డాక్టరు పొట్లూరి సుబ్బారావుగారు చీరాల వాస్తవ్యులు. అద్భుతమయిన అనుభవాలు పొంది అపారమయిన సేవలు చేసుకున్న ధన్యజీవి. కొన్నివేల ఫొటోలు, ఆడియో, వీడియో క్యాసెట్లు, స్లైడ్స్ సినిమాలు తీశారు. వారు డాక్టర్ అయినా బహుముఖ ప్రజ్ఞాశాలి. యోగాసనాలు వ్యాయామం కఱ్ఱ, కత్తిసాములు, ధ్యాన సాధనలు ఈ విధంగా ఎన్నో, ఎన్నో సామర్థ్యాలు కలిగిన వ్యక్తి. నిరంతర అమ్మ స్మరణలో నిండిన ధన్యజీవి అయిన సోదరులు. వీరు చారిత్రాత్మకంగా చేసిన విశిష్టమయిన పనులను గురించి అమ్మ ఒకసారి నాతో చెప్పింది. అమ్మ పుట్టినరోజు పండుగ మొదలు పెట్టింది వీరే. అమ్మ స్వర్ణోత్సవాలకి లక్షమంది ఒకే పంక్తిలో అమ్మ ప్రసాదం స్వీకరించటం, అదే విధంగా అమ్మ వజోత్సవానికి 60 వేలమంది, ఈ విధంగా వైభవోపేతంగా జరిగిన అమ్మ జన్మదినోత్సవాలకి నాంది, పునాది అయిన మహామనీషి వీరు. వచ్చేపోయే వారికోసం ఇప్పుడు హైమాలయం ఉన్న చోట పెద్దమందిరం నిర్మాణం చేయటం, బావి త్రవ్వి కొన్ని అవసరాలైనా తీరేటట్లు నీటి వసతికలుగచేయటం, అన్నపూర్ణాలయం ప్రారంభించటంలో ప్రముఖ పాత్ర వహించటం, మొదలైనవి చారిత్రాత్మకంగా నిర్వహించిన అమ్మ సంతానకోటిలో ప్రముఖమయిన వ్యక్తి వీరు.
వీరు ఒక రోజు అమ్మసాన్నిధ్యంలో రాత్రి 10 లేక 11 గంటల సమయంలో కూర్చున్నారు. ఆ రోజులలో అక్కడ కరంటుకాని, ఈ బిల్డింగులు కాని లేవు. అప్పుడు అమ్మ సమాధ్యవస్థలో అనేక రకాల భాషలలో మాట్లాడింది. ఎందరో మహానుభావులను పిలిచింది. తరువాత లేచి తను స్నానానికి వెళ్తూ డాక్టర్ గార్ని కెమేరా సిద్ధం చేసుకొనమని చెప్పి, స్నానానికి వెళ్ళి వచ్చి నిలుచున్నది అమ్మ. మువ్వల సత్యం అనెడి చీరాల సోదరుడు పెట్రోమాక్స్ లైట్లు వెలిగించి. పెట్టాడు. డాక్టర్ గారు కెమారా సిద్దం చేసుకుని నిలుచున్నారు. వెంటనే అమ్మ దేహంనుండి కాంతులు విరజిమ్మినై. మైనపు ముద్ద కరిగి రకరకాల రూపాలుగా అవుతున్నట్లు అమ్మ అనేక రూపాలుగా మారటం జరిగింది. వానిలో రెండు మూడు రూపాలు మాత్రమే ఫోటోలు తీశారు డాక్టర్గారు. చైనా రూపం జపాన్ రూపం, ఈ విధంగా అనేక రూపాలుగా మారుతూ దర్శనం ఇచ్చారు అమ్మ. తరువాత కాంతులు విరజిమ్మటం పోయి అమ్మ మామూలు స్థితికి వచ్చింది. ఈ సంఘటనకి చాలా కాలం ముందు “అన్ని రూపాలు నావే అన్ని నామాలు నావే” అని చెప్పారు అమ్మ. ఈ సూక్తిని అనుభవపూర్వకంగా డాక్టర్ గారికి ఇచ్చింది. మరొక విషయం “రూపం లక్ష్మి, జ్ఞానం సరస్వతి, శక్తి పార్వతి” అని త్రిమాతల తత్వాన్ని తెలియచేసింది. రకరకాల భాషలు మాట్లాడటం ద్వారా సరస్వతి తానని, అనేక రూపాలు మారుతూ దర్శనం ఇవ్వటం వలన లక్ష్మితానని, కాంతులు విరజిమ్మటం ద్వారా శక్తి అయిన పార్వతి తానని తెలియ చేసింది. శక్తి జ్ఞానం రూపం సర్వంతానని తెలియచేసింది. త్రిమాతలు తానని తెలియచేసింది.
మనం చూసే ఈ విశ్వంలో పదార్థమంతా ఆకాశానికి ప్రతిరూపమని మనకు కలిగే సంకల్పమంతా ప్రాణశక్తికి ప్రతిరూపమని స్వామి వివేకానంద వివరిస్తారు. డాక్టర్ గారికి మరి కొంత మందికి ఇచ్చిన అనుభవం ఒకటి పై సూక్తిని తెలియ చేస్తుంది. ఒక రోజు అమ్మ నివసించే పాకలో ఆకాశం నుండి తేనెలాంటి తియ్యని పదార్థం ధారగా పడింది. డాక్టర్ గారు మరికొందరు దోసిళ్ళతోపట్టుకుని త్రాగారు. ఇది కేవలం ఒక మహిమగా గాక తత్వంగా తీసుకుంటే సర్వంలో ఆకాశం, ఆకాశంలో సర్వం ఇమిడి ఉందని అనంత విశ్వంలో ఏర్పడిన పదార్థానికి మూలమంతా ఆకాశంలో ఉన్నదని తత్వశాస్త్రవేత్తలు చెబుతారు. డాక్టర్ గారికి ఇచ్చిన ఈ అనుభవం, సంకల్పం సర్వం తానని తెలియచేసింది. సర్వం తానయి సర్వానికి అతీతమయిన అమ్మకి ఇటువంటివి చిన్నవే అయినప్పటికి, దీని ద్వారా మహోత్కృష్టమయిన తత్వం అనుభవంలోకి వచ్చింది.