అమ్మ ప్రత్యక్ష పరోక్ష ప్రేరణతో జిల్లెళ్ళమూడి దర్శించిన వారందరూ అదృష్ట వంతులే అని చెప్పాలి. ఎవరెందుకు అమ్మ సన్నిధికి రప్పించ బడ్డారో మన ఊహకు అందదు. అమ్మ తెలుసు
ఆ అమ్మా ఒక ఆడదేగా, చూసేదేమిటి, నమస్కరించేదేమిటి అని తేలిగ్గా తీసి పారేసి, చివరకు ధర్మకర్మ సంయోగం చేతనో, అమ్మ సంకల్పం వల్లనో, అమ్మ సన్నిధికి చేరి, అందరూ నమస్కరిస్తూ ఉంటే తన వంతు వచ్చేసరికి ఒక స్త్రీకి నమస్కారం చెయ్యను, సాగిల పడను అనుకుంటూండగానే మనశ్శరీరాలు తన అధీనం తప్పి. తుళ్ళిపడి, ఆ పడ్డం పడ్డం అమ్మ పాదాలమీద పడి, అసంకల్పితంగా అమ్మకు పాదాభివందనం చేశాడు సుబ్బారావుగారు. అమ్మ వాత్సల్య వర్షంలో తడిసిన మొక్క మహా వృక్షమైంది.
అమ్మను దర్శించి సేవించి తరించిన వారిలో అన్ని రకాలవారూ ఉన్నారు. పండితులు పామరులు, భక్తులు, తత్త్వవేత్తలు, జ్ఞానులు, పరమహంసలు.. పరివ్రాజకులు పీఠాధిపతులు ఇలా అన్ని తరగతుల వారూ, భిన్న భిన్న ప్రవృత్తులు వారూ తారసపడతారు. వృత్తి ఏదైనా, ప్రవృత్తి ఏదైనా అమ్మ పరిధిలోకొస్తే ఇక అమ్మ సేవే వృత్తి ప్రవృత్తులు! అన్నపూర్ణాలయంలో, కళాశాలలో, వైద్యశాలలో అన్ని చోట్లా ఎవరికి తోచిన సేవ వారు చేశారు. కొందరు రచనలతో, గ్రంథ ప్రచురణలతో అక్షరార్చన చేశారు. సుబ్బారావుగారు మాత్రం వేలాది అమ్మ. ఫొటోలు తీసి “ఛాయాచిత్రార్చన చేశారు. ఇవాళ ఇన్ని లక్షలమంది అమ్మను వివిధ రూపాల్లో, వివిధ భంగిమలలో దర్శించుకుని అర్చించుకుని తరించటానికి సుబ్బారావుగారి ఫొటోలు గొప్ప ఆలంబనగా నిలిచాయి.
వీరు ఆయుర్వేదం, హెూమియో రెండు వైద్యవిధానాలు తెలిసిన వారు. ఆయుర్వేద ఔషధాలు తయారీలో కూడా పరిజ్ఞానముంది. కర్రసాము, కత్తిసాము కుస్తీపట్లు, యోగాసనాలు వంటి అనేక వ్యాయామాలే గాక గురూపదేశాలు. పొంది భౌతిక ఆధ్యాత్మిక సాధనలు నిష్ఠగా చేసేవారు. ఆయుర్వేద, వ్యాయామాలు స్ఫురింపనే స్ఫురింపదు. మన తెలివితేటలు, పాండిత్యాలు ఈ విషయంలో ఎందుకూ కొరగావు. అమ్మ అలతి అలతి పదాలలో ఏ మాట చెప్పినా అలానే ఉంటుంది. అందుకే అమ్మ వాక్యాలు కలిగిన ఈ మీ రచనలు మావంటి వారికి వచనా మృతాలనిపిస్తూ, శిరోధార్యాలవుతున్నాయి.
తండ్రిగారి నుంచి వారసత్వంగా సంక్రమించినవి. ఇవిగాక వడ్రంగం, కంసాలి . వృత్తి బంగారపు పని వంటి సాంప్రదాయక వృత్తులలో ప్రవేశముంది. ఇంకా రేడియో, టేప్ రికార్డరు మెకానిజం, ఫొటోగ్రఫీ లాంటి ఆధునిక సాంకేతికతలలో కూడా మంచి పరిజ్ఞానముంది. ఇన్ని నైపుణ్యాలున్న వ్యక్తి ధనార్జన వైపు దృష్టి పెట్టలేదు. పెడితే లక్షాధికారి అయ్యేవారనటం అతిశయోక్తికాదు.
నోరి వెంకటేశ్వర్లుగారు వీరి దగ్గరకు వైద్యానికి వస్తూ ఉండేవారు. వారు అమ్మ గురించి పదేపదే చెప్పగా చెప్పగా 1957లో మొదటిసారి అమ్మను దర్శించారు. అప్పుడేమయిందో ముందే చెప్పుకున్నాం. ఆ తరవాత నుంచి రాకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడింది.
ప్రారంభ దినాల్లో వచ్చిన వారందరికీ అమ్మే వండి పెట్టేది కదా. అది అమ్మ అత్తగారు కనకమ్మ గారికి ఇష్టం లేదు. ఇలా అడ్డూ ఆపూ లేకుండా దోచి పెడుతూ ఉంటే ఎక్కణ్ణుంచి తెచ్చి పెడతాడు వాడు (నాన్నగారు) మాత్రం అని కోపంతో సణుగుతూ ఉండేది. ఒకనాడు ఆ కోపం తారాస్థాయికి చేరి గరిట కాల్చి వాత పెడదామనుకునే వరకు వచ్చింది. ఈ విషయాలు డాక్టర్ గారి దృష్టికొచ్చి – “అమ్మా! నువ్వు మాకోసం బాధపడటమెందుకు? మా ఏర్పాటు మేము చేసుకుంటాం, మీ దంపతులు అంగీకరించండి” అని అర్థించారు.
1958లో అన్నపూర్ణాలయం ఏర్పాటు చెయ్యటంలో చీరాల వారిదే ప్రముఖ పాత్ర. ఆ చీరాల వాళ్ళలో పొట్లూరి వారిదే ప్రముఖపాత్ర. ఆయనే అందర్నీ సమావేశ పరచి అన్నపూర్ణాలయపు ఆవశ్యకత తెలియచెప్పి, చందాలు సేకరించి, వంటసామగ్రి వగైరా కొని జిల్లెళ్ళమూడి చేర్చారు. 1958 ఆగష్టు 15న అన్నపూర్ణాలయం ప్రారంభ మయిన సంగతి అందరకు తెలుసు. పొంగలి ఎలా చెయ్యాలో చెప్పి డాక్టర్ గారి చేత చేయించింది అమ్మ. అన్నపూర్ణాలయంలో మొదటి వంటకం డాక్టర్ గారిదే. హైమాలయం దగ్గర బావి తవ్వించారు, అదే ప్రాంతంలో సందర్శకులకోసం పెద్ద తాటాకుపాక నిర్మించారు. అమ్మ జన్మదినోత్సవం జరపటం మొదలు పెట్టినది వీరే.
అమ్మతో అనుభవాలు
వీరు ఆధ్యాత్మిక గ్రంథాలెన్నో చదివారు. ఓరుగంటి నరసింహం గారి దగ్గర ఉపదేశం పొందారు. రామ్లాల్ ప్రభుజీ భక్తులు. వారిని ధ్యానంలో దర్శించాలని ప్రయత్నించారు కాని సాధ్యపడలేదు. అమ్మ ప్రభావంతో అంతర్ముఖులైనప్పుడు ప్రభుజీ దర్శనం అయింది. అనేక సాధనలు చేసిన వీరికి గరుడ మంత్రం, దాని సిద్ధి ఉన్నది. పాములు స్వాధీనం అయ్యేవి. ఆగు అంటే ఆగేవి. పాము కరిచిన వారికి మంత్రం వేస్తే విషం దిగిపోయేది. ఒకసారి కాంతయ్య యోగి గారికి గుండెనొప్పి వస్తే, వీరు గంధంచెక్కని సానమీద అరగతీస్తూ కొంచెం దిగిందా ఇంకొంచం దిగిందా అంటూ ఆ ప్రయోగంతో స్వామివారి నొప్పి పోగొట్టారు. కాలక్రమంలో ఇలాంటి ప్రత్యేకతలన్నీ అమ్మ ముందు నిస్తేజం నిర్వీర్యం అయిపోయినాయి. వీటి ఆవశ్యకత లేదు. సహజంగానే అని ఒక సందర్భంలో అభిప్రాయ పడ్డారు.
అమ్మ సమాధి స్థితిలో అనేక విదేశభాషలు మాట్లాడటం చూశారు. జిల్లెళ్ళమూడి నుండి అమ్మ పిలిస్తే చీరాలలో వీరికి వినపడేది. అలాగే కనపడిన సందర్భాలు ఉన్నాయి. ఒకసారి అమ్మ చీరాలలో డాక్టర్ గారింటికి వెళ్ళింది. తను జిల్లెళ్ళమూడి నుంచి పిలిచినపుడు ఆయన ఎక్కడ నిలబడినదీ, తను కనపడినపుడు ఎక్కడ ఉన్నదీ చెప్పింది.
అమ్మ అరుణాచలం వెళ్ళినపుడు రమణమహర్షిని దర్శించిందని మనకు తెలుసు. రమణులు ‘మాతృశ్రీ’ అని సంబోధించారని తాను ఎక్కడ కూర్చుని రమణులకు దర్శనం ఇచ్చిందో ఆ చోటనే రమణులు తల్లి స్మృత్యర్థం నిర్మించిన మాతృభూతేశ్వరాలయ నిర్మాణం జరిగిందని అమ్మ వీరితో చెప్పింది.
ఒకసారి అమ్మ, పొట్లూరి వారు ఏడవ మైలురాయి వరకు నడచి వెళ్ళారట. అప్పుడు అమ్మ ఇది తిరుపతిని మించిన క్షేత్రం అవుతుంది. సమీపంలో విమానాశ్రయం వస్తుంది. భూగర్భ జలాలు క్షీణిస్తాయి. పంటలు పండవు. ప్రపంచ క్షామం వస్తుంది. అంటూ భవిష్య ఘటనల గురించి చెప్పిందట.
ఆ ప్రాంతంలో రెడ్డిపాలెం కాంతయ్య యోగి ప్రసిద్ధులు. వారిని అమ్మ చెంతకు తీసుకువచ్చారు సుబ్బారావుగారు. అమ్మ వచ్చి దర్శనమివ్వగానే – అమ్మా గాయత్రీ ఇక్కడ ఉన్నావా? అని ఆర్తితో అన్నారు. ఇక్కడే ఉన్నానా అక్కడ లేనా? అని అడిగింది అమ్మ. కాంతయ్య యోగి ట్రాన్స్లోకి వెళ్ళి, మామూలు స్థితికి రావటానికి ఇబ్బంది పడుతూ ఉంటే వారి భృకుటి స్థానంపై అమ్మ వేలు పెట్టి నొక్కి, షట్చక్రస్థానాలు సరిదిద్దితే సాధారణ స్థితికి వచ్చారట. యోగి గారి ఈ అనుభవానికి సాక్షి డాక్టర్ గారు.
కొందరు స్నేహితులతో కలసి వీరు ఓరుగంటి నరసింహ యోగి వద్ద యోగవిద్య నేర్చుకునే వాళ్ళు. కారణాంతరాల చేత యోగిగారు లభ్యపడక శిక్షణ ఆగిపోయింది. నాకు ఒక సద్గురువు దొరికితే బాగుండును, గురువు చెప్పాలి, నేను విని ఆచరించాలి. అదే తోవలో పెడుతుంది అని భావిస్తూ ఉండేవారు. ఇంతలో అమ్మ దర్శనమయ్యింది. పొట్లూరివారి తండ్రి నీకు ఈ జన్మలో దైవ సాన్నిధ్యం లభిస్తుంది అని చెప్పారట. కొన్నాళ్ళ తర్వాత అమ్మ దర్శనం అయింది. ఒక సందర్భంలో అమ్మ ‘మీ నాన్న నిన్ను కుర్చీ పక్కన కూర్చో పెట్టుకుని ఏం చెప్పారు’ అని ఎప్పుడో మా నాన్న చెప్పిన విషయం జ్ఞాపకం చేసింది అంటారు.
“జన్మలు కావాలని ఇచ్చాను. ఆ నాటకం జరుగుతూ ఉంటుంది. ఒకసారి నిర్ణయింపబడింది. అది ఆగేది కాదు.” “నేను అనుకుంటేనే నీవు ఏది చేసినా, ఏం చెప్పాలన్నా, నీ చేతిలో ఏం లేదు” లాంటి వేదాంత వాక్యాలు చెపుతూ ఉండేది. అలా వీరి సంభాషణలలో 200 ప్రశ్నలకు జవాబు చెప్పింది.
జరిగేది చెపితే నిరోధిస్తాను అన్నారు ఒకసారి. అంతా చెప్పటం కాదు వినపడ్డా కనపడ్డా చెయ్యలేవు అంది అమ్మ. ఈ సంభాషణ జరిగిన కొంతకాలానికి వారి కుమారునికి జబ్బుచేసి సీరియస్ అయి చిన్న ఆపరేషన్ చెయ్యవలసి వచ్చింది. శస్త్ర పరికరాలు తీసుకొని ఆపరేషన్కి సిద్ధపడుతున్నారు. పిల్లవాడి వంక చూస్తూ ఒక దృశ్యం కనపడింది. పిల్లవాడు పోయినట్టు, నలుగురు మోస్తున్నట్టు, తను పక్కన నడుస్తున్నట్టు కనపడింది. చేతిలోని కత్తి వదిలేసి పొయ్యాడు అన్నారు. కొంతసేపటికి ఆ పిల్లవాడు చనిపోయాడు. చివరికి డాక్టర్ గారికి కనపడినట్లే ఆ నలుగురు మొయ్యటం అదీ జరిగింది. ఎంత ప్రయత్నించినా దానికి విరుద్ధంగా చెయ్యలేక పోయారు. అంతా తెలిసి, కనపడినా ఆపలేవు. అన్న అమ్మ మాటలు అనుభవంలోకి వచ్చాయి.
అమ్మ చరిత్రలో ఇద్దరు మహా వ్యక్తులు రహి, శ్యామల. వారిని చూసే అదృష్టం వీరికి కలిగించింది అమ్మ. ఒక సందర్భంలో “నువ్వు నాకు తల్లివి” అని చెప్పిందట అమ్మ. అప్పటి నుంచీ మీకెంత మంది పిల్లలు అని అడిగితే – తనకున్న ఎనిమిది మందికి అమ్మని కలిపి తొమ్మిది మంది అని చెప్పేవారు సుబ్బారావుగారు.
1994లో తాను తీసిన వేలాది ఫొటోలు, స్లైడ్స్, సినిమా రీళ్ళు, నెగెటివ్లు హైదరాబాదు సేవాసమితి వారికి అప్పచెప్పాలని హైదరాబాదు వచ్చారు. అయితే తను వెళ్ళ వలసిన చోటుకి ఎలా వెళ్ళాలో, ఏ బస్సు వెళుతుందో తెలియదు. స్టేషన్ బయట నిలబడ్డ వీరికి అమ్మ కనిపించి, ఎవరినో పిలిచినట్లు సంజ్ఞ చేసి అదృశ్యమయింది. వెంటనే ఒకాయన వచ్చి వీరిని బస్సు ఎక్కించి వెళ్ళాడు. తెచ్చిన అమూల్య సామగ్రి సమితి వారికి అందించటంలో ఆ విధంగా సాయపడింది అమ్మ.
ఒకసారి అమ్మ కృష్ణ వేష ధారిగా వచ్చి ఫొటో తియ్యరా అందట. ఈయన కృష్ణుడు ఇంత పొట్టిగా ఉంటాడా? అని హాస్యమాడితే, ఎంత ఉంటాడు. అనడిగింది అమ్మ. ఇంత అని ఊహించి చెప్పితే, వెంటనే అంత ఎత్తు పెరిగింది. కపాలభేదనం జరిగి, రక్తస్రావమై శిరస్సు పై భాగం మెత్తగా అవటం, పూజా సమయాల్లో దేవతా ముద్రలు అప్రయత్నంగా రావటం, అన్నమో, ప్రసాదమో ఎంతమందికి పెట్టినా అక్షయంగా మిగిలి ఉండటం వంటి అలౌకిక చర్యలు అతి దగ్గరగా గమనించే అవకాశం కలిగింది వీరికి.
అమ్మతో అంత చనువుగా అంత నిష్ఠూరంగా, అంత సరదాగా ప్రవర్తించినవారు అమ్మ పరివారంలో మరొకరు లేరేమో.
పకోడీలు చేసి పెట్టమని మారాం చెయ్యగలవాడు, అమ్మను నమ్మిన వాడిని నాకేమవుతుంది అని గరళం మింగి, ప్రాణం మీదకు తెచ్చుకుని అమ్మచే రక్షింపబడి, పిచ్చి వేషాలు వెయ్యకు అని చివాట్లు తిన్నవాడు, కృష్ణ వేషంలో ఉన్న అమ్మతో కృష్ణుడంత పొట్టిగా ఉంటాడా అని వేళాకోళమాడినవాడు, ఇంట్లో దొంగలు పడి ధాన్యం దోచుకుపోతే, ఈ యేడు తిండికీ ఇబ్బందే, నీ దయ ఇలా ఉన్నదమ్మా అని నిష్ఠూరమాడ గలవాడు డాక్టర్ గారు. ఇలా ఇన్ని పార్శ్వాలలో అమ్మతో అనుభవాలు పంచుకున్న అదృష్టవంతుడు.
బాగా వ్యాయామ సాధన చేసి, 70వ పడిలో కూడా ధృఢమైన ఆరోగ్యంతో ఉండే వీరు, అమ్మ వెళ్ళిపోయిన తర్వాత దిగులు చెంది, కృశించి, అమ్మలేని ఈ లోకంలో ఉండలేక నిష్క్రమించి అమ్మ ఒడిలోకే వెళ్ళిపోయారనిపిస్తుందని అంటారు సన్నిహితులు.
అమ్మ మానుష, అతి మానుష లీలలను అతి దగ్గరగా చూసి దివ్యాను భూతులు పొందిన వారు, సమర్పణ భావన తప్ప మరొక ఆలోచన లేకుండా అమ్మను సేవించుకున్న భాగ్యశాలి, తన సర్వమూ అమ్మకే అర్పణ చేసిన ధన్యజీవి, 1998 నవంబరు 11న అమ్మలో ఐక్య మయ్యారు.
(ఈ వ్యాసానికి ఆధారం : శ్రీయుతులు పి.ఎస్.ఆర్. ఆంజనేయ ప్రసాద్, మన్నవ దత్తాత్రేయశర్మ గార్ల రచనలు)