ఈ ప్రశ్న నన్ను అనేకసార్లు నాకు నేనే ప్రశ్నించు కోవటం దానికి ఏదో సమాధానం చెప్పుకోవటం పరిపాటి అయింది. ఈ రోజు ఎందుకో సమాధానం చెప్పుకోక తప్పదు అనిపించింది. మలం పోతే మనసు శుద్ధి అవుతుంది అని అమ్మ అన్న దాన్ని బట్టి అది శుద్ధి అయిన తరువాత ఆలోచన ప్రారంభించాను. నన్ను నేను చూసుకోవా లంటే అది ఒక వస్తువు కాదు చర్మ చక్షువులతో చూడటానికి. మరి మనోనేత్రంతో చూడవలసిందే. మనస్సును కేంద్రీకృతం చేయవలసినదే. దేనిమీద ? మనస్సు మీదనే చేస్తే ఏమొస్తుంది ? సమాధిస్థితి ఏర్పడుతుంది. సమాధి స్థితిలో తనను తాను తెలుసుకుంటాడా ? లేదు. మరి ఎట్లా. తనను తాను తెలుసుకున్న వారిని “జ్ఞాని” అంటారు. జ్ఞానం ఒకరు ఇచ్చేది కాదు. ఒకరు తీసుకునేది కాదు. అది తాను కావాల్సిందే.
అమ్మ ఒక చిన్న సులువు చెప్పింది. ఏమిటది. ప్రేమ. తనను తాను ప్రేమించినట్లుగా ఇతరులను ప్రేమించడం. ఇకపోతే కొంత తన పిల్లలను ప్రేమిస్తాడు. ఆత్మావై పుత్ర నామాసి అని అన్నారు కదా. కనుక తన పిల్లల్లో తనను తాను చూచుకుంటాడు. ప్రేమిస్తాడు. అందుకే అమ్మ అన్నది. నీ పిల్లలలో నీవు ఏమి చూస్తావో ఎట్లా ప్రేమిస్తావో అట్లాగే అందరినీ చూడు. అందరినీ అట్లాగే ప్రేమించు అంది. అప్పుడు అందరిలో అదే చూస్తాడు. అందరినీ అట్లాగే ప్రేమిస్తాడు. అందరిలో తనను తాను చూచుకుంటాడు. అదే బ్రహ్మస్థితి అన్నది అమ్మ. అందరిలో లయమైపోతాడు. అప్పుడు తనను తాను చూచుకున్నట్లే.