ఈ మానవ శరీరం చర్మం, ఎముకలు, రక్తమాంసాలతో నిండినది. ఇది పరమార్థం సంపాదించు కోవటానికో ప్రత్యక్ష ప్రతిబంధకం. దీనిపై మమకారాన్ని విడవాలి. దీనిని కేవలం ఒక నౌకరు వలె భావించండి. దీనిని నెత్తిన కూర్చోపెట్టుకోకండి.
జీవించటానికి సరిపడా అన్నవస్త్రాలు, తగుమాత్రం ఆలనాపాలనా చేసి, దీనిని జననమరణాలను తప్పించు కోవటానికి, ఆధ్యాత్మిక ప్రగతి కొఱకు వినియోగించండి. మహాభాగ్యం వలన ఎంతో పుణ్య సంచయంతో ప్రాప్తించిన మానవ శరీరాన్ని ప్రతి ఘడియా సద్విని యోగం చేసుకోండి.
పశుపక్ష్యాదులు మొదలగు జీవజంతువులను, చెట్లు చేమలను అపారంగా సృష్టించిన పరమేశ్వరునికి, తన లీల నిస్సారమని అనిపించి, నిరాశతో దుఃఖం కలిగింది.
సూర్యచంద్రులు, తారలు నిండిన విస్తారమైన బ్రహ్మాండాన్ని నిర్మించిన గొప్ప కౌశలాన్ని ఎవరూ కొంచెమైనా గ్రహించటము లేదు. ఈ సకల లీలను చేయటంలో జగదీశుడైన నా ఉద్దేశం, ఏమిటి అని నిశ్చయంగా ఒక్క జీవియైనా తెలుసుకోవటం లేదు.
నా ఈ అనుపమానమైన అపారమైన వైభవాన్ని గ్రహించగలిగే కుశాగ్ర బుద్ధికల ప్రాణిని సృష్టించనంత వరకు నా కార్యం, ముమ్మాటికి నిష్ఫలం, అని తలచి ‘జగదీశ్వరుడు’ తన సామర్థ్యాన్ని, సృష్టిలోని సారాన్ని విచక్షణా బుద్ధితో గ్రహింపగల ప్రాణిని మానవరూపంలో సృష్టించాడు.
అగాధమైన నా ఆ వైభవాన్ని, అట్లే అపూర్వమైన నాశక్తిని, రామాయణ లీలనంతటిని, అతడు ఆశ్చర్య పూర్వకంగా తెలుసుకొంటాడు. అతడే నన్ను అవలోకిస్తూ, జ్ఞానాన్ని సంపాదిస్తాడు. నన్ను ధ్యానిస్తాడు. ఆశ్చర్య పడతాడు. అప్పుడు నా లీల సంపూర్ణమవుతుంది” అని సాయిబాబా చెప్పాడు.
భగవంతుడు అన్నిచోట్లా, అన్నింట్లో కనబడటానికే “అమ్మ”ను సృష్టించాడనేది నానుడి. అమ్మతత్వం అంత
నిస్వార్థమైనది గనుక. అమ్మకు అందరూ బిడ్డలే ! “తల్లి ప్రేమను మించింది లేదనేది” సూక్తి. అలాంటి ‘అమ్మ’ను చూసి, తరించి, గోరుముద్దలు తిని, ‘అందరికీ సుగతే” అని నిర్ద్వంద్వంగా చెప్పిన తర్వాత కూడా, మనకెందుకీ జంజాటము, తాపత్రయము.
భార్య, బిడ్డలు, మనవలను చూసినా చాలక మాకింకా మునిమనవలు ‘బంగారు ఉగ్గుగిన్నెల’ తాపత్రయ మెందులకు ? సర్వం తర్పయామి. అని నిత్యం పారాయణ చేసే మనకు వైరాగ్యం ఎప్పటికో !
సాయి ఉవాచ ప్రకారము, ఆహారము జనన మరణాలను తప్పించుకోవటానికి. మిగిలినవి (శక్తిని) ఆధ్యాత్మిక ప్రగతి కొరకు వినియోగించండి.
కాటికి కాలు జాపుకొనే వయస్సులో గూడా నడిచే శక్తి నిలిచే మనస్సును యిచ్చినా కూడా పరమార్ధచింతన లేకపోవటము మిక్కిలి దుఃఖ కారణము.
అమ్మ ఎవర్నో (అడవులదీవి శ్రీరామ్మూర్తిని) అడిగినట్లుగా “నేనెవరికి బాకీలేను’ అందరికీ తగినంతగా చేశాను కదా ! అన్నదిట.
నిజంగా అది నిజమే గదా ! అమ్మ బిడ్డలందరు ఉన్నంతలో సుఖశాంతులతో, పిల్లలు విదేశాలలో స్వంత గూటితో కాలినడకలు తప్పినవి గదా !
అమ్మచేతి ముద్ద తిన్న మనకు, కూటికి, గుడ్డకు లోటులేదు కదా !
శ్రీ శ్రీ పూర్ణానందస్వామి చెప్పినట్లుగా, ఆ భువనేశ్వరితో ఆడుకున్న మనము ఎంతధన్యులము. దాదాపుగా అమ్మ బిడ్డలందరూ (అక్కయ్యలు, అన్నయ్యలుగా పిలిచిన రోజులు నుంచి) షష్ఠిపూర్తి చేసుకొన్నవారమే గదా! మిగిలిన ఈ తృటికాలమైనా, నిశ్చలమైన, నిస్వార్థమైన మనస్సుతో, అమ్మ సేవా కార్యక్రమాలలో పాల్గొని, అందరింటి అభివృద్ధికి కృషి చేస్తే మనపిల్లలు కూడా సంతోషించి, అప్పటి వారి స్నేహితులతో, మా అమ్మ నాన్నలను కూడా ఈ అమ్మానాన్న భౌతికంగా చూశారు, అని ఎంత గర్వంగా చెప్పుకొంటారు. మీరు ఆలోచించండి. అందరింటికి అభివృద్ధికి కృషి చేయండి.