(గత సంచిక తరువాయి)
(నేటి వరకు ‘జ్ఞాన గుళికలు’ శీర్షికన ధారావాహికంగా ప్రచురిస్తూన్న వ్యాసాల్ని ఇకపై ‘జ్ఞానదీపికలు’ అనే శీర్షికతో ప్రచురిస్తున్నాం. పాఠకులు ఈ మార్పును గమనించగలరు. – సంపాదకులు)
- సహనమనే దేవతను ఆరాధించాలంటే బాధలనే పూజాద్రవ్యాలు కావాలి. సాధారణంగా ఏ మనిషి అయినా బాధలు తొలగించమనీ, సుఖాలు కల్గించమనీ భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాడు. బాధల నెవ్వరూ ఆహ్వానించరు. కానీ ఎంత చెట్టుకు అంతగాలి అన్నట్లుగా ఎంత వద్దను కున్నా వారి వారి స్థాయిని బట్టి బాధలు తప్పవు. వర్షంలో తడవని వారూ బాధలను అనుభవించనివారూ లోకంలో ఉండరు. వాటిని తట్టుకోవటానికి ఎంతో సహనం కావాలి. సహనం ఉంటే జీవితంలో గెలుపే. సహనం’ అలవడాలంటే బాధలు అనుభవించాలి.
ఉన్నతమైన శిఖరాలు ఉన్న చోటనే లోతైన లోయలూ ఉంటాయి. జీవితంలో సహనపు ఔన్నత్యం తెలియాలంటే వ్యధాభరితమైన అనుభవాలు కావాలి. వెలుగులు వెదజల్లే దీపం చుట్టూ క్రీనీడలు తప్పనట్లు లోకానికి ఆనందాన్ని పంచి ఇచ్చే మహాత్ముల జీవితాల్లో కూడ బాధాపరిష్వంగాలు తప్పలేదు. సహనానికి పరాకాష్ఠ అనదగిన ఎన్నో అగ్ని పరీక్షలను అమ్మ ఎదుర్కొన్నది. నిత్యసమరంలా సాగిన ఆ సంఘటనలలో అమ్మ జీవితపు లోతుపాతులను తెలుసుకున్న శ్రీ మన్నవ బుచ్చిరాజు శర్మ (రాజుబావ) గారు అమ్మను సహన దేవతగా ఆరాధించారు. బాధలే భగవంతుడనీ, ‘సహనమనే దేవతను ఆరాధించాలంటే బాధలనే పూజాద్రవ్యాలు కావాలి’ – అనీ చెప్పిన అమ్మ ఎన్నో బాధలనే పూజాద్రవ్యాలతో సహనదేవతను ఆరాధించింది.
‘హృదయమున బడబానలము మౌళిమీదను మంచుకుండలు ఏలనో అవనీమతల్లీ – పాడుటకు నోరాడదమ్మా అమ్మ కథే అవనిగాధా – అవనే అనసూయమ్మ కాదా’ అంటూ అమ్మకూ అవనికీ అభేదాన్ని వర్ణించారు బుచ్చిరాజు శర్మగారు. విరుద్ధరస సంగమంలా సాగిన అమ్మ జీవితాన్ని చూసి విభ్రమానికి లోనై ‘వింతైన ఇతిహాసం – పెనుగాలిలో దీపనివాసం’ అని వ్రాసిన ఈ పాట సహనదేవత సహనానికే పరీక్ష ఎదురయిన ఉద్వేగ భరిత సన్నివేశాలను స్మరింప చేస్తుంది.
“తనకంటూ ఏ ఇష్టాలూ లేకుండా ఒకరి ఇష్టాన్ని తన ఇష్టంగా చేసికొనడమే సహనమని” చెప్పి ఆచరించి చూపింది అమ్మ. ‘వైవాహిక జీవితంలో కష్టాలు ఎదురయితే అవి నీ సహనానికి శిక్షణగా భావించు’ అని ప్రబోధించింది. దుఃఖం నుండి పారిపోనవసరం లేదనీ, సుఖదుఃఖాలు ఒకే నాణేనికి రెండు పార్శ్వాలనీ, సహనం అలవరచుకుంటే దేనినైనా నిర్వికారంగా అనుభవించ వచ్చనీ అమ్మ తన జీవితం ద్వారా సందేశాన్ని అందించింది. సహనదేవతను ఆరాధించడం అంటే సహనాన్ని అలవరచు కోవడమే. బాధల వల్ల సహించే లక్షణం వస్తుంది. బాధే మనిషిని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది. కణకణమండే అగ్నిలో పుటం పెట్టబడిన బంగారం శుద్ధమైనట్లు బాధానల జ్వాలా పరితప్తుడైన మనిషి రాణింపు పొందుతాడు. జీవితంలో ఏర్పడిన సన్నివేశాలు సంఘర్షణ వలన మనిషి వ్యక్తిత్వం ఉద్దీప్తమవుతుంది.
జీవితతత్త్వం తెలిసిన వారు బాధలను చూసి నవ్వుకునే స్థితికి చేరుకుంటారు. బాధల వల్ల సహించే లక్షణం వస్తుంది. ఆ సహనమే సర్వదుః ఖాలను భరించే శక్తినిస్తుంది. భగవదనుగ్రహం పొందాలంటే ఎవరికిష్టమైన పూజా ద్రవ్యాలతో తమ ఇష్టదైవాన్ని పూజిస్తూ ఉంటారు. అలాగే సహన దేవతను ఆరాధించాలంటే బాధలే పూజాద్రవ్యాలు. పూజాద్రవ్యాలను భక్తితో పవిత్రంగా తీసుకుని వచ్చినట్లుగా బాధలను కూడా అంతే భక్తితో ఆహ్వానించాలి. ఒక సందర్భంలో బాధలే భగవంతుడు అని కూడ చెప్పింది. శిల ఉలిదెబ్బలతో సౌందర్యవంతం అయినట్లు బాధలు జీవితాన్ని చైతన్య తరంగితం చేస్తాయి. “సీత, సావిత్రి, హరిశ్చంద్రుడు… వంటి కథలు, గాధల నుండి మనం నేర్చుకునేదేమిటి? వాళ్ళతో పోలిస్తే మనం ఏం బాధలు పడుతున్నాం? బాధలు పడటానికి కూడ సిద్ధంగా ఉండాలి”. అంటూ జీవన సమరంలో మడమ వెనుక త్రిప్పని యోధుడిగా ఉండాలని ధైర్యాన్ని ఉగ్గు పాలతో రంగరించి పోస్తుంది అమ్మ.
సహనమే జీవన పరమావధి అని ఆ గమ్యం చేరుకోవాలంటే బాధలే సోపానాలని, ఆ బాధలు లేని బ్రతుకు వ్యర్థమని, బాధలనే సాధనగా చేసి కొమ్మని అమ్మ ప్రబోధం.
(సశేషం)