ఈ ప్రపంచంలో ప్రతి మనిషీ అధిక సంపాదనతో అన్నీ ఒనగూర్చుకొని తృప్తిగా జీవిస్తున్నాము అనే భావనతో ఉన్నాడు తప్ప నిజమైన తృప్తి మానవుడు పొందలేకున్నాడు. ఎప్పుడైతే మనస్సు తృప్తి చెందుతుందో అదే అసలైన సంతృప్తి.
మరి మనస్సు తృప్తి చెందాలంటే ప్రతినిత్య మన కర్తవ్యం మనం సరిగా నెరవేర్చినట్లయితే మనస్సుకు తృప్తి కలుగుతుంది. అందుకే అంటారు పెద్దలు “కర్తవ్యమే భగవంతుడు” అని.
మన తృప్తికి కొన్ని కారణాలు:
1) మనం చేసే ధర్మబద్ధమైన కార్యం పట్ల శ్రద్ధ
2) భగవంతుని పట్ల భక్తి
3) “దయగల హృదయమే భగవన్నిలయము” అనే భావన.
4) “పరోపకార్ధమిదం శరీరం” అనే భావన.
మన మనస్సు ఎప్పుడు తృప్తిగా ఉంటుందో అపుడే మనము మోక్షసాధన కోసం ప్రయత్నం చేస్తాము. తృప్తి లేని మానవుడు నిరంతరం అది చేయాలి ఇది చేయాలి అని వెంపర్లాడడమే తప్ప ఏ పనీ పూర్తి చేయలేడు. ఈ చరాచర జీవరాశులలో ఒక్క మానవుడు తప్ప మిగిలిన జీవులన్నీ తృప్తిగా జీవిస్తున్నాయి. విచక్షణాజ్ఞానం కల్గిన మానవుడే ముక్తి మార్గాన్ని మరుస్తున్నాడు. మరి ఇటువంటి మానవులను సరైన దారిలో పెట్టాలని కొందరు మహాత్ములు తమ సందేశాల ద్వారా తమ సంభాషణల ద్వారా మనకు మార్గనిర్దేశనం చేశారు. అందులో ప్రధములు శ్రీ శంకరుల వారు ఇలా వివరించారు.
సత్సంగత్వే నిస్సంగత్వం
నిర్మోహత్వే నిశ్చలతత్వం,
నిశ్చలతత్వే జీవన్ముక్తిః – అని.
ఇదే విషయాన్ని జగజ్జనని అనసూయా మాత అతి సరళంగా, మృదుమధురంగా “తృప్తే ముక్తి” అని తెలియజేశారు. వీరు చెప్పిన, చూపిన బాటలో పయనిస్తూ, జీవితం సుసంపన్నం చేసుకుందామని భావిస్తూ ….