శ్రీరాముని అవతార కాలంలో ఉన్న గుహుడు, విభీషణుడు, శ్రీకృష్ణుని అవతార కాలంలో ఉన్న కుచేలుడు, గోపికలు, యాదవులు ధన్యులు. నిజం. కానీ, అవతార పరిసమాప్తి చేసిన తర్వాత కాలంలో ఎందరెందరో మహనీయులు ఈశ్వర కళ్యాణ గుణగానం చేసి, భజించి, తపించి, తరించారు. శ్రీ రాంకపిల్ శర్మ అమ్మను భౌతికంగా చూసి ఉండలేదు. వృత్తిరీత్యా ఎందరితోనో పరిచయాలు, documentary film నిర్మాత. ప్రవృత్తి రీత్యా ఆధ్యాత్మిక సౌభాగ్యవంతుడు, నిజాయితీ పరుడు, చేతల మనిషి, నిరాడంబరమూర్తి. ఏ పని చేసినా ఏకాగ్రత, ఆరాధన, అంకిత భావంతో ఒక తపస్సుగా జీవించారు.
రాం కపిల్ శర్మ అమ్మ సేవలో తరించటానికి కారకులు శ్రీ గంటి కాళీప్రసాద్. 2000 లో పూర్తి నిడివిగల అమ్మ చలనచిత్రాన్ని C.D. గా రూపొందించాలని సంకల్పించి శ్రీ టి. రాజగోపాలాచారి, శ్రీ సింహాద్రి, శ్రీ కాళీప్రసాద్ ముందుకు వచ్చారు. వారి లక్ష్యం ఏమంటే అమ్మ సినిమా’ని ఒక T.V.Channel ద్వారా ప్రసారం చేయాలని సో॥ కాళీప్రసాద్ తనకు పరిచయమైన ‘శ్రీధర్ డిజిటల్ రికార్డింగ్ స్టూడియో’ వారితో సంప్రదించారు. అందుకు సమర్థులు శ్రీ రాంకపిల్ శర్మ అని తెలుసుకున్నారు. కాగా, సినిమా ఫిల్మ్ రంగులు పోయి T.V ప్రసారానికి అనుకూలంగా లేదని తేలింది.
ఆ సమయంలో శ్రీ కాళీప్రసాద్ శ్రీ శర్మగారికి ‘అమ్మ జీవిత మహోదధి’ గ్రంథాన్నిచ్చి, మనమే ఒక Telefilm తీద్దామన్నారు. కాగా తాను నిర్మాణ వ్యయాన్ని భరిస్తా కానీ ప్రతిఫలం ఇచ్చుకోలేనని చెప్పారు. శ్రీ శర్మగారు అమ్మ చరిత్ర రెండు మూడు సార్లు చదివారు; నిండు మనసుతో అమ్మ Telefilm తీయటానికి సమ్మతించారు.
అంతే. శ్రీ రాంకపిల్ శర్మ తపస్సు ఆరంభమైంది; ఒక ఏడాదిలోనే Telefilm Script వ్రాసుకున్నారు; T.V. నటీనటుల్ని కలునుకున్నారు; అందరింటి సోదరీ సోదరులను సంప్రదించారు, శ్రీ రాజుబావ గారితో పాటలు వ్రాయించుకున్నారు; అమ్మ దర్శనం చేసికొని అమ్మ ఆశీస్సులతో ‘విశ్వజనని’ అమ్మ Telefilm ను జనరంజకంగా రూపొందించారు.
తత్త్వతః వారి మనోమందిరంలో అమ్మ సుప్రతిష్ఠిత అయింది. కనుకనే వారి మాతృయజ్ఞం కొనసాగుతూనే ఉంది. శ్రీ కాళీప్రసాద్ గారికి ఒకటి రెండు సార్లు సద్గురు శ్రీ శివానందమూర్తి గారిని సందర్శించుకునే భాగ్యం కలిగింది భాగ్యనగరంలో, శ్రీ రాంకపిల్ శర్మ Cam era, lighting ఇత్యాది సకల సౌకర్యాలతో వచ్చి శ్రీ శివానందమూర్తి గారు అమ్మను గురించి చేసిన ప్రసంగాల్ని వీడియో తీసి C.D. లుగా చేసి అందించారు. అవి మన సోదరీ సోదరులకు బహుధా ఉపయుక్తంగా ఉన్నాయి.
తర్వాత 2008 లో శ్రీ కాళీప్రసాద్ అన్నయ్యగారు ఒక ప్రాజెక్ట్ సంకల్పించారు. అమ్మ మహితోక్తులు సామాన్య జనబాహుళ్యానికి అందించాలి. అని. ఆ బాధ్యతనూ శ్రీ రాంకపిల్ శర్మ తీసుకున్నారు; అమ్మ సాహిత్యం అమ్మ తత్త్వం అవగాహన గల శ్రీ P.S.R, డా|| సుగుణ వంటి సోదరీసోదరులతో సంప్రదించి 50 అమ్మ వాక్యాలకు వివరణ తీసుకున్నారు. ఒక చిత్రకారునిచే ఆ భావాలకి నిలువెత్తు రూపాలుగా చిత్రాలు గీయించారు, స్వయంగా పాటలు వ్రాశారు. శ్రీమతి నిత్యసంతోషిణి వంటి ప్రఖ్యాత గాయనీ గాయకులచే పాడించి, Script voiceover చెప్పించి, Video D.V.D. లను రూపొందించారు. అది హైదరాబాద్ లోనూ, జిల్లెళ్ళమూడిలోనూ, ‘మాతృవేదం’ పేరిట ప్రదర్శింపబడి విశేష ప్రజాదరణకు నోచుకున్నది.
శ్రీ కాళీప్రసాద్ అన్నయ్య, శ్రీ రాంకపిల్ శర్మ గారల సంయుక్త కృషి ఆగలేదు. ‘మాతృ వేదం’ Cassette కు లభించిన స్పందన చూచి దానిని హిందీ, English భాషలలోకి అనువదించాలని సంకల్పించారు. శర్మగారు ఆ సందర్భంగానూ కృతకృత్యులైనారు. ‘పుష్పార్చన్ హై మాతాకో – హృదయార్పణ్ హై అమ్మకో” అనే పాటను చిత్రీకరిస్తూ శ్రీ రవి అన్నయ్య, శ్రీ నరసింహమూర్తి అన్నయ్య ప్రభృతులను పరిచయంచేశారు.
సో॥ శ్రీ రాంకపిల్ శర్మ నిజ జీవితంలో ఎన్నో సవాళ్ళను అవరోధాల్ని ఎదుర్కొని అధిగమించి ‘Master of Communication and Journalism’ ఉతీర్ణులైనారు. ఎన్నో T.V.Channel కార్యక్రమాలు, వాణిజ్యప్రకటనలు, episodes కు Script writer, Lyric writer, Editor, Director and Producer గా మేలైన సేవలందించి విజయవంతం చేశారు.
జయప్రదంగా సార్థకంగా అన్ని Projects చేసి సాటిలేని మేటి నైపుణ్యాన్ని సాధించారు. తన ప్రజ్ఞ సర్వస్వాన్ని ముద్దచేసి అమ్మ సేవలో కర్పూర హారతి పట్టారు; అమ్మ అనంత శక్తి, అనురాగ దీప్తి, సందేశవ్యాప్తికి విశేష కృషిచేసిన శ్రీ రాంకపిల్ శర్మ (శ్రీ చీమలమర్రి రాధాకృష్ణ శర్మ) హైదరాబాద్లో 28-11-12 న అమ్మలో ఐక్యమైనారు. తపస్వి శ్రీ రాంకపిల్ శర్మ అన్నయ్యకి ఇదే ఆత్మీయ నివాళి.