1. Home
  2. Articles
  3. Viswajanani
  4. తెలుగు భాషా దినోత్సవం – కళాశాల వార్తలు

తెలుగు భాషా దినోత్సవం – కళాశాల వార్తలు

V Pavani
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 22
Month : October
Issue Number : 3
Year : 2022

త్రిమూర్త్యాత్మకమైన అమ్మ నడియాడిన అర్కపురి సరస్వతీ క్షేత్రం అని శ్రీ కందుకూరు సత్య సూర్యనారాయణమూర్తి గారు అన్నారు. ఆగస్టు 29 మంగళవారం ఉదయం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో గిడుగు వేంకట రామ్మూర్తి పంతులు గారి 160వ జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవ సభా కార్యక్రమం జరిగింది. ఈ సభలో ముఖ్య అతిథిగా విచ్చేసిన సూర్యనారాయణ గారు ప్రసంగిస్తూ వేదవాఙ్మయాన్ని, లౌకిక వాఙ్మయాన్ని అందించిన ఋషుల జ్ఞాన భాండాగారాన్ని నన్నయ భారతాంధ్రీకరణంతో, ప్రబంధకవుల రచనలతో పండితులు తెలుగు పదజాలాన్ని జనావళిలోకి తీసుకురాగలిగారు. పండిత పామర జనరంజకంగా ఉండేలా గిడుగు వారు చేసిన భాషాఉద్యమం అందరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. అన్నదానం హనుమత్ప్రసాద్ గారు అధ్యక్ష భాషణ చేస్తూ భాషా పరిరక్షణ ఓరియంటల్ కళాశాలలపై ఉందని అందుకు తగిన వారసులుగా మన విద్యార్థులు విద్యను అభ్యసించాలని కోరారు. అనంతరం తెలుగు అధ్యాపకులు పి. మధుసూదనరావు గారు మాట్లాడుతూ వ్యవహారభాష గ్రంథస్థం చేసిన ఘనత గిడుగు వారిదని చెప్పారు. అధ్యాపకులు ముఖ్య అతిథిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థుల తెలుగు పద్యాలాపనతో, ప్రసంగాలతో, నృత్య ప్రదర్శనలతో గిడుగు వారి కృషిని తెలుగులోని మాధుర్యాన్ని చవిచూపారు. తెలుగుశాఖ అధ్యక్షురాలు డాక్టర్ లక్కవరపు మృదుల సభానిర్వహణ చేయగా వీరాంజనేయులు వందన సమర్పణ చేశారు. శాంతి మంత్రంతో కార్యక్రమం ముగిసింది.

5-9-2023 మంగళవారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవం వైభవంగా జరిగింది. విద్యార్థులు సభా నిర్వహణ చేసి గురువులను వేదికపైకి ఆహ్వానించి డా. రాధా కృష్ణన్ గారి ఔన్నత్యాన్ని, గురు ప్రాశస్త్యాన్ని తెలియజెప్పారు. కరస్పాండెంట్ గారి అధ్యక్షతన జరిగిన ఈ సభలో విద్యార్థులు గురువులను సత్కరించారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ గారు శ్రీ ఓంకారానంద మాష్టారు వ్రాసిన ‘యోగ ఆరోగ్య విజ్ఞానం’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. శాంతిమంత్రంతో కార్యక్రమం ముగిసింది.

30-8-2023 న విశ్వసంస్కృత భాషా దినోత్సవం సందర్భంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో జరిగిన సభకు ముఖ్య అతిథిగా సంస్కృత భారతి అఖిల భారత బాలకేంద్ర ప్రముఖులు, విజయవాడ SSR & CVR కళాశాల సంస్కృత ఉపన్యాసకులు శ్రీ ఉపద్రష్ట వేంకట రమణమూర్తి గారు విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. సంస్కృతం అనేది ప్రాచీనభాష మాత్రమే కాదు నిత్య నూతనమైన భాష అన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంలో, జన జీవనంలో సంస్కృతం ఎలా ఇమిడిపోయి వున్నదో వివరించి విద్యార్థులకు భాషపై మక్కువ ఆసక్తి కలిగించారు. కార్యక్రమంలో మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా విద్యార్థులు సంస్కృతంలో ప్రసంగాలను, శ్లోకపఠనాన్ని చేశారు. భారతదేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పే నృత్య ప్రదర్శనలు జరిగాయి. సభాకార్యక్రమాన్ని ఆసాంతం సంస్కృత భాషలో నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. అన్నదానం హనుమత్ప్రసాద్ సభకు అధ్యక్షత వహించారు. సంస్కృతోపన్యాసకులు డా.ఆర్.వరప్రసాద్ గారు సభా కార్యక్రమాన్ని నిర్వహించారు.

14-09-2023 గురువారం నాడు కళాశాలలో ‘స్త్రీ సాధికారత’ Women Empowerment Cell తరుపున IQAC మరియు W20 INDIA సంయుక్త ఆధ్వర్యంలో W20 AND GENDER EQUALITY అనే అంశంపై వెబినార్ జరిగింది. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అన్నదానం హనుమత్ప్రసాద్ గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ W20 HEAD Dr. Lakshmi Vijaya V. T. మరియు చీరాల నుండి ఆలూరి నాగమణి శయన LLM pg Diploma in IPR ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

డా. లక్ష్మీ విజయన్ మాట్లాడుతూ W 20 ఆవశ్యకతను జెండర్ ఈక్వాలిటీ గురించి వివరించారు. అనంతరం మణినాగశయన గారు Women-Law and Order గురించి వివరించి న్యాయస్థానం వరకు వెళ్లే పరిస్థితి తెచ్చుకోవద్దని తెలిపారు. Women Empowerment Cell, Convenor శ్రీమతి కవిత గారు కార్యక్రమాన్ని నిర్వహించారు.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!