(గత సంచిక తరువాత…)
- శిక్షణ కూడ రక్షణే
దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం మహాత్ములు అవతరించి ధర్మ సంస్థాపన కావించడం యుగయుగాల్లో జరిగినట్లు తెలుస్తోంది. వారి ఉద్దేశం ధర్మసంస్థాపన అయితే, మార్గం సాధురక్షణ. ఆ రక్షణలో భాగంగా ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ లోకకంటకులుగా ఉన్న దుర్మార్గుల్ని సంహరించవలసిన అవసరం రావచ్చు. నాటిన పైరు పైకి ఎదిగి, మంచి పంట పండాలంటే కలుపుమొక్కలను ఏరి పారెయ్యాలి. దుష్టశిక్షణ చేయడమే వారి ఉద్దేశం కాదు. సమాజస్థితిని కాపాడడమే మహాత్ముల ఉనికికి పరమార్థం.
‘దుర్జన స్సజ్జనో భూయాత్
సజ్జన శ్శాంతి మాప్నుయాత్
మా కశ్చిత్ దుఃఖభాక్ భవేత్’
దుర్జనులు సజ్జనులుగా మారాలని, సజ్జనులు సుఖశాంతులతో ఉండాలని పెద్దల ఆకాంక్ష. అలా జరగాలంటే దుష్టశిక్షణ చేయాలి. అమ్మ దృష్టిలో దుష్టశిక్షణ అంటే దుష్టత్వ శిక్షణ. ‘శిక్షణ కూడ రక్షణే’ అని అమ్మ చెప్పింది. ఈ శిక్షణ మనకు మూడు విధాలుగా కన్పిస్తుంది.
శిక్షణ ద్వారా రక్షణ :- అంటే ఒక్కరి శిక్షణ ద్వారా మరొకరికి రక్షణ. దుష్టశిక్షణ ద్వారా సాధు రక్షణ జరగటం ఒకటి.
శిక్షణ ద్వారా శిక్షణ :- అంటే దుష్టశిక్షణ వలన ఆ శిక్షే వారికి శిక్షణ అయి వారిలో పరివర్తన వచ్చి వారు సజ్జనులుగా మారడం రెండవది. ఇక్కడ వారి శిక్షణే వారికి రక్షణ అయింది.
రక్షణ ద్వారా శిక్షణ – లలితా సహస్ర నామాలలో ‘శిష్టేష్టా’ అనే నామం ఉన్నది. అమ్మ శిష్టుల పట్ల ఇష్టంతో ఉండేది. కాబట్టి సజ్జనులు రక్షింపబడటం చూసి తాము కూడ అలా ఉంటే భగవదనుగ్రహం పొందవచ్చు గదా అని కొందరు దుర్జనులు సజ్జనులుగా మారడం. ఇక్కడ సాధురక్షణ ద్వారా దుర్జనులు శిక్షణ పొందటం.
ఏది ఏమైనా ఏ శిక్షణ అయినా లోకరక్షణ కోసమే. మరి శిక్షణ అనేది ఎలా ఉంటుంది అంటే చేసే పనులను బట్టి శిక్ష ఉంటుంది. రక్షణ – ఆవశ్యకతను బట్టి శిక్షణ ఉంటుంది.
ఉదాః- ఒక తల్లికి నలుగురు బిడ్డలుంటారు. వారిలో ఒక పిల్లవాడి ప్రవర్తన సరిగా ఉండదు. వాడి వలన మిగతా పిల్లలకు కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి వస్తుంది. అపుడు తల్లి వాడికి ఎన్నోవిధాల చెప్పి చూస్తుంది. కాని వాడిలో ఏమాత్రం పరివర్తన రాకపోతే మిగతా పిల్లల క్షేమం కోసం వాడిని దూరంగా ఉంచుతుంది. అలాగే ఒక ఉద్యోగి ఉన్నాడనుకుందాం. అతడు ఏ వ్యసనాలకో బానిస అయి ఉద్యోగధర్మాన్ని సరిగా నిర్వర్తించడు. అధికారులు ఎన్నో విధాలుగా చెప్పిచూస్తారు. మారతాడేమోనని ఎంతో ఎదురు చూస్తారు. కాని అతడు మారకపోగా మిగిలిన ఉద్యోగులందరికీ భద్రత కరువవుతుంది. అపుడు అతడ్ని ఉద్యోగం నుంచి తొలగించడం ఒక్కటే మార్గం.
ధర్మసంస్థాపనకోసం అవతరించిన రామ, కృష్ణాది అవతారాలలో దుష్టశిక్షణ జరిగింది. కాని దుష్టులు తలఎత్తగానే సంహారం జరుగలేదు. వారిని సంస్కరించడానికి ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో అవకాశాలు ఇచ్చి వారిలో మార్పును ఆకాంక్షించడం జరిగింది. వారిలో ఏ మాత్రం మార్పు రాకపోగా సాధువులను బాధపెట్టడం, మంచి పనులను చెడగొట్టడమే లక్ష్యంగా ప్రవర్తిస్తూ ఉంటే ఇక వారిని శిక్షించక తప్పదు. లేకపోతే లోకం అల్లకల్లోలం అవుతుంది అని దైవం అనుకున్నప్పుడు శరీరంలో దుష్టాంగాన్ని ఖండించి మిగిలిన శరీరభాగాల్ని రక్షించినట్లుగా సంహరించడం జరిగింది. విశ్వకళ్యాణ కారక విశ్వామిత్ర సంకల్పిత మహాయాగాన్ని విధ్వంసం చేయ విజృంభించిన మారీచ, సుబాహువులనే రాక్షసులిరువురి పైనా శ్రీరాముడు భీకర అస్త్రాల్ని ప్రయోగించాడు. సుబాహువు మరణించగా, మారీచుడు మహర్షి అయినాడు. ఆశ్చర్యం. ‘రామో విగ్రహవాన్ ధర్మః, సాధుః సత్య పరాక్రమః’ అని శ్రీరాముని స్తుతించినది మారీచుడే. సంస్కరింపబడి మరీచి పరివర్తన చెందాడు. శ్రీకృష్ణుడు నూరు తప్పుల వరకు శిశుపాలుని వధింప పూనుకోలేదు. సంస్కరణకు అవకాశం లేని చోట మాత్రమే సంహారం జరిగింది. ఆ శిక్షణ సాధుజన రక్షణ కోసమే.
ఒక దొంగను శిక్షిస్తున్నారు. వానిలో పరివర్తన (ప్రవర్తనా మార్పు) తీసుకువచ్చే ఉద్దేశమే కదా అని! పిల్లవాడు నీళ్ళదగ్గరకో, నిప్పుదగ్గరకో వెళ్తుంటే తల్లి దండించి నివారిస్తుంది. అలా శిక్షించడంలో ఉద్దేశం రక్షణే.
‘విద్యనేర్పువేళ వినకున్న బాగుగా
గురువు తిట్టవచ్చు – కొట్టవచ్చు
తల్లి బుగ్గ గిల్లి తాగించగా ఉగ్గు…. ‘ అని
అన్నట్లుగా గురువు తిట్టినా, అమ్మ కొట్టినా అదంతా రక్షణలో భాగమే. ఒక విధంగా చెప్పాలంటే భగవంతుడు మనకు శిక్షణ ఇవ్వడం కోసమే ఎన్నో అనుభవాలను కల్గిస్తున్నాడు. జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి అనుభవం ఒక పాఠమే. ఆ అనుభవాలే జీవితంలో మనను ఉన్నతంగా తీర్చిదిద్దుతాయి. అందుకే అమ్మ ‘శిక్షణ కూడ రక్షణే’ అని చెప్పింది.
తప్పు అని తెలిసే మనిషి ఎందుకు తప్పులు చేస్తాడు? అని అడిగితే “తప్పించుకో లేకనే” అనేది అమ్మ సమాధానం. పుట్టుకతో ఎవరూ నేరస్థులు కారు. కొన్ని సందర్భాలలో పరిస్థితులే వాళ్ళను నేరస్థులను చేస్తాయి. ప్రేమకు దూరమై కొందరు, అవసరాలు తీరకకొందరు, ఆశించినది అందక అసంతృప్తితో కొందరు నేరస్థులుగా మారుతూ ఉంటారు. అందుకే నేరస్థులను సమాజాన్నుండి బహిష్కరించకుండా మానవతా దృక్పధంతో వారిలో నేరప్రవృత్తిని మార్చడానికి తోడ్పడాలన్నది అమ్మ ఆలోచన. అందరినీ బిడ్డలుగా చూసే మాతృత్వ భావనతో బిడ్డల తప్పు గ్రహించినా ప్రేమతో వారికున్న మనో వైకల్యాన్ని సరి చేసి అద్భుతపరిణామం తీసుకు వచ్చింది అమ్మ.
(సశేషం)