1. Home
  2. Articles
  3. Viswajanani
  4. జ్ఞానజ్ఞేయ స్వరూపిణి

జ్ఞానజ్ఞేయ స్వరూపిణి

Mallapragada Srivalli
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 20
Month : January
Issue Number : 6
Year : 2020

“జ్ఞానం చేతనే తెలియదగిన (జేయమైన) స్వరూపం జ్ఞానజ్ఞేయ స్వరూపం. శ్రీమాత జ్ఞానజ్ఞేయ స్వరూపిణి.

జ్ఞానమే శ్రీమాత. జ్ఞానం చేత తెలుసుకోదగిన తత్త్వమూ ఆమెయే జ్ఞానమూ, జ్ఞేయమూ అయిన శ్రీమాత ‘జ్ఞానజ్ఞేయ స్వరూపిణి’ – భారతీ వ్యాఖ్య.

విశ్వమూ, విశ్వేశ్వరుడూ వేరు కాదు. విశ్వమే విశ్వేశ్వరుడు అనే ఎరుక కలగడమే జ్ఞానం. కంటికి కనబడుతున్న సకల చరాచర సృష్టిలో పరమాత్మ నిండి ఉన్నాడనే దృష్టి కలిగినవారే జ్ఞానులు. ప్రహ్లాదుడు భక్తాగ్రేసరుడే కాదు. పరమజ్ఞాని. అందుకే “ఇందుగల డందు లేడని సందేహము వలదు. చక్రి సర్వోపగతుండు. ఎందెందు వెదకి చూచిన అందందే కలడు” అంటాడు. దైవం అంతటా వ్యాపించి ఉన్నా, అందరూ గుర్తించలేరు. ఆ దృష్టి ఉన్న వారికి మాత్రమే గోచరిస్తాడు. అందుకే పోతన్న గారు “వెదకి చూచిన” అని ప్రయోగించారు. “ఈ స్తంభంలో ఉన్నాడా నీ విష్ణువు’ అని గద్దించిన హిరణ్యకశిపునితో ‘ఉన్నాడు’ అని నమ్మకంగా చెప్పగలిగిన జ్ఞాని ప్రహ్లాదుడు. సృష్టిలోని అణువణువుతో నిండి ఉన్న శ్రీమాత జ్ఞేయస్వరూపం. జగత్తే తానుగా భాసించే ఆ తల్లి జ్ఞానస్వరూపిణి. అందుకే శ్రీలలిత జ్ఞానజ్ఞేయ స్వరూపిణి.

“అమ్మ” – జ్ఞానజ్ఞేయ స్వరూపిణి. జ్ఞాన స్వరూపిణి అయిన “అమ్మ” జ్ఞానాన్ని గురించి ఎన్నో విషయాలను విడమరచి చెప్పిన సందర్భాలు ఎన్నెన్నో. “అంతా జీవమయం. నా దృష్టిలో జడమే లేదు” అని చెప్పిన “అమ్మ” – జ్ఞానరూపిణి. “నేను చేస్తున్నాననుకునేది మానవత్వం. వాడు ఇస్తున్నా డనేది జ్ఞానం” – అని, జ్ఞానమంటే మనం చేస్తున్న ప్రతిపనీ భగవంతుడు చేయిస్తున్నాడనే ఎరుక కలిగి ఉండడం అని స్పష్టంగా చెప్పింది. అంతేకాదు. “జ్ఞానమే భగవంతుడు” – అని జ్ఞానస్వరూపమే దైవంగా ప్రకటించింది. “సర్వాన్నీ తెలుసుకున్న తెలివే జ్ఞానం” అనే వాక్యాన్ని పరిశీలిస్తే – సర్వమూ అంటే సృష్టిలోని సమస్తమూ, అంటే కనిపిస్తున్న ఈ చరాచర జగత్తునూ దైవంగా తెలుసుకొని ఎవరు ప్రవర్తిస్తారో వారే జ్ఞానం కలిగిన వారు. భగవంతుడు. వేరు – సృష్టివేరు అని తలచేవారు జ్ఞానహీనులు అని తెలియచేసే వాక్యం – రెండుగా కనపడటం అజ్ఞానం”. ఇంకా వివరిస్తూ “ఏదో ఒకటి తెలుసుకున్నది తెలివి. అన్నీ తెలుసుకున్నది జ్ఞానం” అని చెప్పింది “అమ్మ”.. అంటే ఏదో ఒక విషయం తెలిసిన వారిని పండితుడు లేదా తెలివి గలవాడు అని చెప్పవచ్చునేమో కానీ జ్ఞాని అని చెప్పడానికి వీలులేదు. “అన్నీ తెలుసుకున్న తెలివే, అన్నీ అయి ఉన్నది” అనీ “ఉన్నది ఉన్నట్లుగా అర్థం. చేసుకోవటమేగా జ్ఞానం” – అనీ చెప్పింది “అమ్మ”. అంటే యథార్థ స్వరూపాన్ని గుర్తించడమే జ్ఞానం.

“క్షరం కాదని తెలుసుకోవటమే జ్ఞానం” అన్నది జ్ఞాన స్వరూపిణి “అమ్మ”. క్షరం అంటే నాశనం. ఈ సృష్టి నాశనం లేనిది అని తెలుసుకోవటమే జ్ఞానం. సృష్టికి మార్పే కాని నాశనం లేదని ఎన్నో సందర్భాలలో వ్యక్తపరచింది. “అమ్మ”. సృష్టి అంటే భగవంతుడే (జగత్తే తల్లి). భగవంతుడికి నాశనమేముంటుంది. ఆయన అచ్యుతుడు. “చిన్నకాయ భక్తి, పెరిగినప్పుడు యోగం, పండినప్పుడు జ్ఞానం” – అని భక్తితో మొదలై, యోగంగా రూపుదిద్దుకుని, జ్ఞానంగా పరిణమించడం అనేది క్రమ పరిణామంలో జరుగుతూ ఉంటుందని తెలియ చెప్పింది. “అమ్మ”. జ్ఞానరూపిణియైన “అమ్మ” – జ్ఞాన స్వరూపాన్ని వివరించడంలో ఆశ్చర్యమేముంది ?

జ్ఞానరూపిణి ” అయిన “అమ్మ”  – ఆ జ్ఞానం ద్వారా తెలుసుకోదగిన తత్త్వంగా భాసిస్తూ, జేయరూపిణిగా కూడా ప్రకాశిస్తోంది.

“నేను భగవంతుణ్ణి అయి ఉండి, నేను భగవంతుణ్ణి  తెలుసుకోకపోవటమేమిటి? అన్నదే అహం చేత అహాన్ని తెలుసుకోవటం. సర్వత్రా ‘తనను’ చూడటం, సర్వమూ ‘తనలో చూడటం’ అని చెప్పింది “అమ్మ”- తాను దైవం. అని చెప్పకనే చెప్పినట్లు అయింది. “అందరిలో ఉన్నది నేననేదేగా. ఆ నేనే బ్రహ్మ” అని చెప్పి, మనం “అమ్మ” పరబ్రహ్మగా ఎక్కడ గుర్తిస్తామో అని మళ్ళీ మనకు మాయపొరలు కప్పుతూ, “నేను బ్రహ్మ అని కాదు. ప్రతివారూ సామాన్యంగా ‘నేనే’ అంటారే, అది అహం. ఆ అహం లేకపోతే ‘అహం బ్రహ్మాస్మి’ కాలేదు…” అని వెంటనే మనమందరం సర్వసామాన్యంగా వాడుతూ ఉండే ‘అహం బ్రహ్మాస్మి’ అనే వాక్యాన్ని ఉదాహరించి, తన స్వరూప నిరూపణకు ముసుగు వేసేసింది. మరొకసారి “పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం కాదు బ్రహ్మ మీద పిచ్చుకాస్త్రం” అంటూ తన మీద పిచ్చుక వేసిన గడ్డిపరకను గురించి చమత్కరించి అసలు రహస్యాన్ని బ్రద్దలు కొట్టింది.
“సాక్షాత్కారం అంటే కనబడేదే” అని మనకు కనిపిస్తున్నదంతా భగవత్సాక్షాత్కారంగా పేర్కొన్నది. విశ్వరూప సందర్శనం అనే పేరుతో శ్రీకృష్ణభగవానుడు చూపించింది కూడా ఈ సృష్టిలోని చరాచర జగత్తునేగా అని తన వాదాన్ని బలపరచుకుని, మనం చూడవలసినది ఈ సృష్టిలో దాగి ఉన్న పరమాత్మ స్వరూపాన్నే అనీ, అప్పుడే జ్ఞానం మనకు అలవడినట్లు అని తేల్చి చెప్పిన “అమ్మ” జ్ఞేయస్వరూపిణి. “అందర్నీ తానుగా చూసినా, తనలో అందర్నీ చూచినా ఒకటే” ఎంత చమత్కారమైన వాక్యమండీ ఇది. ఈ వాక్యంలో ‘తాను’ పదం గొప్ప శక్తి కలది. ఎందుకంటే ఈ పదం ఒక కోణంలో “అమ్మ”ను మరొక కోణంలో ఎవరికి వారికి స్ఫురింప చేస్తుంది. అందర్నీ తానుగా (అమ్మగా) చూసినా, తనలో (అమ్మలో) అందర్నీ చూసినా ఒకటే. అంతేనా – “నేను మీరు కాకపోతేగా” అని తనకూ మనకూ అభేదత్వాన్ని ప్రకటించింది. “సర్వసంకల్పాలూ తానైతే, ఇతరులు మనస్సులలోనివి తెలుస్తాయి” అన్న ఆ జ్ఞేయస్వరూపిణికి మన ఆలోచనలన్నీ కరతలామలకములే. ఎందుకంటే మనకు వచ్చే సంకల్పాలకు పుట్టినిల్లు “ఆమె” మహా సంకల్పమేకదా!

‘పరమాత్మ అంటే?’ అనే ప్రశ్నకు “తాను కాకుండా ఇతరం లేనివాడు. అంతా తానైన వాడు” అని చెప్పిన “అమ్మ” ఒకరితో “నేను నిన్ను తాకే ఉన్నానుగా” అని చెప్పి ఆమెలో ఉన్న ‘నేను’ తనలో ఉన్న ‘నేను’ ఒకటే అనే భావం స్ఫురింప చేసింది. “ప్రపంచమూ పరమార్థమూ వేరు కాదు,” “దేశ సేవ, దేవుని సేవ రెండూ వేరు కాదు” అని నిర్ద్వంద్వంగా, నిర్దుష్టంగా చెప్పగలిగిన “జేయస్వరూపిణి అమ్మ”. “నీలో ఉన్న నేనుకూ, నాలో ఉన్న నేనుకూ తేడా ఏమిటి?’ అని ప్రశ్నించిన ఒకరితో “గుర్తింపే తేడా” అని చెప్పింది. అంటే మనందరిలో ఉన్న ‘నేను’కూ, “అమ్మ”లో ఉన్న ‘నేనుకూ’ తేడా “అమ్మ”కు లేదు. ఆ తేడా కలిగిన మనం అంతటా నిండి ఉన్న భగవత్తత్వాన్ని గుర్తించలేము. దర్శించలేము. అందుకే అంటుంది “అమ్మ” – “దేవులాడినా దొరకనివాడు దేవుడు” అని, “ఎందెందు వెదకి చూచిన….” అన్న పోతన్నగారి ప్రహ్లాదుడి భావమే “అమ్మ” వాక్యంలో దోబూచులాడుతోంది.

జ్ఞానరూపిణి అయిన “అమ్మ” జ్ఞానమంటే ఏమిటో విపులీకరించింది. జ్ఞేయస్వరూపిణి అయిన “అమ్మ” తన తత్త్వాన్ని తానే మనకు సులభంగా అర్థమయ్యేటట్లు వివరించింది. “జ్ఞానం ఇస్తే వచ్చేదికాని, చేస్తే వచ్చేది. కాదు” అని “అమ్మ” చెప్పినట్లు – ఆ తల్లి అందించిన జ్ఞానసంపదను సొంతం చేసుకుని, ఆ జ్ఞేయస్వరూపిణిని అర్థం చేసుకునే రోజు కోసం ఎదురు చూడడం తప్ప ఏం చేయగలను?

అర్కపురిలోని అందరింటిలో జ్ఞానజ్ఞేయ స్వరూపిణిగా కొలువు తీరిన “అమ్మ”ను దర్శించి, స్మరించి, భజించి తరించుదాం.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!