1. Home
  2. Articles
  3. Viswajanani
  4. డోలోత్సవము – కేశవశర్మ అన్నయ్య,

డోలోత్సవము – కేశవశర్మ అన్నయ్య,

Annamraju Murali Krishna
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 11
Month : August
Issue Number : 1
Year : 2010

నా భార్య శ్రీమతి సూర్యకుమారి (శశి)కి ఒక కోరిక కలిగినది. తిరుమలలో వలె అమ్మకు ఊంజల్ సేవ నిత్యం జరుగవలెనని తద్వారా వచ్చే డబ్బును సంస్థ అభివృద్ధికి ఖర్చు చేయవలెనని తలచి ఆ విషయమును శ్రీ విశ్వజనని పరిషత్ ఆఫీసువారికి తెలియపరిచినాము. తిరుమలలో వలె పెద్ద ఉయ్యాలను చేయించవలెనని తలచినాము. ఈ విషయము తెలియపరచిన కొద్దిరోజులలో శ్రీ తంగిరాల కేశవశర్మ అన్నయ్యగారి దగ్గర నుంచి ఫోన్ వచ్చినది. అమ్మ పూర్వము ఎప్పుడో చాలా కాలము క్రిందట ప్రసంగవశాత్తూ చాలమంది పసిపిల్లలను ఊయలలో వేసి ఉత్సవము జరపాలని సూచించినదట. శ్రీ విశ్వజనని పరిషత్ వారు ఈ ఊయల ప్రస్తావన శ్రీ కేశవశర్మ అన్నయ్యగారితో తెచ్చినపుడు ఆయనకు గుర్తువచ్చినదట. వెంటనే నాకు ఫోన్, అంత పెద్ద ఉయ్యాల వద్దు. మన అమ్మ గుడిలో పెట్టుకొనే విధముగా మరియు పవళింపు సేవకు గూడ సరిపడేటట్లుగా ఉయ్యాలను చేయించి యివ్వవలసినదిగా కోరి జనవరి 2009లో భోగిపండుగనాడు డోలోత్సవమును జరుపుదామని తెలిపి ఆ రోజుకు ఊయల జిల్లెళ్ళమూడికి చేరే విధముగా ఏర్పాటు చేయమని కోరాడు. అంతేగాక ఆ ఊయల కొలతలు కూడ చెప్పాడు. వారి ఆదేశానుసారము చాలరకముల ఉయ్యాలలను జూచి సంతృప్తి చెందక, గుంటూరులో ఒక వడ్రంగి మేస్త్రిగారికి చెప్పి ఉయ్యాలను అందముగా చేయవలెనని కోరాను. శ్రీ కేశవశర్మ అన్నయ్యగారు చెప్పిన కొలతలు ప్రచారము చాలా అందముగా చేసి భోగిపండుగ ముందు రోజు జిల్లెళ్ళమూడికి పంపాము. ఆ ఊయలలో స్పాంజి పరుపులు, బాలీసులు, దిండు ముఖమల్ గుడ్డతో చేయించి పంపినాము. భోగిపండుగనాడు అందరింటిలో సుమారు 138 మంది పసిపిల్లలకు ఒకేరకమైన చీరలతో ఉయ్యాలలను కట్టి మధ్యలో అమ్మకు చేయించిన ఊయలను పెట్టి అందులో అమ్మ, హైమ చిత్రపటమును పెట్టి డోలోత్సవమును చాలా వైభవంగా చేశారు. ఆ రోజున వచ్చినవారందరు ఉయ్యాల చాల బాగుందని మెచ్చుకోగా మేము చాల ఆనందపడ్డాము. ఆ తరువాత శ్రీ విశ్వజననిపరిషత్ ఆఫీసువారు నీవు ఉయ్యాల ఇచ్చావు కాబట్టి రోజు పవళింపు సేవచేసేటందుకు అమ్మ పంచలోహ విగ్రహమును చేయించి యివ్వవలసినదిగా కోరారు. శ్రీ కేశవశర్మ అన్నయ్యగారు విగ్రహము ఎలా ఉండాలో తెలియపరచి విగ్రహము కొలతలు కూడ యిచ్చినారు. వారు చెప్పిన కొలతల ప్రకారము అమ్మ పంచలోహ విగ్రహము హైదరాబాద్లో చేయించి గుంటూరుకు తెచ్చాము. గుంటూరు నుంచి అమ్మ పంచలోహవిగ్రహాన్ని ముందుగా మన్నవలోని అమ్మ గుడికి తీసుకొని వెళ్ళి అక్కడ కొంతసేపు వుంచి పూజలు చేసి అక్కడ నుంచి జిల్లెళ్ళమూడికి తీసుకొని వెళ్ళాము. జిల్లెళ్ళమూడిలోని మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల దగ్గర నుండి అమ్మ పంచలోహ విగ్రహమును రెండెడ్లబండి మీద మేళతాళాలతో అమ్మ నామసంకీర్తన చేసుకుంటూ ఊరేగింపుగా అమ్మ గుడికి తీసుకొని వెళ్ళాము. అమ్మ విగ్రహమును చూచిన వారంతా చాలా బాగున్నదని, అమ్మను చూచినట్లుగానే ఉన్నదని తెలిపినారు. ఆ పంచలోహ విగ్రహము బరువు 26 కేజీలు వుండటంతో గుడిలో వున్న పూజారిణులు విగ్రహమును రోజు మోయలేకపోయేవారు. అందుకని వారు అదేమి మోస్తారు, విగ్రహము ఇంకొకటి బరువు తక్కువగా వుండేటట్లుగా చేయించి యివ్వవలసినదని కోరారు. అదే విధముగా యింకొక పంచలోహ విగ్రహమును లోపల బోలుగా, చేయించి తేలికపాటి అల్యూమినియంతో నింపి యిచ్చాను. విగ్రహము 11 కేజీలు బరువు వున్నది. ప్రస్తుతం ఆ విగ్రహమునే అమ్మ గుడిలో వుంచి రోజూ పవళింపు సేవ చేస్తున్నారు. అమ్మ పంచలోహవిగ్రహములు రెండూ కూడా చాల చక్కగా అమ్మ పోలికలతో వచ్చినవి. మొదట యిచ్చిన 26 కేజీల విగ్రహమును అందరింటిలోని అమ్మ గదిలో పెట్టినారు. ఆ తరువాత ఇ.సి. మీటింగుకు జిల్లెళ్ళమూడి వెళ్లినపుడు అమ్మ కుమారుడు శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు అన్నయ్యగారు నాకు ఒక సలహా యిచ్చారు. అమ్మ పంచలోహ విగ్రహము మాదిరిగానే శ్రీ నాన్నగారిది కూడ ఒక పంచలోహవిగ్రహము చేయించితే ప్రతి సంవత్సరము మే 5వ తారీఖునాడు ఆ విగ్రహములకే కల్యాణోత్సవము చేయించుదామని తెలిపారు. నాన్నగారి విగ్రహము కూడాతయారు అయినది. Final Touches లో వున్నది వీలున్నంత  త్వరలో ఆ విగ్రహమును జిల్లెళ్ళమూడికి చేరుస్తాను. ఇది అంతా ఎందుకు తెలియపరుస్తున్నానంటే ఈ విషయంలో శ్రీ తంగిరాల కేశవశర్మగారు చేసిన కృషి, తపన అందరికి తెలియాలనే ఉద్దేశముతో…

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!