లోకంలో అందరిచే ప్రేమగా పి.యస్.ఆర్. అని పిలువబడే శ్రీ పోతరాజు సీతారామాంజనేయప్రసాద్ నాకు ఆత్మీయ బంధువు. సాక్షాత్తు నా సోదరి భర్త. నాకంటే వయసులోనే కాదు అన్నింటా పెద్ద. సాహిత్య ప్రస్థానంలో కవిత్వ నిర్మాణంలో వేదాంతతత్త్వ పరిశీలనలో ఆయన నాకంటే పెద్ద. నిజం చెప్పాలంటే జీవితంలో నాకు అన్నింటా పఠన ప్రదర్శన చేసినవాడు. నాకు మార్గనిర్దేశకత్వం చేసినవాడు. నన్ను సన్మార్గంలో ‘సత్’ మార్గంలో నడిపినవాడు. ఆయన వేదిక నెక్కి ధీర గంభీర స్వరంలో పద్యాలు చదువుతూ ఉంటే, నేను మంత్రముగ్ధుడనై ఆయన స్వరాన్ని, ఆ స్వరంలో దాగి ఉన్న విశిష్ట భావాల్ని ఆనందంగా, ఆహ్లాదంగా ఆస్వాదించే వాడను. అందువల్లనే ఆయన మార్గంలో కవితామార్గంలో తడబడుతూ ఆయన అడుగు వెంట అడుగు వేస్తూ నడిచాను. ఆయన కవితా మార్గంలో కదలాడాను. ‘పలికిన పల్కులన్నియును పద్యము లయ్యెడు తీరు నాది’ అన్నది శ్రీ పి.యస్.ఆర్. గారి పద్య స్వైరవిహారశైలి. ఆయన పద్యాల్లో కవిత్వం చిందులు వేస్తుంది. పాఠకులకు విందులు చేస్తుంది.
ఇంక శ్రీ పి.యస్.ఆర్.గారి వేదాంత నిష్ఠను అవలోకిస్తే, ఆయనది ఆచరణ యోగ్యమైన వేదాంతం. ‘అన్ని నేనులు నేనైన నేను’ అన్న మహావాక్యాన్ని అందించిన జిల్లెళ్ళమూడి అమ్మ ద్వారా పొందిన సర్వాత్మ తత్త్వం. విశ్వాత్మతత్త్వం. ఈ లోకంలో వేదాంతాన్ని వర్ణించేవారు కోకొల్లలు. కానీ వేదాంతాన్ని వైరాగ్యాన్ని జీవితంలో ఆచరణలోకి తేగలిగిన వారే చాలా అరుదుగా ఉంటారు. అట్టివారిలో శ్రీ పి.యస్.ఆర్ ఒకరు. తన పెద్దకుమారుడు ప్రేమకుమార్ మరణించిన విషాద స్థితిలో కూడా ఆయన ఉదాసీనంగా, నిర్లిప్తంగా ఉండిపోయారు. జరిగిన విషాదాన్ని సాక్షి స్వరూపంగా దర్శించగలిగారు. ‘వాసాంసి జీర్ణాని యధా విహాయ నవాని గృష్ణాతి నరోపరాణి’ అని భగవద్గీత చెప్పినట్లు, మృత్యువును కేవలం దేహాంతర ప్రాప్తిగా భావించ గలిగారు. ఆయన ఉపాధిలో ఉంటూ నిరుపాధిక ఆత్మతత్త్వాన్ని దర్శించగలిగారు. కఠోపనిషత్లో నచికేతునికి యముడు ప్రవచించిన మరణానంతర దశను, మరణానికి పూర్వమే అంతరంగంలో నిలుపుకోగలిగిన జీవన్ముక్తుడు శ్రీ పి.యస్.ఆర్. నేడు శరీర పతనానంతరం విదేహముక్తిని పొందిన ధన్యజీవి శ్రీ పి.యస్.ఆర్. ‘నేను అడిగిన ముక్తిని ఇవ్వనిదే, నిన్ను అడుగు కదలనివ్వను’ అని అమ్మ పాదాలపై పడి, పదాల ద్వారా ప్రార్థించి ముక్తుడైన ఆత్మనిష్ఠుడు పి.యస్.ఆర్.
‘యత్ర నాన్యత్ పశ్యతి, నాన్యత్ శ్రుణోతి, నాన్యత్ విజానాతీతి, సాభూమా’ అని ఛాందోగ్యం పలికినట్లు ఈ విశ్వంలోని అణువణువులో సర్వే సర్వత్రా ఆత్మ తత్త్వాన్ని దర్శించుకొన్న మహామనీషి శ్రీ పి.యస్.ఆర్. ‘ఏకమేవారి ద్వితీయమైన ఆత్మ తత్త్వాన్ని విశ్వంలో అనేకత్వంలో దర్శించుకున్న ధన్యజీవి శ్రీ పి.యస్.ఆర్.
‘దేహాత్మ బుద్ధ్యా దాసోహం, జీవాత్మ బుద్ధ్యా త్వదంశకః, ఆత్మ బుద్ధ్యాత్వమేవాహం’ అని ఆంజనేయుల వారు శ్రీరామునితో అన్నట్లు, శ్రీ పి.యస్.ఆర్. దేహాత్మబుద్ధిని జీవాత్మబుద్ధికి వీడి, ఆత్మబుద్ధితో నిశ్చలంగా నిలిచారు.
‘ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి’, ఎవరు దేన్ని ప్రియంగా భావించినా, సర్వం తనకు అత్యంత ప్రియమైన ఆత్మ కోసమే అని బృహదారణ్యకోపనిషత్తు పలికినట్లు, శ్రీ పి.యస్.ఆర్. ఈ లోకంలో ఎవరిని ప్రేమించినా, ఎవరిని అర్చించినా, ఎవరిని అనుసరించినా సర్వం ఆత్మనిష్ఠ కోసమే భావించారు. సంభావించారు.
‘యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా, పరబ్రహ్మ తత్త్వాన్ని గ్రహించలేక, అంతరింద్రియంతో సహా పంచ జ్ఞానేంద్రియాలు వెనుదిరుగుతాయి, అలా తైత్తిరీయం భావించిన ఆ ఆత్మతత్త్వాన్ని ఆ నిరుపాధిక ఆత్మనిష్ఠకు శ్రీ పి.యస్.ఆర్. ఉపాధితో ఉంటూనే, సాక్షిస్వరూపంగా దర్శింపగలిగారు.
పరాంచి ఖాని వ్యతృణత్స్వయం భూః
తస్మాత్పరాక్పశ్యతి నాంతరాత్మనే,
కశ్చిద్ధీరః ప్రత్యగాత్మానమైక్షత్
వృత్తచక్షురమృతత్వమిచ్ఛన్.
పరమాత్మ ఇంద్రియాలను బహిర్ముఖం చేసి
నిలిపాడు. కనుక మనిషి బాహ్య విషయాలనే చూస్తాడు. లోపలి పరమాత్మను చూడలేడు. కానీ ఎవడో ఒక ప్రజ్ఞావంతుడు అమృతత్వాన్ని కోరి, ఇంద్రియా లను నిగ్రహించి, అంతర్ముఖుడై పరమాత్మను దర్శిస్తాడు. ఆత్మసాక్షాత్కారాన్ని పొందుతాడు అన్నది కఠోపనిషత్. అలాంటి ప్రజ్ఞాశాలి మన పి.యస్.ఆర్. జీవించి ఉండగానే ఆత్మసాక్షాత్కారాన్ని పొందగలిగాడు.
మన పి.యస్.ఆర్ –
అమ్మను నమ్మినాడు, హృదయమ్మున సత్యము కొల్చినాడు, ఓ
కమ్మని రీతిలో బ్రతుకు కావ్యము చక్కగ అల్లినాడు, ధ్యే
యమ్మగు ముక్తికాంతనిల అందెను, తత్త్వపథమ్ము నందు ఆ
అమ్మను నిల్పుచున్, బ్రతుకు ఆలయమందున నిత్యమీధరన్.
ఔను మన పి.యస్.ఆర్. బ్రతుకును ఒక కావ్యంగా మలచుకొన్నాడు. గుండె గుడిలో విశ్వ జననిని నిల్పుకొన్నాడు. ధన్యజీవి పి.యస్.ఆర్.
శుభం భూయాత్