(గత సంచిక తరువాయి)
- నీ బిడ్డయందు దేనిని చూస్తున్నావో అందరియందు దానిని చూడడమే బ్రహ్మస్థితి పొందడం
లోకమంతటినీ భగవన్మయంగా దర్శించిన వారూ ఆరాధించిన వారూ ఉన్నారేమో కానీ ఎవరూ అమ్మ లాగ ప్రతివ్యక్తినీ తన బిడ్డగా చూసుకుని ప్రేమించలేదు. లోకంలో ఇదొక మధురమైన భావన, మనోహరమైన ఆరాధన. ‘ఆత్మవత్సర్వభూతాని’ అన్నట్లుగా లోకాన్ని తన వలే చూడటం కాక లోకాన్ని బిడ్డగా ప్రేమించడమనే ఒక క్రొత్త విధానానికి అమ్మ శ్రీకారం చుట్టింది. ఈ దృక్పధంలో నుండి వచ్చినదే పై వాక్యం.
గగన కుసుమంలాగా మనకందుబాటులో లేని విషయాలను ఆచరణాత్మకమైన ప్రబోధం ద్వారా మన ముంగిట్లో నిలబెట్టడం అమ్మలో కన్పిస్తుంది.
బ్రహ్మస్థితిని పొందడం ఏ యోగులకో, జ్ఞానులకో గాని సాధ్యం కాదు అని అనుకునే సామాన్య మానవులకు ‘నీ బిడ్డయందు దేనిని చూస్తున్నావో అందరియందు దానిని చూడడమే బ్రహ్మస్థితిని పొందడం” అని ప్రబోధించి లౌకికానికీ, ఆధ్యాత్మికానికీ మధ్యనున్న అడ్డుగోడను తొలగించింది అమ్మ.
‘ఆత్మవత్సర్వభూతాని’ అనీ, సర్వప్రాణికోటి ఒక దాని కంటే మరొకటి ఏమాత్రం భిన్నం కావనీ వేదాంతం చెప్తున్నది.
కాని అమ్మ ‘పుత్ర వత్ సర్వభూతాని’ అని నిరంతరం తన మాటల ద్వారా చేతల ద్వారా మనకు అందించిన మహత్తర ప్రబోధం ఇది. సర్వజీవులనూ తన బిడ్డలుగా చూడమనీ మన బిడ్డలను ఎలా ప్రేమిస్తామో అందరినీ అలాగే ప్రేమించమనీ అమ్మ సందేశం. సృష్టిలో సమస్త ప్రాణికోటికీ తనను కన్న వాళ్ళమీద కంటే తాను కన్న వాళ్ళమీదే మమకారం ఎక్కువ. ఒక ముద్ద అన్నం ఉంటే దానిని బిడ్డకు పెట్టి తాను పస్తు ఉంటుంది తల్లి. చూలింతగానూ, బాలింతగానూ, బిడ్డకోసం తల్లి చేసే పథ్యమూ, పడే కష్టమూ, తపనా, తాపత్రయమూ చూస్తుంటే తల్లికి బిడ్డయందు ఎంత మమకారమో అర్థమవుతుంది. తాము కష్టపడ్డా తమ సంతానం సుఖపడాలని కోరుకుంటారు. తల్లిదండ్రులు. మనిషికి తన కంటే ప్రియమైనది సంతానమేనని అందరూ అంగీకరించే విషయమే. అందువల్లనే సర్వసృష్టినీ తన బిడ్డగా చూసుకోవాలనీ అలాగే ప్రేమించాలని అమ్మ నిరంతర ప్రబోధం. ప్రతివాడూ తన కన్నబిడ్డను చూసినట్లుగా సాటివాడిని చూడగల్గిన నాడు ప్రపంచంలో కక్షలకూ, కార్పణ్యాలకూ, దౌర్జన్యాలకూ, దురాగతాలకూ, మారణహోమాలకు తావేది? మరి ఈ ఇల్లు నాది, ఈ ఊరు నాది అనుకోగలరేమో గాని లోకంలో ఉన్న ప్రతివాళ్ళను తన బిడ్డలుగా భావించడం ఎట్లా సాధ్యం? సాధ్యమేనని 3 నిరూపించింది అమ్మ. సర్వసృష్టినీ తనదిగా భావించి ప్రేమించి ఆచరణాత్మకంగా ప్రబోధించింది. అదే సర్వమాతృభావన: చరాచర భేదరహితంగా సమస్త సృష్టికీ ‘నేను అమ్మను, మీరు బిడ్డలు’ అనే విశ్వజనీనత్వ స్థితి. “నీ బిడ్డయందు దేనిని చూస్తున్నావో అందరి యందు దానిని చూడడమే బ్రహ్మస్థితిని పొందటం” అనేది ఆధ్యాత్మికంగా మహామంత్రంలా ధ్వనిస్తుంది కాని సమాజశ్రేయస్సుకై అమ్మ చేసిన ప్రబోధంగా కూడా మనం భావించవచ్చు.
“నీ బిడ్డయందు దేనిని చూస్తున్నావో…” అన్న దానిలో ఒక విశేషాంశం ఉన్నది. ఏ తల్లిదండ్రులైనా తమ బిడ్డల్లో ఏమి చూస్తారు ? అ ప్రశ్నించుకుంటే – సుగుణాల్ని మాత్రమే అని చెప్పాలి. ఏ తల్లికీ తన బిడ్డలో తప్పు కనిపించదు. కాకి పిల్ల కాకికి ముద్దు. అంతేకాదు. పరాయివాళ్ళు తన బిడ్డను నిందిస్తే, ఆ బిడ్డలోని సుగుణాల్ని మాత్రమే చూస్తూ వాడ్ని తన గుండెల్లో దాచుకుంటుంది; వెనకేసుకు వస్తుంది. అమ్మ విశ్వజనీన ప్రేమ తత్త్వమూ అదే; కాగా సర్వత్రా పరివ్యాప్తమైనది. “మనుషులందరూ మంచివాళ్ళే”. అని అమ్మ మాత్రమే సర్వమానవాళినీ పురిటి బిడ్డల్ని చేసి తన ఒడిలో వేసుకుని లాలించింది. తనను ప్రేమించిన వాళ్ళను, ద్వేషించిన వాళ్ళనూ, పూజించిన వాళ్ళను, నిందించిన వాళ్ళనూ వేల రూపాయలిచ్చిన వాళ్ళనూ, లక్షల రూపాయలు దోచుకున్న వాళ్ళనూ స్తుతించిన వాళ్ళను, తనను అంతమొందించ వచ్చిన వాళ్ళనూ… పందులు, కుక్కలు, ఎలుకలు, పిల్లులు, బజ్జెలు, పక్షులు, క్రిములు – కీటకాదులు, భయంకర విషసర్పాలు… అందరినీ, అన్నిటినీ అక్కున చేర్చుకుంది.
కూతురిని కోడలిని ఒకే మమకారంతో ఆదరించిన అద్వైత మూర్తి అమ్మ. బ్రహ్మత్వ స్థితీ, బ్రహ్మత్వ సిద్ధి అమ్మే. ఈ సాధన క్రమంలో ముందు బిడ్డను బిడ్డగా చూడటం ఒక స్థితి. ‘ఆత్మావై పుత్రనామాసి’ అని తాను తన బిడ్డకంటే వేరు కాదన్న స్థితి మరొకమెట్టు. క్రమంగా ఆత్మతత్వం ఒకటే అని తెలుసుకొని, తాను తన బిడ్డతో అభేద స్థితిని పొందటం మరోమెట్టు. అంటే తన బిడ్డయందు తననే దర్శించడం. ఆ తరువాత తన బిడ్డలాగే లోకాన్ని దర్శించడం వలన సృష్టిరూపంలో ఉన్నది కూడ తానే (ఆత్మయే) అన్న స్థితికి చేరుకుంటాడు. అంటే అంతా (ఆత్మే) తానే అనే స్థితి. అపుడు సృష్టిలో సర్వరూపాల్ని స్వస్వరూపంగా దర్శించ గల్గుతాడు. ఇదే చేరుకోవలసిన గమ్యం. భావన ఆధ్యాత్మికమైనా సాధన లౌకికంగా చెప్పి బ్రహ్మ స్థితిని పొందడాన్ని ఆచరణ సాధ్యం, యోగ్యం కావించింది అమ్మ.
నీ చుట్టూ ఉన్న దానిని నీలాగ చూసుకోవడం అద్వైతం అని అమ్మ చెప్పినట్లుగా అంతా తానుగా దర్శించడం అంటే అద్వైత స్థితికి చేరుకోవడమే.
(- సశేషం)