శ్రీవాణీ గిరిజా స్వరూపమయి రాశీ భూత మాతృత్వమై
ఆ వేదంబుల వెల్గునై వెలసి విశ్వారాధ్యయై దివ్య ను
శ్రీ వాత్సల్య మరీచి మాలిక శుభశ్రీ నించు నిల్లాలు నా
యావఛ్ఛక్తియు భావదీప్తి అనసూయాదేవి రక్షించుతన్
అని 50 యేళ్ళ క్రితం రాసుకున్నప్పటి నుండి ఆ మాతృ రక్షా వలయంలోనే జీవ యాత్ర సాగించారు. అది కూడా –
తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనా
ర్చనముల్ నేవయు నాత్మలో నెరుకయున్ సంకీర్తనల్ చింతనం
బను నీ తొమ్మిది భక్తి మార్గముల సర్వాత్మున్ హరిన్ నమ్మి స
జ్జనుడై యుండుట భద్రమంచు దలఁతున్ సత్యంబు దైత్యోత్తమా!
అన్నట్లు అంతటి భక్తి ప్రపత్తులతో చరించిన సజ్జనుడాయన. ( ఇక్కడ హరి బదులు అమ్మ అని మార్చుకుంటే సరిపోతుంది.)
దాదాపు 11 సంవత్సరాల క్రితం అమ్మ తత్త్వచింతన సదస్సు సందర్భంలో వారితో పరిచయం అయింది. ఆయన పరిచయ మొక భాగ్యం. తదాది వారు వర్షించిన వాత్సల్యం, నా రచనల విషయికంగా చూపించిన ప్రోత్సాహం మరపురానివి. ఇప్పుడు వారి గురించి రెండు మాటలు చెప్పుకో వలసిన సందర్భం వచ్చింది, అది విషాద నేపథ్యంలో, ఇలాంటి సందర్భం ఇంత తొందరగా వచ్చిందేమిటని నిర్వేదం, రాకుండా ఉంటే బాగుండునని ఆశ, కానీ తప్పదు. అగ్రజులు అమ్మ ఒడి చేరారన్న కఠోర సత్యాన్ని, అమ్మ సేవలో అమ్మ ప్రేమలో తవిసిన ఎందరో ధన్యజీవుల గురించి రాసిన, వారే ధన్యజీవిగా మిగిలారన్న వాస్తవాన్ని అంగీకరించక తప్పదు.
1962 సంక్రాంతి నాటి అమ్మ సభలో పద్యాలు చదివారు. అప్పటి నుంచి కవిగా లోకానికి తెలిసింది. ఆ సభావేదిక మీద తండ్రి పురుషోత్తమ రావు గారు, కులపతి గారు, మాతా మహులు కొప్పరపు వెంకటరత్నకవి వంటి ఉద్దండులు ఉండగా, క్రింద కూర్చున్న వీరిని పిలిచి తన మెడలో దండ తీసి పి .ఎస్.ఆర్ గారికి వేసింది అమ్మ. “ఈ స్థాన కవిగా” ప్రకటించింది!
వెనకటికి పుట్టుకతో మూగ వాడైన మూక కవి కామాక్షి పరదేవత ప్రసాదించిన తాంబూల కబళా స్వాదన చేసి మూకపంచశతి వాశాడని, బ్రహ్మం గారి వమనోచ్చిష్టం తిని జ్ఞాని అయిన సిద్ధయ్య గురించి చరిత్ర చెపుతుంది. శంకర భగవత్పాదులు సౌందర్య లహరిలో విలీయంతే మాత: తవ వదన తాంబూల కబళాః …. అని వర్ణించారు. అట్టి సన్నివేశం వీరి విషయం లోనూ జరిగింది. “ఇదిగో ఈ కవిత్వమూ ఈ సంపాదకీయ రచనలు అమ్మ ప్రసాదించిన భాగ్యంగా తెలుసుకున్నాను” అంటారు. ‘నేనేం పండితుణ్ణి కాదు. శ్రద్ధగా ఓ గురువు దగ్గర చదువుకోలేదు. ఈ నా రచనా వ్యాసంగమంతా నా ప్రతిభ కాదు. దాని ప్రభావం వల్లనే’ అని నా ప్రగాఢ విశ్వాసం అంటారు. ఆ విధంగా చూసే కన్ను వ్రాసే పెన్ను గల ప్రతిభా సంపన్నుడయ్యారు.
అమ్మ అనిర్వచనీయ అనంత వాత్సల్యానికి పాత్రులై, అమ్మ ఎన్నుకున్న వ్యక్తులలో ప్రత్యేక స్థానం పొంది, అమ్మ చరిత్రలో అందరింటి చరిత్రలో చిరస్మరణీయ పాత్ర పోషించారు పి .ఎస్.ఆర్. తన అవతార లక్ష్యం నెరవేరడానికి యోగ్యులైన కార్యకర్తలను అమ్మ ఎన్నుకుని అక్కున చేర్చుకుంటుందని అందరం అనుకునే మాట. ఆ దివ్య ప్రణాళికలో ప్రముఖ స్థానాన్ని పొందిన మాతృచరణ చారణ చక్రవర్తి శ్రీ.పి.ఎస్.ఆర్.
-శ్రీ ప్రసాదవర్మకామఋషి
అమ్మ సర్వ వ్యాప్తమైన చైతన్య శక్తి. ఏదైనా అమ్మ అనుకున్నట్లే జరుగుతుంది. మార్జాలకిశోర న్యాయ రీతిలో అమ్మ మనల్ని పట్టుకుంది, నడిపిస్తోంది అనే ఆలోచనతో చేతనయింది చెయ్యటమే తప్ప ఇంకో మార్గం లేదు, ఇంకో శరణ్యం లేదు అన్నది వీరి ఫిలాసఫీ ఈ వయసులో ఈ మాత్రం తిరుగుతున్నానంటే అమ్మ సేవలో నేనున్నాను గనుకనే అని వీరి విశ్వాసం. అందరింటి సాంప్రదాయం ప్రకారం అన్నగారు, వేష భాషా ప్రవృత్తులను బట్టి పితృ సామానులు, ఫ్రెండ్ ఫిలాసఫర్ & గైడ్ ఎందరికో.
వీరి రచనల గురించి చెప్పాలంటే అదే ఒక పెద్ద గ్రంథమవుతుంది. కల్యాణ వీణ, విజయ విపంచి, తులసీదళాలు గిరిబాల గీతాలు, ధన్యజీవులు, వంటి గ్రంథాలు 20కి పైగా వ్రాశారు. పద్యకావ్యాలు, వచన కవితలు, బుర్రకథ లాంటి పలు సాహిత్య ప్రక్రియలలో నూ సిద్ధహస్తుడనిపించుకున్నారు. దేని ప్రత్యేకత దానిదే. ఇవిగాక మాతృశ్రీ, విశ్వజనని పత్రికలకు పుంఖాను పుంఖంగా వాసిన సంపాదకీయాలున్నాయి. ఇవి అమ్మ మాటలను, అందులో అంతర్లీనంగా ఉన్న తాత్త్వికతను, భావ సౌరభాన్ని, అమ్మ సంస్థల తీరు తెన్నులను అవి కొనసాగవలసిన రీతి రివాజులను, ఎన్నెన్నో విషయా లను చర్చిస్తూ సాగినవి. అమ్మ యెడల అచంచల భక్తి ప్రపత్తులకి, అమ్మ సంస్థల పట్ల కమిట్మెంట్కి అక్షర సాక్ష్యాలు. కొన్ని సంపాదకీయాలకు పరిశోధన పత్రాల విలువ ఉన్నదంటారు పొత్తూరి వెంకటేశ్వర రావుగారు. ఇవన్నీ ఒక ఎత్తు – “ఆదర్శ మూర్తి -ఆచరణ స్ఫూర్తి జిల్లెళ్ళమూడి అమ్మ” పారాయణ గ్రంథము, ధన్యజీవులు ఈ రెండూ ఆయనను మాతృరస సిద్ధుణ్ణి, చిరంజీవిని చేశాయని నా భావన. ఒకటి భగవతి చరిత్ర మరొకటి భాగవతుల చరిత్ర.
2013 ఏప్రిల్ లో అనుకుంటా నా వ్యాసం 7వ
మైలురాయి’ చూసి, వెంటనే ఫోన్ చేసి ‘ఎంతో
అధ్యయనం చేస్తే గాని ఇలాంటి రచన చెయ్యలేరు. బావుంది, ముందుకు సాగండి’ అని ప్రోత్సహించిన సౌజన్య శీలి, ఒకసారి గుంటూరులో వారింటికెళితే వారు చూపిన ఆదరం మరువలేనిది. కొంత అమ్మ సాహిత్య చర్చ తరువాత, మేడమీద గదికి తీసుకెళ్లి, వారి రచనలు, కులపతి గారి గ్రంథాలు ఏమేం కావాలో తీసుకోండని, అనేక గ్రంథాలు బహూకరించారు. అలాగే వారి తలిదండ్రుల పేరున ప్రతి సంవత్సరం దంపతులకు నూతన వస్త్రాదులతో సత్కరించటం జరుపుతున్నారు. ఆ పరంపరలో ఆప్యాయత, అదృష్టం తప్ప అర్హత ఏమాత్రం లేని మాకూ ఆ సత్కారం చేసి గౌరవించారు.
అమ్మభక్తిలో, సాహిత్యానురక్తిలో, పాత్రికేయ ప్రవృత్తిలో అన్నిటా తన ప్రతిభా ముద్ర వేసిన పట్టభద్రులు. వారి వ్యక్తిత్వంలో గ్రంథ రచన, విశ్వజనని, మౌనప్రభల సంపాదక బాధ్యతలు ఒక పార్శ్వ మైతే, ఆదరణ, స్నేహశీలత, వదాన్యత మరో డైమన్షన్ .
వేయి మాటలేల – అమ్మ ప్రేమలో ఆమ్మ సేవలో ఎంతగా మమేకమయ్యారో తెలియటానికి కులపతిగారు చెప్పిన ఈ రెండు మాటలు చాలు.
“మాతృశ్రీ పదపద్మ భంభరముగా మాధుర్యమున్ గ్రోలుచున్ నాతో చెప్పడుగాని వాని కదియే నాకమ్ము లోకంబునన్ ” “మాతృశ్రీ ఆనసూయ వాక్కులన్ సంభావించిన వాడు
శ్రీ తత్త్వంబులు దేవతా మహిమలన్ జిల్లెళ్ళమూడిన్ కనెన్, అతడంతర్లీనుడా భూమికన్”
అమ్మ తత్త్వసౌరభ వ్యాప్తికి, అమ్మ సంస్థల కీర్తికి అహరహం తపన పడ్డ అవిశ్రాంత సేవాతత్పరులు. ఆయనొక తపస్విలా మాతృ సాహిత్యాన్ని శ్వాసిస్తూ తనను తాను మననం చేసుకుంటూ ఆత్మాన్వేషణ స్థితిలో అమ్మ ఒడికి ప్రస్థానం చేసి అమరులయ్యారు. ధన్యజీవికి అశ్రుపూరిత అక్షరాంజలి. ***