1. Home
  2. Articles
  3. Mother of All
  4. జ్ఞానదీపికలు

జ్ఞానదీపికలు

Bhattiprolu Lakshmi Suguna
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 13
Month : July
Issue Number : 3
Year : 2014

(గత సంచిక తరువాయి…)

సహించలేనిదే హింస

“హింస అంటే సహించలేనిదే, నాన్నా! మేకలను కోసేవాడు ఆవులను నరకటం సహించలేడు. కోళ్ళను కోసేవాడు గొజ్జెలను చంపటం చూడలేడు. సర్వమూ ప్రాణమయమే అనుకున్నప్పుడు అన్నం తినటమూ కూరగాలను కోయటమూ మంచి నీళ్ళు త్రాగడటమూ హింసే కనక ఏది హింస, ఏదికాదు అన్నది సమస్య కాదు. ఎవరు ఏది సహించలేరో అదే హింస. కాబట్టి దానిని మానుకుంటే సరిపోతుంది, అదీ మానుకోగలిగితే” అని సోదాహరణగా వివరించింది అమ్మ.

ధర్మాధర్మ విచారణ ఎంత కష్టమయినదో ఏది హింస, ఏది అహింస అని నిర్ణయించడం కూడా అంత కష్టమయిన విషయమే. ఒకే విషయం ఒకరికి హింసగాను మరొకరికి అహింసగాను తోస్తుంది. పూర్వం యజ్ఞయాగాదులలో జంతుబలి ఇచ్చేవారు. అప్పటి కాలాన్ని బట్టి అది హింస కాకపోవచ్చు. ఇప్పటికీ కొన్ని క్షుద్రవిద్యలకు నరబలి ఇవ్వడం జరుగుతూనే ఉన్నది. దానిని వాళ్ళు హింసగా భావించరు.

దేవదత్తుడు వేట వినోదం కోసం రాజహంసను పడగొట్టగా నేలవాలిన ఆ రాయంచను చూసి ‘నిండు జాబిల్లి మెత్తని గుండెలోన క్రూర నారాచమేరీతి. గ్రుచ్చినావు?’ అంటూ సిద్ధార్థుడు విలవిలలాడి పోయాడు. నేల కూలిన ఆ హంసను అనునయించి సేదతీర్చి చికిత్స చేసి ఆదరించాడు. ఒకే విషయంలో దేవదత్తుడు వీరత్వంతో విజయంగా భావించగా సిద్ధార్థుడు హింసగా భావించాడు.

సామాన్యంగా స్త్రీలకు పూలు కోయటమనేది సంతోషదాయకం, ఒక ముచ్చట. కోసే వారికి గానీ, చూసేవారికి గానీ అది హింస అనే ఆలోచన ఏ మాత్రం రాదు. కాని, చెట్ల నుండి పూలు కోస్తే సహించలేని పూల అంతరంగాన్ని శోధించి ప్రకృతిని పరవశింపచేసే పువ్వుల్ని త్రుంచటం ‘మానవాళి సల్పు – ఖూనీ’ అని దుయ్య బట్టారు కవులు.

‘ఊలు దారాలతో గొంతు కురి బిగించి

 గుండెలో నుండి సూదులు గ్రుచ్చి కూర్చి

 ముడుచుకొందురు ముచ్చట ముడుల మమ్ము

 అకటా ! దయలేనివారు మీ యాడు వారు’ అని ధ్వజమెత్తారు కరుణశ్రీ. 

మరొక ఉదాహరణ. ఒక వ్యక్తి లోకహితానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే, ప్రజలకు హాని చేస్తే అతనిని లోకకంటకుడు అంటారు. అట్టి వానిని ఉపేక్షించక శిక్షించటం ధర్మం. శిక్షింపక విడుచుట అధర్మం. ఆ విషయంలో హింస ధర్మం అహింస అధర్మం.

యుద్ధం క్షత్రియ ధర్మం అంటారు. ధర్మ పరిరక్షణ దృష్టితో చూస్తే కురుక్షేత్ర సంగ్రామం హింసగా తోపకపోవచ్చు. కాని కవి యుద్ధరంగాన్ని నెత్తుటి ఏరుల్ని వర్ణిస్తే మన కన్నీరు వాగులై ప్రవహిస్తుంది. ఈ విధంగా ఒక మనస్సు ఒకే విషయాన్ని అన్ని సందర్భాల్లో ఒకటిగా తీసుకోదు.

హింసనం హింస ఇతి – ప్రాణుల శరీరాన్ని గాని మనసును గాని పీడించేది. హింస. ఇది మూడు విధాలుగా ఉంటుంది మనసా, వాచా, కర్మణా అని. ప్రాణి వధ మాత్రమే హింస కాదు. ఇతరులకు హాని చేయాలనే ఆలోచన గానీ, కటువుగా మాట్లాడటం గానీ హింసగానే పరిగణింపబడుతుంది. లోకంలో హింస చేయని వాడు ఉండనే ఉండదు. గాలి పీల్చినా, నీరు త్రాగినా, నడిచినా, నాగలి దున్నినా, అజ్ఞాతంగా హింస జరుగుతూనే ఉంటుంది.

కానీ ఎవరూ తాము చేసింది మాత్రం హింసగా భావించరు. ఉదాహరణకు ఏ ఆకుకూర తరుగుతున్నాం అనుకోండి. అది హింసగా భావింపం కాని ఏ పశువుల్ని చంపడమో హింసగా అన్నిస్తుంది, బాధిస్తుంది. అది వృత్తి ధర్మంగా భావించే వారికి మనుష్యుల్ని చంపడం హింసగా తోస్తుంది. ఒక మనిషిని చంపేవాడికి పది మందిని చంపడం హింసగా తోచవచ్చు. ‘అహింసా పరమో ధర్మః’ అన్నారు. కాని అది సార్వకాలికమూ, సార్వదేశికమూ కాజాలదు అని మన అనుభవమే చెప్తున్నది.

హింసకు తొలగి ఉండాలంటే జీవయాత్రే కష్టం. భారతంలో అరణ్య పర్వశేషంలో గల వృత్తాంతాలలో ధర్మవ్యాధోపాఖ్యానం ప్రధానమైంది. అందులో ధర్మవ్యాధుడు కౌశికుడికి ధర్మ విశేషాల్ని పుణ్యపాపాల స్వరూపాన్నీ అహింసా స్వరూపాన్నీ తెలియచేశాడు.

‘హింస చేయని వాడు లేడిజ్జగమున 

ఒక్కడైనను తమ తమ ఓపినట్లు

 హింస తెరువున కెడుగల్గి యేగవలయు

 అదియ చూపె అహింస నానతిశయిల్లు’ – అంటే హింస అహింసల నిర్ణయం వారి స్థితి మనస్థితులను బట్టి ఉంటుంది. అందుకే అమ్మ ‘సహించలేనిదే ‘హింస’ అని సూత్రీకరించారు. భారతంలో సాధ్యమైనంత వరకు హింసకు దూరంగా ఉండడమే అనే సలహా మాత్రమే కన్పిస్తుంది.

కానీ అమ్మ “ఎవరేది సహించలేరో అదే హింస. కాబట్టి దానిని మానుకుంటే సరిపోతుంది, అదీ మానుకోగలిగితే” అనుగ్రహించింది. అంటూ ఒక పరిష్కారాన్నీ కూడా

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!