(గత సంచిక తరువాయి)
- త్యాగం యొక్క చరమదశ సర్వసంగపరిత్యాగం:
శ్రీ విన్నకోట వెంకటరత్న శర్మగారు వేదాలూ, ఉపనిషత్తులు, పురాణాల్ని ఔపోసన పట్టాను, కానీ అవి అనుభవాన్ని ఇవ్వలేదు. అనుభవసారమే శాస్త్రం – అదే అమ్మ. కనుకనే వారి సందేహాలను సవినయంగా అమ్మను అడిగి నివృత్తి చేసుకున్నారు. ‘త్యాగి అన్నా సర్వసంగపరిత్యాగి అన్నా ఒకటేనా, అమ్మా?’ అని ప్రశ్నించినపుడు, “త్యాగం యొక్క చరమదశ సర్వసంగపరిత్యాగం” అని వివరించింది అమ్మ.
ఏ మనిషికైనా త్యాగగుణం కొద్దోగోప్పా ఉంటుంది. పీల్చిన గాలి వదలినప్పుడే ఊపిరితిత్తులు క్షేమంగా ఉన్నట్లు సంపాదించిన ధనానికి సార్థకత త్యాగం చేయడమే. ఇది ఒక ధనం విసయంలోనే కాదు. వస్తువు పట్ల ఉన్న సంగాన్ని వదిలి పెట్టడమే త్యాగానికి చరమదశ అని అమ్మ ప్రవచిస్తోంది. సంగత్యాగమే నిజమైన త్యాగం. ఇది ఎట్లా సాధ్యం? అ అంటే అమ్మ వాక్యం లోనే ఒక సాధనా క్రమం కన్పిస్తోంది. ఇతరుల ఆనందం కోసం ఒక వస్తువుని గాని ఒక విషయాన్నిగాని, సుఖాన్నిగాని త్యాగం చేయడం మొదటి దశ. ఇతరుల ఆనందంలో తన ఆనందాన్ని చూసుకోవటం రెండవదశ. త్యాగం ఇతరులకోసం మొదలుపెట్టినా దాని వలన కలిగే తృప్తి, శాంతి, లబ్ధి, మాత్రం తనకే. ఆ విదంగా త్యాగమే పరమార్థంగా చేస్తూ ఉంటే అది సహజమైపోతుంది. క్రమేణా, త్యాగం “సహజమైతే వచ్చేది సర్వసంగపరిత్యాగమే.
‘సర్వకర్మఫలత్యాగః ప్రాహః త్యాగం విచక్షణాః’ అని కర్మఫల పరిత్యాగమే త్యాగమని భగవద్గీతా ప్రవచనం. ఫలితం మీద దృష్టి ఉన్నపుడు మనిషికి అనేక ఆలోచనలు. తనకు ఫలితం అనుకూలమైతే ఆనందం, ప్రతికూలమైతే దుఃఖం, కనుక ఫలితం మీద దృష్టి పెట్టకుండా ఫలప్రదాత భగవంతుడు కనుక ఫలితాన్ని ఆయనకే వదలి కర్మాచరణ మాత్రమే మానవుని విధి. సంగత్యాగమంటే నాది అనే భావాన్ని వదలి చేసే ప్రతిపని యోగదృష్టితో చేయడం. యోగి కాకపోతే త్యాగి కాలేడు. ఈశ్వర మాయలో పడి మనిషి కర్తృత్వాన్ని నెత్తిన పెట్టుకొని గలగలలాడతాడు. కనుకనే ‘మాయ అంటే ‘ఏమిటమ్మా?’ అని ప్రశ్నిస్తే అమ్మ, “నేను చేస్తున్నా ననుకోవటమే” అని అలవోకగా నిరుపమానమైన నిర్వచనాన్ని అందించింది.
‘యోగస్థః కురుకర్మాణి’ అని గీతాచార్యులు ప్రబోధం. ఒక పని చేసినపుడు అది ఫలించినా ఫలించక పోయినా ఒకటేననే సమదృష్టి కల్గి ఉండడమే యోగం. అంటే భిన్న దృష్టి లేకపోవడం. అన్నీ ఒకటిగానే కనపడడం. ఇదే ఆత్మసాక్షాత్కారం. సర్వమానవాళి చేరుకోవలసిన గమ్యం; సమస్తమైన ఆధ్యాత్మిక సాధనల పరమప్రయోజనం. ఆ స్థితిని చేరుకోవడానికి అమ్మ త్యాగాన్ని సోపానంగా సూచించింది. మెట్టు ఎక్కడం మొదలు పెడితే మేడపైకి చేరుకుంటాం. అలాగే వ్యక్తి తనకున్న దానిని నలుగురికి పంచుతూ త్యాగగుణాన్ని పెంపొందించుకుంటే అదే క్రమంగా వాటి మీద ఉన్న సంగాన్ని వదులుకోవడానికి దారి తీస్తుంది. ‘సంగాత్ సంజాయతే కామః’ – సంగం వల్లనే కోరిక కల్గుతుంది. ఎపుడైతే ‘నాది’, ‘నేను’ అనే సంగాన్ని వదిలి పెడితే అదే కోరికలు లేని స్థితిని చేరుకోవటానికి దారితీస్తుంది. “కోరికలు కోరేటి కోరికే ‘లేనట్టి’ స్థితిని చేరుకోవడానికి సంగత్యాగమే సాధనం”.
భార్యా బిడ్డలూ, ఐశ్వర్యం – సకల బంధాల్ని త్రెంచుకొని కాషాయవస్త్రాలు కట్టి కరతల భిక్ష, తరుతల వాసం చేయటం వైరాగ్యం అంటారు.
కానీ అమ్మ విధానమే వేరు. ‘సర్వత్రా అనురాగమే విరాగం” అనే విప్లవాత్మక ప్రవచనం చేసింది. అన్నిటినీ విసర్జించడం కాదు, ప్రేమించడమే వైరాగ్యం అని అంటుంది అమ్మ. ఇందుకు గృహస్థాశ్రమం ఒక రాచబాట. “సర్వాన్నీ అనుభవిస్తూ సర్వాన్నీ విడిచి పెట్టేదే వివాహం” అని వివరించింది. దీనిసారం ఏమంటే ‘The art of living is the art of leaving’..
‘నాలుగు వేళ్ళూ నోట్లోకి పోవటం’ అంటే అర్థం చిన్ని నా బొజ్జకు శ్రీరామరక్ష అనుకుంటూ ఎవరికి వారు తినటం కాదు; నలుగురికి ఆదరణగా తినిపించటం. అదే త్యాగం, అదే అమృతత్వం. ‘నకర్మణా ప్రజయ… అమృతత్వమానశుః’ అని నిగమాంతాలు శ్లాఘించేది ఈ తత్వాన్నే.
‘రాగం’ అంటే ‘ఇది కావాలి’ అని; ‘ద్వేషం’ అంటే ‘ఇది వద్దు’ అని. కోరికల్ని త్యజించినపుడు దాని రూపాంతరం ద్వేషాన్ని కూడా త్యజించాలి. అమ్మ ద్వేషాన్ని ద్వేషిస్తుంది. సమయానికి ఏది వస్తే దానిని అనుభవించటమే జీవనతారక మంత్రం.
పది మందితో కలిసి పని చేయడం, పది మంది కోసం కలిసి పని చేయడం ఇదే పరమపదసోపాన అధిరోహణం; సర్వసంగపరిత్యాగం.
(సశేషం) –