(గత సంచిక తరువాయి)
- ‘సరే’ మంత్రం
‘అమ్మ ఏమైనా మంత్రాన్ని జపించేవారా, మంత్రోపదేశం చేసేవారా?’ అని చాలామంది అడుగుతూ ఉంటారు. అమ్మకు ఒక సోదరునికి జరిగిన సంభాషణ. దానికి సమాధానం.
సో: అమ్మా! మీరు జీవితమంతా జపించిన మంత్రం ఏది?
అమ్మ : ‘సరే’ మంత్రం
సో: సరే అంటే
అమ్మ : అన్నింటికీ సరే. ఆ మాట ఒక మహామంత్రం.
అమ్మకు ఇది ఎక్కువ, ఇది తక్కువ అని లేదు. దేనినీ, ఎవరినీ వద్దనదు. దేనికైనా సరే అనడమే అమ్మ మంత్రం.
అమ్మ జపించి ప్రబోధించిన ఈ సరే మంత్రం విశ్వతోముఖమైనది. ‘అల్పాక్షరం అసందిగ్ధం సారవద్విశ్వతోముఖమ్’ అన్న సూత్ర లక్షణాన్ని బట్టి ఈ ‘సరే’ అనేది ఒక సూత్రమైతే దానికి వ్యాఖ్యానమే అమ్మ జీవితం.
సాధారణంగా ఏ మంత్రానికైనా కొన్ని నియమాలు, ఆచారాలు, సమయాసమయాలు ఉంటాయి. ఎవరి సంప్రదాయం ప్రకారం వారు మంత్ర జపం చేసుకుంటూ ఉంటారు. కానీ ఏ నిబంధన లేకుండా ఏవేళ అయినా ఎవరైనా ఏ కులంవారైనా ఏమతం వారైనా, పెద్దవారైనా, చిన్నవారైనా, స్త్రీలైనా, పురుషులైనా జపించదగిన మంత్రం అమ్మ ఆచరణాత్మకంగా బోధించిన సరే మంత్రం.
‘సర్వేజనాః సుఖినోభవన్తు
లోకాస్సమస్తాః సుఖినోభవన్తు’ – అన్నట్లు ఏ మంత్రానికైనా పరమార్థం లోకకల్యాణమే. అన్ని మంత్రాలకూ మూలమై విశ్వ సంక్షేమమే లక్ష్యంగా పుట్టిన ఈ సరే మంత్రం తెలుగులో మహామంత్రం. అదే అమ్మ తత్వానికి విశ్వరూపం. వృక్షమంతా విత్తులో దాగినట్లుగా, విశ్వవ్యాపకమైన త్రివిక్రమత్వం చిన్నపటువులో దాగినట్లుగా, విశ్వమంతా బాలకృష్ణుని నోటిలో ఇమిడినట్లుగా అమ్మ అవతార తత్వమంతా తనలో ఇముడ్చుకున్న రెండక్షరాల మహామంత్రం.
తృప్తినీ, శాంతినీ ఇచ్చి హాయిని కలిగించేదే మంత్రం అంటూ మనిషి జీవితం శాంతియుతంగా సాగడానికి జీవనసూత్రంగా అమ్మ సరే మంత్రాన్ని ఉపదేశించింది. జీవితానికి అన్ని కోణాలను స్పృశించిన మంత్రం ఇది. ఒక విధంగా చెప్పాలంటే అమ్మ సందేశ సర్వస్వం సరే మంత్రం.
అమ్మ జీవిత విధానమే అయిన ఈ ‘సరే’ అనడం అమ్మలో ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఉంటుంది. తల్లికి తప్పే కన్పించదు కాబట్టి బిడ్డల మీద ప్రేమతో అన్నింటికీ సరే అనడం కన్పిస్తుంది. పరుగెత్తేవాడిని ఆపకూడదు, వాడితోపాటు పరుగెత్తి వాడు అలసిపోయినపుడు పట్టుకోవాలి అని అమ్మ భావన. ఇది అమ్మ అనుసరించే సరే విధానాల్లో ఒకటి. అందుకే ఒక సందర్భంలో ఒక సోదరునితో అన్నది – “నీవు ఎవరినీ అదలించకుండా, బెదరించకుండా పని చేయించుకోవాలి. వాళ్ళను అనుసరిస్తున్నట్లుగా ఉంటూ వాళ్ళను మనవైపునకు తిప్పుకోవాలి” అని. ఏ విభేదము లేకుండా ‘సరే’ అంటూ ఎదుటివారిని మనకు అనుకూలంగా మలచుకునే విధానాన్ని అమ్మ సూచించింది. “నేను మీ ఇష్టప్రకారం నడుస్తున్నట్లు కన్పిస్తాను. కానీ నా ఇష్టప్రకారమే మిమ్మల్ని నడుపుకుంటాను” అంటూ అమ్మ ముందు సరే అన్నట్లుగా కన్పించినా తన ఇష్టప్రకారమే మనల్ని నడిపిస్తుంది. కొందరు అమ్మ చెప్పిన మాటను అనుసరించి నడుస్తున్నట్లు కన్పిస్తారు. మరికొందరు అమ్మ చెప్పినదానికంటె భిన్నంగా నడుస్తున్నట్లు కన్పించినా పరోక్షంగా అమ్మ మాట ప్రకారమే నడుస్తారు.
‘సర్వానుల్లంఘ్యశాసనా’ అయిన అమ్మ తన ఇష్టప్రకారమే మనల్ని నడిపిస్తోంది. కనుక భిన్నమైన ఆలోచనకు అవకాశమే లేదు. ‘చేతలు చేతుల్లో లేవు. తోచిందేదో చెయ్యి; తోపింపచేసేది వాడేగా’ అని చెప్పిన అమ్మ దృష్టిలో మనిషికి కర్తృత్వం లేదు. అందుకే “నాకు ఎపుడూ మీ మీద కోపం రాదు. నేను ఏమీ అనకపోవటానికి కారణం మీదేమీ లేదని, ఆ పనులకు మీరు బాధ్యులు కారనీ అనుకోవడమే” – అని అన్నది. అందుకే మనం ఏం చేసినా అమ్మ ‘సరే’ అని అనుకోగల్గింది.
ఒక సందర్భంలో అమ్మ, “వారు చేసే పనిని వారి దృష్టితో చూడాలిగాని మనకు కావలసినట్లుగా మలచుకోకూడదు గదా!” అన్నది. దీనిని బట్టి ఒక్కొక్కసారి అమ్మ ఎదుటివారి ఇష్టాన్ని బట్టి ‘సరే’ అనడం కన్పిస్తుంది.
వరంగల్ నుంచి ఒక సోదరుడు అమ్మ వద్దకు వచ్చి తాను దేవాలయం కట్టాలనుకున్నానని, ఏవో కొన్ని కారణాల వలన కట్టలేకపోయాననీ ఇపుడు వృద్ధాప్యం, అనారోగ్యం కూడ వచ్చాయనీ అమ్మకు చెప్పుకుని ఎంతో బాధపడ్డాడు. కొన్ని విషయాలలో అమ్మ ‘వద్దులే, నాన్నా’ అంటుంది. కానీ తాను దేవాలయం కట్టలేకపోయానని అతడు బాధపడుతున్నాడు. దేవాలయం కడితేనే అతడికి తృప్తి. కనుక ‘సరే, నాన్నా’ అంటూ “ఆలయం కడితేనే నీ బాధ పోతుంది. అనుకుంటే దేవాలయాన్ని కట్టు. కానీ రాతితో కడితేనే దేవాలయం కాదుగా! కనుక గుండెలలో నామంతో గుడికట్టు” అంటూ వాస్తవాన్ని పారమార్థిక సత్యాన్ని దర్శింప చేసింది.
ఒక భక్తుడు అమ్మ దర్శనం కోసం వచ్చి శ్రీ లలితా అష్టోత్తర శతనామావళి చదువుతూ పూజ చేసుకుని, అంతా అయ్యాక ‘అమ్మా! నాకేదైనా మంత్రం ఉపదేశించమ్మా’ అన్నాడు. “ఇప్పుడు చేశావుగా, అదే చెయ్యి” అన్నది అమ్మ. ‘అది లలితదమ్మా. మీరేదైనా చెప్తే” అంటూ అర్ధోక్తిలో ఆగిపోయాడు. “నేను విన్నాను. నాన్నా! బాగుంది. అదే చెయ్యి” – అని అతడిని ఆ దారిలోనే వెళ్ళమన్నది అమ్మ. “ఈ పూజలు నాకని చేస్తున్నారా? ఏ పార్వతి అనో, లక్ష్మి అనో, సరస్వతి అనో చేస్తున్నారు కానీ!’ అన్న అమ్మ అన్ని తత్వాలూ తనవే కనుక అన్నింటినీ అంగీకరించింది. అమ్మ జీవితంలో ప్రతి సన్నివేశంలోనూ మనకు కన్పించేది ఈ సరే విధానమే.
ఒక్కొక్కసారి అమ్మ సరే మంత్రాన్ని ఒక అస్త్రంగా వాడుకున్న సందర్భాలూ ఉన్నాయి. రేపల్లె, ఒంగోలు నుంచి వచ్చిన సోదరులు ఎవరికివారు అమ్మను ముందుగా తమ ఊరు రావాలని ఆహ్వానించారు. అమ్మ ‘సరే’ అంటూ నిర్ణయం వారికే వదలిపెట్టింది. “నేను వస్తాను. కానీ ముందుగా ఏ ఊరు రావాలో మీరిద్దరూ కలిసి ఆలోచించి చెప్పండి” – అని సరే మంత్రాన్ని ప్రయోగించింది. అపుడు వారిద్దరూ కలిసి ఆలోచించి ఒక అవగాహనకు వచ్చి తమ నిర్ణయాన్ని అమ్మకు తెలియచేశారు. ఇలా తన బిడ్డలు సామరస్యంగా కలిసి ఆలోచించి. ‘సరే’ మంత్రాన్ని అనుష్టించాలని అమ్మ ఆలోచన.
ఒక్కొక్కసారి మనం మన ధోరణిలోనే ఆలోచిస్తాం. అపుడు అమ్మ మనకు ఒక అనుభవాన్ని ప్రసాదించడానికి కూడ ‘సరే’ అనేది. ఎక్కడికైనా అమ్మ వద్దు అంటున్నా మనం వెళ్తామంటే ‘సరే’ అని బొట్టు పెడుతుంది. ఇక్కడ అమ్మ ‘సరే’ అనడం ఇష్టంతో కాదు. “నేననేదైనా, నీవనుకునేదైనా, నీ వాచరించేదైనా నే ననుకుంటేనే” అన్నది అమ్మ. అందుకే తన మంచిమాటను కాదని వెడితే ఏం జరుగుతుందో ఆ అనుభవాన్ని ఇవ్వడానికి కూడ అమ్మ ‘సరే’ అనడం జరిగేది.
‘సరే’ అనేది అమ్మ జీవిత విధానమే అయినా మొట్టమొదటగా అది ఒక మంత్రంగా చెప్పింది మాత్రం చిదంబరరావు తాతగారితో. అమ్మ వివాహం సందర్భంగా తాతగారు అమ్మను, “నీకీ పెండ్లి ఎందుకమ్మా’ అని అడిగితే “ఆరని అగ్నిగుండంలో పడి, తీరని వ్యధల్లో చిక్కి, తియ్యగా అనుభవిస్తూ ‘సరే’ మంత్రంతో జీవించాలి” – అన్నది. అనడమే కాదు. ఒకానొక దశలో అమ్మ, చుట్టూ ఎన్నో సమస్యల వలయాలు. కానీ గృహిణిగా ‘సరే’ అన్నదే అమ్మ జపించిన మంత్రం. అంటే జపమాల తీసికొని పూసలు లెక్కిస్తూ చేసిందని కాదు. విపత్కర సమయాల్లో, ప్రతికూల పవనాల నడుమ వికృత మనస్తత్వాలతో ‘సరే” అంటూ ఒడి పట్టి సమయానికి ఏది వస్తే దానిని అనుభవించింది. బాధలు జీవితాన్ని చైతన్యతరంగితం చేస్తాయని ఋజువు చేసింది.
ఒక సందర్భంలో, “అవసరాన్ని బట్టి పేడ తొక్కాను, పిడకలు చేశాను, చాపమీద పడుకున్నాను, కుక్కి మంచం మీద పడుకున్నాను, రేపు ఎయిర్ కండిషన్ పెట్టవచ్చు, ఎన్ని కండిషన్లు మారినా నా కండిషన్ ఒక్కటే” – అన్నది. అమ్మ. అమ్మ జీవితంలో ఇది కష్టమనికానీ, ఇది బాధ అని కానీ ఎపుడూ అనుకోలేదు. ‘సరే’ అంటూ అన్నింటినీ సమంగానే స్వీకరించింది.
ఒక గృహిణిగా అమ్మ సరే మంత్రాన్ని ప్రబోధించినట్లుగా కనిపిస్తున్నా ఇది అందరికీ అన్నివేళలా వర్తించే మంత్రమే. కుటుంబ విషయమే ఆలోచిద్దాం. కుటుంబ సభ్యులందరూ ఒకేమాటగా ఒకే బాటగా సాగాలంటే ఒకరి మాటను ఒకరు గౌరవిస్తూ ఒకరి ఆలోచనను ఒకరు అవగాహన చేసికోవాలి. అమ్మ చెప్పినట్లుగా జీవితం సమస్యల తోరణం. జీవన సమరాలన్నీ సమన్వయం లేకనే. ఎందుకంటే నేను చెప్పిందే వేదం, నా ఆలోచనే సరి అయినది, నేను నడచిన మార్గమే ఆదర్శమైనది, కనుక నాదే పైచేయిగా ఉండాలి. = అని ఎవరికివారు అనుకోవడం వలన సమన్వయం లోపిస్తుంది. అదే అన్ని అనర్థాలకు దారితీస్తోంది. సమన్వయం లేకపోతే సంఘర్షణ తప్పదు. ‘రెండు మనస్తత్వాల మధ్య సంఘర్షణ తప్పదు. కానీ కొందరితో మరీ కష్టం’ – అని ఒకరు అంటే అమ్మ, “జీవితంలో చూస్తున్నాంకదా, నాన్నా! భార్యాభర్తలు కానీ, తల్లీబిడ్డలు కానీ, అన్నదమ్ములు కానీ, స్నేహితులు కానీ… ఇద్దరిలో ఎవరో ఒకరు మొగ్గాల్సిందే” – అంటూ సర్దుకుపోతేనే మనుగడ సాధ్యం అనే పరమసత్యాన్ని ప్రకటించి ‘సరే మంత్రం’ ఆవశ్యకత, విలువలను ప్రబోధించింది. కంటికి కనిపిస్తున్న వైవిధ్యంలో ఏకత్వాన్ని దర్శించినపుడు కలిగే అనుభూతికి వ్యక్తీకరణ ‘సరే మంత్రం’.
“అనడం వేరు, అనుకోవడం వేరు” అని అమ్మ చెప్పినట్లుగా ముందుగా సరే అనడం తర్వాత అనుకోవడం ఆరంభించాలి. ఆ విధంగా మనస్సుకు సరే అనిపిస్తే అపుడంతా సామరస్యమే. సామరస్యమే సౌమనస్యాన్ని కలిగిస్తుంది. విభేదాలు అంతరిస్తాయి. అట్టి ప్రతి ఇల్లు ఒక శాంతినికేతనం అవుతుంది.
– (సశేషం )