సంచిక తరువాత….
- బ్రహ్మతత్త్వమే బ్రాహ్మణత్వం
బాల్యంలో అమ్మ ఒకసారి తెనాలిలో రోడ్డు మీద ప్రాణాపాయస్థితిలో ఉన్న ఒక పాకీ పిల్ల వానిని రక్షించి అక్కున చేర్చుకున్నది. ఒక అస్పృశ్యుని ఆదరంగా గుండెలకు హత్తుకున్న దృశ్యం అక్కడి పెద్దలను నిశ్చేష్టులను చేస్తుంది. వారు లబలబలాడతారు, అమ్మను దుయ్యబడతారు. ఆ సందర్భంలో మరిడమ్మ తాతమ్మని అడ్డు పెట్టుకొని అమ్మ తన వాణిని వినిపించింది “బ్రహ్మతత్త్వమే బ్రాహ్మణత్వం” అని.
‘విద్యావినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని ||
శునిచైవ స్వపాకేచ పండితాః సమదర్శినః ॥’ అని జ్ఞాని యొక్క సర్వసమాన దృష్టిని వివరించారు శ్రీ కృష్ణపరమాత్మ. ‘బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే’ – అని అన్నమాచార్యులు చాటి చెప్పింది ఈ తత్త్వాన్నే.
కృష్ణయజుర్వేదీయ ఆశీర్వచన మంత్రంలో ‘వేదవిది బ్రాహ్మణః’ అని ఒకటికి రెండు సార్లు ఘంటాపథంగా నొక్కి వక్కాణించబడింది వేదములను తెలుసుకున్న వాడే (వాసుదేవః సర్వమితి) బ్రాహ్మణుడు – అని.
అమ్మ విచక్షణలేని వీక్షణే బ్రాహ్మణత్వం, అక్షరాలా అదే బ్రహ్మతత్త్వం.
‘చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః’ – అనే గీతాచార్యుని ప్రవచనం ప్రకారం గుణ, కర్మ విభాగమే చాతుర్వణ్యవ్యవస్థకు ఆధారమనీ, జన్మ వలన కాదనీ తెలుస్తోంది. గుణమంటే స్వభావం. అంటే మన ధర్మం. కర్మ అంటే భౌతికమైన క్రియ. ఉదా:- విత్తనాన్ని తీసుకుందాం. భూమిని చీల్చుకు రావడం దాని స్వభావం. అలా వచ్చేటప్పుడు జరిగేది కర్మ. ఏ పనీ చేయకుండా ఎవరూ ఉండలేనట్లే అందరూ అన్ని పనులూ చేయలేరు. మనోధర్మాన్ని బట్టి, కర్మకలాపాన్ని బట్టి వర్ణవిభాగం ఏర్పడింది. కాని వర్ణం అంటే అనే అర్థం తీసికొని ఈ నాటి సమాజంలో కులంపేరుతో ఎన్నో గొడవలు సృష్టిస్తున్నారు. మానవులంతా మను సంతతి వారే అయినపుడు ఈ కులాలు, మతాలు ఎక్కడివి? ‘ఆకృతి వ్యంగ్యాజాతిః’ అని అంటారు. పశువు, పక్షి, పాము. మొదలైనవి జాతులు. వాటికి ఉన్న ప్రత్యేక చిహ్నాలను బట్టి ఆయా జాతులుగా పరిగణించబడతాయి. బ్రాహ్మణత్వాదులు జాతులైనట్లయితే పుట్టుకతోనే వీడు, బ్రాహ్మణుడు వీడు వైశ్యుడు అని తెలిపే గుర్తులు ఉండవద్దూ.. కనుక కులమత వర్గ భేదం జన్మతః వచ్చేది కాదు. అందరూ విశ్వవిరాట్ పురుషునిలో భాగాలే కదా!
‘బ్రాహ్మణోZస్య ముఖమాసేత్, బాహూరాజన్యః కృతః, ఊరూతదస్య యదేవైశ్యః పద్భ్యాగ్ం శూదో జాయత్ అంటూ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు ఆ విరాట్ పురుషుని ఒక్కొక్క స్థానాన్ని పొందిన వారుగా చెప్పినపుడు అందరిదీ ఒకే కులం కదా! ఈ పరమసత్యాన్నే అమ్మ, “మీరంతా నా బిడ్డలే కాదు, నా అవయవాలు” అని స్పష్టం చేసింది. ఒకే దేహంలోని అవయవాలకు హెచ్చుతగ్గులను ఆపాదించటం ఏమిటి? జ్ఞానంతో వ్యవహరిస్తే బ్రాహ్మణుడు, రక్షణ విషయంలో క్షత్రియుడు, వ్యాపార నిర్వహణ – ధనధాన్యాది వస్తు సముపార్జన చేయునపుడు వైశ్యుడు, పారిశ్రామిక స్థైర్యం కలిగినపుడు శూద్రుడు…. అని వివరిస్తూంటే ఇంకా తారతమ్యా లెక్కడివి?
ఆనువంశిక గుణగణాన్ని ఎంచేటప్పుడు పిల్లల విషయంలో… కళ్ళు, ముక్కు వాళ్ళ అమ్మ, కాళ్ళు, చేతులూ వాళ్ళ నాన్న, పొట్టి పొడుగు వాళ్ళ నాయనమ్మ, పెంకితనం వాళ్ళ మేనత్త, తెలివి తాతది అని అంటుంటారు.
ఒకే శరీరంలో ముఖానికి ఒక కులం, బాహువులకు ఒక కులం అంటూ ఉండదు కదా! కులవ్యవస్థ పుట్టుకతో వచ్చేది కాదు. వారి వారి ప్రవృత్తులు జీవన సాధానాల్ని బట్టి చేసిన విభజన ఇది. అంతేకాదు, కొన్ని సందర్భాల్లో బ్రాహ్మణుడు, కొన్ని సందర్భాల్లో క్షత్రియుడు, అలాగే వైశ్యుడు, శూద్రుడు అయి ప్రతివ్యక్తి పంచలోహ మిశ్రితమైన విగ్రహంలాగా చాతుర్వర్ణ్య మిశ్రితమైన సంపూర్ణమూర్తే. అందుకనే మానవులలో న్యూనతాధిక్యాలు లేవు. కానీ అజ్ఞాన వశాన భేదాలను సృష్టించు కుంటున్నారు. వర్ణవ్యవస్థలో విభాగాలుండవచ్చు కాని విభేదాలుండ కూడదు. ‘శుక్లశ్రోణి తాలకేది కులమో అదే నా కులం’ అని అమ్మ ప్రకటించింది. పిండోత్పత్తికి మూలం శుక్లశోణిత సంయోగం. కనుక చరాచర సకలజీవరాశికి నేనే తల్లిని అని అమ్మ వాక్యం వివరిస్తోంది. అందరిని అన్నపూర్ణాలయాన్ని స్థాపించి అంతా కలిసి ఉండటం, తినటం, మసలటం ద్వారా జిల్లెళ్ళమూడిలో అక్షరాలా వర్గరహిత సమాజాన్ని స్థాపించింది. ఏకోదరభావాన్ని సుప్రతిష్ఠితం చేసింది: రాజ్యాంగ అధికరణాలు శాసన అధికారాలు సాధించ విఫలమైన లౌకిక సర్వసమాన ఆదర్శ సమాజ స్థాపన అమ్మకి సాధ్యమైంది.
‘జన్మనా జాయతే శూద్రః కర్మణాద్విజ ఉచ్యతే |
వేదపాఠేన విప్రత్వం బ్రహ్మజ్ఞానేన బ్రాహ్మణః ॥
బ్రహ్మజ్ఞానం కలిగి ఉండటమే బ్రాహ్మణత్వం. బ్రాహ్మణత్వాన్ని నిర్వచించేది ‘సర్వం బ్రహ్మమయం అనే జ్ఞానం’; కేవలం తిర్యకుండ్రాలు, యజ్ఞోపవీత ధారణ, పుట్టుక కాదు. కనుకనే మనీషాపంచకంలో ‘చండాలోzస్తు సతుద్విజోZస్తు గురుః ఇత్యేషా మనీషామమ’ – చండాలుడైనా, ద్విజుడైనా ఎవరికి బ్రహ్మజ్ఞానం ఉంటుందో వారే నా గురువని శ్రీ శంకరాచార్యులు ఉద్భోధించారు.
ధర్మవ్యాధుని స్థితిని ఉదాహరణగా తీసుకుందాం. ఆయన వృత్తి ఏదైనా బ్రహ్మజ్ఞాన సంపన్నుడు కనుకనే కౌశికునకు ధర్మప్రబోధం చేయగలిగాడు. జ్ఞానానికి వయస్సుకానీ కులం కానీ అవరోధాలు కావు. బురదలో పుట్టినదైనా పద్మం లక్ష్మీనివాసమూ, పవిత్రమూ ఐనది.
‘బ్రహ్మతత్వమే బ్రాహ్మణత్వమ’ని బాల్యంలోనే నిర్వచించి వర్గరహిత సమాజస్థాపనకి ఏనాడో శంకుస్థాపన చేసింది అమ్మ.
“రక్తమంతా ఈశ్వరతత్వమే నని సర్వసమాన దృక్పధాన్ని (all inclusive attitude) ఆచరణాత్మకంగా చాటి చెప్పిన అమ్మ తత్వమే బ్రహ్మతత్త్వం: అదే వాస్తవానికి బ్రాహ్మణత్వం.
(సశేషం)