తొలిరోజులో అమ్మవద్దకు వచ్చి అమ్మతో ఆడుకొని, పాడుకొని అమ్మలోని అతిమానుషశక్తిని సందర్శించిన మహామహుల్లో ఒకడు, సామాన్యుల్లో అసామాన్యుడు మన రాజు బావ. అమ్మతో మాటాడటానికి రెడ్డిపాలెం కాంతయ్యయోగి, నరసింహయోగి వంటివారు వచ్చినపుడు సాటివారి వద్ద, పెద్దల వద్ద ఎలా ప్రవర్తించాలో తెలియక తడిక చాటున కూర్చొని గోల చేసిన వారిలో ఒకడు. అటువంటి రాజు బావ అమ్మలోని మహత్తరశక్తికి నిదర్శనం చూపించమని అడిగిన రోజులు లేక పోలేదు.
అమ్మ సమాధి స్థితిలో ఉండి ఎవరెవరితోటో రకరకాల భాషలలో మాట్లాడటం చూసిన రాజుబావ అమ్మతో సమాధిలో ఎవరెవరితోనో మాట్లాడుతున్నావు సరే! అసలు “ఏం అక్కడకు విషయం, శక్తి నీకు ఉన్నట్లు మాకు తెలిసేదెలా నిదర్శనం కావాలి అని అడిగాడు”. సరే! నీవు ఇప్పుడు ఎక్కడకు వెళుతున్నావురా ?” అని అడిగింది అమ్మ వస్తావా ?” అంటూ “వస్తే వచ్చావు నాకు కనుపించాలి” అన్నాడు రాజు బావ. పొన్నూరు వెళ్ళుతూ రెడ్డి సుబ్బయ్యతో అమ్మ దగ్గరే ఉండమని చెప్పి, అమ్మతో “నేను రాత్రి తొమ్మిది గంటలకు గొడ్ల సావిట్లో ఉంటాను అప్పుడురా, అంతేకాని నీవు స్నానం చేస్తున్నావు అప్పుడు వచ్చి వెళ్ళానురా ! అని అనకూడదు” అని చెప్పాడు.
రాజు బావ పొన్నూరు వెళ్ళి ప్రయాణపు అలసటలో వేడినీళ్ళు స్నానం చేసి హాయిగా భోజనం చేసి గొడ్ల సావిట్లోకి వెళ్ళాడు. రాత్రి తొమ్మిది కావస్తున్నది. కొష్టంలో పేడకంపు కొడుతున్నది. నిద్ర ముంచుకొస్తున్నది. ఆ కంపులోనే నులకమంచంపైన పడుకొన్నాడు. ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు.
ఒక్కసారి భుజంమీద చురుకుపుట్టే దెబ్బ తగిలించి, గాజుల చప్పుడయింది. రాజుబావ లేచి చూచాడు. మైసూర్ శాండిల్ సోపుతో స్నానం చేసినప్పుడు వచ్చే వాసన వచ్చింది. తెరిపార చూచాడు. ఎవ్వరూ కనిపించలేదు.
తరువాత వారం జిల్లెళ్ళమూడికి వెళ్ళి అమ్మతో “నీవు వస్తానని రాలేదేమమ్మా !” అని అడిగాడు. అమ్మ “లేదురా !” నేను నిన్ను లేపాను. నీకు వాసన కూడా వచ్చేటట్లు చేశాను. అయినా నీవు లేవ లేదు నన్ను గుర్తించ లేదు” అన్నది.
అవునమ్మా ! గాజుల చప్పుడు వినపడ్డది మైసూరు సబ్బు వాసన వచ్చింది. అయితే గుర్తించలేక పోయాను నీవు చెపితే తప్ప. అంటూ ఆనాటి అనుభవాన్ని నెమరు వేసుకుంటూ ఆ అనుభవం ఇప్పటిదాకా నన్ను వదల లేదు అంటూ ఆనాటి నిదర్శనాన్ని భావించాడు.