(గత సంచిక తరువాయి)
- ‘సరే’ మంత్రం (3వ భాగం)
అమ్మ అవతారంలోని ప్రత్యేకత విశ్వమాతృత్వం. అమ్మ స్త్రీ రూపంలో ఒక సామాన్య గృహిణిలా కనిపిస్తుంది. కానీ అమ్మ విశ్వజనని. సదా అందరినీ పోషిస్తూ, ఆదరిస్తూ ఉన్న విశ్వశక్తే అమ్మ. భౌతికంగా దేహానికి జన్మ నిచ్చిన తల్లి ఒడిలోనో, బడిలోనో పెంచుతుంది. కానీ ‘అమ్మ’ కడుపులో పెట్టుకుని పెంచుతుంది; కంటి పాపలా సంరక్షిస్తుంది. “నేను మీ అమ్మను. ఈ లోకంలో తల్లిలేని వారెవరూ లేరు’ – అని తన విశ్వమాతృత్వాన్ని తెలియచేసింది. అందుకే సర్వకాల సర్వావస్థల యందు కూడ “నేను అమ్మను – మీరు బిడ్డలు” అనే చెప్పింది. ఏం చేసినా మారనిదీ, చెదరనిదీ ఎక్కడుంటే అదే మాతృతత్వం అని అమ్మ చెప్పినట్లుగా ఎన్ని పరిస్థితు లెదురయినా అందరినీ తన బిడ్డలు గానే ప్రేమించింది. విశ్వంలో జడ చైతన్యాలకు భేదం చూడకుండా అందరినీ, అన్నింటినీ బిడ్డలుగానే ప్రేమించిన అమ్మ విశ్వమాతృత్వం నుంచి ఆవిర్భవించింది “సరే మంత్రం”. అది విశ్వశాంతికి శ్వేతచ్ఛత్రం.
బిడ్డ తల్లికి సరెండర్ కావడం కాదు, తల్లే బిడ్డకు సరెండర్ అవుతుంది, అదే తల్లికి ఇష్టం, అదే తల్లి తత్త్వం అంటూ “మీరు నాకు సరెండర్ కావడం కాదు, నేనే మీకు సరెండర్ అయినాను” – అని చెప్పిన అమ్మ మాటల్లో సరెండర్ అంటే ‘సరే’ అనుకోవడమే.
ప్రేమస్వరూపిణి అయిన అమ్మ, “ఎదుటి వారెవరైనా ఏం చేసినా ప్రేమించ కల్గితే అదే నిజమైన ప్రేమ” అని ప్రేమను గురించి చెప్పిన నిర్వచనం సరే మంత్రానికి మరో రూపమే. మరొక సందర్భంలో “మీరంతా నా బిడ్డలే కాదు. నా అవయవాలు కూడ” – అన్న అమ్మ వాక్యం అమ్మ విశ్వరూపాన్ని సందర్శింప చేస్తుంది. అదే విధంగా “జగన్మాత అంటే జగత్తుకు మాత అని కాదు, జగత్తే. మాత” అని వాస్తవాన్ని తేటతెల్లం చేసింది. ఈ జగత్తే అమ్మ శరీరమైతే అందులో సమస్త ప్రాణికోటి అమ్మకు అవయవాలే. తన అవయవాలైన తన బిడ్డల యందు అమ్మకు ఏ లోపమూ కన్పించదు. ఉదాః- మన చేతి వ్రేళ్ళే. సమానంగా ఉండవు. అది వ్యత్యాసం అనుకోము. హెచ్చు తగ్గులు సృష్టికి సహజం అనీ, అవి సృష్టినడకకి మూలమైన ద్వంద్వాలు అని అనుకుంటాం. అలాగే మన శరీరంలో ఏ అవయవమూ మనకు వ్యతిరేకం కాదు. దేనినీ కాదనుకోలేము. అన్నింటినీ సరే అనుకుంటాం. అలాగే తన అవయవాలైన తన బిడ్డల యందు అమ్మకు ఏ భేదమూ కన్పించదు. అమ్మకు బిడ్డల పట్ల మక్కువేకాని ఎక్కువ తక్కువలు లేవు.
దేవుడిని గురించి చెప్తూ “దేవులాడినా దొరకని వాడే దేవుడు” అని ఉపనిషత్సారాన్ని స్పష్టం చేసింది. “ఎంత వెదికినా అది కానిది కన్పించడం లేదు” అని అద్వైత సారాన్ని కరతలామలకం చేసింది. కాని ఆలోచించి చూస్తే వాక్యవిన్యాసంలో వైవిధ్యం తప్ప వైరుధ్యం ఏమీ లేదు. మన దృష్టిలో గర్భాలయంలో ప్రతిష్ఠింపబడిన అర్చామూర్తే భగవంతుడు. కానీ దేవాలయమేకాదు, దేవాలయం ప్రహరీగోడ కూడ భగవంతుడే అనేది అమ్మ, దృష్టి. కనుకనే దేవుడ్ని తెలుసుకోవడం అంటే దేవుడు లేడని తెలుసుకోవడమే అని విశదీకరించింది.
ఒక జిజ్ఞాసువు “అమ్మా! రామకృష్ణ పరమహంస వివేకానందుడికి భగవంతుణ్ని చూపించారట కదా! మీరు నాకు చూపించరా!” – అని అడిగితే “అంతా దైవమే అయినపుడు వేలుపెట్టి ప్రత్యేకంగా ఎక్కడని చూపించమంటావు, నాన్న?” అన్నది. అమ్మ సమాధానం అంతా దైవమే అనే మౌలిక దృక్పథానికి దర్పణం పడుతుంది. భగవంతుడు అన్నింటిలో కాదు, అన్నీ అయి ఉన్నాడు: సర్వాంతర్యామి మాత్రమే కాక సర్వమూ తానే అయి ఉన్నాడు అని అమ్మపలుమార్లు ఉద్ఘాటించింది. కనుక ప్రతి ప్రాణిని ప్రేమించటమే దైవారాధన అన్నది. అమ్మకి భర్త, బిడ్డలు (సకల జీవరాశీ) అందరూ…. అన్నీ… ఆరాధ్యమూర్తులే. సర్వాన్నీ ప్రేమించ గలగటం అంటే ‘సరే’ అనుకోవటమే.
‘మాలో దైవాన్ని చూస్తావా?’ అని అడిగితే “మీలోకాదు, మీరుగా చూస్తాను” అని సరి చేసింది. “నేను మీ కంటే భిన్నంగా లేను; మిమ్మల్ని విడిచి నేనూ; నన్ను విడిచి మీరూ లేరు: మీరంతా నేనే మీదంతా నేనే – ఇదంతా నేనే; నేనే మీరు కాకపోతేగా; అంతానేనే అనుకున్నప్పుడు ప్రత్యేకించి భక్తులెవరు?” – అని పలికిన అమ్మ వాక్యాల్లో ఈ సకల సృష్టితో గల పరిపూర్ణ తాదాత్మ్యం కనిపిస్తుంది.
‘యస్మిన్ సర్వాణి భూతాన్యాత్మైవా భూద్విజానతః |
తత్రకోమోహః కః శోకః ఏకత్వమను పశ్యతః ॥’
ఆత్మదర్శనం పొందిన వారికి అంతా ఒకటిగానే కన్పిస్తుంది. వారికి శోకం గానీ మోహం కానీ ఏమీ ఉండవు. దేనితోనూ ఏ విభేదమూ ఉండదు. విభేదం ఉంటే సరే అనుకోవడం ఉండదు. అమ్మది అంతా తానే అనే స్థితి. అంతా తానే అంటే – అన్ని ఆలోచనలు, అన్ని మాటలు, అన్నిక్రియలు తానే గమ్యము, బాట, బాటసారి తానే అయినపుడు సరేగాక మరేముంటుంది? తానుగా ఉన్న “నేను నేనైన నేను” స్థితికి రెండు లేవు.
“అంతా అదే (సర్వ ఖల్విదం బ్రహ్మ) అనే విషయం మాటలలోకాక అనుభవానికి వచ్చినపుడు అద్వైతం” అని అమ్మ చెప్పినట్లుగా ఉన్నదొకటే… అదే సత్యం అదే నిత్యం, అదే దైవం. ఆ దైవానికి బాహ్య రూపం అనేకత్వం అంతర రూపం ఏకత్వం అనేకత్వంలో ఏకత్వాన్ని దర్శించిన అమ్మ ఎన్నో విషయాలను వివరించ గల్గింది.
‘ఉన్నదంతా అదే’ అని తన ఆత్మయే విశ్వమంతా దర్శించడమే సమదృష్టి. సమదర్శనం అంటే సర్వాన్నీ ఒకటిగా దర్శించడం. అంటే భిన్నదృష్టి లేక పోవడం. అన్నీ ఒకటిగానే కనపడటం. అదే ఆత్మ సాక్షాత్కారం. సర్వమానవాళికీ ఇదే అసలైన గమ్యం. మరి ఆ స్థితిని పొందిన వారికి మరి ‘సరేనే కదా!
రాజమ్మగారు అమ్మను ‘పరిపూర్ణత అంటే ఏమిటమ్మా?’ అని అడిగితే “సర్వత్రా భిన్నత్వం లేక పోవడమే” అని అమ్మ సమాధానం చెప్పింది. అమ్మ జీవితంలో అన్ని సన్నివేశాలలోనూ అమ్మ ప్రబోధించిన అన్ని వాక్యాలలోనూ పూసలలోని దారం లాగా అంతస్సూత్రంగా కనిపించేది ఈ సరే మంత్రమే.
‘ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక’న భిన్నత్వంలోని ఏకత్వమే బ్రహ్మ; ఆ బ్రహ్మే అమ్మ. కనుకనే అమ్మ ఒడిలో ఆస్తికులూ – నాస్తికులూ, హేతువాదులూ నిరీశ్వరవాదులూ, షణ్మతాలేకాదు. సకల మతాలూ, అందరి అభిమతాలు సేదదీరుతున్నాయి; ఐకమత్యంతో ఉన్నాయి. యోగులకు భోగులకు, యోగ్యులకు అయోగ్యులకు… సకలసృష్టికి అమ్మ విశ్వజనీన వాత్సల్యమే శ్రీరామరక్ష. అమ్మవాక్యమే ఆప్తవాక్యం. అమ్మ అందరి అమ్మ, అందరికీ అన్నిటికీ అమ్మ. ‘సత్యంచ అనృతంచ సత్య మభవత్’ అని అంటుంది వేదం. ఆ సత్యస్వరూపానికి సాకార రూపమే అమ్మ. కనుకనే అమ్మలో అన్నీ ఇముడుతాయి; అవయవాలై విరాజిల్లుతాయి.
అమ్మ అందరినీ అనుగ్రహిస్తుంది. అందరినీ సంతృప్తి పరుస్తుంది. అన్ని మతాల వారికీ, అన్ని దేశాల వారికీ, అన్ని ఉద్దేశాల వారికీ.. అందరికీ సమ్మతమైన సందేశాన్ని అనుగ్రహించింది. ఆ సందేశమే ‘సరే’ మంత్రం.