1. Home
  2. Articles
  3. Mother of All
  4. జ్ఞాన దీపికలు

జ్ఞాన దీపికలు

Bhattiprolu Lakshmi Suguna
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 12
Month : October
Issue Number : 4
Year : 2013

(గత సంచిక తరువాయి)

  1. ‘సరే మంత్రం’ (2వ భాగం) :

సామరస్యానికి దోహదపడే ‘సరే మంత్రం’ కుటుంబంలోనే కాదు సామాజిక అభ్యుదయానికి కూడ కారణం అవుతుంది. సమాజంలో ఒక సువ్యవస్థ ఏర్పడాలంటే సరయిన మంత్రం ‘సరే మంత్రమే’. ఏ వ్యవస్థ నయినా సరి చేయగల్గిది ఈ మంత్రమే. సమాజంలో అందరూ కలిసి మెలిసి ఉండి శాంతియుత సహజీవనం సాగించాలి; ఒకరి మనస్సును ఒకరు అర్థం చేసుకుని ప్రవర్తించాలి అంటూ ”సంగధ్వం సంవదధ్వం’ అనే వేదమంత్రం ప్రబోధిస్తున్నది. ‘మా భ్రాతా భ్రాతరం’ అంటూ అన్నదమ్ములు అక్కచెల్లెళ్లు, పరస్పరం ద్వేషభావం లేకుండా ఉండాలి అని మరో మంత్రం శాసిస్తుంది. ‘మిత్రస్యమా చక్షుషా’ – అందరూ నన్ను మిత్ర భావంతో చూడాలి. నేనందర్నీ మిత్ర భావంతో చూడాలి’ అని మరో మంత్రం హితాన్ని బోధిస్తుంది. ఈ వేదవాక్యం ఆప్తవాక్యం. దీనికి జాతిమత ప్రాంతీయ భాషా భేదాలు లేవు. ఈ విధంగా ఏ మంత్రాన్ని చూసినా భేదభావం లేకపోవడమే ఆర్షధర్మం అనీ, వసుధైక కుటుంబమే వేదసారం అని తెలుస్తోంది. ఈ సారాంశాన్ని అమ్మ రెండక్షరాల ‘సరే’ మంత్రంతో విశదీకరించింది. ‘సామరస్యపరాయణ’ అయిన అమ్మ సహజీవన వైభవాన్ని ప్రపంచానికి ప్రసాదించడానికి ‘సరే’ మంత్రాన్ని సాధనామార్గంగా చూపింది.

‘కలిసి తినాలి. కలిసి జీవించాలి’ అనే లక్ష్యంతో అందరిల్లు అన్నపూర్ణాలయం ఏర్పరచింది. ‘ఇక్కడ ఉండడమే సాధన. ఇది రావడానికీ, పోవడానికీ అడ్డులేని ఆవరణ’ అని చెప్పింది. ‘అందరిల్లు సదా జనసందోహంతో అన్నపూర్ణాలయంలోని గుండిగల, గరిటల చప్పుళ్ళతో, కోలాహలంగా ఉంటుంది. కనుక సాధనకు అవరోధం కదా’ అని అంటే, ‘ప్రశాంతంగా ఉండడానికి ఇది ఆశ్రమం కాదు. ఒక ఇంట్లో ఏం ఉంటాయో అవన్నీ అందరి ఇల్లు అయిన అందరింటిలో ఉంటాయి. అవన్నీ సహజంగా తీసుకోవాలి. అది సాధనకు ఏమాత్రం. అడ్డుకాదు’ అంటూ సహించడం, సర్దుకుపోవడం, మనకి నేర్పుతున్నది. కులమత వర్గ విచక్షణ లేకుండా అందరికీ సహపంక్తి భోజనం ఏర్పాటు చేసింది. ఇదంతా అమ్మ చెప్పిన సరే మంత్రానికి ఆచరణ రూపమే. సహపంక్తి భోజనం పట్టింపు కలవారికి తగిన ఏర్పాటు చేసింది.

అమ్మది సర్వసమాన దృష్టి వ్యక్తుల యోగ్యతాయోగ్యతల ప్రమేయం లేకుండా అందరినీ ఆదరిస్తుంది. ‘నా ఒడి విడిచి ఎవరూ లేరు’, ‘నా ఒడిలో మీరేం చేసినా భరించగలను’, ‘గుణ భేదమే లేని నాకు కులభేదం ఎక్కడిది?’, ‘నాది రాశీ బేరం’ – మొదలైన అమ్మ వాక్యాలన్నీ సరే మంత్రం అనే సూర్యబింబం నుంచి ప్రభవించిన కాంతికిరణాలే.

అమ్మ ఎవరి ఇష్టాన్నీ కాదనలేదు. ఎవరి అభిప్రాయాన్నీ ఖండించలేదు. అన్నింటినీ సమ్మతించింది. కనుకనే ‘సర్వ సమ్మతమే నా మతం’ అని ప్రకటించింది. ఈ వాక్యం సరే మంత్రానికి చక్కని వివరణ. ఇక్కడ మతం అంటే Religion అని కాదు; అభిప్రాయం అని. సర్వజన సమ్మతమే అమ్మ మతం; సర్వం అమ్మకు సమ్మతమే. అమ్మ తాను ప్రత్యేకంగా ఏ మత సంప్రదాయాల్ని పాటించదు. కానీ అన్ని మతాలనూ అంగీకరిస్తుంది. ఎవరికి ఏది ఇష్టమో దానినే అనుసరించమని అంటుంది. ఒకటి మంచి, ఒకటి చెడు అని లేదు. ఎవరికి ఏమతంలో విశ్వాసం ఉంటే ఆ మతమే మంచిది అంటుంది. ‘విశ్వాసమే భగవంతుడు’ అన్న అమ్మ వాక్యం అన్ని మతాలకూ, అన్ని కులాలకు వర్తిస్తుంది. మతం అనేది అందరూ సుఖశాంతులతో జీవించడానికి ఆచరించవలసిన జీవన విధానం.

‘చర్చలు కాదు, నాన్నా!, చర్చి లంటే ఇష్టం’ అన్న అమ్మ సన్నిధిలో క్రిస్మస్ పండుగ ఎంతో వేడుకగా జరిగేది. అమ్మకు అనుంగు బిడ్డలైన ముస్లిం సోదరులు ఎందరో ఉన్నారు: ‘రహి మనందరికి అగ్రజుడు. భగవద్గీత, బైబిల్, ఖురాన్… లసారం ఒకటే అయినట్లు ఆచరించే వాడికి ఏ మతమైనా ఒకటేననే వాస్తవాన్ని ప్రతిపాదించింది. అమ్మ యేసు క్రీస్తు, మరియమ్మ, మరియమ్మకూ అమ్మ అని విశ్వసించే వారున్నారు. అల్లాయే అమ్మగా అవతరించాడని నమ్ముతున్న వాళ్ళున్నారు. అలా ఎవరు ఏ రూపంలో భావిస్తే అమ్మదానినే ఆమోదిస్తూ ఆ మూసలోకి ఒదిగి అలాగే సాక్షాత్కరిస్తూ సంతృప్తి పరుస్తున్నది. అందుకే అన్ని మతాల వారికీ అమ్మ ఆరాధ్యమూర్తి, ఆప్తురాలు. అమ్మ ఎవరికి వారికి ఎక్కువ. అమ్మ హృదయాంతరాళంలో ఎవరి స్థానం వారిదే. ఎవరికి వారు అమ్మ తమ సిద్ధాంతాన్నే ప్రబోధిస్తున్నది అని విశ్వసిస్తారు.

భక్తి ఒకటే అయినా మార్గాలు అనేకం: కొందరు ఒక్కొక్క దైవాన్ని నమ్ముతారు. తమ ఇష్టదైవమే ఈ జగత్తు సృష్టి స్థితి లయలకు కర్త అని త్రికరణశు ద్ధిగా భావిస్తారు. ఉదా: శైవులు, శాక్తేయులు, వైష్ణవులు, గాణాపత్యులు. ఈ కారణంగా భక్తుల్లో కూడ వైరుధ్యం, ద్వేషం కలిగి ఎన్నో దారుణాలు జరుగుతూ ఉన్నాయి. ఈ వైరుధ్యమే మత విద్వేషాలకు దారి తీస్తోంది. ఉన్నదొక్కటే; అదే ఇన్ని రూపాలుగా గోచరమవుతోంది అని అంటుంది అమ్మ. కనిపించే ఈ వైవిధ్యంలో, భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శించగలిగినపుడు అమ్మ ఉపదేశించిన ‘సరే’ మంత్రం అనుభవంలోకి వస్తుంది.

కొందరు అమ్మ దరి చేరి ‘హరేరామ నామ సప్తసప్తాహాలు చేస్తాం. సన్నిధిలో’ అని అంటే, ‘రామనామం అమ్మనామం కాకపోతేగా!’ అన్నది.

‘నేను సరిపెట్టుకోవడం కాదు, నాన్నా!, నాకన్నీ సరిపోతాయి. శ్రీశంకర, రామానుజ, గౌడపాదు…. ఇలా అందరు చెప్పినవీ సరిపోతాయి. ఎందుకంటే ఉన్నది ఒకటే కనుక.

అన్నింటిలోనూ ఒకటినే చూడటం అద్వైతం. కళ్ళు రెండైనా చూపు ఒకటే. చెవులు రెండైనా వినేది ఒకటే. విషయాలు ఎన్నైనా గ్రహించే మనస్సు ఒకటే. భావమే అద్వైతం. అన్నం వండినా, జపం చేసినా భావం మాత్రమే ప్రధానం..

“నాకు అన్ని దారులూ, అన్ని సిద్ధాంతాలూ సరిపోతాయి. నేను సర్వ సిద్ధాంత సార్వభౌమను” – అన్నది అమ్మ. ‘సృష్టి అనాది; నాది’ అని ప్రకటించిన విశ్వాంతరాత్మ అమ్మకి మతాలూ, అని సిద్ధాంతాలూ పొత్తిళ్ళలో పసి బిడ్డలే. ‘నేనేమీ సాధన చేయలేదు’ అంటూనే అన్ని సాధన మార్గాలనూ అమ్మ సమ్మతించింది; అక్షరాలా తనలో దర్శింపజేసింది. ‘పూజ చేసుకుంటాము’, ‘యాగం చేసుకుంటాము’ – అంటే ‘సరే’ అన్నది. ‘నిన్నే చూస్తూ నీ దగ్గరే కూర్చుంటాను’ – అంటే ‘సరే’ అన్నది. సాధనలో ఇది గొప్పది, ఇది తక్కువది అని లేదు. ఎవరికి ఏది సాధ్యమైతే అది బాగుంటుంది; ఒకరికి ధ్యానం, ఒకరికి నామం, ఒకరికి ధర్మం – కర్తవ్య పరాయణత్వం. కనుకనే ‘సాధ్యమైనదే సాధన’ అని అమ్మ ప్రబోధించింది.

‘విగ్రహారాధన ఎందుకూ?’ అని అడిగితే ‘నిగ్రహం కొరకే విగ్రహారాధన’ లక్ష్యాన్నీ, ఉద్దేశాన్ని తెలియజేసింది. మరి విగ్రహారాధన వద్దు అనే వారి అని ఆ సంగతి ప్రస్తావించినపుడు ‘విగ్రహారాధన వద్దనే వారి ఉద్దేశం – నిగ్రహానికి విగ్రహాలే అక్కరలేదని కావచ్చు. కానీ మనస్సులో ఏదో ఒక రూపం పెట్టుకుంటూనే ఉంటారు. ఈనాడు విగ్రహారాధన వద్దనేవారు ఏమీ చూడొద్దని ఆకాశంలోకి చూస్తారు. ఆకాశం ఒక రూపం కాదూ, గుర్తు కాదు!’ అని విశదీకరించింది.

‘విగ్రహారాధన వద్దనడం తప్పు కదా!’ అంటే ‘నేను ఏదీ తప్పు అనను. నిత్యం ఏది చేయగలిగితే అదే సాధన అంటాను. అంతటా ఉన్న దైవాన్ని చేరడానికి అన్నీ మార్గాలే. నీకు ఏది హాయి ఇస్తుందో అదే నీ సాధన. సదా నీవు చేయకలిగేది సాధన. ఏది చేస్తే నీకు రెండోది అక్కరలేదో, ఏది చెయ్యాలని సదా నీకు అన్పిస్తుందో అదే నీ సాధన.

ఏదీ చెయ్యలేని వారే అదా, ఇదా అనే సందేహంతో అసలు చేయరు. కనుక ‘సాధ్యమైనదే సాధన’ -అని, మనిషి విధి నిషేధాలు అనే అడకత్తెరలో పడి నలిగిపోకుండా ‘సాధన’ అనే పదానికి సరైన అర్థాన్ని తెలిపింది; ఏదో చెయ్యాలి, దానిని తాను చేయలేక పోతున్నాను, ఇక తరణోపాయం లేదు అని ఒక విచార సాగరంలో పడి కొట్టుకుపోతున్న వారిని గట్టున పడవేసింది; ‘బ్రతుకు జీవుడా!’ అని ఊపిరి పీల్చుకునే రాజమార్గాన్ని

‘నీ ఉద్యోగంలో నీవు నీతి నిజాయితీలతో ఉండడమే నీ ధర్మం. దానిని సక్రమంగా పాటిస్తే మరింకేమీ అవసరం లేదు’ అని కర్తవ్యమే దైవమని, కర్తవ్యపాలనే దైవారాధన అనీ విస్పష్టం చేసింది. 

అంతే కాదు. సాధనలన్నింటికీ చరమదశ తృప్తే. ఆనందం తృప్తిలో ఉ ంది. సమయానికి ఏది వస్తే దాని కంతటికీ ఒడి పట్టడమే. శాంతి హృదయంలో కొలువై ఉండాలి కాని ఎక్కడికి పరుగులు దీసినా లభించదు. మహాయోగి మహాభోగి – అన్నింటికి సరే అంటే సరిపోతుంది. అది సరే అస్త్రం అని చెప్పింది. అది సార్వకాలిక సత్యం, శాస్త్రం కూడా.

ఆచారమూ, సంప్రదాయాల విషయంలో కూడ అమ్మది ‘సరే’ మంత్రమే. ఆచారమంటే ఆచరణే. ఆచరణలో చేయగలిగినదే చెయ్యమంటుంది అమ్మ. ఈ కట్టుబాటే గొప్పది, ఇంకొకటి తక్కువని ఏముంది! ఒక కట్టుబాటులోని సౌకర్యం దానికి కట్టుబడి సాగగల్గిన వారికి ఉంది. ఒక ‘మడి, తడి అవసరం లేదా?’ అన్న మాటకు సమాధానంగా ‘శుచిని ఆచరించేదే మడి’ అన్నది. ‘నీకు కావలసిన మంచి నీవు చేసుకో. పైవాళ్ళు చెప్పేది చెయ్యలేకపోయామని బాధపడకు. చెప్పే వాళ్ళకేం. గట్టుమీద కూర్చుని ఎన్నైనా చెప్తారు. నీటిలో పడి ఈదే వాడు తనకు వీలైనదే చేయగలడు. ఏ పద్ధతి అయితేనేం. ఆచరించడమే ఆచారం’  అంటూ ఆచరించిన దేనినైనా సరే అన్నది అమ్మ..

(…. సశేషం)

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!