(గత సంచిక తరువాయి)
- నీకున్నది తృప్తిగాతిని, ఇతరులకు ఆదరంగా పెట్టుకో. అంతా వాడే చేయిస్తున్నాడనుకో.
అమ్మ దృష్టిలో ‘నీకున్నది తృప్తిగా తిని ఇతరులకు ఆదరంగా పెట్టుకోవట’ మనేది ఒక్క భోజనం విషయంలోనే కాదు. అన్ని విషయాలలో సాటివారిని ఆదుకోవాలన్నదే అమ్మ ఉద్దేశం. ప్రకృతి ప్రసాదించిన సమస్త సంపదనూ మానవులంతా సమంగా పంచుకోగల్గితే ప్రపంచంలో దారిద్ర్యము అనేది ఉండదని అమ్మభావన. అది అందరికీ సమానంగా అందడమే లోకకళ్యాణమని అమ్మ ఆలోచన. ఆకలి మంటల్లో దహించుకు పోతున్న ప్రక్కవాడిని వదిలేసి రేపటికి తన కోసం దాచుకోవడమే ప్రపంచంలోని అశాంతికి మూలం. మనిషిలో దినదినాభివృద్ధి పొందుతున్న ఈ స్వార్ధాన్నీ తుడిచేసి త్యాగ భావాన్ని పెంపొందింప చేయడానికే అమ్మ చేస్తున్న ప్రయత్నం అని అమ్మ ప్రబోధాల వలన సువిదితం అవుతుంది. కాని ఈ నాటి కాలపరిస్థితిని బట్టి ఏరంగంలోనైనా అరాచకం, అన్యాయం, అశాంతి, అవినీతి చెట్టాపట్టా లేసుకుని తిరుగుతుంటే నాగరికత వికసిస్తున్న కొద్దీ మనం ఆశించే ప్రగతి – పథకాలూ, ప్రసంగాలకే పరిమితమై పోయింది. మానవులంతా ఒక్కటే అనే భావంతో అందరికీ సమానావకాశాలు, కనీసావసరాలైన తిండి, బట్ట, ఇల్లు ఏర్పడాలని కులమతవర్గ వర్ణాది విభేదం లేని వసుధైక కుటుంబం కావాలని ఉపన్యాసాలిచ్చేవారెందరో. పత్రికల ద్వారా ప్రచారం చేసేవారు మరికొందరు. కాని ప్రస్తుత సమాజంలో అన్ని రంగాలలోను వర్గభేదం ఉందనేది అందరికీ అనుభవంలో ఉన్న విషయమే. ఒక ప్రక్క సమసమాజ నిర్మాణం కోసం ఆకాంక్ష, మరొక ప్రక్క సాటి మనిషిని మనిషిగా చూడలేని స్థితి నేటి సమాజ సంకట పరిస్థితి.
వెలుగు చీకట్ల సంధికాలంలో నాగరికత వెల్లువలో కొట్టుకు పోతున్న మానవతా విలువల్ని పునరుద్ధరించి ఆచరణాత్మకమైన పరిష్కారాన్నీ సూచించింది అమ్మ. చీకటిలో చిరుదివ్వెను వెలిగించినట్లు అమ్మ ఆచరణకు రూపకల్పనే ‘అందరిల్లు’. వర్గరహిత సమాజానికి అదొక చిరునామా. ‘గుణ భేదమే లేని నాకు కులభేదమెక్కడిది?’, ‘శుక్లశోణితాలకేది కులమో అదే నా కులము’, ‘సర్వసమ్మతమైనదే నామతము’ – అని ప్రవచించిన అమ్మ వర్గ భేదం లేకుండా వర్గం లేని స్వర్గాన్ని నిర్మించాలని అందరింటిని ఒక ప్రయోగశాలగా ఎంచుకున్నదా అన్పిస్తుంది.
అమ్మ ఏం చెప్పినా ఎన్ని చెప్పినా ప్రధానమైన శిలాశాసనం లాంటి సందేశం ‘నీకున్నది తృప్తిగా తిని, ఇతరులకు ఆదరంగా పెట్టుకో. అంతా వాడే. చేయిస్తున్నాడనుకో’ అనేది. ఏ వ్యక్తి అయినా ఇతరులకు ఏమయినా పెట్టినపుడే తాను తృప్తిగా తినగల్గుతాడు. ఈ సందేశమే అమ్మ జీవితమంతా పరచుకుని ఉన్నది.
ఒకటి రెండు ఉదాహరణలు పరికిద్దాం.
ఒక సోదరునికి అమ్మ బట్టలు పెడుతుంటే అతడు ‘నాకు చాలా ఉన్నాయి. నాకెందుకమ్మా?’ అన్నాడు. వెంటనే అమ్మ, “నీ చేత ఇతరులకు పెట్టించడానికి నీకు నేను పెడుతున్నాను. నాన్నా?” అని చెప్పింది.
ఒకసారి ఒక కుటుంబం అమ్మ దగ్గరకు వచ్చి వారి పిల్లవాడికి అమ్మ చేత అక్షరాభ్యాసం చేయించుకున్నారు. మన దృష్టిలో ఆ కార్యక్రమం అంతటితో పరిసమాప్తి అయినట్లే. కాని అమ్మ దృష్టిలో అసలు కార్యక్రమం ముందే ఉన్నది. ట్రేలో పోసి ఉన్న చాక్లెట్లలో ఒకటి తీసికొని పిల్లవాని నోటికి ప్రేమగా అందించి వాడి దోసిలి నిండా చాక్లెట్లు పోసి అందరికి పంచమన్నది. పిల్లవాడు వాటిని అందరికీ పంచుతుండగా అమ్మ ఆనందంగా చూస్తూ” ఇదే అసలు అక్షరాభ్యాసం. జీవితంలో నేర్చుకోవలసిన ప్రథమ పాఠం, ప్రధాన పాఠం ఇదే” – అంటూ “తనకున్న దానిని అందరకూ అట్లా హాయిగా పంచుతుంటే ఎంత ఆనందంగా ఉంటుంది?” అని తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.
మరొక సందర్భంలో “పంచని కాడికి ఉండడం దేనికి”, అని ప్రశ్నించింది. అమ్మ వాక్యంలో ఆధ్యాత్మికత, సామాజికత అంతర్లీనంగా ముడి పడి ఉన్నాయి. అందులో మూడు సోపానాలున్నాయి.
- ‘నీకున్నది తృప్తిగా తిని’ :- ఒక వ్యక్తి యొక్క జ్ఞానం, శక్తి, సంపద…. సర్వం భగవద్దత్తమే. దానిని తృప్తిగా అనుభవించమన్నది. ప్రతివ్యక్తి కంటే ఆయా రంగాల్లో పై మెట్టులోనూ క్రింది మెట్టులోనూ అనేకులు ఉంటూనే ఉంటారు. సంపదలో తనకంటే తక్కువ వారితో పోల్చుకోమని అంటారు. కనుక తనకు ప్రాప్తించిన దానితో తృప్తిగా అనుభవించ మన్నది. తృప్తికి మించిన సంపద ఏముంటుంది?
- ‘ఇతరులకు ఆదరంగా పెట్టుకో’ :- మనకంటికి ‘ఇతరులు’గా కనబడుతున్నా వారందరూ జగన్మాత రక్తాన్ని పంచుకుని పుట్టిన మన తోడబుట్టిన వారే. కనుకనే ఈశ్వరానుగ్రహ సంప్రాప్తమైన సంపదని ‘ఆదరంగా పెట్టుకో’ అన్నది అమ్మ. పెట్టుకోవటం ప్రేమధర్మం; తన కోసమే కాని వేరొకరి కోసం కాదు.
‘శ్రద్ధయా దేయం, అశ్రద్ధయా అదేయం’ – అనే ఉపనిషత్సారాన్ని ఉగ్గుపాలతో రంగరించి పోస్తోంది అమ్మ.
- ‘అంతా వాడే చేయిస్తున్నాడనుకో’ :- ఇది అమ్మ దివ్య సందేశంలోని ఒక ఆదేశం. కర్తృత్వాన్ని తన మీద పెట్టుకుంటే అది అశాంతికి దారి తీస్తుంది. (జగజ్జనని) తల్లి చాటు బిడ్డగా ఎదగడం తత్త్వతః కర్తృత్వ రాహిత్యం. మన ఆలోచనలు, కదలికలు.. సృష్టిలోని సకల స్పందనలు అన్నీ మనకి అర్థంకాని ఒక అతీంద్రియైన అద్భుతమైన అమోఘమైన శక్తి పరిధిలో ఉన్నాయి. దీనిని అస్తిక్యభావం, విశ్వాసం అని అనవచ్చు. అంతా దైవం చేయిస్తున్నాడనే నమ్మకం కలిగిన నాడు పురుషకారం నశించి మనస్సుకు శాంతి, నిశ్చలస్థితి. లభిస్తాయి. కొండంత అమ్మ ఇల కోరి అండన ఉండ, నాకు లోటు ఏమిటి? దిగులు ఎందుకు? – అనే ధీమా కలుగుతుంది. ఆత్మ విశ్వాసం, ఆత్మబలం పెంపొందుతాయి.
అమ్మ వాక్యసారాన్ని ఒక్కమాటలో చెప్పాలంటే – (త్యాగేనైకే అమృతత్వమానశు:) ‘త్యాగం వలన అమృతత్వం ప్రాప్తిస్తుంది’ – అనే వేదవాక్కుని ఉటంకించాలి.
– (సశేషం )