తత్త్వం అంటే ఏమిటి ? తత్త్వచింతన అంటే ఏమిటి? అని తెలుసుకోవాలి అని అనుకున్నాను. తత్త్వం అంటే తత్త్వం అంటే అది నీవై వున్నావు అని అర్థం. అది అంటే ఏది. “నాకు ఏది చూచినా ఏది తాకినా ఏది విన్నా అది తప్ప ఏమీ కనిపించడం లేదు నాన్నా” అన్నది అమ్మ. అది ఏది? అది ఆత్మ, అది బ్రహ్మ. ‘సర్వం ఖల్విదం బ్రహ్మ’ అన్నది ఉపనిషత్. అంటే ఇది అంతా బ్రహ్మమై వున్నది అని అర్థం. కనుక అమ్మకు అంతా బ్రహ్మమయంగా, ఆత్మమయంగానే కన్పట్టుతున్నది. ఆత్మ కనపడేది కాదు. కనుక అది అనుభూతమై వున్నదన్నమాట. అంటే ఇది అంతా బ్రహ్మగా, ఆత్మగా అనుభవము కలుగుతున్నది. ఈ బ్రహ్మ ఎవరు ? దానిని మనమెట్లా అనుభూతి పొందగలం? “అహం బ్రహ్మాస్మి” అన్నది ఉపనిషత్. అంటే ఆ బ్రహ్మ నేనై వున్నాను అని అర్థం. ఇక్కడ “నేను” అంటే ఎవరు ? మామూలుగా నేను అంటే ప్రతిజీవి నేను నేను అని చెప్పుకుంటారు. అంటే నేను గోపాలకృష్ణను. నేను పుల్లయ్యను. నేను ఎల్లమ్మను అని చెప్పుకునే విధంగా ప్రతి వానిలోనూ ఈ నేను అంతర్భూతంగానే వుంటూంటుంది. అంటే ఈ నేను ఈ దేహం కాదు. అంటే ఈ నేను దేహధారి అయిన ప్రతివానిని నేనుగనే భ్రమింప చేయుచున్నది. అసలు నేనెవరు ? ‘ముందర నీవు ఎవరివో తెలుసుకో’ అన్నారు మహర్షి రమణ. ఆ నేను ఎవరు? అని తెలుసుకో కోరడమే చింతన. అదే ఆత్మ చింతన. ఈ ఆత్మ చింతన చేయగా చేయగా మనం తెలుసుకొనేది ‘ఈ దేహం నేను కాదు’ అని. మరి ప్రతిజీవి ‘నేను’, ‘నేను’ అని చెప్పుకుంటున్నారు కదా! మరి ఈ నేను ఎవరు ? దీనిని గురించి తరచుగా అమ్మ రాల్చిన రత్నరాసులలో ఆణిముత్యాలలో మనము ఏరుకోతగినది సత్యమైనది. నిత్యమైనది అయిన “నేను నేనైన నేను” – “అన్ని నేనులు నేనైన నేను” అనునది మకుటాయమానమైనది. ఈ నేను నేనైన నేను అంటే ఏమిటి? ప్రతి జీవిలో ‘నేను’ అనే ‘నేను’ అని జీవులలో వున్న ‘నేను’, ‘నేను’ అనే “నేను” “నేనే” అనే అర్థం. అదే ‘అహం బ్రహ్మాస్మి’. ఆ నేనునే ప్రతివారిలో ప్రతివానిగా అమ్మకు బ్రాహ్మీభూతమగుచున్నది. అందుకే అమ్మ నీలో ఏమి చూచుకొనుచున్నావో అదే అందరిలో “చూడు అదే బ్రహ్మస్థితి” అన్నది అమ్మ. విశ్వజననిగ వెలయుచు ఈ సర్వజీవులను, సర్వసృష్టిని తన పిల్లలుగా భావించి తనను తాను అందులో చూచుకుంటూ అందరినీ ప్రేమిస్తున్నది. అమ్మ ప్రేమకు నోచుకోని చరాచరులు లేనే లేవు. ఇది అమ్మ ప్రేమతత్త్వానికి పరాకాష్ట. అటువంటి మాతృమూర్తి, “నేను తల్లిని మీరు బిడ్డలు” అని అంటూ “మీరు కానిది నేనేమీకాదు” అని తన బ్రహ్మత్వాన్ని మనందరికీ కూడా పంచుతున్నది. “అమ్మా ! నీవి బ్రహ్మ కడిగిన పాదములు కదమ్మా” అంటే, “మీరంతా బ్రహ్మకాకపోతే కదా అన్నది”.
“ఈ ‘బ్రహ్మ’ లేక ‘ఆత్మ’ లేక నేను “నేనును” తెలుసుకోవలెనంటే మీరంతట మీరు తెలుసుకోలేరు. నేనెవరో నేను తెలియపరుచుకుంటే మీరు నన్ను తెలుసుకోలేరన్నది” అమ్మ. దానంతట అది తెలియపరచుకోవలసినదే కాని మనం తెలుసుకోలేము.
అమ్మ ‘నేను’ అని వాడిన పదము అమ్మ వాఙ్మయములో రాటు తేలింది. కొన్ని ఆత్మపరంగా కొన్ని మాతృత్వపరంగా మనం అన్వయం చేసికొన్న రీతిలో మన హృదయాన్ని నింపుతాయి. ఇవి మన జీవితాలలో తెలియని మార్పును తీసుకుని రాగలవు. అమ్మ నుడివిన “మీరు నాలోనే పుట్టి నాలోనే పెరిగి నాలోనే లీనమౌతారు” అన్న అమ్మ వ్యక్తీకరించిన ఈ వాక్యములోని ఈ “నా” సృష్టి, స్థితి, లయకారిణి తనే అనే అర్థంలో ఆత్మపరంగానే చెప్పినట్లు ద్యోతకమౌతుంది. “మీరు అన్నం తినకపోతే మీరు చిక్కిపోతారు. మీకు పెట్టుకోకపోతే నేను చిక్కిపోతాను”. “లక్షమంది భోజనం చేసినా ఒక్కరు తినకపోతే నాకు బాధే” అన్న వాక్యాలలో మాతృత్వం పొంగి పొర్లుతుంది. అమ్మ నోట ఆత్మపరంగా రాలిన ఈ ఆణిముత్యాలు రవ్వలూ, రత్నాలూ ఈ ఆత్మచింతన ఆత్మజ్ఞానోన్ముఖుని గావిస్తాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు.