ప్రజ్ఞానాజ్ఞాన సందృష్ట పరబ్రహ్మైక్య భావనా ప్రజ్ఞానం, అజ్ఞానం రెంటినీ పరబ్రహ్మే’ అని అమ్మ ప్రవచించింది.
‘విజ్ఞానం చ విజ్ఞానం చ’, ‘సత్యంచ అనృతంచ’ సత్యమ భవత్. విజ్ఞానం, విజ్ఞానం, సత్యం – అసత్యం రెంటి కలయికే నిత్యసత్య స్వరూపం (దైవం) అయినది అని ప్రబోధిస్తోంది వేదం.
“అజ్ఞానం బ్రహ్మే” అని అమ్మ స్పష్టం చేసింది వేదమాత కనుక. కానీ ఆ మాట వినగానే మనస్సు కలుక్కుమంటుంది ఎవరికైనా ప్రప్రథమంగా; ‘సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ’ అని అంటే హాయిగా, ఆమోదయోగ్యంగా ఉంటుంది. దీనికి వివరణ “వెలుతురుకు ఆధారం చీకటి” అని అమ్మే స్వయంగా జ్ఞానామృతాన్ని గోరుముద్దలు చేసి తినిపించింది.
శ్రీ భావనారాయణ స్వామి కోవెలలో అమ్మ ఒకసారి కొబ్బరి చెక్క పగులగొట్టి, “చూశారా! ఒకటే అనేకమైంది” అని అన్నది. అమ్మ అన్నమాట సహజమైన, అందులో విశేషమేముంది? అనిపిస్తుంది. అందులో సృష్టిరచనా వైచిత్రి (ఏకం సత్ విప్రా బహుధా వదంతి, అజాయమానో బహుధా విజాయతే) స్పష్టం అవుతోంది తెల్సుకుంటే.
చాల వరకు శాస్త్రజ్ఞుల నూతన ఆవిష్కారాల (Inventions)కి భూమిక అజ్ఞానమే, అవి (accidental) దైవికము. కొన్ని ఉదాహరణలను పరిశీలించండి.
1.Alexander Fleming, Penicillin ను కనుగొనటం యాదృచ్ఛికం.
- చెట్టు నుంచి apple రాలి భూమి మీద పడితే అది సహజం అని అంటాం. ‘భూమిమీదే ఎందుకు (క్రిందికి పడింది? అని ప్రశ్నిస్తే కుంటి ప్రశ్న, గుడ్డి ప్రశ్న’ అని నవ్వుకుంటాం, ఎగతాళి చేస్తాం. ఆ ప్రశ్న Isaac Newton గురుత్వాకర్షణ సిద్ధాంత (F = GM.M1) ఆవిష్కరణకి రాచబాట వేసింది. D.
- Telescopeని వాస్తవంగా ఎవరు కనిపెట్టారు? గెలీలియో కాదు; కొందరు ఆకతాయి పిల్లలు. ఒక కళ్ళజోడు దుకాణం చెంత పారవేసిన కుంభాకార కటకాల్ని తీసుకొని వాటి ఆధారంగా ఒక ఆటగా దూరంగా చెట్టుమీద ఉన్న కాయల్ని ఖచ్చితంగా లెక్క చేసేవాళ్ళు. దాన్ని Hans అనే వ్యక్తి చూసి ఆ కటకాల్ని ఒక చట్రంలో బిగించాడు. Telescope ready! మరికొన్ని మెరుగులు దిద్ది 1611లో గెలీలియో ఖగోళ దూరదర్శిని (Astronomical Telescope) ని రూపొందించాడు.
అజ్ఞానమే జ్ఞానానికి ఆధారం. ఖాళీ పాత్రలోనే ఏదైనా పోసి నింపగలం. జ్ఞానలవ దుర్విదగ్ధుల్ని దేవుడు కూడా సమాధానపరచలేడు.
- గెలీలియో మహా మనీషి. Telescopeలో తదేకంగా సూర్యగమనాన్ని చూసి చూసి కళ్ళు పోగొట్టుకున్నాడు. ఆ రోజుల్లో భూమి బల్లపరుపుగా ఉన్నదని నమ్మేవారు. చంద్రగ్రహణం తర్వాత భూమి యొక్క గుండ్రని ఆకృతి చంద్రుని మీద పడటాన్ని చూసి భూమి గుండ్రంగా ఉన్నదని ఎలుగెత్తి చాటాడు. భూకేంద్ర సిద్ధాంతాన్ని ఖండించి, సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని బల్లగుద్ది చాటాడు. నిజం చెప్పినందుకు వారికి యావజ్జీవ గృహనిర్బంధ శిక్షను విధించారు. ఆ శిక్షాకాలంలోనే పదిమంది కళ్ళు తెరిపించి, తాను కళ్ళు మూశాడు శాశ్వతంగా. వారి పరిశోధన ‘భూమి సూర్యుని చుట్టూ తిరుగుతోంది’ అనే వాస్తవాన్ని అంగీకరించటానికి సమాజానికి 350 సం॥లు పట్టింది. ఏది అజ్ఞానం? ఏది
- 1903లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని ఫ్రెంచి శాస్త్రవేత్త Becquerel పొందారు. వేడి లేకుండా ప్రకాశించే పదార్థం (Phosphorescent Substance) ను Photographic plate పై పెట్టి నల్ల కాగితంతో కప్పి, సూర్య రశ్మిలో ఉంచి, ఆ సందర్భంగా ఎటువంటి రశ్మి వెలవడునో అని చాల కాలం ప్రయోగం చేశాడు. ఒక రోజున ఆకాశం మేఘావృతం కావటం వలన ఆ ప్రయోగ సముదాయాన్ని బీరువాలో ఉంచి, రెండు మూడు రోజులు పిమ్మట వచ్చాడు. ఆశ్చర్యం. అతని మస్తిష్కంలో ఒక ఆలోచన తటాలున మెరిసింది. ‘ఎండలో ఉంచక పోయినా చర్య జరుగునా?’ అని వెంటనే photographic plate ను Develop చేశాడు. అద్భుతం. చర్య జరిగింది అని తెల్సుకున్నాడు. ఇంకేముంది! అయత్నకృతం (Spontaneous) గా విచ్ఛేదం చెంది కిరణాల్ని విడుదల చేసే రశ్మ్యుద్ధారక (Radio active) పదార్ధాన్ని ఆవిష్కరించాడు. ఆ గామా కిరణాల్ని బెక్వెల్ కిరణాలు అని పిలుస్తారు.
ఇదే చాల ఆసక్తికరమైన ప్రధానమైన విషయం. అమ్మ అంటుంది, “థాట్ (Thought) వచ్చిందంటారు. ఎక్కణ్ణించి వచ్చింది? వచ్చిన తర్వాత తెలుస్తోంది. దానినే ప్రేరణ అంటాను” – అని.
మన ఆలోచనలన్నింటికీ ప్రేరణ దైవం. అజ్ఞానమూ – జ్ఞానమూ; ఆలోచన కలగటం – కలగక పోవటం… రెండూ దైవమే. “సర్వం ఖల్విదం బ్రహ్మ’ అని అంగీకరించిన తర్వాత ‘ప్రజ్ఞానం బ్రహ్మ,
అన్నం బ్రహ్మ, గురు బ్రహ్మ, వైద్యోనారాయణో హరిః, భార్యకు భర్త దేవుడు … అని మాత్రమే ఎందుకు విశ్వసిస్తున్నాం?
అమ్మ జ్ఞానస్వరూపిణి కాబట్టి ‘అజ్ఞానం బ్రహ్మ, అశుద్ధం బ్రహ్మ, శిష్యుడూ బ్రహ్మే, రోగీ నారాయణ స్వరూపుడే, భార్యా దేవతే…” అంటూ సంపూర్ణత్వాన్ని ప్రతిపాదించింది. అమ్మలోని ఈ విశిష్ట విలక్షణ తత్వాన్ని పురస్కరించుకొని ‘ఆధ్యాత్మిక చింతనలో సామ్యవాదాన్ని ప్రవేశపెట్టిన మహాప్రవక్త అమ్మ’ అని వర్ణించాడు రామకృష్ణ అన్నయ్య,
జ్ఞాన స్వరూపం అమ్మ:
సంపూర్ణత్వం అమ్మ.
గాయత్రీ మంత్రం “ఓం భూర్భువస్సువః…. ప్రచోదయాత్ లోని (సూర్య తేజస్సు మా బుద్ధులను ప్రేరేపించుగాక – అనే అభ్యర్థన) ‘ప్రేరణ’ గురించే అమ్మ ప్రస్తావించింది. జ్ఞానం, అజ్ఞానం రెండూ ‘భగవత్ప్రేరణ’ అనే నాణానికి బొమ్మ – బొరుసులు. జ్ఞానం యొక్క చరమదశ అజ్ఞానం. అజ్ఞానం యొక్క చరమదశ జ్ఞానం. కనుకనే జగదేకైక శాసని అమ్మ తెలిసిన వారికి తెలియదు; తెలియని వారికి తెలుసు.
ఒక సందర్భంలో అమ్మ అన్నది, “తెలుసుకోగా, తెలుసుకోగా… తెలుసుకోగా… చివరికి ఏమీ తెలియదని తెలుస్తుంది” అని. అభేద్యమైన సృష్టి రహస్యాల్ని ఛేదించాలనే తాపత్రయాన్ని విడనాడి, విశ్వనాటక రంగస్థలంపై వ్యక్తి తనకు నిర్దేశించిన పాత్రలో జీవించడం అజ్ఞానం అనిపించుకోవచ్చు; కానీ వస్తుతః అదే ప్రజ్ఞానం.