(గత సంచిక తరువాయి)
- రూపాంతరమే కానీ రూపనాశనం లేదు.
“సృష్టి పరిణామ శీలం కలది. సృష్టికి పరిణామమేకానీ నాశనం లేదు” అని అంటుంది అమ్మ.
పరిణామం సృష్టి ధర్మం అయినప్పుడు అదే అంతటా కనిపిస్తుంది. ప్రకృతినే ఉదాహరణగా తీసుకుందాం. అనుక్షణం మార్పు కనిపిస్తూనే ఉంది. ఆ మార్పే ప్రతిక్షణం క్రొత్తగా అనిపించేట్లుగా చేస్తుంది. మొగ్గ పువ్వుగా మారుతుంది; పువ్వు పండుగా మారుతుంది; విత్తనం మొక్కగా మారుతుంది; మొక్క చెట్టు అవుతుంది. అందుకే అమ్మ. “రూపాంతరమే కానీ రూపనాశనం లేదు” అని విశదీకరించింది. అలాగే గ్రీష్మం వెంబడి తొలకరి జల్లులు పడుతున్నాయి. శిశిరం వెంటనే వసంతం తొంగి చూసి ప్రకృతినే పరవశింప చేస్తుంది.
పరిచయమైన విషయాలు కూడా కావ్యంలో కవి రచనా ప్రాభవంతో మన ముందు రంగుల హంగులతో సరిక్రొత్త దృశ్యానికి తెరతీస్తున్నట్లుగా, పరిచితమైన తోట కూడ వసంతాగమనంతో క్రొత్త చిగుళ్ళతో పక్షుల కిలకిలారావాలతో మన ముందు ఒక క్రొత్త లోకాన్ని ఆవిష్కరిస్తుంది. ఈ విధంగా ప్రకృతికి మార్పు సహజమై అదే నూతనత్వాన్ని కలిగిస్తోంది. నిన్న ఉన్నట్లు ఈ రోజు లేకపోవడమే మార్పు. అదే క్రొత్త దనం. మార్పే ప్రగతికి సోపానం. పరిణామమే చైతన్యానికి గుర్తు, చెట్టులో, గుట్టలో, మనిషిలో, మనస్సులో మార్పు ఉంటూనే ఉంటుంది. మార్పు లేకపోతే శిలా సదృశమే. ఈ నాడు శాస్త్రీయంగా, సాంకేతికంగా సామాజికంగా ఎంతో అభివృద్ధి కన్పిస్తోంది. ఇదంతా మార్పులో భాగమే. ఆ మార్పు ఒక్కొక్కసారి మంచిని కల్గించవచ్చు; చెడుకు దారి తీయవచ్చు. ఏదైనా ఆ మార్పును స్వీకరించ వలసిందే.
సృష్టిలో మార్పు ఎంత సహజమో మనిషిలో కూడ మార్పు సహజం. పంచభూతాలకు ప్రతీక మనిషి. పంచభూతాల తత్వమే మనిషిలో ఉంటుంది.
గాలిని వీచకుండా ఆపలేం, నీటిని ప్రవహించకుండా ఆపలేం. ఆ చలనశీలమే మనిషిలో కనిపిస్తుంది. భౌతికంగాగానీ, ఆలోచనాపరంగాగానీ ఆధ్యాత్మికంగా గానీ మార్పులేకపోతే ఎదుగుదల లేదు. మనిషికి ఎన్నో అనుభవాలు జీవితంలో ఎదురౌతాయి. దాని నుంచి ఎంతో నేర్చుకుంటాడు.
‘జీవిత మొక రసమయ కావ్యం
క్షణం క్షణం నవ్యాతి నవ్యం’ – అంటారు కవులు. చూసే దృష్టి ఉండాలి. గాని జీవితంలో కాని ప్రకృతిలోకాని ప్రతిరోజూ ప్రతిక్షణం నూతనతత్వం గోచరిస్తూనే ఉంటుంది. ఈ నూతనత్వమే రామణీయకాన్ని సంతరింప చేస్తుంది. కానీ సాంకేతికంగా వైజ్ఞానికంగా ఎంతో అభివృద్ధి సాధించిన ఆ నాగరికతే ఒకొక్కక్కప్పుడు వినాశనాన్ని కలిగిస్తోంది. ఆ మార్పును చూసి భయపడుతున్నాం. కానీ తరాల మధ్య అంతరాలు పెరుగుతున్న ఈ కాలంలో మార్పు సహజం’ అన్న అమ్మ వాక్యం ఒక ఓదార్పుగా అనిపిస్తుంది. ‘ఏది సహజమో దానిని ఆహ్వానించాలి. అన్నింటిని ఎదుర్కొనే ధైర్యాన్ని పొందాలి’ అన్న సందేశాన్ని అమ్మ సమాజానికి అందిస్తోంది.
ఒకటిగా ఉన్న సద్వస్తులే ఇన్ని లక్షల జీవులుగా అనంత సృష్టిగా రూపు దాల్చటమే రూపాంతరం. సృష్టి, స్థితి, లయములు రూపాంతరములే. ‘ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపలనుండు లీనమై ఎవ్వనియందు డిందు’ అనే పోతనగారి పద్యసారం ఇదే, అక్షర పరబ్రహ్మ లీలా విశేషమే.
‘సర్వం తానైన తల్లి’ కనుకనే అమ్మ; ఈ సృష్టి పరిణామ శీలం కలది. దీనికి రూపాంతరమే కానీ రూపనాశనం లేదు” అంటూ పరమ సత్యాన్ని విస్పష్టంగా చాటింది.
(సశేషం)