1. Home
  2. Articles
  3. Viswajanani
  4. తల్లిదండ్రుల వంటి అత్తమామలు

తల్లిదండ్రుల వంటి అత్తమామలు

Brahmandam Seshu
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 13
Month : October
Issue Number : 3
Year : 2013

శ్రీ బ్రహ్మాండం నాగేశ్వరరావుగారి (నాన్నగారి ఇంటి కోడలు కావటం నా అదృష్టం. అమ్మ, నాన్నగారు, హైమ….  కుటుంబసభ్యులంతా ఏకాభిప్రాయంతో కోరి నన్ను సాదరంగా వారింట్లోకి ఆహ్వానించారు. తల్లి లాంటి అత్త, తండ్రి లాంటి మామ, దేవతలాంటి ఆడబిడ్డ లభించటం నాకు గర్వకారణం.

మా నాన్నగారు శ్రీమతుకుమల్లి శ్రీధర్రావుగారు. మా స్వస్థలం తెనాలి. అమ్మ (అనసూయమ్మ), మా నాన్న పెదతల్లి పినతల్లి బిడ్డలు. మా నాన్నకంటే ‘అమ్మ’ పెద్దది. కావున ‘అనసూయక్క’ – ‘నాగులుబావ’ అని పిలిచేవాళ్ళు.

మా బామ్మ తాతయ్యగార్లు అప్పికట్ల దగ్గర భర్తిపూడిలో ఉండేవాళ్ళు. వాళ్ళు అమ్మకి పిన్ని, బాబాయి అవుతారు. ఒకసారి అమ్మ వాళ్ళింటికి వెళ్ళింది. అప్పుడు అమ్మ సుబ్బారావు అన్నయ్యని కడుపుతో ఉన్నది. అమ్మ అలిసిపోయి మా నాన్న పడుకునే మంచం మీద పడుకున్నదిట. మా నాన్న ‘నా మంచం నాకు ఇవ్వు లేకపోతే పడేస్తా’ అన్నాడు. అప్పుడు అమ్మ, “నా కొడుక్కి నీ కూతుర్ని చేసుకుంటారా, శ్రీధరా!” అన్నదిట. మేము ఇద్దరం పుట్టకుండానే అమ్మ నిర్ణయించింది.

1967లో నేను బంధువుగా జిల్లెళ్ళమూడి వచ్చాను. ఏడాది పాటు నాన్నగారింట్లోనే ఉన్నాను. అపుడు నాకు 13 ఏళ్ళు. నన్ను అమ్మ, నాన్నగారు, హైమ ఎంతో ఆప్యాయంగా చూసేవాళ్ళు. హైమక్కతో కలిసి తిరిగేదాన్ని. నాన్నగార్కి చేతనైన సపర్యలు చేసేదాన్ని. అప్పట్లో వసుంధరక్కయ్య నాన్నగార్కి అన్నం వండిపెట్టేది. ఆ రోజుల్లో నేను రజస్వల అయ్యాను. నాన్నగారు మునసబు గారిని బాపట్ల పంపి నాకు రెండు పరికిణీలు, రెండు వోణీలు కుట్టించి పెట్టారు. అప్పుడు ఊళ్ళో వాళ్ళూ ఆవరణలో వాళ్ళూ “అబ్బో ! కోడలికి బట్టలు పెట్టుకున్నారే!” అని అన్నారు.

నా పెళ్ళికి ముందు ‘అమ్మాయ్’ అనీ, పెళ్ళి అయిన తర్వాత ‘శేషమ్మా’ అని పిలిచేవారు నాన్నగారు. అమ్మ పంచిన ప్రేమను గురించి చెప్పనవసరం లేదు. రెండు చేతులతో పొదివి పట్టుకుని, నా తలను తన గుండెలపై పడుకోబెట్టుకుని, ముద్దు పెట్టుకుని పసిబిడ్డలా లాలించింది. గారం చేసి కన్నతల్లిని మరిపించింది. ఆవరణలో వాళ్ళూ, ఊళ్ళో వాళ్ళూ ‘కోడలిని దగ్గర పెట్టుకున్నారు’ అని అంటూండేవాళ్ళు.

విజయవాడ ఒకసారి హైమ ప్రకృతి వైద్యం కోసం వచ్చింది. అప్పుడు మేము విజయవాడలో ఉండేవాళ్ళం. మా నాన్న వెళ్ళి రెండు మూడు సార్లు హైమను మా ఇంటికి తీసుకువచ్చారు. హైమతో రుక్మిణక్కయ్య యోగయ్య గారు ఉండేవాళ్ళు. హైమ రుక్మిణక్కయ్యతో “శేషుని మన సుబ్బారావన్నయ్యకి చేసుకుంటే బాగుంటుంది” అన్నది. అందుకు రుక్మిణక్కయ్య “శేషు, సుబ్బారావు కంటే 14 ఏళ్ళు చిన్నది. ఎలా కుదురుతుంది” అన్నది. ఏమైనా హైమ హృదయంలో నా స్థానం అలాంటిదని నాకు ఆనందం.

1968లో నేను తెనాలి మా ఇంటికి వెళ్ళాను.

తర్వాత హైమ శరీరత్యాగం చేసింది.

నా వివాహం 1969లో జరిగింది; పూర్తిగా అమ్మకావాలని చేసుకున్నది. పెళ్ళిముహూర్తం ఐదు రోజులుందనగా మాకు వర్తమానం అందింది. మా నాన్న జిల్లెళ్ళమూడి వెళ్ళి నాన్నగార్ని లాంఛనం అడిగారు; తక్షణం తాంబూలాలు తీసుకున్నారు; బాపట్ల ప్రెస్ లోనే శుభలేఖలు ముద్రించి వెంట తీసుకు వచ్చారు.

పెళ్ళి అయిన తర్వాత నాన్నగారి భోజనాది సౌకర్యాలు నేనే చూసేదాన్ని. వంట పూర్తి కాగానే ఒక పళ్ళెంలో పెట్టుకుని వెళ్ళి అమ్మకి నివేదన చేసేదాన్ని. ఆ సందర్భంగా “మీ అత్తగార్కి అన్నం పెట్టావా?” అని నాన్నగారు, “నాన్నగార్కి అన్నం పెట్టావా?” అని అమ్మ అడిగేవారు. నాన్నగార్కి పెరుగు ఇష్టం ఉండేదికాదు; జీర్ణం కాదు అనేవారు. ఆయనకి రక్తపోటు ఉండేది. అసలు ఉప్పు వేయకుండా చప్పిడిగా తినేవారు. కానీ ఉప్పు కాస్త పడిందంటే తినలేకపోయేవారు. ఆయన రోజూ తెల్లవారు ఝామున 4గంటలకే నిద్ర లేచేవారు. వెంటనే కాఫీ త్రాగాల్సిందే. మధ్యాహ్నం 11గంటల ప్రాంతంలో భోజనం. సాయంకాలం 6-30గంటల ప్రాంతంలో రేడియోలో ప్రాంతీయవార్తలు వింటూ భోజనం చేసేవారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో పచార్లు చేస్తూ “ఏమమ్మా! మీరు ఇంకా అన్నాలు తినలేదా” అని పలకరించేవారు.

నాన్నగారికి బంధుప్రీతి ఎక్కువ. వారి పినతండ్రులు శ్రీ బ్రహ్మాండం సత్యనారాయణగారు, శ్రీ పులిపాక చలపతిరావుగారు, వారి పినమామగారైన అంబారావు గారు, శ్రీ లోకనాధం బాబయ్య, పాప (శారద) అత్తయ్య, రాఘవరావు మామయ్య, మా బాబయ్యలు మురహరి, తేజోమూర్తి గారు తరచుగా వస్తుండేవాళ్ళు. బంధువులంతా ఇటు అమ్మ వైపు అటు నాన్నగారి వైపు చుట్టరికం కలవాళ్ళే. నాన్నగారికి బంధుత్వ రీత్యా మా నాన్న బావమరిది. ‘ఏరా శ్రీధరా!’ అని ఆప్యాయంగా పిలిచేవారు. ఎవరు వచ్చినా తన ప్రక్కనే కూర్చొనబెట్టుకుని భోజనాలు చేసేవారు.

నాన్నగారింట్లో చిన్న కార్యక్రమం చేసినా ఆవరణలో వాళ్ళనీ, ఊళ్ళోవాళ్ళనీ పిలిచి తన సరసన భోజనాలు పెట్టేవారు. ఆయన పెద్దవారితో పెద్ద మనిషిలా, పసివాళ్ళతో పసివాడుగా కలిసిపోయేవారు. రాఘవరావు మామయ్య చనిపోవటం ఆయన మీద చాల ప్రభావం చూపింది; మానసికంగా క్రుంగిపోయారు. ఒకనాటి రాత్రి సమయంలో వచ్చి తన మనవరాలు హైమ పక్కనే పొట్టమీద చేయి వేసుకుని పడుకున్నారు. ఆ క్షణంలో అంత పెద్ద మనిషి ‘చిన్నబాబు’ అనిపించారు.

పసివాళ్ళంటే ఎంతో ప్రేమగా ఉండేవారు. హైమని, స్వీటీని ఎత్తుకుని తిరుగుతూండేవారు. రవి వేటపాలెంలో ఉద్యోగం చేసేరోజుల్లో పింకీ చంటిపిల్ల. దాని మాటలు వినాలని ఆయన వేటపాలెం వెళుతూండేవారు. అమ్మ దగ్గరికి వెళ్ళినపుడు శరత్, చైతన్యలతో కారమ్స్ ఆడేవారు. అమ్మ నాకు ఏదో పెడుతూండేది. ఒకరోజు “అమ్మా! రాజ్యం, భవానీ… వీళ్ళంతా ఉపవాసాలు చేస్తారు. నీకు పూజలు చేస్తారు, నేనేమీ చేయటం లేదు” అన్నాను. అందుకు “నువ్వు నాన్నగార్ని కనిపెట్టుకుని చూసుకుంటున్నావు. చాలు. అంతకంటే వ్రతాలు, పూజలూ ఏమీ అక్కర్లేదు” అని చెప్పింది.

నాన్నగార్కి గుంటూరు ఆస్పత్రిలో ఆపరేషన్ చేశారు. మంచం మీద ఉన్నవారికి చెంచాతో అన్నం తినిపించేదాన్ని. ఆ సమయంలో డాక్టర్ గారు వచ్చారు. “మా అమ్మాయిని చూడండి. కొడుకులా చూసుకుంటోంది” అన్నారు. ఆయనకి వారబ్బాయి కంటే వీసం ఎత్తు నాపైనే వాత్సల్యం ఎక్కువ అనిపిస్తుంది. ఆ రోజుల్లో సుబ్బారావు అన్నయ్య ఒంగోలు దగ్గర కొబ్బరినూనె తీసే పరిశ్రమ లాంటిది పెట్టారు. అక్కడ తనకి భోజనానికి ఇబ్బంది అని నన్ను తీసుకుని వెడతానన్నారు. అందుకు నాన్నగారు, “వెడితే వాడిని వెళ్ళమను. అమ్మాయిని ఇబ్బంది పెట్టొద్దు. శేషమ్మను తీసుకు వెళ్ళటానికి వీల్లేదు” అని కోప్పడ్డారు. ఏ తండ్రికైనా కోడలిపై కంటే కొడుకుపైనే మమకారం ఎక్కువ. కానీ అదే నాన్నగారిలో ప్రత్యేకత.

ది. 16.1.81 తేదీన – తీవ్ర అనారోగ్యానికి గురై అప్పుడే కోలుకున్న అమ్మ “కళాశాల విద్యార్థినీ విద్యార్థులే కాదు, అందరింటి సభ్యులు, కాలేజి సిబ్బంది…. అందరూ అన్నపూర్ణాలయంలోనే భోజనం చేయాలి” అని అమ్మ కోరింది. అమ్మ అభిమతాన్ని సమ్మతించి నాన్నగారు కూడా తన కంచం, గ్లాసు తెచ్చుకుని అందరి సరసన కూర్చుని భోజనం చేసేవారు. అంతవరకు సంతోషమే.

కానీ అన్నపూర్ణాలయంలో పదార్థాలు ఆరోగ్యవంతులకి అమృత తుల్యం, సరిపడ ఉప్పు, పులుపు, కారం వేసి రుచిగా చేస్తారు. అది నాన్నగారికి పడదు; అందుకు వారి ఆరోగ్యం సహకరించదు. ఒకసారి ఛాతీ నొప్పి వచ్చింది. పాపక్కయ్య వచ్చి ఇ.సి.జి. తీసింది. గుండె నొప్పి అని నిర్థారించింది. నాటి నుంచీ నాన్నగారిని ఎక్కడకూ వెళ్ళవద్దన్నాము.

రవి చిరంజీవులు చైతన్య, శరత్ల అక్షరాభ్యాసం కోసం అంతా జిల్లెళ్ళమూడి వచ్చారు. శుభకార్యం జరిగింది. తర్వాత వాళ్ళంతా ఉండిపోయారు.

తర్వాత (మూడవరోజు) అని గుర్తు. ది. 16.2.81 తేదీ నాటి రాత్రి నాన్నగార్కి కొంచెం అసౌకర్యం కలిగి ‘అమ్మాయిని పిలవండి’ అని కబురు చేశారు. చిన్నవాళ్ళకి వారి మాట సరిగా అర్థం కాలేదు. నాకు ఆ కబురు అందలేదు. తెల్లవారుఝామున లేచి ఛాతీనొప్పిగా ఉందమ్మా అన్నారు. పాపక్కయ్య అన్ని పరికరాలను, మందులను సిద్ధంచేసికొని అక్కడే ఉన్నది. వెంటనే ఆక్సిజన్ పెట్టడానికి ఏర్పాటు చేసింది. ఈ లోగా నాన్నగారు నా భుజంమీద పసివానిగా వ్రాలిపోయారు. వారికి నాపై ఉన్న పితృవాత్సల్యానికి చిరస్మరణీయమైన సంఘటన.

17.2.81తేదీన నాన్నగారు, 14.2.85తేదీన అమ్మ ఆలయ ప్రవేశం చేశారు. ఆ పుణ్యమూర్తులకు ఎంతో కొంతసేవ చేసుకున్నాననే తృప్తి నాకు మిగిల్చారు.

అమ్మ నాన్నగార్లతో సన్నిహిత సంబంధం గల అన్నయ్యలు, అక్కయ్యలు చాలమందికి మా కుటుంబం మీద అభిమానం ఉంది. అంటే వారిని అమ్మ తన కుటుంబ సభ్యులుగా దగ్గరకు తీసింది. ఉదాహరణ: శ్రీ నాదెండ్ల లక్ష్మణరావు, శ్రీ రాచర్ల లక్ష్మీనారాయణగారల కుటుంబాలు.

ఒకసారి లక్ష్మీనారాయణ అన్నయ్యకి వ్యాపారంలో చాల నష్టం వచ్చింది. నేను అమ్మ ఆలయానికి వెళ్ళి “నాన్నగారూ! మీరే ఆదుకోవాలి” అని ప్రార్థించాను. నాటి రాత్రి కలలో నాన్నగారు కనిపించి, “మీ అమ్మ గార్కి చెప్పవమ్మా” అన్నారు.

మరొకసారి ఉగాది పండుగనాడు ఆలయానికి వెళ్ళి “నాన్నగారూ! మమ్మల్ని ఆశీర్వదించండి” అని ప్రార్థించాను. నాటి రాత్రి కలలో “నువ్వు నన్ను ఆశీర్వదించమని అడగాలా, అమ్మా! మా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి” అన్నారు.

‘అమ్మ’ – ‘నాన్నగారు’ నాకు తల్లిదండ్రులవంటి అత్తమామలు.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!