(గత సంచిక తరువాయి)
- అద్వైతం అంటే కూతురిని కోడలినీ ఒకే విధంగా చూడటం
అద్వైతాన్ని గురించి అమ్మ అనేక సందర్భాలలో అనేక రీతులలో వివరించింది. “నీ చుట్టూ ఉన్న దానిని నీలాగా చూసుకోవడం అద్వైతం” అని, ఒక సందర్భంలో చెప్పింది. మరోసారి మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన ఒక యువకుడు “అమ్మా! రామకృష్ణ పరమహంస వివేకానందుడికి భగవంతుణ్ణి చూపించారు కదా! మీరు నాకు చూపించరా’ అని అడిగాడట. దానికి “కనపడేదంతా వాడే అయినపుడు దేనినని ప్రత్యేకంగా వేలు పెట్టి చూపించమంటావు నాన్నా!” అనీ, “ఈ జగత్తు సర్వము ఈశ్వరుడే” అని సర్వకాల సర్వావస్థలయందు సంభావన చేసే అద్వైతమూర్తి అమ్మ ఇచ్చిన సమాధానం. దైవం సర్వాంతర్యామి. అన్నింటిలోనూ అంతటా ఉండడమే కాదు. ఆ దైవం అమ్మ దృష్టిలో అన్నీ తానై ఉన్నాడు. మరొక సందర్భంలో “సరైన కమ్యూనిజం అద్వైత” మనీ, “అంతా అయినదీ, అర్థం కానిదీ అద్వైతం ” అనీ నిర్వచించింది అమ్మ. మరి ఎన్ని నిర్వచనాలు చెప్పినా ఇవి సామాన్యుడికి అంతు పట్టేవి కావు, అనుభవంలోకి వచ్చేవి కావు. ఏ నిర్వచనాలనైనా ఆచరణలో పెట్టగలిగితేనే ప్రయోజనం కదా! అమ్మ ఆచరణ శీల కాబట్టి నిర్వచనాలతో (మాటలతో ఆగిపోకుండా తన అనుభవం (చేతలు) నుంచి వారి వారి స్థాయిని బట్టి అతి సామాన్యమైన వాళ్ళకు కూడ అర్థం అయ్యేటట్లుగా అద్వైతస్థితిని స్పష్ట పరిచింది. ఒక సామాన్య గృహిణి “సంసారంలో ఉండి అద్వైత స్థితిని పొందడం ఎట్లా?” అని ప్రశ్నించింది. ఎంత మహాపండితులైనా అద్వైత సిద్ధాంతాన్ని ఏమాత్రం చదువురాని ఆమెకు అర్థమయ్యేట్లుగా ఏ మాటలలో చెప్పగలరు?
కానీ అమ్మ “కూతుర్నీ కోడల్నీ ఒకే విధంగా చూసుకుంటే సరి” అని అద్వైత తత్వాన్ని ఆచరణయోగ్యంగా అందించింది. వాస్తవానికి కూతురినీ, కోడలినీ ఒకే విధంగా చూడడం అసంభవం; అలాగే అద్వైత సిద్ధిని పొందడమూ అసంభవమే. అందుకు ఒకే ఒక్క మార్గం ఉంది. అమ్మ అనుగ్రహం ఉంటే చాలు; అసంభవం సంభవం అవుతుంది. కనుకనే శంకరభగవత్పాదులవారు “ఈశ్వరానుగ్రహదేవ పుంసాం అద్వైత వాసనా” అన్నారు.
‘ఏం చేస్తే బ్రహ్మత్వసిద్ధి వస్తుంది?’ అని ప్రశ్నిస్తే, అమ్మ, “ఏం చేసినా రాదు. వాడు (శక్తి/దైవం) ఇస్తే వస్తుంది” అని రూఢిగా ప్రకటించింది.
సాధారణంగా అత్తా కోడళ్ళ మధ్య బద్ధ శతృత్వం అమ్మాయి మెట్టినింట్లో కాలు పెట్టినపుడే ప్రారంభం కావడం లోకం పోకడ. సమాజంలో ఈనాడు అత్తాకోడళ్ళ మధ్య సమన్వయం కుదరకనో, వరకట్నం వేధింపులో కాని సజీవ దహనాలూ, ఆత్మహత్యలూ ఎక్కువవుతున్నాయి. సమాజ పరిస్థితిని బట్టి అమ్మ తన మాటల ద్వారా చేతల ద్వారా మార్పు తీసుకురావాలని అద్వైత వివరణ ద్వారా సమాజానికి ఆచరణాత్మకమైన సందేశాన్నందించింది. దీనిని ఏ కొద్దిమందైనా ఆచరించగలిగిననాడు గృహం, గ్రామం, రాష్ట్రం, దేశం, ప్రపంచమే శాంతి నిలయం, ప్రేమ మందిరం అవుతుందనడంలో సందేహం లేదు.
తల్లి తన కూతురిలో తననే చూసుకుంటుంది. తన కూతురు కావడం వల్లనే కదా తల్లికి బిడ్డ మీద ప్రేమ. కోడలు ఇంకొక అమ్మ కన్న బిడ్డ. కోడలులో తనను చూసుకోదు అత్తగారు. కూతుర్నీ కోడల్నీ ఒకే లాగ చూడడం అంటే కూతురులోనూ, కోడలు లోనూ తననే చూసుకోవడం. ఇంకొక అమ్మ కన్నబిడ్డలోనూ తన్ను చూసుకోగల్గడమే అద్వైత స్థితికి నాంది.
మూలానికి వెడితే, తత్వపరంగా అవలోకిస్తే ‘అద్వైతం’ అనేది పరమ ఆధ్యాత్మిక పారమార్థిక సార్వకాలిక సత్యం. అట్టి సత్యరూపిణి, సత్యభాషిణి, సత్యదర్శిని, సత్యప్రియ, సత్యవ్రత, సత్యసంధ అమ్మ.
అమ్మకి పది సంవత్సరాల వయస్సులో శ్రీ చిదంబరరావు తాతగారు “అమ్మా! నువ్వు చెప్పే ప్రతి ఒకటి అద్వైత స్థితికి తీసుకు వెళుతున్నది” అని అంటే అమ్మ “నేను తీసుకు వెళ్ళేదేమున్నది? అది అయ్యే ఉన్నది” అన్నది. “మేమంతా అజ్ఞానులం. మాకు జ్ఞానబోధ చెయ్యమ్మా” అని ప్రార్థిస్తే అమ్మ, “నా దృష్టిలో మీరంతా పరిపూర్ణ జ్ఞాన స్వరూపులే” అన్నది.
“మీరంతా నా బిడ్డలే కాదు; నా అవయవాలు” అని దేవునికి జీవునికీ అభేదత్వాన్ని చాటింది; విశ్వరూపతత్వజ్ఞాన సర్వస్వాన్ని తేటతెల్లం చేసింది.
“అంగుష్ఠ తర్జనీ యోగముద్రా వ్యాజేన సేవినామ్ |
శృత్యర్ధం బ్రహ్మ జీవైక్యం దర్శయన్నో వతాచ్ఛివః ॥
అన్నట్లు రెండు చేతులలో చిన్ముద్రను ధరింపజేసి అద్వైత సిద్ధి ప్రదాయినిగా తన కన్న బిడ్డ, హైమక్కయ్యను ప్రతిష్ఠించింది: అద్వైతతత్త్వామృత రసవాహిని అమ్మ. సామాన్యంగా –
‘మీకు కారు డ్రైవింగ్ వచ్చా? కంప్యూటర్ వినియోగంలో ఎం.ఎస్. ఆఫీసు ‘తెలుసా?’ – అని ఎవరైనా అడిగితే – ‘ఆఁ! రాదు, తెలియదు. అయినా అదేమైనా బ్రహ్మవిద్యాండీ!’ అని అంటాం. నిజమే. అది లౌకిక విద్య, పొట్టకూటి విద్య, బంధ హేతువు.
బ్రహ్మవిద్య తరింపచేసేది, మోక్షానుగ్రహకారకం. కాగా సాహిత్యంతో రాహిత్యం కాదు కనుకనే –
అమ్మతత్త్వబోధ చెయ్యదు. శాస్త్రాన్ని వల్లించదు. జ్ఞాన భిక్ష పెడుతుంది. అనుభవాన్ని అనుగహ్రిస్తుంది. మూర్తీభవించిన దక్షిణామూర్తి తత్వం అమ్మ. అమ్మ చెప్పేది వేదం, చేసేది ధర్మం, చూపేది సత్యం. ఇదే అమ్మ దివ్యసాన్నిధ్య విశేషం.
“అద్వైతం అంటే కూతురినీ కోడలినీ ఒకే విధంగా చూడటం” అనే అమ్మ వాక్యం పండితులకీ పామరులకీ అతులితసాధనా మార్గం, ఆచరణాత్మక ప్రబోధం.
– (సశేషం)