(గత సంచిక తరువాత…)
- భార్యకు భర్త దేవుడు – భర్తకు భార్య దేవత
అందరినీ బిడ్డలుగా చూసే మాతృత్వ భావనతో బిడ్డల తప్పు గ్రహించినా శిక్షించకుండా, ప్రేమతో వారికున్న మనోవైకల్యాన్ని సరిచేసి అద్భుతమైన పరిణామం తీసుకువచ్చింది అమ్మ; సంస్కరించింది. అమ్మ అందరికీ అమ్మగా ప్రకటితమైనపుడేకాదు, ముక్కుపచ్చలారని వయసులో కూడా ఎంతో మందిని సంస్కరించిన విషయం అమ్మ చరిత్ర మనకి చెపుతోంది.
బాల్యంలో ఒకసారి అమ్మ, మరిడమ్మ తాతమ్మతో పెనుగుదలపాడు వెళ్తూ మార్గమధ్యంలో శ్రీరంగపురంలో తెలిసినవారి ఇంట్లో ఉంటుంది. ఆ ఇంటి యజమానిని సంస్కరించడం కోసమే అమ్మ వారి ఇంట్లో బస చేసింది. ఆ సమయంలో అమ్మ ఆరేండ్ల బాలికలాగా కాకుండా అరవైఏళ్ళ ముత్తైదువలా వ్యవహరించి ఆ సంసారాన్ని చక్కబెట్టింది. ఆ సందర్భంలోనే “భార్యకు భర్త దేవుడయితే, భర్తకు భార్య దేవత” అని ప్రబోధించింది.
భారతీయ ధార్మిక జీవనానికి పునాది వివాహవ్యవస్థ. వైవాహిక జీవితమనేది ఒక దీక్ష, ఒక యజ్ఞం. పరమపవిత్రమైన గృహస్థాశ్రమంలో ప్రవేశించడానికి చేసే వైదిక సంస్కారమే వివాహం. అది పరమార్ధసాధనకు సోపానం. అందుకే మన సంప్రదాయంలో వివాహం చేసికొని భర్త ఇంట అడుగుపెట్టిన స్త్రీకి సహధర్మచారిణి అని పేరు వచ్చింది. గృహస్థాశ్రమంలో స్త్రీ ఇల్లాలుగా, అర్థాంగిగా, సహధర్మచారిణిగా, సఖిగా, భార్యగా, కర్తవ్యాన్ని నిర్వహిస్తూ తన వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటుంది. అందుకే సంసార జీవిత నౌకకు చుక్కాని గృహిణి అంటారు. గృహస్థాశ్రమ ధర్మరక్షణకు కేంద్ర బిందువు గృహిణి. ‘అర్ధవా ఏష ఆత్మనః యత్పత్నీ తన్మిధునం’ అని పురుషార్థసాధనలో భార్య భర్తలో సగం స్థానాన్ని పొందుతుందని ఈ మంత్రం మనకు బోధిస్తున్నది.
కన్యాదాన సమయంలో కూడ ‘కన్యాం కనక సంపన్నాం’ అంటూ, వరుడు నారాయణ స్వరూపుడయితే వధువును లక్ష్మీస్వరూపంగా భావించి ఈ కన్యాదానం ఉత్తమలోకప్రాప్తికి చేసే మహత్కార్యంగా భావించారు పెద్దలు. భారతీయ సంస్కృతి, సంప్రదాయం స్త్రీకి ఉన్నతస్థానం ఇచ్చి గౌరవిస్తూ వచ్చింది.
స్త్రీ ఔన్నత్యాన్ని దృష్టిలో పెట్టుకుని పురాణ ఇతిహాస గ్రంథాలన్నీ స్త్రీని పవిత్రమూర్తిగా, పతివ్రతగా, సహధర్మచారిణిగా చిత్రిస్తూ నిత్యజీవనంలో ఆమె ఎంత ప్రధానభూమిక వహిస్తుందో తెలియజేశాయి.
శ్రీమద్రామాయణమే తీసుకుంటే… శ్రీరాముడు వనవాస సమయంలో అత్రిమహర్షి ఆశ్రమానికి వచ్చినపుడు ఆ మహర్షి తన ధర్మపత్ని అయిన అనసూయాదేవి గొప్పతనాన్ని గురించి వివరిస్తూ….
‘తామిమాం సర్వభూతానాం నమస్కుర్యాం యశస్వినీం
అభిగచ్ఛతు వైదేహీ వృద్ధామక్రోధనం సదా
అనసూయేతియా లోకే కర్మభిః ఖ్యాతి మాగతా’
– అంటూ తానే స్వయంగా శ్రీరామునికి చెప్పడం జరిగింది.
సీతాదేవిని గురించి శ్రీరామచంద్రుడు కూడ అనేక సందర్భాలలో ‘అనన్యాహి మయాసీతా భాస్కరేణ ప్రభాయధా’ (సూర్యుని కంటె సూర్యకాంతి వేరు కానట్లు సీత తన కంటే వేరు కాదు) అనీ,
‘విశుద్ధా త్రిషులోకేషు మైధిలీ జనకాత్మజా!
న విహాతుం మయా శక్త్యా కీర్తిరాత్మవ్రతా యధా ॥’
(ముల్లోకాల్లోనూ సీతాసాధ్వి పరమ పవిత్రురాలు) అనీ చెప్పిన మాటల వలన సీతపట్ల గల రాముని హృదయం వ్యక్తం అవుతోంది. అంతే కాదు,
‘ఇది నాకెపుడు తెలియును.
మదవతి నా ప్రాణచయము, మద్దేహము, నా
యెద, మేధ, బుద్ధి, సర్వము… ‘ – అంటూ (తన దేహం, తన హృదయం, తన మేధ, తన బుద్ధి… అంతా సీతేననీ, ఆమె తన ప్రాణమనీ, ఆమే తన జీవితానికి వెలుగని చెప్పి) భార్యను ఎంతో మహోన్నతంగా సంభావించిన మహోదాత్తమూర్తిగా మనకు దర్శనమిచ్చాడు శ్రీరామచంద్రుడు. అలాగే పార్వతీదేవి తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు – ‘అద్యప్రభృత్యవనతాంగి తవాస్మిదాసః’ – అంటూ (నీ తపస్సుకు నేను వశుడైనాను. ఇక నుండి నీ దాసుడను) స్వయంసమర్పణ చేసుకున్నట్లుగా కుమారసంభవ కావ్యంలో కాళిదాస మహాకవి ప్రస్తావించారు. అందువల్లనే అమ్మవారిని ‘స్వాధీన వల్లభా’ అనే నామంతో స్తోత్రం చేస్తూ ఉంటారు.
నన్నయ భారతారంభంలో ‘శ్రీ వాణీగిరిజాశ్చిరాయుదధతో వక్షోముఖాంగేషుయే…’ అన్న ప్రార్ధనాశ్లోకంలో (శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని తన హృదయ కమలం లోనూ, బ్రహ్మదేవుడు సరస్వతిని ముఖకమలంలోనూ, పరమేశ్వరుడు పార్వతిని అర్థశరీరంలోనూ ధరించి లోకరక్షణ కావిస్తున్నారు – అని చెప్పడంలో త్రిమూర్తులు భార్యకిచ్చిన స్థానమేమిటో తెలుస్తున్నది.
మరి మన సంప్రదాయంలో భార్యకు ఇంత ఉన్నతస్థానము ఇచ్చినట్లు కన్పిస్తూ ఉంటే పురుషాధిక్య సమాజంగా రూపు దిద్దుకున్న ఈ నాటి సాంఘికవ్యవస్థలో భార్య స్థానానికున్న ప్రాధాన్యతని గుర్తించకుండా తమ ఆధిక్యతను ప్రదర్శిస్తున్నారు కొందరు పురుషులు. భార్య అంటే భరింపబడేది – అని, ఆమెను ఒక మనసులేని మనిషిగా చూసే సామాజిక పరిస్థితి మధ్యకాలంలో నెలకొన్నది. ఒక వంక ‘క్షమయా ధరిత్రీ’ అని కీర్తిస్తూనే మరొకవంక ‘నస్త్రీ స్వా మర్హతి’ అని పురుషాధిక్యతను చాటుతూ ఉన్నారు.
ఆదర్శవంతమైన ధార్మిక జీవనానికి ఆలంబనమైన ఈ వివాహవ్యవస్థమూలాలలో ఒక ప్రకంపనం కన్పిస్తోంది. అందుకే వివాహవ్యవస్థలో కనుమరుగై పోతున్న విలువలను పరిరక్షించడం కోసమే అమ్మ వివాహం చేసుకున్నది. అమ్మ జీవితాన్ని పరిశీలిస్తే ఒక వంక పతివ్రతా ధర్మం కన్న మించినదేదీ లేదని చెప్తూ మహాపతివ్రతకు ప్రత్యక్ష నిదర్శనంగా కన్పిస్తుంది. మరొకవంక ‘భార్యకు భర్త దేవుడయితే, భర్తకు భార్య దేవత’ అని సమన్వయాత్మకంగా సమానత్వాన్ని, సమున్నతత్వాన్నీ, సంపూర్ణత్వాన్ని దర్శింపజేస్తోంది. అంటే అమ్మ దృష్టిలో ‘వివాహం అంటే సమర్పణ’ అని. ఒక సందర్భంలో “తలవంచి తాళికట్టించుకునేది భార్య; నడుం వంచి తాళికట్టేవాడు భర్త’ – అని ఇరువురికి సమానమైన బాధ్యత ఉన్నదని సూచించింది. సంసార రథానికి స్త్రీ పురుషులిద్దరూ రెండు చక్రాలు. అవి సమానంగా ఉన్నప్పుడే ఆ రధం ముందుకు సాగి గమ్యం చేరుకుంటుంది.
వివాహం సందర్భంగా అమ్మ అనేక నిర్వచనాలను ప్రసాదించింది. ‘కళంకరహితమైన మనస్సును కళంకరహితంగా అర్పించడమే కల్యాణం’ ‘ఒక పెన్నిధి అండను చేరడమే పెండ్లి’ అని నిర్వచించింది. పరస్పర అవగాహనతో ఇద్దరూ ఒకరికొకరు తోడు నీడగా ఉన్నప్పుడే అది అనుకూల దాంపత్యం అవుతుందనీ, భర్త భావం తెలుసుకొని స్త్రీ, బాధ్యత తెలుసుకుని పురుషుడూ ప్రవర్తిస్తే వివాహవ్యవస్థ సర్వాంగేణంగా శోభిల్లుతుందనీ ‘భార్యకు భర్త దేవుడయితే, భర్తకు భార్య దేవత’ అన్న వాక్యం ద్వారా అమ్మ ప్రబోధిస్తోంది.
(సశేషం)