిచిపెట్టేదే వివాహం” అనే మహత్తర సందేశాన్ని అనుగ్రహించింది.
ఏ మనిషికయినా సుఖాన్నికానీ దుఃఖాన్ని కానీ కల్గించేది మనస్పే. ‘మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః’ – అని చెప్పినట్లుగా దేనికయినా మనస్సే కారణం. సంసారం పట్ల మనకున్న సంకల్పమే. అంటే మనకు కలిగే ఆలోచనలు, భావాలే సంసారం ఒక గుదిబండ, ఊబి అని అనిపించటానికి కారణం అవుతున్నాయి. ‘యద్భావం తద్భవతి’ అని అన్నారు. కదా! కనుక మనసు సరైన మార్గంలో ప్రయాణించాలి. నిత్య జీవిత శ్రీ నిర్వహణలో మనిషి మనస్సుకి చాలా ప్రాధాన్యం ఉంది.
ఆత్మానం రధినం విధి, శరీరం రధమేవచ |
బుద్ధిం సారధిం విద్ధి, మనః ప్రగ్రహమేవచ ॥
శరీరం అనే రధానికి ఆత్మయజమాని, బుద్ధి సారధి, మనస్సు కళ్ళెం, ఇంద్రియాలు అశ్వాలు. మనస్సు ఇంద్రియ వశమైతే అధర్మాచరణ, బుద్ధి వశమైతే ధర్మాచరణ
యస్తు విజ్ఞాన వాన్భవతి యుక్తేన మనసా సదా ॥
తస్యేంద్రియాణి వశ్యాని సదశ్వా ఇవ సారధేః ॥
వివేచన కలసారధి పగ్గాలు స్వాధీనం చేసుకుని తన యజమాని వెళ్ళదలచుకున్న మార్గంలో అశ్వాలను నడిపినట్లుగా బుద్ధి మనస్సును నిర్దేశిస్తే ఇంద్రియాలు వశంలో ఉంటాయి. కాబట్టి వివేచనా శక్తి గల బుద్ధితో తమ మనస్సును స్థిరంగా ఉంచుకొని ఇంద్రియాలను వశం చేసుకున్నవారే విజ్ఞులు. వారికి సంసారం బంధహేతువు కాదు; నదిని దాటించే నావ. నావ నదిని దాటిస్తుంది కానీ తాను దాటలేదు. నావ నీటిలోనే ఉంటుంది ఎప్పుడూ గట్టు ఎక్కేది లేదు. ఒక ఉదాహరణ : ధర్మ వ్యాధుని తీసుకుందాం. ఆయన సాంసారిక బాధ్యతలను బంధాలుగా భావించలేదు. తల్లిదండ్రుల సేవయే దైవసేవ అనీ, అదే తన ధర్మమనీ తన జ్ఞానానికి మూలం అని కౌశికునికి ధర్మ ప్రబోధం కావించాడు. కాని కౌశికుడు తల్లిదండ్రులను బంధాలుగా ఎంచి ఇంటిని విడిచి బయటకు వచ్చాడు. ధర్మవ్యాధుడు కోటలో ఉండి యుద్ధం చేస్తూంటే, కౌశికుడు కోట విడిచి యుద్ధం చేయడం వంటిది. ఏది సుఖం? ఏది కష్టం? ఏది మార్గం?
శ్రీ మహావిష్ణువు రామావతారంలోనూ, కృష్ణావతారంలోనూ గృహస్థుగా తన జీవితాన్ని గడిపి ధర్మ సంరక్షణ చేస్తూ సంసారం బంధహేతువుకాదని సందేశాన్ని అందించలేదా?
‘సంకల్పం’ అనగానే దాని ప్రక్కన ‘వికల్పం’ అనే మాట జతకడుతుంది. సంకల్పం అంటే ఒక ఆలోచన కల్గినది అనీ; వికల్పం అంటే అది మారింది అని. ‘సంకల్ప వికల్పాలు రెండూ ఈశ్వరేచ్ఛయే’ – అనే సంకల్పమే సత్సంకల్పం. జరిగేవి, జరగనివి భేదమోదాలు. రెండూ ఈశ్వరానుగ్రహాలే. కనుకనే అమ్మ జీవితంలో కొంగుపట్టి అన్నింటికే “సరే మంత్రా”న్ని పఠిస్తూ, సమయానికి ఏది వస్తే దానిని – అనుభవించమన్నది.
సంసార చక్రాన్ని నడిపించేది మనస్సే. సంసారం అంటే భార్యా బిడ్డలు కాదు. మనస్సే సంసారం. ఈ గంభీర భావాన్నే ‘సంకల్పమే సంసారం’ అనే అమ్మ వాక్యం మనకి విశదపరుస్తోంది.
– (సశేషం)