“తమస్సు అంటే అజ్ఞానం. దీనికే ‘అవిద్య’ అని పేరు. అవిద్యారూపమైన అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞాన దీధితులను ప్రసరించే శ్రీమాత ‘తమె పహా’. తమస్సు అంటే చీకటి. తమోగుణం కూడా. చీకటిలో కొట్టుమిట్టాడేవానివలె తమోగుణంతో నిండిన జీవుడు తల్లడిల్లుతూ ఉంటాడు. దేవిని ఆరాధిస్తే జీవుని అజ్ఞానాన్ని పోగొట్టి, జ్ఞానదీప్తిని ప్రసాదిస్తుంది. కనుకనే ఆమె ‘తమో_ పహా” – “భారతీ వ్యాఖ్య”.
సామాన్యమానవులమైన మనం అజ్ఞానమనే అంధకారంలో కొట్టుమిట్టాడుతూ ఉంటాం. అజ్ఞానమంటే అవిద్య. సౌందర్యలహరిలో “అవిద్యానా మంత స్తిమిర మిహిర ద్వీప నగరీ…” అని శంకరా చార్యులవారు అమ్మను స్తుతించారు. మనస్సులో అజ్ఞానాంధకారం ఉన్నవారికి సూర్యుడు ఉదయించే పట్టణం నువ్వే అని దీని భావం. సూర్యకిరణ ప్రసారంతో చీకటి ధ్వంసమైనట్లు, మనలోని అజ్ఞానమనే చీకటిని తొలగించగల తల్లి శ్రీమాత. అమ్మవారిని ఆరాధించిన వారికి మనసులోని అజ్ఞానమనే చీకటి తొలగిపోయి, జ్ఞానమనే దీపం ప్రకాశిస్తుంది. అందువల్లనే శ్రీలలిత ‘తమో పహ’.
“అమ్మ” ‘తమో పహ’. అజ్ఞానం అంటే ఏమిటో “అమ్మ” చాలా స్పష్టంగా చెప్పింది. “రెండుగా కనబడడం అజ్ఞానం” అని చెప్పి, ఇంకా వివరిస్తూ, “రెండుగా లేనిదాన్ని రెండుగా చేసి మాట్లాడు కుంటున్నాం” అన్నది. అంతటా నిండి ఉన్న భగ వంతుడిని చూడలేక – పరమాత్మ వేరూ, కనపడుతున్న చరాచర సృష్టి వేరు అనే భ్రాంతిలో మనం ఉన్నాం. అందుకే “ఒకటి రెండుగా అన్పించటమే భ్రమ”, “రెండుగా తోచడం మాయ” అని అమ్మ స్పష్టంగా చెప్పింది. “రెండు లేనివాడూ, రెండూ అయినవాడూ భగవంతుడు” అని కూడా చెప్పింది “అమ్మ”. భగవంతుడు ఎక్కడో ఉన్నాడు. మనకు కనిపించడం లేదు అని ఆవేదనతో, ఆర్తితో అలమటిస్తున్న మనకు “వాడు కనిపిస్తూనే ఉన్నాడు. నువ్వు గుర్తించడం లేదు” అని తేటతెల్లం చేసింది. అయితే ఎక్కడ ఉన్నాడు? ఎలా ఉన్నాడు? నేనెందుకు చూడలేకపోతున్నాను? లాంటి భావాలు మన మనస్సులో చుట్టుముట్టి మనల్ని బాధిస్తూ ఉంటాయి. ఈ బాధ పోగొట్టడానికా అన్నట్లు “అమ్మ” – “భగవంతుడు అన్ని రూపాలలోనూ ఉన్నాడు” అని కనిపిస్తున్నదంతా భగవంతుడే అని స్పష్టం చేసింది. “అన్నింటిలో తానే, అన్నీ తానే కనుక”నే దైవం సాక్షీభూతుడు అని చెప్తూ, “అంతటా ఉన్నదాన్ని వెతుక్కోవటం ఏముందీ? దృఢం అవడమే” అని భగవంతుడు ఎక్కడోలేడని, కనిపిస్తున్నదంతా ఆయన స్వరూపమే అనే విషయం మనం దృఢంగా నమ్మడమేనని వివరించింది. ఇంకా తేలిక చేసి చెప్తూ “రూపం తేడా. అన్నీ దైవమే” అన్నది.
“వాడొక మూల ఉండి మనచేత చేయిస్తున్నాడని నేననుకోవట్లేదు. మిూలాగే వాడో, అదో, మనస్సో సర్వత్రా ఉన్నాడనుకొంటున్నాను -” అని భగవంతుని సర్వవ్యాకపత్వాన్ని విశద పరచి, వైకుంఠంలోనో, కైలాసంలోనో హరిహరుల రూపాలలో ఉన్నాడనుకునే మన అజ్ఞానపు పొరలను తొలగించింది. “దైవత్వం అంటే నాలుగు చేతులూ, కిరీటమూ కాదు” అని మనం కల్పించుకున్న రూపాన్ని ఒక్క వాక్యంతో పటాపంచలు చేసింది “అమ్మ”.
“ఉన్న ఆ ఒక్కటీ అర్థం కానంతవరకూ రెండుగానే కనపడుతుంది” అనే వాక్యం మనం భగవత్స్వరూపాన్ని చూడలేకపోవటానికి, భగవత్తత్త్వాన్ని అర్థం చేసుకోలేకపోవటానికి మన అజ్ఞానమే కారణం అని తెలియచేస్తుంది. “ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకోవటమేగా జ్ఞానం” అని జ్ఞానం అంటే ఏమిటో చెప్పి, “నేను మీకంటే భిన్నంగా దేవుణ్ణి చూడలేదు” అని చెప్పిన జ్ఞాన స్వరూపిణి “అమ్మ”.
అయితే, ఎక్కడో లేడు, మనలోనే, మనతోనే ఉన్నాడు అనుకుంటూ ఉంటే ఇంకా ఈ పూజలెందుకు? వ్రతాలెందుకు? అనే ప్రశ్నలు మనల్ని వెంటాడుతాయి. ‘జ్ఞాన జ్ఞేయ స్వరూపిణి’ అయిన “అమ్మ” వాటికి కూడా చక్కని సమాధానరూపంలో చిక్కని సందేశాన్ని అందించింది. “ఇదంతా అదే నన్న భావం ఏర్పడటానికే ప్రత్యేక ఆరాధన”, “నామ రూపాలు లేనివాడిని చూడటానికి నామాన్ని చేస్తున్నాము” – అనే “అమ్మ” వాక్యాలు మన పూజలూ, వ్రతాలూ, నామజపాలూ అంతటా నిండి ఉన్న పరమాత్మను దర్శించడానికి ఉపకరించాలేకాని, మన మనస్సును మరింత సంకుచిత పరచి, కేవలం వాటివల్ల మాత్రమే భగవదారాధన జరుగుతుంది అనే భ్రాంతిలోకి వెళ్ళి పోకూడదు అనే సత్యాన్ని తెలియ చేస్తున్నాయి.
“తన బిడ్డయందు ఏమి చూస్తున్నామో, అందరియందు దానిని చూడడమే బ్రహ్మ స్థితిని పొందటం”, “తన పిల్లలవరకే పరిమితంగా ఉంటే పామరత్వం. అందరియందూ ఉంటే భగవంతుడు” అనే వాక్యాలను పరిశీలిస్తే, “అమ్మ” సరళసుందరంగా, మృదుమధురంగా మన అజ్ఞాన్నాన్ని తొలగించే ప్రయత్నం చేసింది అనిపిస్తుంది. మన మనస్సులను విశాలం చేసుకుని, మన ప్రేమను పదిమందికి పంచి ఇవ్వటమే నిజమైన ఆరాధన అనీ, అదే దైవం వైపుకు మనల్ని నడిపిస్తుందని అర్థమవుతుంది. “భ్రాంతి అంటే మమకారం”, “భ్రాంతి వదిలితే బ్రహ్మ” అని మన దృక్పథాన్ని విస్తృతం చేసుకోవాలని, అప్పుడే బ్రహ్మ స్థితిని పొందగలమని చక్కగా ఉపదేశించిన “అమ్మ” ‘తమో వహ’. “ఇవన్నీ కూడా అదేనని” తెలియచేయడానికే సంక్రాంతి పండుగనాడు బొమ్మలు పెట్టడం అని బొమ్మల కొలువు నేర్పరచడంలోని అంతర్యాన్ని, అంతరార్థాన్ని మనకు తెలియచేసింది “అమ్మ”.
“ఈ సృష్టి మారదు. నీ దృష్టి మార్చుకో” అని చెప్పింది “అమ్మ”. అంటే ఈ సృష్టి ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది. ఆ సృష్టి క్రమాన్ని మనం మార్చలేము. మనం చేయవలసినదల్లా మన దృష్టిని మార్చుకోవటమే. మన దృష్టిని మార్చుకుంటే మన మనస్సుకు ప్రశాంతత ఏర్పడుతుంది. మనస్సు ప్రశాంత స్థితిని పొందటమంటే, మన మనస్సులో అజ్ఞానం తొలగి, జ్ఞానదీపం ప్రకాశించటమే కదా! అందుకే “అమ్మ” – “జ్ఞానం అంటే భావం మారటమే” అనే ఒక మంచి సూక్తిని మనకు అందించింది. మన మనస్సులోని భావాన్ని బట్టే కదా! ప్రపంచం మనకు కనిపిస్తుంది. అందువల్ల మనస్సులోని భావం మన మార్చుకోగలిగామా, మన అజ్ఞానం అంతరించి, జ్ఞానోదయమై, మనకు ప్రశాంతత ఏర్పడుతుంది. అప్పుడు అంతా ఆనందమే. అదే బ్రహ్మానంద స్థితిని పొందటం. ఆ స్థితిని అనుగ్రహించమని అమ్మనే వేడుకుందాం.
“సర్వానికి నేనే మూలం”, “నేను కానిది లేదు” అని ప్రకటించిన తల్లి మనలోని అజ్ఞాన తిమిరాన్ని సమూలంగా నాశనం చేయాలనే ఉద్దేశంతో చిన్న, చిన్న వాక్యాలలో అంతులేని జ్ఞానసంపదను మనకందించిన “అమ్మ” ‘తమో పహ’.
అందరింటిలోని అనసూయేశ్వరాలయంలో నిండుగా కొలువుతీరిన “అమ్మ”ను ‘తమో పహ’గా దర్శించి, స్మరించి, భజించి తరించుదాం. ఈ నెల ఆఖరులో దేవీ నవరాత్రులలో అమ్మవారి అవతారాలలో అందరికీ కన్నుల పండుగగా దర్శనమిచ్చే మన “అందరి అమ్మ” దివ్యాశీస్సులు మనందరిపై సంపూర్ణంగా వర్షించాలని, ఆకాంక్షిస్తూ, “అమ్మ” : కు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ – జయహెూమాతా! శ్రీ అనసూయా!